అతని ముందు చేతులు కట్టుకుని నిలబడే అతని కొడుకులు మంత్రాంగం మొదలుపెట్టారు..పంచాయితీ ప్రారంభించారు. తండ్రి మరణానికి ముందే పోస్టుమార్టం చేస్తున్నారు…ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి గుప్పెడంత ఆకాశం (03-09-2017)

(12)
ఒక్కక్షణం నిశ్శబ్దం పహారాలో ఆ ప్రాంతం మౌనముద్రలోకి వెళ్ళింది.”ఎందుకు ఏమిటి?అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు.ఎందుకంటే సుగాత్రి మేడం ఏ పని చేసినా అలోచించి చేస్తారు.మనసుతో అలోచించి చేస్తారు.
“ఓకే మేడం…కానీ చిన్న సందేహం …అడగమంటారా ?సంశయంగా అంది ఏసీపీ వసుమతి.
“మీ అందరిలోనూ ఈ సందేహం వుంది..నేనే చెబుతా..మొన్నటి వరకూ శేషాచలాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాం.లాయర్ సాత్యకి సెక్షన్స్ ను వెతికింది.ఏసీపీ వసుమతి ఆధారాలను సంపాదించింది. శోధించింది.డాక్టర్ ప్రియాంక దాడిలో గాయపడిన వారి రిపోర్ట్స్ ను కలెక్ట్ చేసింది.జర్నలిస్ట్ నందిని ఈ కేసుకు సంబంధించిన వార్తాకథనాన్ని ప్రపంచం ముందుకు తీసుకువచ్చి సుగాత్రి ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్న వారిని ,సుగాత్రి ఫౌండేషన్ ను అక్షరాలతో కాపాడుకోవడానికి సిద్ధపడింది.
అన్నింటికీ మించి ఈ సుగాత్రి ఫౌండేషన్ ద్వారా ఈ సమాజంలో ఉన్నత స్థానాల్లో వున్న మేథావులు ఉపాథ్యాయలు న్యాయవాదులు పోలీసులు …ప్రతీ ఒక్కరూ..చివరికి చిన్నారులతో సహా సాక్ష్యంగా రావడానికి రామదండులా సుగాత్రి ఫౌండేషన్ దండు సిద్ధమైంది.
సుగాత్రి ఫౌండేషన్ నిరాశ్రయులకు కల్పవృక్షం..ఇక్కడి నుంచి బయటకు వెళ్లిన ప్రతీ వ్యక్తి ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ఆదర్శంగా వుంటున్నారు…కానీ….మరో మూడు రోజుల్లో మన కేసు కోర్ట్ ముందుకు వస్తుంది.ఒక వ్యక్తి చివరిక్షణంలో వున్నప్పుడు..అతనికి ఓటమి ఎదురైనప్పుడు ఆ ఓటమి భయంకరంగా ఉంటుంది.
మరణం వాకిలి ముందు నిలబడ్డ వ్యక్తిని కోర్ట్ గుమ్మం ఎక్కించి అతని చివరి క్షణాలను మనం దోచుకోవద్దు…”అని ఆగింది.
ఒక్కక్షణం వాళ్లకు ఏమీ అర్థం కాలేదు…
సుగాత్రి కొనసాగించింది…
“శేషాచలానికి క్యా…న్స…ర్ …చివరి దశలో రోజులు లెక్కపెట్టుకుని ఇక సెలవని మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయే క్యాన్సర్ ..ఎక్కువ రోజులు బ్రతకడు….ఈ విషయం నిన్ననే తెలిసింది.ఈ సమయంలో అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను.ఆగర్భశత్రువుకు కూడా రాకూడని మరణం క్యాన్సర్.
మనిషి ఎప్పుడో ఒకప్పుడు చస్తాడు…మరణం అనివార్యం..అని తెలిసినా స్వార్థం మనిషిని రాక్షసత్వంతో బ్రతికేలా చేస్తుంది.
ఇప్పుడు నేను ఆలోచించేది మన ఫౌండేషన్ గురించి కాదు…శేషాచలం ప్రశాంతంగా కన్నుమూయడం గురించి…అతనికి త్వరలో రేడియేషన్ చికిత్స జరుగుతుంది…ఈ సమయంలో అతడిని కోర్ట్ కు రప్పించడం నాకు ఇష్టం లేదు…మనం కేసు నుంచి తప్పుకుంటున్నాం..అతను కోరుకున్నట్టుగా …. అతను ఆక్రమించుకున్న ఈ కోట్ల ఆస్తి అతడికే అప్పగిస్తున్నాం,,,,నా నిర్ణయం తప్పయితే మన్నించండి…కానీ ఒకటి మాత్రం నిజం..ఫౌండేషన్ ను కంటికి రెప్పలా చూసుకుంటాను…నా సూపర్ మార్కెట్ ను అమ్మకానికి పెట్టాను..నా పేరుతో వున్న ఆస్తులు..నా ఒంటి మీద వున్న బంగారం అంతా ఈ ఫౌండేషన్ కు మాత్రమే చెందుతుంది ….దయచేసి నా నిర్ణయాన్ని మన్నించండి.”రెండు చేతులు జోడించింది సుగాత్రి.
అప్పటికే ఏసీపీ వసుమతి చేతులు సుగాత్రి పాదాలను తాకాయి…నందిని సుగాత్రి మేడం మాట్లాడుతున్నప్పుడే ఆ ఫౌండేషన్ లో వున్న మైకులను ఆన్ చేసింది.సుగాత్రి మేడం నిర్ణయం అందరికీ తెలియాలి…అందరూ హర్షించాలి…డబ్బును తృణప్రాయంగా ,మానవత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తోన్న సుగాత్రి మేడం ఆమె కళ్ళ ముందు గీత బోధిస్తున్న కృష్ణుడిలా కనిపించింది.
డాక్టర్ ప్రియాంక రెండు చేతులు జోడించి “మేడం..మీ మాటే మాకు వేదవాక్కు…శిలాశాసనం..మీ మంచి మనసు ముందు మోకరిల్లుతున్నాం”మోకాళ్ళ మీద కూచుంది ..ఆ వెంటనే నందిని..సాత్యకి…
అప్పటికే ఆశ్రమం నలుమూలల నుంచి చప్పట్ల అంగీకారంతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది.
“మీ మంచి మనసుకు ఇది పరాకాష్ట…ప్రాణాలతో పోరాడేవాడు శత్రువని తెలిసినా అతని కోసం మీ విజయాన్ని పరాజయంగా మార్చుకున్న మీరు అసలైన విజేత” రూపమతి అంది.
గుప్పెడంత గుండెలో ఆకాశమంత మానవత్వాన్ని ప్రదర్శించిన నిలువెత్తు సంతకం సుగాత్రి నిర్ణయం 
అక్షరాల ధరిత్రిలో నిలిచిన భావోద్వేగాల చరిత…సుగాత్రి వ్యక్తిత్వం.
***
ఉదయం పదిగంటలు
భవిష్యత్తు సైతం ఊహించలేని ఒక సరికొత్త చరిత్రకు కాలమే సాక్షి.
అధికారంలో వున్న మంత్రి …అంగబలం అర్థబలం వున్నవ్యక్తి రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను ఓ మలుపు తిప్పగల వ్యక్తి…అతను కనుసైగ చేస్తే రాష్ట్ర శాంతి భద్రతల భవిష్యత్తే ప్రశ్నకర్థం అయ్యే ఒక బలమైన శక్తి …ఇప్పుడు యుద్ధం తర్వాత సమస్త సైన్యాన్ని కోల్పోయిన వ్యక్తిలా వున్నాడు…
అతని ముందు చేతులు కట్టుకుని నిలబడే అతని కొడుకులు మంత్రాంగం మొదలుపెట్టారు..పంచాయితీ ప్రారంభించారు.
తండ్రి మరణానికి ముందే పోస్టుమార్టం చేస్తున్నారు.
తండ్రికి వారసులు ఎవరో తెలియాలని కొడుకులు చేస్తోన్న యుద్ధం…
బాగుకోరే బావమరిది నేనూ ఉన్నానంటూ తన వర్గాన్ని బల పరీక్షకు తీసుకువచ్చాడు…
ఇదంతా చూస్తోన్న శేషాచలానికి క్యాన్సర్ వచ్చింది తనకేనా?అధికారవ్యామోహంతో కళ్ళముందే రాలిపోబోతున్న వ్యక్తి ముందు అధికార ఆస్తుల పంపకం చేసుకుంటున్న తన వాళ్ళు అనుకున్న ఈ మనుష్యులకా ?
మొదటిసారి అతనికి ప్రాణభయం కన్నా భయంకరమైన అంతర్ఘర్షణ మొదలయింది.
అప్పుడే సెక్యూరిటీని దాటుకుంటూ లోపలి వచ్చింది సుగాత్రి….
ఒక్కక్షణం విస్మయంగా చూసాడు…మరో మూడురోజుల్లో తాను ఆక్రమించుకున్న సుగాత్రి ఫౌండేషన్ తాలూకూ కేసు…తనకు ట్రీట్మెంట్ మొదలయ్యే రోజునే..తనకు క్యాన్సర్ అన్న వార్త ఓ మీడియా సంస్థ వాళ్ళు లీక్ చేసారు..బహుశా ఆ ధైర్యంతోనే వచ్చి ఉంటుంది.చిత్రంగా అతనికి కోపం రాలేదు…
తనయులు ఆత్మీయులే తన వారసత్వం కోసం పోటీలు పడుతుంటే…న్యాయంగా తన ఫాండషన్ కోసం పోరాడే ఒక సగటు మనిషి ఆలోచన అతడిని బాధ పెట్టలేదు…
కానీ తన అంచనా తప్పని ఆ మరుక్షణమే అతనికి అర్థమైంది.
సుగాత్రి చేతుల్లో సుగాత్రి ఫౌండేషన్ కు సంబంధించిన పత్రాలు…డాక్యుమెంట్స్ …
చేతిలో బొకే ..గెట్ వెల్ సూన్ అన్న అక్షరాలు…
రెండు చేతులు జోడించింది..అప్రయత్నంగా మొదటిసారి తన అహాన్ని వదలి స్వచ్ఛందంగా లేచాడు శేషాచలం
“సుగాత్రి ఫౌండేషన్ కేసు వాపసు తీసుకుంటుంది..ఫౌండేషన్ కు సంబంధించిన అన్ని పత్రాలు మీకు అందజేస్తున్నాను..మీరు కోర్ట్ కు రావలసిన అవసరంలేదు..కానీ ఒక చిన్న విన్నపం..”డాక్యుమెంట్స్ అతని చేతిలో పెట్టి అంది..
“ఒకసారి మీరు బయటకు రావాలి..రాగలరా?సున్నితంగా రిక్వెస్ట్ చేసింది…
మంత్రముగ్ధుడిలా బయటకు నడిచి అక్కడి దృశ్యం చూసి కన్నీళ్లతో కదిలిపోయాడు…
బయట….దాదాపు కిలోమీటర్ మేర చిన్నారులు ఉపాథ్యాయులు న్యాయవాదులు డాక్టర్స్ ప్రజలు సుగాత్రి ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్న వాళ్ళు..తన పైశాచిత్వానికి తాను చేయించిన దాడికి గురైనవాళ్లు..
వాళ్ళ చేతుల్లో గులాబీలు. ప్ల కార్డులు…గెట్ వెల్ సూన్ అన్న కార్డులు….
నిష్కల్మషమైన చిరునవ్వుతో నిజాయితీతో…తన ముందు వేదబ్రాహ్మణుల.. మంత్రోచ్ఛారణలు…తాను మృత్యంజయుడిగా తిరిగిరావాలన్న ఆశీర్వాదాలు…ప్రార్థనలు…సర్వమతాల మానవతావాదం…మానవహారమై..తనను దీవిస్తూ…
“సర్ మీరు ఆరోగ్యంతో క్యాన్సర్ ని జయించి తిరిగిరావాలి “అంది సుగాత్రి మనస్ఫూర్తిగా
కుప్పకూలి సుగాత్రి పాదాల ముందు మోకరిల్లాడు…
“అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినపుడు ఏడ్చానో లేదో…నాకు తెలియదు..ఊహ తెలిసాక నా స్వార్థంతో అధికారదాహంతో ఎందరినో ఏడ్పించాను..మీతో సహా…అమ్మలా నాకు విచక్షణ అనే జన్మను ఇచ్చారు..నేనిక చచ్చినా బాధ లేదు…వచ్చేజన్మలో మీ బిడ్డగా పుట్టి మంచివాడిగా బ్రతుకుతాను…చావబోయేవాడిని వదిలేయక నన్ను సంతోషంగా ఉంచాలని కోట్ల ఆస్తిని వదిలేసారు…”
శేషాచలం ఏడుస్తున్నాడు.
అప్పటికే నందిని మీడియాను తీసుకువచ్చింది
అతని మాటలు లైవ్ లో వెళ్తున్నాయి.
“ఇంకా చావక ముందే వారసత్వపు యుద్ధం మొదలైంది.నన్ను బ్రతికుండగానే నావాళ్లు పోస్ట్ మార్టం చేస్తున్నారు…ఎవరు తల్లీ మీరు…
దేవుడు ఇలా మీలా ఉంటాడని చెప్పడానికే వచ్చారా ?అతను చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు.లైవ్లోకి వెళ్తుంది ఆ దృశ్యం.
“నేను బ్రతుకుతానో లేదో తెలియదు.బ్రతికితే మాత్రం మీలో ఒకడిని అవుతాను…ఈ ఆస్తులు అక్కర్లేదు ..ఈ మాట నేను మరణభయంతో అనడం లేదు..మీ వ్యక్తిత్వాన్ని మంచితనాన్ని చూసాను…నాకు జీవితం విలువను చిన్నసంతకంతో పెద్ద మనసుతో తెలియజేసారు….”అంటూ తన చేతుల్లో వున్న కాగితాలు సుగాత్రి చేతికి అందించబోయాడు.
“వద్దు సర్…ఈ క్షణం నుంచి ఈ ఆస్తి మీది..మీరు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలి….ఇది సుగాత్రి ఫౌండేషన్ ఆకాంక్ష మాత్రమే కాదు…ప్రజల కోరిక కూడా..”అంది.
“మీరు ఈ ఆస్తిపత్రాలు తీసుకుంటేనే నేను చికిత్స చేయించుకుంటాను …”ఒక్కక్షణం అక్కడ నిశ్శబ్దం..మానవత్వపు పరిమళం అక్కడ వ్యాపించింది.ఆక్రమించుకోవడమే తప్ప మరోటి తెలియని శేషాచలం…మొదటిసారి మనిషిగా మాట్లాడుతున్నాడు…మనసు స్వరంతో మాట్లాడుతున్నాడు.
“అయితే ఓ కండిషన్ సర్ మీరు తిరిగివచ్చేవరకు ఈ బాధ్యతలు చూస్తాను..ఆ తర్వాత ఈ ఫౌండేషన్ మీరే నడిపించాలి”
నిర్మూలించాలని ప్రయత్నించినవాడే,,కాపుకాసే రక్షకుడు…
హింసకు ప్రతిహింస కాదు
అహింస పరమోధర్మః 
మానవతా వాదమే సుగాత్రి అభిమతం
ధరిత్రిలోన సుగాత్రి చరిత నూతనోధ్యాయం 
***
ఉపసంహారం
శేషాచలం జీవితంలో అద్భుతం జరిగింది…అతను కోలుకున్నాడు…క్యాన్సర్ ని జయించాడు.తన మంత్రిపదవికి రాజీనామా చేసాడు. రాజకీయాల నుంచి తప్పుకున్నాడు.సామాజిక సేవారంగంలోకి అడుగుపెట్టాడు.తన ఆస్తుల్లో కొన్నింటిని మాత్రమే పిల్లలకు ఇచ్చి మిగితా ఆస్తులు సుగాత్రి ఫౌండేషన్ పరం చేసాడు.
***
ఎయిర్ పోర్ట్
శేషాచలం ,వసుమతి ,సాత్యకి నందిని డాక్టర్ ప్రియాంక రూపమతి..ఇంకా చాలా మంది అక్కడికి వచ్చారు.
“అమ్మా..నన్ను మనిషిని చేసి…నువ్వు మాకు దూరంగా వెళ్తున్నావు..ఇది న్యాయమా తల్లీ..ఈ బిడ్డలను అనాథలను చేసి వెళ్తావా?కదిలిపోతూ అడిగాడు శేషాచలం.
“మీరున్నారుగా..ఇక్కడ నా అవసరం లేదు..మీ అవసరం ఉంది.మీలా ప్రతీవ్యక్తి అలోచించి మారితే ఈ ప్రపంచంలో అనాథ అనే పదం నిఘంటువులో తప్ప కనిపించదు…తెలుగురాష్ట్రాల వెలుగు మీరు ..సుగాత్రి ఫౌండేషన్ కు మీరంతా రథసారథులే…దేశమంతా పర్యటించాలి…అనాథలు నిరాశ్రయులు బాధితులు పీడితులు అభాగ్యులు లేని ప్రపంచం కావాలి…వృద్ధాప్యాన్ని జయించే ఆత్మవిశ్వాసం కావాలి…ప్రతీవ్యక్తి తానే ఒక ఏకవ్యక్తి సైన్యంలా మారి ఓటమిని ఓడించాలి…డ్రగ్స్ కు బానిసలయ్యే చిన్నారులు యువతను కాపాడే సైన్యం కావాలి…అందుకు మీరంతా కృషి చేయాలి”ఇది నా విన్నపం అంది చేతులు జోడించి సుగాత్రి.
***
హైద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తోన్న విమానం టేకాఫ్ తీసుకుంది.
ఆ విమానంలో సుగాత్రి..తన ఆశయాల ఆలోచనల రెక్కలు విప్పుకుని ఆకాశం వైపు కదులుతోంది.గుప్పెడంత గుండెలో ఆకాశమంత ఆశయాన్ని నింపుకున్న నిలువెత్తు రూపమై…తానే ఆకాశమై.
ఆమె మనసులో వున్న మరో ఆలోచన …భవిష్యత్తు భారతదేశాన్ని ఉజ్వలంగా మార్చే ఆశయాల స్వప్నం … సువిధ ఫౌండేషన్…

***
సీరియల్ అయిపొయింది…సుగాత్రి ఆశయం కొనసాగుతూనే ఉంటుంది 
గుప్పెడంత ఆకాశానికి …శ్రీసుధామయి అక్షరవాణి వచ్చేవారం

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY