ఒక్క క్షణం ఆగి చెవులు రిక్కించి విన్నాడు. వెనక ఎవరో నడుస్తున్న శబ్దం.విజయార్కె హారర్ కథ “టక్ టక్”

(ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక 08-08-1997 సంచికలో ప్రచురించబడిన కథ)
అర్దరాత్రి 
పన్నెండు కావడానికి యింకా పది నిమిషాల వ్యవధి వుంది. రైలు పెద్ద కుదుపుతో ఆగేసరికి దివాకరం ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. బయటంతా చీకటి, అంతా అడవి ప్రాంతం. దూరంగా ఎక్కడో మిణుకు మిణుకుమంటూ గుడ్డి వెలుతురులో తండాలోని మనుషులే చెయిన్ లాగి రైలు ఆపినట్టున్నారు.ఇది అక్కడ మామూలే, ఉదయమే మెయిల్ లో పక్క వూరికెళ్ళి కాయకూరలు, కట్టెలు అమ్ముకొని రాత్రి బండికి వస్తారు. ఇక్కడ స్టేషన్ లేకపోవడంవల్ల చెయిన్ లాగుతారు. మరో ఐదుకిలోమీటర్లు వెళ్తే వల్లకాడు స్టేషనొస్తుంది .

“వల్లకాడు”పేరు గమ్మత్తుగా వుంది కదూ? నిద్రరాని ప్రయాణికుడు పక్కన నిద్రపోతున్న మరో ప్రయాణికుడిని లేపి మరీ అడిగాడు. అతను కళ్ళు నులుముకొని నిద్ర చెడగొట్టిన అతని వైపు సీరియస్ గా చూసి, మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు, వాళ్ళిద్దరినీ చూస్తుంటే నవ్వొచ్చింది దివాకరానికి.

‘మీరు వల్లకాడు వరకు వెళ్తున్నారా’? అడిగాడా ప్రయాణికుడు దివాకరాన్ని.
‘అవును…మీకెలా తెలుసు? దివాకర్ అడిగాడు.”పన్నెండు గంటలకు వల్లకాడు’ లో రైలు ఆగుతుంది. మామూలుగా అయితే అందరూ నిద్రపొతారీ సమయంలో. అక్కడ దిగే వాళ్లే స్టేషన్ దాటుతుందేమోనన్న భయంతో మెళుకువుగా వుంటారు. తన ఎనాలిసిస్ కరెక్టేనా? అన్నట్టు చూశాడు అతడు దివాకరన్ వైపు.
అవునన్నట్టు తలూపి చెప్పాడు దివాకరం.“అక్కడ మాకు పొలాలున్నాయి. పదిహేనేళ్ళుగా ఎప్పుడూ వెళ్ళలేదు. కోర్టు కేసుల్లో యిరుక్కుపోయి, ఈ మధ్యే మాకు పేవర్గా తీర్పు వచ్చింది. ఏదో ఓ ధరకు అమ్మేద్దామని నిర్ణయించుకున్నాను”అది సెటిల్ చేయడానికే వెళ్తున్నాను. 
‘అక్కడ ఎవరైనా భూములు కొంటారా? ఎకరం వెయ్యికి కూడా కొనడం లేదు. మా బామ్మర్ది పదేళ్ళ క్రిందటే ఆ ఊరి మంచి తెగనమ్ముకొని వచ్చేశాడు’ చెప్పాడు ఆ ప్రయాణికుడు.
”అదేం”?
 ”మీకు పూర్తిగా తెలియనట్టుంది. ఆ ఊరికి వెళ్లాలంటే బస్సులు లేవు. ‘వల్లకాడు’ స్టేషన్ లో దిగి నాలుగు కిలోమీటర్లు నడవాలా? స్టేషన్ నుంచి ‘వల్లకాడు’ కు వెళ్ళాలంటే స్మశానం, అడవి దాటాలా? పగటిపూట దయ్యాలు తిరుగుతాయంటారు. 
పొద్దునో రైలు, రాత్రికో రైలు అంతా సైకిళ్ళ మీద ఆధారపడాల్సిందే,లేకపోతే టాంగాలు. 
ఆ ఊళ్ళో బయటకు వెళ్ళి బ్రతకలేని వాళ్ళు, ఇళ్లూ, పొలాలు వున్న వాళ్ళూ, ముసలి వాళ్ళూ ఎక్కువ. అందరికీ తాయెత్తులుంటాయి. 
ఇప్పటికి రాత్రి అయ్యిందంటే ఆ ఊళ్ళో ఏడుపులు,పరుగెత్తిన చప్పుళ్లు వినిపిస్తాయట. సాయంత్రం ఆరు అయ్యిందంటే చాలు తలుపులు బిడాయించుకుని పడుకుంటారు. అయినా మీరా ఊరి వాళ్లేగా, మీకా విషయాలు తెలిసినట్టు  లేవు” ఆ ప్రయాణికుడు ఆవులిస్తూ అన్నాడు.
”చిన్నప్పుడే సిటీలో హాస్టల్ లో చేర్పించారు. ఆ తర్వాత చదువంతా అక్కడే. ఎప్పుడో పదిహేనేళ్ల క్రిందట వెళ్ళినప్పుడు, అక్కడ పరిస్థితులు బాగాలేవని ఊరికెవరో చేతబడి చేశారని మా నాయనమ్మ అంటుండేది, నన్ను అక్కడ ఉండనివ్వలేదు కూడా. ఆ తర్వాత మా నాయనమ్మ చచ్చిపోయింది. అమ్మా, నాన్నగారు యాక్సిడెంట్ లో పోయారు. దాయాదులు కోర్టుకెక్కారు. తీర్పు యిప్పుడొచ్చింది. అయినా కోర్టు ఖర్చులకే బోల్డు డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. మా తల్లిదండ్రులు ఆస్తి కోసం  మా వాళ్ళు జ్ఞాపకం కోసం పోరాడాల్సి వచ్చింది” చెప్పాడు దివాకరం. 
రైలు వేగం తగ్గుతోంది.
”మీ స్టేషన్ వచ్చినట్టుంది. జాగ్రత్త ఓ పని చేయండి. ఈ రాత్రి స్టేషన్ లోనే పడుకొని, పొద్దున్నే లేచి వెళ్ళండి” ఆ ప్రయాణికుడు ఉచిత సలహా యిచ్చాడు.
”నాకటువంటి భయాలు, నమ్మకాలు లేవు అంటూ బ్యాగ్ ను చేతిలోకి తీసుకున్నాడు. రైలు పెద్దకేకతో ఆగింది. స్టేషన్ లో లైటు వెలుగుతుంది. దివాకరం ఒక్కడే దిగాడు. స్టేషన్ మాస్టరే కాబోలు బ్లాంకెట్ కప్పుకుని బయటకు వచ్చాడు. అతడే గంట కొట్టాడు. రైలు కదిలింది. వణుకుతూ ఆఫీసువైపు నడిచాడు.
”ఎక్స్ క్యూజ్ మీ”
స్టేషన్ మాస్టర్ దివాకరాన్ని చూసి దయ్యాన్ని చూసినట్టు ఉలిక్కిపడ్డాడు.
”ఊళ్లోకి వెళ్ళాలంటే ఇప్పుడేమైనా టాంగాలు దొరుకుతాయా?”
స్టేషన్ మాస్టర్ దివాకరాన్ని ఎగాదిగా చూసి, ఇప్పుడా? రేపు పదిగంటలు వరకూ టాంగాలు రావు. అయినా ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ దిగారేమిటి? ఊరికి కొత్తా? గొణిగినట్టు అన్నాడు స్టేషన్ మాస్టర్.
మొత్తం వివరాలు పూసగుచ్చినట్టు చెప్పాడు.
”అయితే పురుషోత్తంగారి అబ్బాయివన్న మాట. పొలాలు ఎవరు కొంటున్నారు. ఊరికే వదిలివెళ్తున్నారు. సర్లే. ఓ పన్జేయండి. పక్కనే నా క్వార్టర్ లో పడుకొని రేపు ఉదయం వెళ్ళండి” చెప్పాడు ఎందుకైనా మంచిదని దివాకరం పాదాలవైపు చూస్తూ.(దయ్యాలకు పాదాలు వెనక్కి తిరిగి వుంటాయన్న నమ్మకంతో)
”లేదండీ, రేపు నేను సిటీలో వుండాలి. నడుస్తూ వెళ్తాను. ఎంత ఓ అరగంటలో చేరిపోతాను” అన్నాడు.
”ఈ రాత్రా…దారిలో స్మశానం వుంది. అంత మంచిదికాదు. హెచ్చరించాడు స్టేషన్ మాస్టర్.
”నాకు అలాంటి నమ్మకాలు లేవండి…పోనీ ఈ రాత్రి మనిద్దరం పేకాడుతూ టైం పాస్ చేద్దామా? నిద్రకూడా రావడం లేదు. ప్రపోజ్ చేశాడు దివాకరం.
‘నాకు పేకలో ఎన్ని ముక్కలుంటాయో కూడా తెలియదు” చెప్పాడు స్టేషన్ మాస్టర్. 
”అయితే నేను నడుచుకుంటూ వెళ్తాను” తన నిర్ణయం చెప్పి , బ్యాగ్ లో నుంచి స్వెట్టర్ తీసి వేసుకున్నాడు, స్టేషన్ మాస్టర్ ఏదో చెప్పబోయాడు.
అప్పటికే దివాకరం నాలుగడుగులు ముందుకు వేశాడు. స్టేషన్ మాస్టర్ ఏదో గొణుక్కొంటూ తన క్వార్టర్ వైపు నడిచాడు. క్వార్టర్ లోకి వెళ్ళగానే తలుపు మూసుకుని ఆంజనేయ దండకం చదువుకోసాగాడు.
 
            **           **           **
దివాకరం నడుస్తున్నాడు. చేతులను ప్యాంటు జేబులో తోసి అటు యిటు చూస్తూ ముందుకు కదిలాడు. అతనికి నవ్వొచ్చింది. మనిషికెంత భయం. లేని ఊహలను గుర్తు చేసుకుని భయపడడం సహజమైపోయింది అనుకున్నాడు. అతని జేబులో ఎత్తుగా తగిలింది పేకముక్కల బాక్స్.
దివాకరంకు ఒకే ఒక వీక్ నెస్ పేకాట. ఆఫీసు వదలగానే సరాసరి యింటికి వెళ్ళాడు. ఫ్రెండ్స్ యింటికి వెళ్ళి పేకాటలో కూచుంటాడు. శోభనం రోజు కూడా పేకాట పిచ్చిలో పడి అరగంట ఆలస్యంగా శోభనం గదిలోకి వెళ్లాడు.
వెనక ఏదో గజ్జెల శబ్దం వినిపించింది. ఆలోచనల్లో నుండి బయటపడి  ఒక్క క్షణం ఆగి చెవులు రిక్కించి విన్నాడు. వెనక ఎవరో నడుస్తున్న శబ్దం. చుట్టూ చూశాడు. చెట్లు ఓ పక్కన స్మశానం …. పాడుబడిన సమాధులు. వాతావరణం భయంకరంగా వుంది. కింద కొన్ని ఎండుటాకులు, కాళ్ల కింద నలిగి అదోరకం శబ్దం చేస్తూ అక్కడి వాతావరణాన్ని భయానకంగా మారుస్తున్నాయి.
మొదటిసారిగా భయమేసింది దివాకరానికి
      అప్పటికే రెండు కిలోమీటర్లు వచ్చాడు. వెనక్కి కూడా వెళ్ళలేడు. ఎక్కడైనా తండా లాంటిది. తగిలితే, అక్కడ ఆశ్రయం పొందొచ్చు అనుకున్నాడు. అడుగుల వేగం పెంచాడు. వెనక ఎవరో తరుముతున్నట్టు అనిపిస్తుంది.
దూరంగా ఓ పాడుబడిన యిల్లు, శిథిలావస్థలో వుంది, లాంతరు వెలుగు బయటకు పడుతుంది కిటికీలో నుంచి.
‘హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. లాంతరు వెలుగు ఉందంటే ఎవరో వుండే ఉంటారు’ అనుకున్నాడు. అటువైపు నడిచాడు.
మెల్లిగా  తలుపు తట్టాడు. ఎదురుగా చిన్న టేబుల్ రౌండ్ టేబుల్, ఓ వ్యక్తి కూచుని తదేకంగా ఒక్కడే పేకాట ఆడుకుంటున్నాడు. మధ్యలో లాంతరు, కాస్త ధైర్యం చేసి రమ్మన్నట్టు సైగ చేశాడు. దివాకరానికి కొద్దిగా దైర్యం వచ్చింది. తనలాంటి మరో మనిషి కనిపించడం వల్ల.
“ఊళ్ళోకి వెళ్ళాలి…మధ్యలో ఏవో అడుగుల శబ్దం వినిపించింది. ఈలోగా మీ యిల్లు కనిపించింది అవును….మీరు ఒక్కరే ఉన్నారేమిటి? “అడిగాడు.
”నా వాళ్ళు ఎవ్వరూ లేరు. రోజూ ఒక్కడినే కాలక్షేపం చేస్తాను” అన్నాడు. అతడి గొంతు అదో మాదిరిగా వుంది.
‘అదేమిటి….ఈ పాడుబడిన యింట్లో ?’
”పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు” చెప్పాడతను, బొంగురుపోయిన గొంతుతో.
”భయం వేయదా?” ఒక్కరే వుంటున్నారు.
“భయమా?నాకా?ఎందుకు..అంటూ “ఓ అట ఆడుదామా?ఒక్కడినే ఆడుకోవడం బోర్ గా వుంది”అన్నాడతను దివాకరం వైవు అదోలా చూస్తూ.
దివాకరానికి హుషారుగా వుంది. మంచి కంపెనీ దొరికినందుకు. పేకాట మొదలైంది.
మొదటి రెండు ఆటలు దివాకరం గెలిచాడు. తర్వాత వరుసగా ఎదుటి వ్యక్తి ‘షో’ అనడం మొదలు పెట్టాడు. పట్టుదలగా ఆడుతున్నాడు దివాకరం.
”ఉదయమంతా ఏం చేస్తారు” ముక్కలు కలుపుతూ అడిగాడు దివాకరం.
”ఉదయం ఇక్కడుండను. రాత్రి మాత్రమే వుంటాను చెప్పాడా వ్యక్తి!
” డ్యూటీకి వెళ్తారా?” ఎక్కడ? అడిగాడు.
ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా, ముక్కలు సరిచేసుకుని ‘షో’అన్నాడు.
”మీరు చాలా ఫాస్ట్…నేనే ఫాస్ట్ అనుకున్నాను అన్నాడు దివాకరం మెచ్చుకోలుగా.
కోడి కూత వినిపించింది.
ఆ వ్యక్తి హడావుడిగా లేచాడు.
”ఇంకో ఆట ఆడుదాం… ఓటమితో వెళ్ళడానికి మనసొప్పటం లేదు. ఈసారి నేనే ‘షో’ చెబుతాను” దివాకరం అన్నాడు.
‘లేదు…వెళ్ళాలి… టైమయింది. ఓ పని చేయండి. ఇవ్వాళ రాత్రికి రండి… అంటూ లేచి బాత్రూం లోకి వెళ్ళిపోయాడు.
దివాకరం పేకముక్కలు సర్ది, వళ్ళువిరుచుకుని లేవబోయి ఆగాడు. టేబుల్ మీద పదేళ్ల క్రితం పేపర్, లాంతరు వెలుగులో ఆ పేపర్ లో వున్న ఫోటో చూసి షాకయ్యాడు. 
ఇందాక తనతో పేకాడిన వ్యక్తి ఫోటో. బాక్స్ కట్టి న్యూస్ వేశారు. మే 9, 1987.

ప్రాణాలు తీసిన పేకాట పిచ్చి

సిరామిక్స్ ఫ్యాక్టరీ లో పనిచేసే లాజర్ అనే వ్యక్తి తన పేకాట వ్యసనంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తెల్లవార్లూ ఒక్కడే కూచుని పేకాడుతూ, నిద్రమత్తులో లాంతరుమీద పడిపోయాడు. ఇల్లు అంటుకుంది. ఇల్లు తగలబడిపోవడమే కాక,ఆ మంటలలో లాజర్ తొంభై శాతం కాలిపోయి, ఆస్పత్రిలో కన్నుమూశాడు.ఇతనికున్న పేకాట వ్యసనం వల్ల, అతని భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్ళింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు”అన్న వార్త అది…
ఒక్క క్షణం దివాకరానికి గుండె కొట్టుకోవడం మానేసింది…అంటే రాత్రి నుంచి ఇప్పటి వరకూ తనతో పేకాట ఆడింది లాజర్…ఉహూ కాదు….దెయ్యం…
లాజర్ ఆత్మతో…ఇన్ని గంటలూ…
అది తలచుకోగానే దివాకరానికి మొదటిసారిగా వెన్నులో చలిపుట్టింది.
లోపల బాత్రూంలో నుంచి నీళ్ళ ధారా పెద్ద శబ్దంతో కిందపడుతూనే వుంది. లాంతరులో వత్తి అయిపోయి ఆరిపోయింది. గదంతా చీకటయింది. దివాకరం అలాగే కూచుండి పోయాడు, నిర్జీవంగా…!ఆ భయంతో షాక్ తో…!
                                     ***
ఆ రోజు రాత్రి…
లాజర్ ,దివాకరం కూచోని పేకాడుతున్నారు.మూడవవ్యక్తి కోసం ఎదురుచూస్తూ…సరిగా అప్పుడే ఎవరో తలుపుతట్టారు.టక్ టక్ మంటూ శబ్దం చేస్తూ…
                                              ***
అందుబాటులో వున్న విజయార్కె రచనలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

vijayarke books

ఈ కథను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

2 COMMENTS

  1. నిరాకారాలు అయిన ఆత్మలు అక్షరాల రూపంలో సాకారమై సాక్షాత్కరిస్తే ఎలా ఉంటుందో? తెలుపేదే ఈ కథ.ఆర్.వ్యాస పరాశర భట్టర్