అద్భుతమైన రచనాశైలి…కట్టిపడేసే భావోద్వేగాల సరళి.పాత్రల్లో ఔచిత్యం…కథనంలో మానవత్వాన్ని పరిచయం చేయడం…అభినందన వర్షంలో…ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి గుప్పెడంత ఆకాశం (30 -07-2017)

ఫీడ్ బ్యాక్
నమస్తే …
నా వయసు ఎనభై దాటింది.పుస్తకాలు చదివి చాలా కాలమైంది.కంటిచూపు ఒక కారణమైతే..కంటికి(మనసుకు)ఆహ్లాదాన్ని కలిగించే రచనలు అరుదుగా రావడం మరో కారణం.మా మనవరాలు యుఎస్ నుంచి ఈ వయసులో నా కోసం స్మార్ట్ ఫోన్ పంపించింది.నెట్ కూడా పెట్టించింది.మేన్ రోబో అంతర్జాల పత్రికలో ఆలా చదివిన ధారావాహిక గుప్పెడంత ఆకాశం…అద్భుతమైన రచనాశైలి…కట్టిపడేసే భావోద్వేగాల సరళి.పాత్రల్లో ఔచిత్యం…కథనంలో మానవత్వాన్ని పరిచయం చేయడం…రచయిత్రి శ్రీసుధామయికి కృతఙ్ఞతలు ..ఆశీస్సులు…ఇలాంటి ధారావాహికలు మరిన్ని మీ కలం నుంచి రావాలని కోరుకుంటున్నాను. (సరస్వతీ దేవి,పూర్వ ఉపాధ్యాయిని)

7
మనసు అలిసినచోట కనురెప్పలు కాసింత విశ్రాంతిని కోరుకుంటాయి.కానీ విశ్రాంతి అనే పదానికి తన నిఘంటువులో చోటివ్వని సుగాత్రి తాను చేయవలిసిన పని గుర్తుకు చేసుకుని విశ్రాంతిని ఎప్పటిలానే కాలం ఒడిలో నిర్ధాక్షిణ్యంగా వదిలేసి లేచింది.
ప్రతీ నెలా మొదటివారంలో సూపర్ మార్కెట్ రద్దీగా ఉంటుంది.ముఖ్యంగా ఉద్యోగస్తులు తమకు కావలిసిన నెలవారీ సరుకులు తీసుకువెళ్తారు..కొందరు లిస్ట్ ఇచ్చేసి వెళ్లారు.అందరినీ పేరుపేరునా పలకరిస్తుంది.సూపర్ మార్కెట్ కు వచ్చే చిన్నపిల్లలకు చాక్లెట్స్ ఇస్తుంది.
టైం ఎనిమిది దాటింది.సూపర్ మార్కెట్ కు దూరంగా వున్నసిబ్బందిలోని మహిళలను టైం కన్నా ముందే పంపిస్తుంది.అవసరమైతే ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేస్తుంది.అందుకే సుగాత్రి అంటే సూపర్ మార్కెట్ లో అందరికీ భయం..అభిమానం..అంతకు మించి గౌరవం.
లక్ష్మి వచ్చింది.ఆమె చేతిలో ప్రతిమ సూపర్ మార్కెట్ తాలూకూ కవర్ వుంది.
“మేడం మీరు చెప్పినట్టే యాసిడ్ బాటిల్స్..గ్లవుజ్ పెట్టాను”చెప్పింది లక్ష్మి.
ఓ సారి లక్ష్మి వంక చూసి “గుడ్”అని లేచింది.దాసు అడ్రస్ అడిగింది.తర్వాత క్యాబ్ బుక్ చేసింది.మరో కాసేపటిలో ఇద్దరూ బయటకు వచ్చారు.క్యాబ్ వచ్చింది.ఇద్దరూ క్యాబ్ ఎక్కారు.లోలోపల లక్ష్మీ కి భయంగా వుంది…కానీ ఒకేఒక ధైర్యం “సుగాత్రి మేడం వుంది”అన్న ధైర్యం అది.
***
పోలీస్ స్టేషన్
క్యాబ్ దిగి పోలీస్ స్టేషన్ లోకి అడుగుపెట్టారు సుగాత్రి ..లక్ష్మి…వాళ్ళ వెనుక భయం భయంగా దాసు.అతని చేతికి బ్యాండేజీ కట్టు.
“మేడం..నాకు భయంగా వుంది..”అంది లక్ష్మి .పోలీస్ స్టేషన్ లోకి అడుగు పెట్టడం అదే మొదటిసారి…పైగా పత్రికల్లో చదివినందువల్ల ఒక విధమైన భయం…చాలా మందికి ఇదే భయం…
ఇప్పుడిప్పుడే పోలీస్ స్టేషన్స్ ఆధునీకరిస్తున్నారు.పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా మారాలనే తపన ప్రభుత్వంలో,పోలీస్ అధికారుల్లో పెరుగుతూ వస్తుంది.పోలీస్ స్టేషన్స్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది.కొందరు కలుపు మొక్కల్లాంటి పోలీస్ ల వల్ల పోలీస్ వ్యవస్థ ఆత్మరక్షణలో పడే పరిస్థితి.
పోలీస్ స్టేషన్ ను “స్టేషన్ హౌస్” అంటారని కానీ…సర్కిల్ ఇన్స్పెక్టర్ ను “స్టేషన్ హౌస్ ఆఫీసర్” అని అంటారని కానీ….కొన్ని పోలీస్ స్టేషన్స్ ను కలిపి వారిపై ఒక అధికారి ఉంటారని,అతడినే అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్ అంటారని …ఆ తర్వాత డిప్యూటీ కమీషనర్ అఫ్ పోలీస్ ..డిసిపి పైన అడిషనల్ కమీషనర్ అఫ్ పోలీస్ ..కమీషనర్ ,,.డిజిపి …అనగా పోలీసులకు బాస్…ఉంటాడని తెలియదు…ఇలాంటి విషయాలను స్కూల్స్ లో ఉపాథ్యాయులు..ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి..ఇప్పుడిప్పుడే ఈ అవేర్నెస్ అందరిలోనూ వస్తుంది.
***
నేరాలు జరక్క కాదు,జరిగినా భయంతో పోలీస్ స్టేషన్ కు రాక..అన్నట్టు పోలీస్ స్టేషన్ బోసిపోయినట్టు కనిపిస్తుంది..పోలీస్ స్టేషన్ బయట టీ కొట్టువాడు…లోపల ఇద్దరు కానిస్టేబుల్స్ ..స్టేషన్ రైటర్ అప్పుడప్పుడు నిద్రలో నుంచి తేరుకుంటున్నాడు.
సరిగ్గా అదే సమయంలో ఎంట్రీ ఇచ్చిన సుగాత్రి వైపు అలానే చూస్తోండిపోయారు పోలీసులు.
అప్పుడే సిఐ వచ్చాడు.అటెన్షన్ లోకి వచ్చారు.సిఐ లోపలి వస్తూనే సుగాత్రి వైపు చూసాడు..ఆమె వెనుక వున్న లక్ష్మిని దాసును చూసాడు..దాసును గుర్తు పట్టింది అతని పోలీస్ మెమరీ…
“నమస్తే సర్..నా పేరు సుగాత్రి..ఈ అమ్మయి పేరు లక్ష్మి ..ప్రతిమ సూపర్ మార్కెట్ లో పని చేస్తుంది.దాసు అనే ఈ రౌడీ షీటర్ రోజూ వేధిస్తున్నాడు..”చెప్పింది సుగాత్రి.
సిఐ దాసు వైపు చూసాడు..అతనికి ఇంకా పజిల్ గానే వుంది…దాసు పేరు మీద రౌడీ షీట్ ఉంది.వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి భయపడతారు.అలాంటి దాసును పోలీస్ స్టేషన్ వరకూ ఎలా తీసుకురాగలిగారు?
“సర్ ఈవిడ నన్ను బెదిరించి ఇక్కడికి తీసుకువచ్చింది”దాసు అమాయకంగా మొహం పెట్టి అన్నాడు
సిఐ కి అర్థం కాలేదు
“అసలేం జరిగిందో నేను చెబుతాను సర్ ,,అంది సుగాత్రి..
***
క్యాబ్ బెల్ట్ షాప్ ముందాగింది దాసు బెల్ట్ షాప్ లో చీప్ లిక్కర్ తాగుతూ చిందులేస్తున్నాడు.అది అతని అడ్డా….అదేసమయంలో క్యాబ్ లో నుంచి దిగింది సుగాత్రి ఆమె చేతులకు గ్లవుజ్ వున్నాయి.లక్ష్మి చేతులకు కూడా గ్లవుజ్ వున్నాయి…సుగాత్రి రెండు చేతుల్లో .రెండు యాసిడ్ బాటిల్స్…
“నువ్వేనా దాసువు..”అడిగింది సుగాత్రి డైరెక్ట్ గా .
తన ఎదుగా నిలబడి తననే అలా అడగడం అవమానంగా ఫీలయ్యాడు.పైగా బెల్ట్ షాప్ లో వున్న అందరూ చూస్తున్నారు.మాములుగా అయితే అతని చేతిలో అమ్మాయిలను బెదిరించే యాసిడ్ బాటిల్ ఉండేది..ఇపుడు ముందేసుకుని టైం కాబట్టి మందు బాటిల్ వుంది…
“ఇదే లాస్ట్ వార్నింగ్ ..ఇంకోసారి ఈ అమ్మాయినే కాదు ఏ అమ్మాయిని బెదిరించినా మర్యాదగా ఉండదు”తర్జని చూపి అంది సుగాత్రి
“ఏం చేస్తా..”ఓ బూతు మాటన్నాడు…
అప్పటికే సుగాత్రి యాసిడ్ బాటిల్ ఓపెన్ చేసి అతడి చేతి మీద కొద్దిగా పోసింది.ఆ మాత్రానికే విలవిల్లాడిపోయాడు…
“ష్ …నాకు సౌండ్ ఎలర్జీ ..అరిస్తే మొత్తం గుమ్మరించేస్తా..నాలుగు బాటిల్స్ వున్నాయి…మొత్తం బాడీ యాసిడ్ తో స్నానం చేస్తుంది.మర్యాదగా క్యాబ్ ఎక్కు…”చెప్పింది సుగాత్రి.మీ మాటలో “అన్నంత పని చేస్తుందనే ధీమా,గారెంటీ కనిపించింది’…సుగాత్రి చూస్తూ ఉంటే…పాణభయంతో క్యాబ్ ఎక్కాడు.
***
“ఇదన్యాయం సర్,,నా చేయి కాలిపోయింది..హాస్పిటల్ కు కూడా వెళ్లనీయకుండా ఇక్కడికి తీసుకు వచ్చింది…”చెప్పాడు దాసు
“మేడం ఏమిటిది మీరు చూస్తే చదువుకున్నవారిలా వున్నారు.చట్టాన్ని ఇలా మీ చేతిలోకి తీసుకుని బెదిరించి తీసుకువస్తారా?అన్నాడు.
“మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ కూడా పెట్టింది ప్రభుత్వం..అందరికీ మొబైల్స్ అందుబాటులో లేకపోవచ్చు..పిర్యాదు చేసే ధైర్యం లేకపవచ్చు . పిర్యాదు చేయకపోయినా మీరు బాధ్యత తీసుకుంటే మీమీద గౌరవం పెరుగుతుంది.బెల్ట్ షాప్ ను మూసేస్తే సగం సమస్య పోతుంది.ఇలాంటి వాళ్ళను ..అంటూ దాసు వైపు చూపిస్తూ లోపలేసి శిక్ష పడేలా చేస్తే మొత్తం సమస్య పోతుంది సిస్టమ్ బాగుపడుతుంది. “స్పష్టంగా చెప్పింది. సుగాత్రి.
“.ఇలా అందరూ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే..ఇంకా ఏదో అనబోయేంతలో బయట హడావుడి…ఏసీపీ లోపలి వచ్చింది.సిఐ లేచి సెల్యూట్ చేసాడు….ఒక్క క్షణం సుగాత్రి వైపు చూసి చేతులు జోడించింది..దేవుడి ముందు భక్తుడు చేతులు జోడించినట్టు..సిఐ ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు.
ఏసీపీ వసుమతి పేరు చెబితే రాజకీయనాయకులకు గుండాలకు కూడా టెర్రర్…ముక్కుసూటిగా వెళ్తుంది.ఎవరికీ భయపడదు…
అలాంటి ఒక వ్యక్తి ఒక సాధారణ మహిళకు చేతులు జోడించి నమస్కరించడం…
సిఐ తన కుర్చీలో కూచోమన్నట్టు
ఏసీపీ వసుమతి సుగాత్రిని సమీపించింది.టేబుల్ పక్కనే నిలబడి వుంది సుగాత్రి….ఏసీపీ టేబుల్ మీద వున్న పేపర్ వెయిట్ ని కిందికి జరిపింది.టేబుల్ అంచు దాటి కింద ..సరిగ్గా సుగాత్రి పాదాల మీద పడబోతున్న సమయంలో తన హేట్ తీసి టేబుల్ మీద పెట్టి కిందికి వంగి సుగాత్రి పాదాల మీద పడబోతున్న పేపర్ వెయిట్ ని అందుకుని…తన కుడిచేతిని సుగాత్రి పాదాల మీద పెట్టింది.
” నాకు పునర్జన్మినిచ్చి…నాలాంటి వాళ్ళెందరికో అమ్మవై మా నుదుట తలరాతను పునర్లిఖించిన అపర విధాత నీకు పాదాభివందనం”
రెండు కన్నీటి బొట్లు సుగాత్రి పాదాలను తాకాయి.
ఆ దృశ్యాన్ని కాస్త దూరంగా నిలబడి వున్న లక్ష్మి చూసింది.
***
సుగాత్రి ఏసీపీ వసుమతి వైపు చూసింది.గర్వంగా..నీళ్లు నిండిన కళ్ళతో…
అప్పుడే వచ్చింది అగ్నికణం పత్రిక జర్నలిస్ట్ నందిని…
ఒక్కక్షణం అక్కడ ఉద్విగ్నభరిత దృశ్యం ఆవిష్కృతమైంది
జర్నలిస్ట్ నందిని ,ఏసీపీ వసుమతి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.
ఇద్దరూ ఆప్యాయంగా చేతులు కలుపుకున్నారు.మానవత్వపు వృక్షానికి రెక్కలు తొడిగిన కొమ్మలు …
దానవత్వం కొమ్ములు విరిచి …కుళ్ళిన సమాజానికి శస్ర్తచికిత్స చేయడానికి అక్షర కరవాలం,చట్టం చేతులు కలిపాయి
***
(ఈ కలయిక ఒక మహాయజ్ఞానికి శుభారంభం …అద్భుత దృశ్యానికి అక్షరరూపం…)

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY