చలి చుట్టేస్తుంటే జ్ఞాపకాల దుప్పటి నులివెచ్చగా కప్పేస్తుంది…వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (20-11-2016)

                                                             (4 )
అర్థరాత్రి పన్నెండూ పది…
ఎక్కడ చూసిన 500 వందలు వెయ్యిరూపాయలు నోట్ల రద్దు వార్త.జనానికి నోట్లు మార్చుకునే అవకాశం కూడా లేదు.బ్లాక్ మనీ ని బయటకు తీసే ఫైనాన్సియల్ సర్జికల్ స్ట్రైక్…ఎలక్ట్రానిక్ మీడియా అర్థరాత్రి కోడై కూస్తోంది.నల్లబాబుల గుండెల్లో విమానాలు దూసుకెళ్తున్నాయి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని ఢీ కొట్టేంత వేగంతో…
అప్పుడే ఆ ఏరియా లోకి ప్రవేశించారు నలుగురు తాగుబోతులు.వాళ్ళ చేతుల్లో బీర్ బాటిల్స్ వున్నాయి.రోడ్డు మీద తాగుతూ తూలుతూ వస్తున్నారు.
అర్థరాత్రుళ్లు రోడ్లమీద తచ్చాడుతూ వచ్చిపోయేవారికి కత్తులతో బెదిరిస్తూ దోచుకునే ముఠా అది.
దూరంగా ఒకతను డప్పు మీద చేతులతో దరువేస్తూ పాటలు పాడుతున్నాడు
‘తెగబలిసిన నల్లడబ్బు బాబులూ ,పుట్టల్లో నుంచి బయటకు రారండి రారండి…దోచినడబ్బును ఇప్పటికైనా పేదోళ్లకు పంచి పుణ్యం కట్టుకోండహో”అనిఅరుస్తున్నాడు.
ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడపడితే అక్కడ తన డప్పుతో ఇలా మాట్లాడేస్తాడు అరుస్తాడు పాడుతాడు అతనికి మతిస్థిమితం లేదని కొందరంటారు.అతడినందరూ డప్పుదాసు అంటారు.
“ఒరేయ్ డప్పూ నీ డప్పు ఆపేయ్ లేకపోతె చిరిగిపోద్ది…”ఆ నలుగురిలో ఒకడు డప్పుదాసును కసురుకున్నాడు.
మిగితా ముగ్గురు అటుగా వచ్చిన బైక్ ను ఆపారు.భార్యాభర్తలు .వాళ్ళ చేతిలో ఒక పసిబిడ్డ.బిడ్డను హాస్పిటల్ కు తీసుకువెళ్తున్నారు.
బిడ్డను లాక్కొని ఆ దంపతులను బెదిరిస్తున్నారు.బిడ్డను హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని ప్రాధేయపడ్డా వినట్లేదు.డబ్బు ఇస్తామన్న తీసుకోవట్లేదు.
“చెల్లని డబ్బు మాకెందుకురా..ఒంటిమీద నగలు ఇచ్చేయండి…”అని కత్తి చూపెట్టారు.
ఆమె మెడలో మంగళసూత్రం తప్ప మరేమీ లేవు..దాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఓ వైపు బిడ్డ ప్రాణం.మరో వైపు మంగళసూత్రం సెంటిమెంట్…బిడ్డ ప్రాణానికే కన్నీళ్లతో మొగ్గు చూపింది ఆ ఇల్లాలు.
“ఒరేయ్ ఒద్దురా..ఆడదాని అయిదవతనంతో ఆడుకోకండి..పంచభూతాలను ఆవాహన చేసుకుని దేవుడొస్తాడు.మిమ్మల్ని పాతేస్తాడు…దేవుడా రారా..మెరుపునుంచి రా..పిడుగులోనుంచి రా…చీకటిని చీల్చుకుంటూ రా…”దప్పదాసు అరుస్తున్నాడు.
“ఇది సినిమా కాదురా దేవుడురా అనగానే రావడానికి..”ఆ నలుగురిలోలావుగా ఉన్నతను అంటూ కత్తిని ఆ ఇల్లాలి కత్తి మెడ మీద పెట్టాడు….ఆమె గొంతులో నుంచి కేక రాకముందే ఆ రౌడీ గోతులో నుంచి కేక వచ్చింది.గాల్లోకి ఎగిరిపడ్డాడు ఆ రౌడీ…
వెనక్కి తిరిగి చూస్తే…
అరడుగు ఆజానుభావుడు.స్ట్రీట్ లైట్ వెలుతురులో నిప్పుకణకల్లాంటి కళ్ళు …
ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని చుట్టేసింది.
మూడే నిమిషాలో ఆ నలుగురిని మట్టి కురిపించాడు.తలోమూల పడిపోయారు.
రక్తపు మడుగులోపడిపోయారు
డప్పుదాసు చేతులు డప్పు మీద పెద్దశబ్ధం చేస్తున్నాయి.”దేవుడొచ్చాడు…”అని అరిచాడు.
ఆ ఏరియా లో గతకొన్ని నెలలుగా రౌడీల దాష్టీకాలతో భయభ్రాంతులు అవుతున్న జనం ఊపిరి పీల్చుకున్నారు.
ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా అతను అక్కడి నుంచి కదిలాడు.
“దేవుడా నీపేరేమిటి?చీకటి నుంచి వెలుగువైపు వెళ్తోన్న ఆ వ్యక్తిని ఉద్దేశించి అరిచి అడిగాడు డప్పుదాసు…
“నేను దేవుడినికాను..మీలాంటి మనిషిని..మీమనిషిని..నా పేరు అనిరుద్ర”నడుస్తూనే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనిరుద్ర…
***
చలి చుట్టేస్తుంటే జ్ఞాపకాల దుప్పటి నులివెచ్చగా కప్పేస్తుంది.ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు.మంచు వర్షమై కురుస్తున్నట్టుంది.కిటికీ తలుపులు తెరిచి చూస్తే,మనసు తలపులు కళ్ళు తెరిచి చూస్తే…ఎదురుగా లాన్ లో నిహారికబిందువులు పచ్చగడ్డి మీద పవళించాయి ఊయలలూగుతున్నాయి.
హాలులో జీరో బల్బు ధవళకాంతులతో మెరిసిపోతుంది.పడగ్గదిలో నీలిరంగు బల్బు బద్ధకంగా అప్పుడే కళ్ళు మూసుకుంది.పూజగదిలో ధూపం హాలులో వున్న శ్రీవేంకటేశ్వరుడి చిత్రపటానికి కైమోడ్పు అంటుంది…ధూపం హాలును పరుచుకుని వింత అనుభూతిని కలిగిస్తుంది.అద్భుతభావం అనుభూతితో సంగమిస్తోంది.
పూజగదిలో నుంచి బయటకు వచ్చింది ఆమె.ఆమె పొడవాటి జుట్టు ,జుట్టును బంధించిన టవల్….నుదుట సూర్యోదయంలా కుంకుమబొట్టు.అప్పుడే తోటలో విచ్చుకున్న తెల్లగులాబీలా వుంది.
హాలంతా పరుచుకున్న ధూపం ఇంటికి రక్షలా అనిపిస్తుంది.మెల్లిగా పడగ్గదిలోకి వెళ్ళింది ధూపం…
హాలులో వున్న స్పీకర్లో నుంచి సుప్రభాతం వినిపిస్తోంది..మంద్రస్థాయిలో…”కౌసల్య సుప్రజ పూర్వాసంధ్యా ప్రవర్తతే…”
***
తలమీదుగా వున్న దుప్పటి తొలిగించి గదిలోకి వచ్చిన ధూపాన్ని,చెవిలోకి వచ్చిన సుప్రభాతాన్ని,తనదగ్గరికి వచ్చిన కాలిపట్టీల శబ్దాన్ని ఏకకాలంలో రిసీవ్ చేసుకుని కళ్ళు తెరిచాడు సమీర్.
ఎదురుగా చిరునవ్వుతో…అతని ముందు నిలబడింది ఎ…ర్వి…క్
అలానే చూస్తుంది పోయాడు సమీర్.
ఇంకా నిన్నటి ఎర్విక్ లానే వుంది.
తర్జని ఎర్విక్ శరీరంలోకి ప్రవేశించినట్టే వుంది…ఎక్కడో విదేశాల్లో జీన్స్ టీ షర్ట్ వేసుకుని బాబ్డ్ హెయిర్ తో స్టయిలిష్ గా కనిపించే ఎర్విక్…పదహారణాల తెలుగమ్మాయికి నిలువెత్తు సంతకంలా…
మెడలోని మంగళసూత్రం ఎర్విక్ గుండెల మీద కోహినూర్ వజ్రంలా మెరుస్తోంది.
రెండుచేతులు చాచి ఆమెను ఆహ్వానించాడు.
“ముందు లేవండి,స్నానం చేయండి.అబ్బా …ఇప్పుడే ఏంటి “లాంటి సినిమా మాటలు మాట్లాడలేదు..అతని గుండెలో ఒదిగిపోయింది.
“దేవుడిని అందమైన భార్యను ఇవ్వమని కోరుకుంటే అందమైన ప్రపంచాన్నే భార్యగా ఇచ్చాడు”ఆమె తలకు చుట్టుకున్న టవల్ ను తీసేసి శిరోజాలను చుంబిస్తూ అన్నాడు సమీర్.
“ఈ అందమైన ప్రపంచంలో ఎలా ఉందొ నన్ను నేను చూసుకోవడానికి అద్దం లాంటి మిమ్మల్ని నాకిచ్చాడు.మీలో రోజు నన్నునేను చూసుకుంటున్నాను…”అతని గుండెలమీద రిలాక్స్ అవుతూ అంది ఎర్విక్.
అప్పుడే వాళ్ళ అపురూప అనుబంధానికి నేపథ్యసంగీతాన్ని అందిస్తూ చిన్నారుల ఏడ్పు మంద్రంగా…సముద్ర తరంగాలు స్వరాలు పలికిస్తున్నట్టు…
” తర్జని లేచింది?అన్నాడు సమీర్
“కాదు అనిరుద్ర నిద్రలేచాడు “చెప్పింది ఎర్విక్ అతని నుంచి విడిపడుతూ…బెడ్ పక్కనే వున్న ఊయల వైపు కదిలి…
సరిగ్గా అదే సమయంలో…
డోర్ బెల్ మోగింది.
ఇంతపొద్దున్నే డోర్ బెల్ కొట్టేది ఎవరు…పాలు పేపర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు.సమీర్ లేచి వెళ్లి తలుపు తీసాడు.
బెడ్ రూమ్ లో నుంచి ఎర్విక్ అరిచి చెప్పింది.”అనిరుద్ర లేచాడు…”అని
“కాదు అనిరుద్రగారు వచ్చారు”ఎదురుగా వున్న వ్యక్తిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ చెప్పాడు సమీర్.
తర్జనిని ఎత్తుకుని వచ్చిన ఎర్విక్ ఎదురుగా నిలబడి వున్నఅరడుగుల బులెట్ లాంటి అనిరుద్రను చూసి షాకైంది.
పట్టరాని సంతోషం ధూపంలా ఆమెను చుట్టేసింది.
***
నార్త్ అవెన్యూ లో కీలకమైన మలుపుతిప్పే సంఘటన వచ్చేవారం.
tobe continued

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY