నేలమీదే పడక. ఒక బెడ్ షీట్, దిండు, చిన్నగది.అందులో తనతోపాటు మరో ముగ్గురు…విజయార్కె…సీరియల్ ..ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్(30-04-2017 )

6
సెంట్రల్ జైలు!
జైలులో సుమన్
కలలోకూడా ఊహించని విషయం. ఒక రైజింగ్ స్టార్ సెంట్రల్ జైలులో వుండడం బహుశా చలనచిత్ర చరిత్రలో మొదటిసారేమో!
ఆ రోజు రాత్రి అంతా నిద్రలేదు.
ఆ రాత్రంతా జాగరమే.
తెల్లవారింది.
తాను వుంది జైలులో.లోపలికి పేపరు వచ్చింది.
పేపరులో చూశాడు సుమన్.
అందులో తన అరెస్టు వార్త ప్రముఖంగా వచ్చింది. గుండాస్ యాక్ట్ తదితర సెక్షన్ల క్రింద అరెస్టు చేసినట్లు వుంది.
ఓ పెద్ద పుస్తకం ఇచ్చారు.
తన మీద ఫైలుచేసిన ఎఫ్.ఐ.ఆర్ అది.
దాన్ని స్టడీ చేసి చదువుకోమన్నారు. సుమన్ గుర్తులు తీసుకున్నారు. తర్వాత సంబంధితాధికారి వచ్చి జైలు నియమ నిబంధనలు చెప్పరు.
సుమన్ వాటిని యాంత్రికంగా వినసాగాడు.
కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ఆ క్షణం ఏం చేయాలో అర్ధం కాలేదు.
* * *
కేసుకు ఏమాత్రం సంబంధం లేకుండా మరుసటిరోజు పేపర్లలో (తెలుగు పత్రికలలో కాదు) బ్లూఫిలిం కేసులో సుమన్ అనే సారాంశంతో కూడిన వార్తలు ప్రత్యక్షమయ్యాయి.
అది చూసి ఏం చేయాలో తోచలేదు సుమన్ కు.
అసలిదంతా ఏమిటి?
పత్రికలూ తనపై వచ్చిన ఆరోపణలను ఈ విధంగా క్యాష్ చేసుకుంటూన్నాయా?
ఎఫ్.ఐ.ఆర్ లో తన మీద వున్న కేసులకు పత్రికలలో వచ్చిన వార్తలకు పొంతనలేదు.
ఇది నిజంగా విచారించాల్సిన విషయమే. ఇప్పటికి సుమన్ మీద బ్లూఫిలిం కేసు ఉందని, ఆ కేసు గూర్చే జైలుకు వెళ్ళాడని అంతా అనుకుంటారు. నిజంగా మాత్రం ప్.ఐ.ఆర్ లో బ్లూఫిలిం ప్రసక్తే లేదు.
ఆ వార్త చదివిన సుమన్ హర్ట్ అయ్యాడు.
ఆ తరువాత పత్రికలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించడం ప్రారంభించాయి. వాటిమీద రోజుకో విధంగా వార్తలు బయలుదేరాయి. సుమన్ మీద ఫైల్ చేసిన ఎఫ్.ఐ.ఆర్ న్యూస్ కన్నా ఈ వార్తకు అక్కడి పత్రికలు ప్రచారాన్నిచ్చాయి. వాటి ట్రాన్సలేషన్స్ ను తెలుగు పత్రికలూ వేశాయి.
ఈ విషయంలో తెలుగు ప్రెస్ కు నేను థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తెలుగు ప్రెస్ మిగతా కొన్ని పత్రికలు సమంగా రెండు వెర్షన్స్ ప్రచురించాయి అన్నాడు సుమన్.
* * *
సుమన్ ను చూడడానికి తల్లి వచ్చింది.
”బాబూ”
ఎదురుగా తల్లి ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు సుడులు తిరక్కపోయినా మనిషి గంభీరంగా వున్నా అది కొడుకు కోసమే.
ఒక్కోసారి కన్నీళ్ళు కార్చడం కన్నా కన్నీళ్ళను దిగమింగుకోవడమే పెద్ద పనిష్మెంట్ అవువుతుంది.
కొడుకును ఆ పరిస్థితుల్లో చూడవలసి వస్తుందనుకోలేదు. తాను కొడుకును ఓదార్చాలా? ఎలా?
”ఎలా వున్నావమ్మా?
”బాబూ..” అతని చేతుల మీద తన చేతులు వేసింది., ఆమె గొంతు వణుకుతోంది.
”అంతా సర్దుకుపోతుంది బాబు.నేను లాయర్లతో మాట్లాడాను” అంతకు మించి మాట్లాడలేకపోయింది.
ఇద్దరి మధ్యా మౌనం.
ఎవర్ని ఎవరు ఓదార్చాలో తెలియని పరిస్థితి.
* * *
జైలు వాతావరణానికి అలవాటుపడడం చాలా కష్టం. అయినా సుమన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు.
పక్కకు తిరిగాడు. నేలమీదే పడక. ఒక బెడ్ షీట్, దిండు, చిన్నగది.
అందులో తనతోపాటు మరో ముగ్గురు.
అందులోనే ఓ మూల లెట్రిన్, బాత్రూమ్, కిచెన్ అన్నీ ఆ గదిలోనే ఓ కుండలో నీళ్ళు. ఆ నీళ్ళనే అన్నింటికీ ఉపయోగించుకోవాలి.
మామూలు వ్యక్తులకు ఓకే ..కానీ లగ్జరీలో పుట్టి పెరిగిన సుమన్ లాంటి వ్యక్తికి అదీ సినిమా ఇండస్ట్రీలో హీరోగా వున్న వ్యక్తికి అలాంటి వాతావరణం నిజానికి ఇబ్బందే…కష్టమే. ఊహించుకోవాల్సిందే.
ఒక్కోసారి ఆ గదిలో ఏడుగురు కూడా వుంటారు.
ఉదయం లేవడం, బ్రేక్ ఫాస్ట్ గా రెండు చపాతీలు, కప్పు టీ
లంచ్ కు రైస్, పప్పు, డిన్నర్ లో రెండు చపాతీలు ఇదీ అక్కడ సుమన్ ఆహారం.
రోజూ క్యూలో నిలబడ్డం , ఆహారం తెచ్చుకోవడం….
ఆ జైల్లో వున్నవాళ్ళకు సుమన్ గూర్చి తెలుసు అతనో హీరో అని.
తమిళంలో కూడా సుమన్ పిక్చర్స్ చేశాడు. తమిళ ప్రేక్షకులకు కూడా సుమన్ పరిచయమే.
అలాంటి వ్యక్తి కేవలం తిండికోసం క్యూ కట్టడం వాళ్ళను బాధించింది. వాళ్ళలోవాళ్లే తీసుకొచ్చే పెట్టేవాళ్ళు.
స్నానానికి నీళ్ళు కూడా తోడేవారు. కానీ సుమన్ కిది నచ్చలేదు తనకోసం వాళ్ళు అలా చేయడమెందుకు? తానూ ఓ మనిషే.
వాళ్ళతో మాట్లాడ్డం తన దినచర్యలో ఓ భాగం చేసుకున్నాడు. వాళ్ళవల్ల ఎన్నో విషయాలు తెలిసాయి. వాళ్ళ చరిత్ర, కథలు వింటుంటే సుమన్ కు ఆశ్చర్యం కలిగేది.
నిజజీవితంలో కూడా సినిమా కథలను మించిన విషాదకరమైన గాథలుంటాయని తెలుసుకున్నాడు.
* * *

(ఇంకా వుంది)

మేన్ రోబో పాఠకుల కోసం పునః ప్రచురణ
ఈ పుస్తకం కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులో వుంది.
ఆంధ్రభూమి వీక్లీలో ఈ సీరియల్  వస్తోన్న సమయంలో (1991 ప్రాంతంలో) ఈ సీరియల్ చదివిన పాఠకులు అప్పటి అనుభవాలను షేర్ చేసుకోవచ్చు.
ఈ పుస్తకం కావాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చేయండి

http://preview.kinige.com/previews/7800/PreviewJailuGodalaMadhyaHeroSuman36533.pdf

NO COMMENTS

LEAVE A REPLY