విధాత లిఖించని తలరాతను స్వయం లిఖితంగా చేసుకుని నిస్సహాయులకు నీడనిచ్చే కల్పవృక్షమై…ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి గుప్పెడంత ఆకాశం (27-08-2017)

ఫీడ్ బ్యాక్
*ద్వందార్థాలు క్రైమ్ లేకుండా భావోద్వేగాలతో చదువరుల మనసును ఆకట్టుకునే సీరియల్ కూడా రాయగలరని నిరూపించిన ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి గారికి అభినందలు.మీ నుంచి మరిన్ని రచనలు రావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాం…నితిన్ (విజయవాడ)
*సుగాత్రి పాత్ర మాకు రోల్ మోడల్ …శ్వేత (వైజాగ్)
(11)
విశ్వకర్మ తనను తానూ మరిచి
విధాత లిఖించని తలరాతను స్వయం లిఖితంగా చేసుకుని
నిస్సహాయులకు నీడనిచ్చే కల్పవృక్షమై
అనాథలకు అక్షయ పాత్రయి…
అభాగ్యులకు కొండంత అండగా నిలిచే…
కొంగు బంగారమై భాసిల్లేలా సృజించిన ….
సుగాత్రి ఫౌండేషన్ …ప్రాంగణంలోకి అడుగుపెట్టారు.
ప్రకృతి తో పాటు పుట్టిన కవలలా వుంది… సుగాత్రి ఫౌండేషన్…
అక్కడి దృశ్యం చూసి అలాగే ఉండిపోయింది రూపమతి.
ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తుంది.ఒక కలల ప్రపంచాన్ని వీక్షిస్తుంది.పరిసర ప్రాంతమంతా పచ్చదనమే..స్వచ్ఛమైన గాలి.పచ్చదనం కాన్వాసు మీద కూరగాయల తోట…టమోటాలు వంకాయలు సొరకాయలు …బెండ …పచ్చి మిర్చి….
అరవై పైబడిన వృద్ధులు మహిళలు పురుషులు అక్కడ పని చేస్తున్నారు.కూరగాయలను చెట్ల నుంచి వేరు చేస్తూ..ఓ పక్కన కుప్పలా పోస్తున్నారు.నవనవలాడుతూ తాజా కాయగూరలు కనువిందు చేస్తున్నాయి.
మరో పక్క చెట్లకు నీళ్లు పోస్తూ కొందరు…ఇంకో పక్క ఓ పర్ణ కుటీరం..అక్కడ ఒక మహిళ సంగీతం పాఠాలు చెబుతుంది..పిల్లలు శ్రద్ధగా వింటున్నారు .
మరో పక్క పిల్లలు కర్రాబిళ్ళ ఆట ఆడుతున్నారు…దాగుడుమూతలు…ఆడుకుంటున్నారు…మరుగున పడిన ఆటలు అక్కడ ఆటాడుకుంటున్నాయి…మాటాడుకుంటున్నాయి.
ఇది ఏ ప్రపంచం..?
ఏ మయుడు సృష్టించిన నయా మాయా ప్రపంచం…?
నందిని చెప్పింది..ఇక్కడ కులమతాలు లేవు..వర్ణవర్గ విభేదాలు లేవు…అందరూ సమానమే..ఒకే రకం దుస్తులు..
పిల్లల్లో సృజనాత్మకతను బట్టి వాళ్ళకు ఇష్టమైన రంగంలో చదువుతో పాటు శిక్షణ ఇస్తారు.శిక్షణ ఇచ్చే గురువులు కూడా ఇక్కడ తీర్చిదిద్దబడిన వాళ్ళే.స్వచ్ఛందంగా తమ లాంటి ప్రతిభావంతులను తీర్చిదిద్దుతారు.వీళ్లంతా ఒకప్పుడు అనాథలు…రోడ్డు పక్కనో…నిస్సహాయలుగా రైలు పట్టాల మీదనో..యాసిడ్ దాడులతో నరకంలోనో బ్రతుకుతున్న వాళ్ళు….వాళ్లలో కొండంత ఆత్మ విశ్వాసాన్ని ..తన గుప్పెడంత గుండెతో నింపిన మా దేవత సుగాత్రి మేడం…
ఇక్కడ అందరూ పనులు చేస్తారు.చేయలేని వాళ్లకు చేయగలిగిన వాళ్ళు సేవలు చేస్తారు….
ప్రాథమిక చికిత్స మీద అందరికీ అవగాహన వుంది.రాత్రి అందరూ ఒకే దగ్గర కూచోని కబుర్లు చెప్పుకుంటారు ..తమ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు….కొందరు పాటలు పాడుతారు..మరికొందరు తమ నటనను ప్రదర్శిస్తారు…నిరాశను దగ్గరికి రానివ్వరు..ఒక్కరికి కంటిలో నలుసు పడితే అందరూ కన్నీళ్లు కారుస్తారు…
ఇది వసుధైక కుటుంబం..
ఇది సుగాత్రి మేడం సృష్టించిన మరో స్వర్గం…భావోద్వేగంతో కదిలిపోతూ చెప్పింది…జర్నలిస్ట్ నందిని.
ఇక్కడ ఎవరికీ మొబైల్స్ వుండవు..ఎవరికీ అవసరమైనా ల్యాండ్ ఫోన్ వాడుకుంటారు…కొందరు కంప్యూటర్ లో పనిచేసుకుంటూ నేర్చుకుంటూ వుంటారు..డెబ్బై ఏళ్ళ వాళ్ళు కూడా నెట్ మీద పట్టు సాధించారు.ఆన్ లైన్ ట్యూషన్స్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు..అందరి సంపాదన ఫౌండేషన్ కు మాత్రమే చెందుతుంది.
“కళ్ళ ముందు కనిపించి తాను తినే అన్నం ముద్దను నా నోటికి అందించిన ఆ తల్లిని ఒక్కసారి చూడాలనిపిస్తుంది…ఎక్కడా ఆ తల్లి ఫొటోస్ లేవేమిటి?అడిగింది రూపమతి
“తాను చేసే పనులే కానీ తన రూపం కనిపించవలిసిన అవసరం లేదంటుంది సుగాత్రి మేడం,..ప్రచారానికి దూరం…ఇంటర్ వ్యూస్ కు కూడా దూరం తను “చెప్పింది నందిని.అయినా ఈ పాటికి రావాలి..ఈరోజు వైదేహి గారి పుట్టినరోజు.,,,ఈ సుగాత్రి ఫౌండేషన్ లో ఎవరి పుటిన రోజైనా తను వస్తుంది.ప్రతీ రోజు ఏదో ఓ సమయంలో వస్తుంది.మొక్కలకు నీళ్లు పోస్తుంది..తోట పని , ఇంటిపని అన్నీ చేస్తుంది.”నందిని చెప్పింది.
ఇదంతా రూపమతి అద్భుతంగా అనిపిస్తుంది.ఇలాంటి ప్రపంచాన్ని మొదటిసారి చూస్తుంది.ఒక వ్యక్తి సృష్టించిన అద్భుతప్రపంచం…ఇక్కడే సుగాత్రి మేడం ఆశయానికి ప్రాణం పోసి “తను తన వంతు బాధ్యతగా చెస్ ఛాంపియన్స్ ను తయారు చేయాలి”మనఃస్ఫూర్తిగా అనుకుంది..
అపుడే అక్కడిచెట్లు స్వాగతం పలుకుతున్నట్టు ఆహ్వానిస్తున్నట్టు కదులుతున్నాయి…చిన్న వానతుంపర నగారా మోగించింది..గుడిలో గంట మోగింది…అప్పుడే ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టింది సుగాత్రి…కాటన్ శారీ ..ఎటువంటి ఆడంబరంగా అలంకరణలు లేని గొప్ప వ్యక్తిత్వం మూర్తీభవించిన నిండైన విగ్రహం …దేవుడు గర్భగుడిలో నుంచి నడిచి వస్తున్నట్టు…
ఆ ప్రాంగణంలో రోడ్డుకు ఇరువైపులా వున్న పూల చెట్లు గాలికి కదిలి రంగురంగుల పువ్వులను వెదజల్లింది …ఆ పువ్వులు సుగాత్రిని పరామర్శిస్తున్నాయి…అక్కడ ఆడుకుంటున్న పిల్లలు…పరుగెత్తుకు వచ్చారు..ఓ పక్కన నాట్యం నేర్చుకుంటున్న చిన్నారులు నాట్య భంగిమలతో సుగాత్రిని చేరి పాదాభివందనం చేసారు..
రోడ్డు పైన దిక్కులేని దుస్థితిలో వున్న తమకు తనే దిక్కుగా మారి తమని నృత్య కళాకారిణులుగా తీర్చిదిద్దుతున్న గొప్ప వ్యక్తికి వారు చెప్పిన స్వాగతం అది.
అక్కడున్న అందరూ క్షణాల్లో సుగాత్రిని చేరారు.చిన్నా పెద్ద తేడా లేదు…నందిని వసుమతి ప్రియాంక సాత్యకి ..అంతా వచ్చేసారు…ప్రతీక్షణం సుగాత్రి వాళ్లకు అపురూపంగానే అనిపిస్తుంది…కనిపిస్తుంది.సుగాత్రి రూపమతి దగ్గరికి వెళ్లి “బావున్నారా అమ్మా?అని ఆప్యాయంగా అడిగింది.
కదిలి కన్నీటి గోదావరి అయ్యింది.రూపమతి…సుగాత్రి ప్రేమ ముందు…
“నీ దయవల్ల బావున్నాను తల్లీ…అమ్మవై చేరదీసావు”రుద్దమైన కంఠంతో అంది రూపమతి
“మీరు పెద్దవారు…మా అందరికీ అమ్మలాంటి వారు..మీ సేవలు మీ ఆశీర్వాదాలు మాకు కావాలి..”అంది నిజాయితీగా సుగాత్రి
ఆ దృశ్యాన్ని చూసి భావోద్వేగమే కంట తడిపెట్టింది.
***
వైదేహి పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి..కాండిల్స్ కేక్ కటింగ్ కాదు…షడ్రసోపేత భోజనం..అందరికీ కొత్తబట్టలు…అందరూ శుభాకాంక్షలు చెబుతుంటే తొంభై పడిలో వున్న వైదేహి తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంది..తనను చేరదీసిన సుగాత్రి మంచితనాన్ని గుర్తు చేసుకుంది…
సుగాత్రి తన చేతిలో వున్న ఆల్బమ్ కానుకగా ఇచ్చింది వైదేహికి…వణుకుతోన్న చేతులతో ఆల్బమ్ ఓపెన్ చేసింది.
కళ్ళు తడిబారాయి.తన బాల్యం..యవ్వనం ..పెళ్లి..పిల్లలు..భర్తతో గడిపిన జీవితంలోని మధురమైన జ్ఞాపకాలు…ఎంతో శ్రమకోర్చి సేకరించిన ఫోటోలు ఒక గుచ్ఛంగా అందించిన సుగాత్రికి రెండు చేతులు జోడించి నమస్కరించింది
ఈ జీవితంలో ఇంత కన్నా గొప్ప కానుక ఇంకేముంటుంది…
కాలం దోసిట్లో రాలిపోయిన ఒక్క జ్ఞాపకాన్ని జ్ఞాపకాల గుచ్ఛంగా అందించిన ఈ క్షణం చిరస్మరణీయం అయ్యింది.
***
అర్థరాత్రి పన్నెండు…సుగాత్రి ఫౌండేషన్ లో నిశ్శబ్దం..అంతా పడుకున్నారు…
సుగాత్రి ,లాయర్ సాత్యకి వసుమతి నందిని ప్రియాంక వున్నారు…
“శేషాచలానికి సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించాను మేడం..ఈ స్థలాన్ని సుగాత్రి ఫౌండేషన్ ను అతను ఎలాగైనా పొందాలనుకుంటున్నాడు . వందల కోట్ల విలువ చేస్తుంది.మనవైపు సాక్షులు బలంగా వున్నారు..ఆధారాలూ వున్నాయి…మీరు అన్నట్టుగా మన ప్రాణం అయిన ఈ స్థలాన్ని అతనికి దక్కనివ్వకూడదు..అధికారంలో మంత్రిగా అంగబలం అర్ధబలం వున్న వ్యక్తిగా వున్న అతడిని మనం ఢీ కొనబోతున్నాం..విజయం మనదే మేడం,,,”చెప్పింది లాయర్ సాత్యకి
“అవును మేడం అతడు మన వాళ్ళను బెదిరించినట్టు బలమైన సాక్ష్యాలు వున్నాయి.ఎఫ్ ఐ ఆర్ బలంగా వుంది”ఏసీపీ వసుమతి అంది
“అతని మనుష్యులు దాడి మన ఫౌండేషన్ మీద దాడి చేసినప్పుడు గాయపడ్డ వాళ్ళు తీవ్రమైన గాయాలకు గురైనట్టు..రిపోర్ట్స్ నా దగ్గర వున్నాయి”డక్టర్ ప్రియాంక చెప్పింది
“వీటన్నింటినీ కలిపి స్పెషల్ స్టోరీ తయారు చేశాను మేడం..మినిస్టర్ శేషాచలం విధ్వంస రచన పేరుతో”చెప్పింది నందిని
“విజయం మనదే మేడం..ఈ సుగాత్రి ఫాండషన్ మనదే “నలుగురూ ఒకేసారి అన్నారు.
“విజయం మనదే..కానీ ..ఈ వందల కోట్ల ఆస్తి మాత్రం శేషాచలానిది..మనం అందరం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్తున్నాం”చెప్పింది సుగాత్రి
ఒక్కక్షణం అక్కడ నిశ్శబ్దం గడ్డకట్టింది…
ఊహకందని ఈ నిర్ణయం వెనుక దాగివున్న మర్మమేమిటి?

(గుప్పెడంత ఆకాశం లో చిన్న విరామం )

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY