ఆమె నడుం ఒంపులో మంచు ముత్యాలను ఏరుకున్నాడు. ఆమె పెదవులపై స్కీయింగ్ మొదలెట్టాడు. ఆమె శరీరంతో స్కెటింగ్ చేశాడు. పెదాలు పాదాలయ్యాయి. .విజయార్కె రొమాంటిక్ ఫ్లేవర్ కాశ్మీరం

స్వాతి సపరివార పత్రికలో (2009) లో ప్రచురితమైన సరసమైన కథ.స్వాతికి ప్రత్యేక ధన్యవాదాలతో …
ఆ రాత్రి వెండికొండమీద, చంద్రుని వెలుగును ఆహ్వానిస్తూ శ్వేతవర్ణాన్ని వెక్కరిస్తున్నట్టుంది. ఆమె పెదవులపై ముద్దుపెట్టాడతను. ఆమె చేతులు చేతలై అతన్ని చుట్టేశాయి. ఆమె మనసు సన్నజాజుల పరిమళం అయింది. కరిగేమంచు ధూపములో ఇద్దరూ ఒక్కటయ్యే సమయంలో….
”కదన రంగాన్ని కథన కుతూహలంగా మార్చిందామె. రణక్షేత్రం ఆ క్షణాన శృంగారక్షేత్రమైంది. యుద్ధంలో రక్తవర్ణం, వాళ్ళిద్దరి గాఢ పరిష్యంగణంలో నీలివర్ణమైంది. శత్రువులను తరిమికొట్టిన మారణాయుధాలు, అక్కడ వాళ్ళ అమలిన శృంగారంలో నఖ, దంత, చుంబన క్షతాయుధాలయ్యాయి శతధా వర్థిల్లాయి.
రణ క్షేత్రంలో వన్ మేన్ ఆర్మీగా శత్రువులను తుదముట్టించే అతను, ఒన్ అండ్ ఓన్లీ, ప్రాణబెన్స్ గా ఆమెలోని విరహాన్ని తరిమికొట్టాడు.యుద్ధకాశ్మీరాన్ని, శోభన కాశ్మీరంగా మార్చిన, అతగాడి ఇష్టబెన్స్ ఎందుకిలా చేసింది? ఈ ‘ఆపరేషన్ కాశ్మీరం’ వెనుక వున్న ఆమె ఆంతర్యపు నేపథ్యం ఏమిటి?”
అప్పటివరకూ ఉద్వేగాన్ని శ్వాసించిన ఆ శోభనపు గది , ఆ క్షణం ఉత్కంఠను నిశ్వసించింది. చలిలో చెలిమిచేసి, కౌగిలితో ఉద్విగ్నానికి లోనైంది.
శోభనపు అలంకరణలో వున్న ప్రణతి ఓ పక్కగా తలొంచుకొని నిలబడి వుంది. ఆమెకు అభిముఖంగా ఆమెనే చూస్తూ నిలబడివున్నాడు మిస్టర్ ప్రణతి.ఆర్మీ ఆఫీసర్ అగ్నిహోత్ర.
ప్రణతి తలలో సన్న జాజుల పరిమళం అతని మనసును చేరి, గొప్ప ఫ్లేవర్ ని పెర్ఫ్యూమ్ లా స్ప్రే చేస్తున్నట్లుంది.
”ఇప్పుడేం చేద్దామంటారు? అడిగాడు ప్రణతి తండ్రి అగ్నిహోత్ర బామ్మని. బామ్మ మనవాడి వైపు చూసింది. అగ్నిహోత్ర ప్రణతివైపు చూశాడు. అందరి చూపులూ ఆ గదిలో హైడ్ అండ్ సీక్ ని గుర్తు తెప్పిస్తున్నాయి. చివరగా అగ్నిహోత్ర గొంతు విప్పాడు.
”నేను వెళ్ళక తప్పదు…ఇది అత్యవసర పరిస్థితి”
”అదేమిట్రా? యుద్దమైతే సైన్యం చూసుకుంటుంది. నువ్వే వెళ్లి యుద్ధం, గట్రా చేయాలా? బామ్మ అంది.
”ఇది సైన్యం చేయవలసిన యుద్ధం కాదు బామ్మా… నేనే ‘ఏవ్యక్తి సైన్యం’ లా వెళ్ళాలి” చెప్పాడతను.
ఆ ‘ఏకవ్యక్తి సైన్యాన్ని’ కి అర్ధం తెలియనిది కాదు బామ్మ. ఆమె భర్త మిలటరీలో పనిచేసి దేశంకోసం ప్రాణం విడిచిన వీరుడు…కొడుకు సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతూ, తన దేహాన్ని దేశరక్షణకు అర్పించినదీరుడు. అయినా ఆమెలో దేశభక్తి ఆవగింజంతయినా చలించలేదు…మనవడిని అర్మీలోకి పంపించింది.
మరో వీరుణ్ణి ‘మునిమనవడు’ గా ఈ దేశానికి అప్పగించాలని ప్రణతిని తన ఇంటి కోడలిగా ఆహ్వానించింది. , తన మనవడికిచ్చి పెళ్ళి చేసింది.
ఆ రాత్రి శోభనం ఏర్పాట్లు…
అంతలోనే అర్జంట్ ‘ఎమెర్జెన్సీ ఆపరేషన్.’
ఒక్కక్షణం సరిహద్దుల్లోని యుద్ధ వాతావరణం ఆ గదిలో నెలకొంది. ప్రణతి తండ్రికి నోటమాట రాలేదు. బామ్మ నిశ్చేష్టురాలైంది. అగ్నిహోత్ర విభ్రాంతిగా చూస్తుండిపోయాడు. ప్రణతి ముందుకొచ్చి నిలబడింది.
”ఏంటి చిట్టితల్లి నువ్వు మాట్లాడేది? బామ్మగొంతు పెగుల్చుకొని మరోసారి అడిగింది.
“నేనూ మీ మనవడితో వెళ్తాను “స్థిరంగాచెప్పింది ప్రణతి. ప్రత్యేక విమానంలో కాశ్మీర్ మంచుకొండల్లో సమావేశమవుతోన్న సరిహద్దు దేశపు తీవ్రవాద సంస్థల ఆత్మాహుతి దళాలను ఏరిపారేసి ఆపరేషన్ కోసం బయల్దేరే అగ్నిహోత్ర వెంట ప్రణతి’ తానూ వస్తానని’ పట్టుబట్టింది.
”వాడు వెళ్ళేది యుద్దానికి…మిమ్మల్ని ‘హనీమూన్’ కు పంపించడం లేదు” బామ్మ తేరుకొని చెప్పింది. మందలిస్తున్నట్టు…వాస్తవాన్ని వివరిస్తున్నట్టు…
”యుద్దమైనా, శోభనమైనా…చివరికి ఈ దేహం విడిచి నిష్క్రమించడం అయినా ఆయనతోనే…” గొంతు వణుకుతోండగా దృఢంగా చెప్పింది ప్రణతి.
ఒక్కక్షణం అగ్నిహోత్ర కదిలిపోయాడు. ఒక చిన్న వాక్యం…అతని గుండెల్లోకి అణ్వస్త్ర సమానమై చొచ్చుకుపోయింది. అది ప్రాణాలు తీసేది కాదు..ప్రాణం చుట్టూ ఆత్మలా ఆవహించేది. కన్నీటిని సృష్టించేది.
***
హైదరాబాద్ నుంచి బయల్దేరిన ప్రత్యేక విమానం కాశ్మీర్ వైపు వెళ్తోంది. భర్త భుజాలమీద తలవాల్చి కళ్ళు మూసుకుంది ప్రణతి. అగ్నిహోత్ర ప్రణతివైపు చూస్తుండిపోయాడు. ఇంకా ఆమె శోభనపు అలంకరణలోనే వుంది. ఆమె జాడలోని సన్నజాజుల పరిమళం కన్నా, ఆమె శరీరాన్ని ఆవరించిన మనసు తాలూకు పరిమళం అతణ్ణి చుట్టుముడుతోంది. ఎంతో అలసిపోయినట్టు కనిపిస్తోంది. కేవలం కొన్ని రోజులకు ముందే పరిచయం అయి, తన జీవితంలోకి ప్రవేశించిన ప్రణతి…ఎన్నో ఏళ్ళుగా తనకు తెలిసినదానిలా అనిపిస్తోంది అతనికి.
ప్రణతి నుదురుమీద ముద్దుపెట్టుకున్నాడు.
ప్రణతి మరికాస్త దగ్గరగా జరిగింది. గదిలో మొదటి రాత్రి జరుపుకోవాల్సిన ఆ జంట ఆకాశానికి, భూమికి మధ్య వున్నారు. శృంగార మంత్రం పఠించాల్సిన అతను, కళ్ళుమూసుకుని యుద్ధతంత్రాన్ని రచిస్తున్నాడు
సరిగ్గా కొన్ని నిముషాల ముందు…ఇంట్లో అందరూ శోభనపు ఏర్పాట్లలో వున్నా సమయంలో ఆర్మీ చీఫ్ మూడో కంటికి తెలియకుండా తన దగ్గరికి వచ్చాడు.
”మిస్టర్ అగ్నిహోత్రా…వెరీ ఎమర్జెన్సీ…ఇది సైన్యం వెళ్లి ముఖాముఖి తలపడే యుద్ధం కాదు. సరిహద్దు దేశంలో ఎమర్జెన్సీవుంది. ఆ విషయం మీకు తెలుసుగా…
ఆ దేశానికి చెందిన నాలుగు తీవ్రవాదసంస్థలు ఆత్మాహుతిదళాలు కాశ్మీర్ లో సమావేశమవుతున్నాయి. అతి కీలకమైన సమావేశం జరగబోతోంది. తెల్లవారితే మంచు కొండల్లో విధ్వంస రచన మొదలవుతోంది.
ఏమరపాటుగా వుంటే మనదేశ శాంతిభద్రతలు మంచులా కరిగిపోతాయి. డూ ఆర్ డై…ఏదో ఒకటి చేయాలి…ఈ రిస్కీ ఆపేరేషన్ ఈ సమయంలో మీకు తప్పడంలేదు…అయామ్ వెరీ సారి మిస్టర్ అగ్నిహోత్రా” ఆర్మీ చీఫ్ చెప్పి క్షణాల్లో మాయమైపోయాడు.
***
గుల్మార్గ్.
కాశ్మీర్ లోని ప్రధాన మైన స్కీయింగ్ పాయింట్. సముద్రమట్టానికి రెండువేల ఏడువందల ముప్పయి మీటర్ల ఎత్తులో వున్న హిల్ రిసార్ట్. హెలా స్కీయింగ్ లకు పెట్టింది పేరు. దేశవిదేశాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో స్కీయింగ్ పోటీలకు వచ్చిన వాళ్ళకు తెలియదు. ఇక్కడ ఓ విధ్వంసరచన జరుగుతోందని…
హిమాలయ పర్వత శ్రేణులను, మంచు దుప్పటిలా కప్పేసినట్టుంది. మంచు ముద్దులతో ఆడుకోవాలనిపించే ఆ వాతావరణంలో, చలి శరీరమంతా ఆక్రమించి వణికించేస్తుంటే…ఆ రాత్రి వెండికొండ మీద, చంద్రుని వెలుగును ఆహ్వానిస్తూ, శ్వేతవర్ణాన్ని వెక్కిరిస్తున్నట్టుంది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా హిమమే…కనుచూపు మేరలో ఎటు చుసిన నిర్మాణుష్యమే.
టెంట్ లో నుంచి బయటకు వచ్చారు అగ్నిహోత్ర, ప్రణతి. ప్రత్యేక విమానం వాళ్ళకు దింపేసి వెళ్ళిపోయింది. ఆపరేషన్ పూర్తి అయ్యేవరకూ, వాళ్ళు ఆ మంచుమీదా, ఆ చలిగాలులలో సహజీవనం చేయాలి.
”భయంగా వుందా?” అడిగాడు అగ్నిహోత్ర.
”భయమెందుకు…నా పక్కన ధైర్యం ఉండగా…”
భర్త గుండెలో తలపెట్టి ఒదిగిపోతూ అంది.
”చలిగా వుందా?”
”చలెందుకు…చలిమంటలా మీరుండగా” అంది.
అతను ఆశ్చర్యంగా భార్యవంక చూశాడు. శారీరకమైన అందంకన్నా, వ్యక్తిత్వం తాలూకు అందం…మంచు పర్వతాన్ని మించిన శ్వేతవర్ణంతో ఆమె శరీరమ్మీద ప్రతి ఫలిస్తుంది. ఆమె చలికి వణుకుతోంది. తనకి వాతావరణం అలవాటే…కానీ భార్యకు…?
”ఈ చలిని తట్టుకోవడం కష్టం” అన్నాడు.
”కాదు…ఇష్టం…” అంది ప్రణతి.
”ఎలా?”
”ఇలా…” చుట్టూ చూసింది. పైన వెండి వెలుగులను అందిస్తూ మొహం తిప్పుకున్న చంద్రుడు.
కింద…తన వీపును పాన్పుగా చేసుకోమని చెప్పే హిమం…చుట్టూ…గది గోడలుగా మారిన చల్లగాలులు… ఆమె అక్కడ…ఆ వాతావరణంలో వున్నా చలి ఉద్వేగాన్ని పెంచుతూ…ఒక్కో ఆచ్చాదనా తీసి వేస్తోంది.అగ్నిహోత్ర అలానే చూస్తుండిపోయాడు.
చల్లటి వాతావరణంలో, వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్, వెచ్చదనాన్ని ఇచ్చే ఎన్నో ఆచ్చాదనలు ఉండవలసిన శరీరం మీద…అనాచ్చాదితమే వస్త్రమైనట్టు వివస్త్రయై నిలబడి పోయింది. అతని ముందు మోకరిల్లింది. అతని కోసం పాన్పు అయింది. ఆ క్షణం ఆమె శరీరం శృంగారవీణ అయింది. అతను వైణికుడు అయ్యాడు.
ఎముకలు కొరికే ఆ చలిలోనే వాళ్ళ శరీరాలు మమేకమవుతున్నాయి. రెండు అనాచ్చాధిత శరీరాల మధ్య శృంగార యుద్ధం…మొదలైంది. రెండు శరీరాల రాపిడిలో చలిమంట మొదలైంది. తన దేహాన్ని అతని ముందు పరిచింది. ఆమె శరీరంలో పర్వతశ్రేణులను స్పృశించాడు. ఆమె నాభిలోని లోతుని చూబించాడు.
ఆమె నడుం ఒంపులో మంచు ముత్యాలను ఏరుకున్నాడు. ఆమె పెదవులపై స్కీయింగ్ మొదలెట్టాడు. ఆమె శరీరంతో స్కెటింగ్ చేశాడు. పెదాలు పాదాలయ్యాయి. నిట్టూర్పులు వేడిసెగలయ్యాయి. శృంగార తంత్రం అనుభవాల దొంతరైంది.
కాలం మంచులా కరిగిపోతుంది. అనుభవాలు హిమవర్ణంతో పోటీ పడుతున్నాయి. ప్రకృతి సాక్షిగా…హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఆ జంట ఏకమై…మమేకమై…మమజీవన హేతునా…కు పరమార్ధమైంది. రెండు మనో శరీరాల సంగమం…సాగరసంగమమైంది.
***
అర్ధరాత్రి ఒంటిగంట…
ఆమె నుంచి విడివడ్డాడు అగ్నిహోత్ర…
యుద్దానికి ముందు కవాతు చేసినట్టుంది.
కొత్తరకం అనుభవం…కొంగ్రొత్త ఉత్సవాహం. అది వీర తిలకం కాదు. శృంగారానుభవ తిలకం…మనో శరీరాలకు కొత్త శక్తినిచ్చే మంత్రం. తన సహచరి అర్పించిన, అభిమంత్రించిన పరిమళాల మంత్రపుష్పం.
అప్పటివరకూ అతనిలో వున్న శృంగారభావకుడు పక్కకు తప్పుకున్నాడు. సైనికుడు బయటకు వచ్చాడు. మంచులా కదిలాడు…మృత్యువులా చెలరేగాడు. నిశబ్దాన్నిచీలుస్తూ…ఆకలిగొన్న సింహంలా కదిలాడు.
అతను చేతిలో వున్న మారణాయుధంలో ఏ క్షణమైనా నిప్పులు గక్కడానికి సిద్ధంగా వుంది.
”మీకోసం…మీ సమాగం కోసం…మీ స్పర్శకోసం…ఎదురుచూస్తూ వుంటాను…ఎంతకాలమైనా…ఈ హిమాలయాలు మొత్తం కరిగేవరకైనా…” తనను గట్టిగా హత్తుకొని భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. దేశాన్ని అతలాకుతలం చేసే ఆత్మాహుతి దళాల జాడలు తెలిశాయి. అతని చేయి వేగంగా కదిలింది.
కన్నుమూసి తెరిచేలోగా, గాలిని సర్రున చీలుస్తూ ముందుకు కదిలి, అత్యంత అధినాథనమైన ఆయుధాన్ని గురిపెట్టాడు. శత్రువుల గొంతులు పెగలకముందే తూటాలు వాళ్ళ శరీరాలను ఛిద్రంచేశాయి.
***
మంచు పర్వతం, వాళ్ళ రక్తంతో తడిసి, తలస్నానం చేసింది తృప్తిగా. ఆపరేషన్ కాశ్మీరం సక్సెస్…
ఆత్మాహుతి దళాలు నేలకొరిగాయి. విధ్వంసరచన చేసిన వాళ్ళు ధ్వంసమయ్యారు. రాత్రంతా శత్రువులను అన్వేషించి, తుదముట్టించి అలసిపోయి వచ్చిన ఆ వీరుడు…ఆమె ఒడిలో సేదతీరారు.
”ప్రణతి…ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ రిస్కీ ఆపరేషన్ కు వచ్చాను. నువ్వు ఏ ధైర్యంతో నాతో వచ్చావు? ఆమె అనాచ్చాదిత దేహాన్ని స్పృశిస్తూ అడిగాడు.
”మీ ధైర్యంతోనే…మీరున్నారన్న ధైర్యంతోనే” అంది ప్రణతి. ”అంటే…?” అర్ధంగాక అడిగాడు.
ఆమె పెద్దవులు సమాధానం చెప్పలేదు….ఆమె చేతుల చేతలై అతన్ని చుట్టేశాయి. ఆమె మనసు సన్నజాజుల పరిమళం అయింది. కరిగే మంచు అగరొత్తుల ధూపమయ్యింది. హిమవత్పర్వతం పాన్పుగా మారింది. కొరిక ఫైర్ ప్లేస్ అయింది. అనాచ్చాదిత దేహాలు వెండి వర్ణమున్న చెకుముకి రాళ్ళయ్యాయి.
”ఏ ధైర్యంతో తను భర్తతో వచ్చింది.
ఏ కోరికతో తను భర్తను అనుసరించింది?
జరక్కూడనిది జరిగినా…ఈ రిస్కీ ఆపరేషన్ ఫెయిలైనా…తన భర్త స్పర్శ తన శరీరంలో, తన భర్త తాలూకు జ్ఞాపకం తన కడుపులో భద్రంగా వుండాలి.
ఒక జీవిత కాలానికి సరిపడే ఈ కలయిక…మరో వీరుడి పుట్టుకకు శుభారంభం కావాలి…ఈ గుండెను పట్టి కుదిపేసిన ఆ కోరిక…ఆ తపనే భర్తతో వచ్చేలా చేసింది. ఆ ఇష్టమే తన భర్త యుద్దానికి వెళ్ళేముందే…తను శృంగార తిలకం దిద్ది పంపించేలా చేసింది.
తన భర్త వీరుడు …కదనరంగంలో…
తన భర్త ధీరోధాత్తుడు…శృంగార కథన కుతూహంలోనూ…”ఒక్కసారిగా భర్తను చుట్టేసింది.
ఆమె మనసులోని భావాలు…అతని శరీరంలోకి చొచ్చుకుపోయినట్టు…అతని శరీర స్పర్శ…ఆమె అంతరాంతరాల్లోకి ద్విగుణీకృత వేగంతో కదిలినట్టు రెండు శరీరాలు హిమాన్ని వెచ్చబరుస్తున్నాయి.
కోరికలను రెచ్చగొడుతున్నాయి.
తెలతెలవారుతుండగా, ఆమెనుంచి ఆరవసారి విడిపడుతూ ”యుద్ధ కాశ్మీరాన్ని శోభన కాశ్మీరంగా మార్చావు కదూ…” అన్నాడు ఆమె తలపై నిమురుతూ ఆమె చెవి కొసని కొరుకుతూ. సరిగ్గా అప్పుడే అతనికో మెసేజ్ వచ్చింది ఆర్మీ చీఫ్ నుంచి.
”కంగ్రాట్స్…ఆపరేషన్ కాశ్మీరం సక్సెస్ చేసినందుకు…సారీ..ప్రత్యేక విమానాన్ని పంపించడం లేదు. ఆ మంచుకొండల్లో మీ పాట్లు మీరు పదండి…తొమ్మిది నెలలపాటు సెలవు ఇస్తున్నాను. హేపీ హనీమూన్…”
ఆ మెసేజ్ చూసి ఎక్కువ సంతోషపడింది ప్రణతే!
ఆ కాశ్మీరం వీళ్ళని అక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా వుంది. ఆ తొమ్మిది నెలలూ వీళ్ళకు కాశ్మీరం…శృంగార కాశ్మీరమే. వీరి జీవితాలు రసోదయమే!
* * *

NO COMMENTS

LEAVE A REPLY