దీనంగా మా సర్ వైపు చూశాను. తింటావా చస్తావా అన్నట్టుగా నావైపు చూశారు….స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటినేను (22-01-2017)

 (గత సంచిక తరువాయి)
మా స్క్రిప్ట్ చదివిన వ్యక్తి అందులోని కొన్ని డైలాగ్స్ ను ఖంగుమంటూ వినిపించాడు. ఆ దెబ్బకు అక్కడ ఉన్నవారు అందరూ అదిరి పడ్డారు. అప్పటి వరకు ఎక్కడో లోవాయిస్ తో డైలాగ్స్ చెప్పుకునే మాకు ఆ గొంతు అద్భుతంగా తోచింది. అతను ఖంగుమంటూ డైలాగ్ చెప్తుంటే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాం. డైలాగ్ చెప్పే విధానం ఎలానో అప్పుడే తెలిసింది. అతణ్ణి తీసుకువచ్చిన మా సర్ కి మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాం.
అతని రాకతో మా డైలాగ్ చెప్పే స్టైల్ మారింది. స్పష్టంగా చెప్పడం అలవాటు చేసుకున్నాం.
మరో పక్క… నా మైమ్ డ్రామా ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యింది. డైలాగ్స్ తో పని లేని డ్రామా కావడం వల్ల నా పని సులభం అయ్యింది. కేవలం యాక్షన్ తో అర్థగంట డ్రామాను బోర్ కొట్టకుండా నడపడం అనే కాన్సెప్ట్ నాకు కొత్తగా అనిపించింది.
ఇలాంటి డ్రామాలు కూడా ఉంటాయా… ఇటువంటివి చేస్తే ఎవరైనా చూస్తారా? అన్న సందేహం మనసులో ఒక పక్క పట్టి లాగుతూ ఉన్నా… వచ్చిన అవకాశం పోగొట్టుకోవడం ఇష్టం లేక ఏదైతే అది అయ్యిందని మొండిగా డ్రామా చెయ్యడానికే డిసైడ్ అయ్యాను.
మైమ్ డ్రామా ప్రాక్టీస్ చిత్రంగా ఉండేది. మొత్తం డ్రామా 15 నిముషాలలో అయిపోయేది. రోజులో కనీసం 10 సార్లు ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం.
ఇక శనివారం, ఆదివారం ఐతే చాలు డ్రామా ప్రాక్టీస్ కోసం కొండలు గుట్టలు ఎక్కేవాళ్ళం.
ఒక ఆదివారం టిఫిన్ చేసి మా ఇంటి బయట నిలుచున్నా… ఇంతలో మా తెలుగు సర్ ప్రత్యక్షమైయ్యాడు. వచ్చీ రావడంతోనే తన సైకిల్ వెనుక సీట్ లో కూర్చోమన్నాడు…
ఇంట్లో కూడా చెప్పకుండా బయలేదేరాను. పైగా చెప్పే అలవాటు కూడా లేదాయె…
మా తెలుగు సర్ నన్ను దగ్గరలో ఉన్న టిఫెన్ సెంటర్ కు తీసుకువెళ్ళాడు.
ఉదయం 9 కావడంతో టిఫెన్ సెంటర్ రష్ గా ఉంది. మా తెలుగు సర్ బాచిలర్ కావడంతో హోటల్ టిఫెన్ తప్పదు. ఇక నేను వెయిట్ చెయ్యడం స్టార్ట్ చేశాను.
ఇంతలో కౌంటర్ వద్ద నుండి నన్ను పిలిచారు. నాకు పనేదైనా అప్పజెప్పుతారని అనుకుంటూ వెళ్ళగానే చేతిలో టిఫెన్ ప్లేట్ పెట్టారు.
అప్పటికే ఫుల్ గా తిన్న నాకు చేతిలోని టిఫెన్ ప్లేట్ లో ఉన్న 10 ఇడ్లీలు చూడగానే ఎక్కడలేని నీరసం వచ్చింది.
దీనంగా మా సర్ వైపు చూశాను. తింటావా చస్తావా అన్నట్టుగా నావైపు చూశారు.
ఇక తప్పదనుకుంటూ నెమ్మదిగా ఇడ్లీలను ఒక పట్టు పట్టడం స్టార్ట్ చేశాను.
ఎలాగో టిఫెన్ తిని బయటపడ్డాను. చాలా హెవీగా ఉంది
సైకిల్ లో నన్ను వెనుక కూర్చోపెట్టుకుని ఎస్వీ యూనివర్సిటీ వైపు కదిలాడు.
“ఈ డ్రామాకు నిన్ను సెలెక్ట్ చెయ్యడానికి ముందు మీ క్లాస్ మెట్ ను సెలెక్ట్ చేశాను. కారణం అతనికి సైకిల్ ఉంది. కానీ అతనికి ఇంట్రెస్ట్ లేదు” అన్నాడు సర్
డ్రామాలో సెలెక్ట్ కావడానికి ఫస్ట్ క్వాలిఫికేషన్ సైకిల్ అన్న విషయం అర్థం అయ్యింది. నాకు పట్టిన అదృష్టాన్ని తలచుకుంటూ, ఆ దేవునికి మనసులో థాంక్స్ చెప్పుకుంటూ ఏమీ మాట్లాడకుండా సైకిల్ వెనుక కూర్చున్నా…
సైకిల్ ఎస్వీ యూనివర్సిటీ హాస్టల్ వద్ద ఆగింది. నాకు ఆ వాతావరణం చాలా కొత్తగా వింతగా ఉంది.
అక్కడ మా సర్ కు తెలిసిన మాస్టర్స్ డిగ్రీ చదివే వాళ్ళు చాలా మంది ఉన్నట్టు అనిపించింది.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY