చివరకు తేలింది ఏమంటే మా బాసిగాడు చెప్పింది నిజం. ఎన్టీఆర్ సాయంత్రం 6 పైన మా ఊరు వస్తున్నాడు…స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటినేను (04-11-2016 )

                                               (5)

“ఎన్టీఆర్ మన ఊరు వస్తున్నాడా?” నమ్మకం కలగక అడిగాను. అది కల కాకూడదు అనుకుంటూ.
“అవును… నీకు చెప్పాలని వచ్చాను” ఆయాసపడిపోతూ అన్నాడు
“నీకు ఎవరు చెప్పారు” వాడి మాటలతో నమ్మకం కుదరక అడిగాను
“తోపులో ఎక్కడ చూసినా అదే మాట” తోపు అంటే మెయిన్ బజార్.. జనం గుమిగూడే ప్లేస్.
సాయంత్రం ఐతే ఎక్కడివాళ్లు తోపులో చేరి లోకాభిరామాయణం మొదలెడుతారు.
ఎందుకో వాడి మాటలు నమ్మకం కలిగిస్తున్నాయి
“పదరా తోపులోకి వెళ్లి వద్దాం” తొందరచేశాడు బాసిగాడు
ఇంట్లో చూస్తే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు.
అమ్మమ్మకు చెప్పేసి బయలుదేరాం
“8 కల్లా ఇల్లు చేరు” అంటూ అమ్మమ్మ వెనుక నుండి అరుస్తున్నా పట్టించుకోక బయటపడ్డాం
మనకు ఊరంతా బంధువులు కావడంతో ఎక్కడ పడితే అక్కడ తినేయడం అలవాటు
నేను సరిగ్గా తిన్నానో లేదో అంటూ ఇంట్లో వాళ్ళ ఆందోళన.
రెండు వీధులు దాటితే తోపు. మెల్లగా నడిచినా 3 నిముషాల కంటే ఎక్కువ పట్టదు.
మాకు 20 నిముషాలు పట్టింది.
పలకరించిన ప్రతివారికి ఓపిగ్గా సమాధానం చెప్తూ తోపు చేరడానికి ఆ మాత్రం టైం కావాలి
“నీతో తోపుకు పోవడానికంటే తిరుపతికి వెళ్ళడం ఈజీ. ఎంత మందితో మాట్లాడుతావురా ” అంటూ మా బాసిగాడి సణుగుడు.
వాడి సణుగుడు పట్టించుకోక తోపులో అడుగుపెట్టాను
అక్కడ కూడా కొంతమంది పలకరింపులు…
చివరకు తేలింది ఏమంటే మా బాసిగాడు చెప్పింది నిజం.
ఎన్టీఆర్ సాయంత్రం 6 పైన మా ఊరు వస్తున్నాడు
బాసిగాడిని మెచ్చుకోలుగా చూశాను
గర్వంతో తెగ ఫీల్ ఐపోయాడు
నాకైతే ఇంకా కలలోనే ఉన్నట్టు ఉంది
టైం 3.30 PM
ఎప్పుడు 6 అవుతుందా అని ఎదురుచూపు…
ఆ రోజు ఎందుకో టైం చాలా స్లో గా పోతున్నట్టు ఉంది
మా నెక్స్ట్ ప్లాన్ లో పడ్డాం
అదేమంటే… ఎక్కడి నుండి చూస్తే ఎన్టీఆర్ బాగా కనపడతాడు.
ఊరంతా బంధువులు కావడంతో ఏ మిద్దె ఎక్కినా అడిగేవాడు లేడు
కాని ఎక్కడ నుండి చూస్తే దగ్గరగానే కాక ఎక్కువసేపు కనపడతాడు?
ఒక గంట సమయంలో ఎన్టీఆర్ తిరిగే దారులన్నీ సర్వే చేసేశాం…
మద్యాహ్నం ఎప్పుడో తినడం వల్ల ఆకలిగా ఉన్నట్టు ఉన్నా, ఎన్టీఆర్ ను చూస్తామన్న ఉత్సాహం ఆకలిని చంపేసింది
టైం సాయంత్రం 5.30
మా సర్వేలో మొత్తానికి తేలింది ఏమంటే మా మిద్దే అతి పెద్దది.. అక్కడ నుండి చాలా సేపు చూడడానికి అవకాశం ఉంది.
ఎవరు ఎక్కడ నిలబడాలి అన్న విషయంపై ఆర్గుమెంట్, అలకలు బుజ్జగింపులు మొదలైయ్యాయి
అప్పటికే అక్కడ జనం గుమిగూడుతున్నారు
మా బాసిగాడు తన లోకల్ పవర్ తో పిల్లలను మా మిద్దెపైకి రాకుండా బెదరగొట్టాడు.
వాడి లాజిక్ ప్రకారం ఎక్కువ మంది ఉంటే మనం చూడ్డానికి కుదరదంట.
“ఒరే బాసిగా… నీకు ఎన్టీఆర్ అంటే ఇష్టం లేదు కదా? మరెందుకు ఇంత హడావిడి?” అని అడిగాను
“అది కాదు సూరీ… ఎంతైనా సినిమా హీరో.. పైగా నీకు ఇష్టం. మా ఊరికి గెస్ట్ గా వచ్చావు. నేను ఆ మాత్రం చెయ్యకపోతే బాగుండదు కదా” అని నసిగాడు
వాడి వాలకం చూస్తుంటే ఎన్టీఆర్ ను చూడాలన్న ఇంట్రెస్ట్ నాకన్నా ఎక్కువగా ఉంది అనిపించింది.
నాకోసం అంటూ అనడం ఒక బిల్డప్ అని క్లియర్ గా తెలిసింది.
వాణ్ని ఎక్కువగా కదిలించకుండా నేను రిజర్వ్ చేసుకున్న ప్లేస్ లో సెటిల్ అయ్యాను
మా మిద్దెకు ఉన్న చిన్న పిట్టగోడ వద్ద నిలబడి ఎన్టీఆర్ కోసం వెయిట్ చెయ్యడం స్టార్ట్ చేశాం
టైం 6.15
మిద్దె మొత్తం జనంతో నిండిపోయింది.
మాకు ప్లేస్ సరిపోవడంలేదు. పైగా చిన్న పిల్లలం కావడంతో మా కన్నా పెద్దవారు మమ్మల్ని వెనక్కు నెట్టేస్తున్నారు
మా బాసిగాడి పరిస్థితి నాకన్నా ఘోరంగా ఉంది.
అతనికి నిలబడడానికి కూడా స్థలం లేదు.
ఇంతలో కలకలం…
ఎన్టీఆర్ వస్తున్నాడంట…
అందరి చూపులూ రోడ్ పైనే…
స్ట్రీట్ లైట్స్ సరిపోకపోవడంతో పెట్రోమాక్స్ లైట్స్ వెలిగించారు
వీధంతా పట్టపగల్లా ఉంది
చాలా సేపు నిలబడ్డంతో కాళ్ళు లాగేస్తున్నాయి.
అనుకున్న సమయం అయ్యింది
అందరూ కన్నార్పకుండా రోడ్ వైపే చూస్తున్నారు.
రెప్ప పడితే ఏదైనా మిస్ అవుతుందేమో అన్న ఫీల్
పార్టీలకు అతీతంగా అందరూ ఎదురుచూస్తున్నారు
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY