మన మైండ్ అసలే అనుమానాల పుట్ట….స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటి నేను (19-02-2017)

 (గత సంచిక తరువాయి…)
హడావిడిగా నాకు కావలసిన బుక్ కోసం మొత్తం వెదికాను. అతను ఇచ్చిన బుక్స్ నుండి నాకు కావలసిన బుక్స్ సెపరేట్ చేసి పక్కన పెట్టుకున్నా…
అతని షాప్ చాలా చిన్నది. ఇద్దరు వ్యక్తులు షాప్ ముందు నిలుచుంటే చాలు షాప్ మొత్తం కవర్ అయిపోతుంది.
మామూలు బుక్స్ అయితే కవర్ పేజి చూసో లేక రైటర్ పేరు చూసో వెంటనే కొనేయవచ్చు. డ్రామా బుక్స్ అలా కాదు… కాన్సెప్ట్ తో పాటు డ్రామా మొత్తం చదివితే కాని ఒక ఐడియా రాదు.
అతని షాప్ ముందు అంతసేపు నిలబడి బుక్స్ మొత్తం చదవాలంటే… ముందు అతను అసలు ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నా అంతసేపు నిలబడే ఓపిక నాకు ఉండాలి కదా…
తప్పదు… ఒక్కసారి కమిట్ అయ్యాక వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు… ఉండదు కూడా
నా ప్రాబ్లం అతనికి చెప్పి బుక్స్ తో ఒక పక్క నిలబడ్డాను…
ఒక్కో బుక్ డీటెయిల్ గా చూస్తుంటే అతనికి జాలి వేసినట్టు ఉంది…
లోపలి వచ్చి కూర్చుని చూసుకోమన్నాడు. అతని మంచి మనసుకు జోహారు చెప్తూ లోపలికి వెళ్లాను.
గంట పాటు కుస్తీ పట్టి మూడు డ్రామాలు సెలెక్ట్ చేశాను. డబ్బులు పే చేసి ఇంటికి బయలుదేరాను.
***
మన మైండ్ అసలే అనుమానాల పుట్ట.
ఇంటివైపు నడుస్తూ ఉంటే ఎదో చెత్త ఆలోచన.
ఇంత కష్టపడి డ్రామాలు సెలెక్ట్ చేసి తీసుకెళితే… తీరా అక్కడకు వెళ్ళాక చినబాబుకి నచ్చకపోతే?
ఒక్కసారి నీరసం నన్ను చుట్టుముట్టింది. ఇంత కష్టపడ్డా ఫలితం దక్కకపోతే ఎలా?
ఏమైతే అది అవుతుందని మనసులోని ఆలోచనలను ఒక పక్కకు నెట్టి ఇల్లు చేరాను.
పొద్దునే బయటపడ్డ నేను లంచ్ కూడా ఇంటికి రాకుండా సాయంత్రం 4 గంటలకు ఇల్లు చేరాను.
చెప్పకుండా వెళ్ళినందుకు ఇంట్లోవాళ్ళు నాకు అష్టోత్తరం చదువుతున్నా పట్టించుకోకుండా వంట ఇంట్లోకి దూరాను. పొద్దున ఎప్పుడో తిన్న ఇడ్లీలు అరిగిపోగా పనిలోపడి ఆకలి సంగతి పట్టించుకోలేదు.
కమ్మని గోంగూర వాసన చచ్చిపోయిన ఆకలిని మేల్కోల్పింది.
వెంటనే ఆకలికి తట్టుకోలేక హడావిడిగా తినేసి పక్కింట్లో దూరాను.
ఆదివారం సాయంత్రం..
దూరదర్సన్ లో తెలుగు సినిమా వచ్చే టైం. మా ఇంట్లో టీవీ ఉన్నా పక్కింట్లో దూరడానికి కారణం, వాళ్ళ టీవీలో హైదరాబాద్ దూరదర్సన్ తో పాటు మదరాసు (ఇప్పటి చెన్నై) తమిళ్ సినిమా వస్తుంది. మా ఇళ్ళు పక్కన పక్కన్నే ఉన్నా వారి టీవీలో తమిళ్ రావడం మా టీవీలో రాకపోవడం నాకు ఎంత ఆలోచించినా ఇప్పటికి కూడా అర్థం కాలేదు.

టీవీ యాంటేనా తిప్పితే కాని దూరదర్సన్ ను కాదని పక్కింటివాళ్ళ యాంటేనా ఏ డైరెక్షన్ లో ఉందో అదే డైరెక్షన్ లో తిప్పి మాఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టి (పైన యాంటేనా తిప్పుతూ ఉంటే టీవీ వద్ద ఎవరైనా ఉండి చెక్ చేస్తూ ఉండాలి) ఎంత ట్రై చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది.
***
సోమవారం…
నేను కొన్న డ్రామా బుక్స్ ని మరిచిపోకుండా స్కూల్ బ్యాగ్ లో పెట్టుకుని బయలుదేరాను.
డ్రామా టైం లంచ్ తరువాత…
లంచ్ వరకు టైం గడిపి ఎలానో లంచ్ ముగించుకుని లైబ్రరీ చేరాను.
మా డ్రామా ప్రాక్టీస్ 3 గంటలకు ఉండడంతో 2 గంటలకు లైబ్రరీలో అడుగుపెట్టాను.
అప్పటికే చినబాబు, అతని గ్యాంగ్ కూర్చుని ఉన్నారు.
నెమ్మదిగా వెళ్లి నా చేతులోని డ్రామా బుక్స్ ని అతనికి అందించాను.
అతను తన పక్కన ఉన్న అతని ఫ్రండ్ కి ఆ బుక్స్ హ్యాండ్ ఓవర్ చేశాడు.
ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్ లా వాళ్ళ ముందు నిలబడ్డాను

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY