అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినపుడు ఏడ్చానో లేదో…నాకు తెలియదు..ఊహ తెలిసాక…గుప్పెడంత ఆకాశానికి …శ్రీసుధామయి అక్షరవాణి…(10 -09 -2017 )

ఒక బిడ్డకు జన్మను ఇవ్వడానికి తల్లిపడే ప్రసవ వేదన ఒక తల్లిగా నాకు తెలుసు…అక్షరాలకు జన్మనివ్వడానికి రచయిత పడే మానసిక వేదన ఆలోచనల అంతర్ఘర్షణ ..పదాల సంఘర్షణ అనుభవేద్యమైంది.
మిట్ట మధ్యాహ్నం విభాకరుడు మబ్బుల చాటుకు వెళ్ళాడు కూసింత విశ్రమించడానికా…అన్నట్టు…
గుప్పెడంత ఆకాశానికి నా అక్షరవాణిని ఆలకించడానికి ఆకాశం చినుకులను సాక్షులుగా పంపింది.మేఘాలు కదిలి మా ఊరొచ్చినట్టు..నన్ను పరామర్శిస్తూ తన మేనిపైనున్న చినుకులను పంపించింది…చీకటి ముసుగేసినట్టు…వర్షం మా ఊరుని చుట్టేసింది…రాత్రి ధాత్రిని చుట్టేవేళ నా అక్షరవాణి మేన్ రోబో స్వరానికి చేరాలి.
బయట హోరున వర్షం…ఆ వర్షంలో కూడా పిల్లలు కేరింతలు కొడుతూ నోటు బుక్స్ లో వున్న కాగితాలను చించి “కాగితం పడవలు చేసి నీటిలో వేసి “ఆనందిస్తున్నారు.
ఆ బాల్యాన్ని ఎంతిచ్చి కొనుక్కోగలం…ఒక ఆశయానికి ఈ సీరియల్ కు రాసే ముగింపు ఎలా మొదలుపెట్టగలను?
రాత్రి తొమ్మిది దాటింది...విభాకరుడెప్పుడో తన ఇంటికి వెళ్ళాడు డ్యూటీ చేయకుండానే…చీకటమ్మ ఆ రోజంతా మా ఊళ్ళో చాలాసేపు వుంది…అని అప్పుడు తెలిసింది.
పవర్ పోయింది.చీకటి కళ్ళతో స్మార్ట్ ఫోన్ మీద ఫ్లాష్ లైట్ వెలుతురులో నా చేతివ్రేళ్ళు అక్షరాలను ఆహ్వానిస్తున్నాయి.ఉపసంహారాన్ని లిఖిస్తోంది.
రచయిత పడే వేదన ఎలా ఉంటుందో తెలిపే పరీక్ష ఈ సీరియల్ కు ముగింపు…
ఈ సీరియల్లో రెండురకాల ముగింపుల్లో నేను ఎంచుకున్నదొక ముగింపు.
పూర్తిస్థాయి క్రైమ్ ఎలిమెంట్ తో సీరియల్ ముగించకూడదు అనుకున్నాను.
సీరియల్ ముగింపును సినిమాటిగ్గా మార్చి సుగాత్రి పోలీసుల సాయంతో శేషాచలం దాష్టీకాన్ని ఎదుర్కొని గెలవడం ఒక ముగింపు…
కానీ సుగాత్రి పాత్ర ఆ కోణంలో తీర్చిదిద్దలేదు.
మైండ్ గేమ్ తో ప్లాన్ చేసి తగిన ఆధారాలు సేకరించి సాక్షులుగా మొత్తం ప్రజలనే కోర్ట్ ముందుకు తీసుకు వచ్చేలా ఆలోచించాను…
ప్రజలే సాక్షులు..మైండ్ గేమ్ అన్యాయాన్ని ప్రతినాయకుడిని ఎదుర్కునే ఆయుధం...
కానీ ఈ ముగింపు కన్నా “మించి”మరోటి ఉంటే బావుండనిపించింది.
చేతివ్రేళ్ళలో చిన్నగా నొప్పి…చిన్నముల్లు ఒకటి దాటి రెండు దాటి..మూడు దాటేసరికి చిన్న అసహనం…
బయట హోరున వర్షం..నా ఆలోచనల జడివానను పరిచయం చేస్తున్నట్టు…
నేననుకున్న మూడవ ముగింపు ఎలా ఉండాలి..నాకే తెలియని సందిగ్ధం.
కాసింత వ్యక్తిత్వం..మరి కాసింత మానవత్వం.. ..ఇంకాసింత ఆశయాల ఆలోచనల కొనసాగింపు….
సందేశం కన్నా ఒక జీవిత పరమార్థం ..ఒక భావోద్వేగం..ఒక నిష్ఠురసత్యం ఉండాలి…
సుగాత్రి ప్రతినాయకుడిని ఎదుర్కునే సన్నివేశం రాబిన్ హుడ్ సాహసం లా ఉండకూడదు
మైండ్ గేమ్ తో సాధించే విజయం కాకూడదు…
మానవత్వంతో వ్యక్తివంతో కొనసాగే పోరాటం కావాలి..సుగాత్రి ఒడి గెలవాలి…ప్రతినాయకుడు గెలిచి ఓడాలి ….అదే సమయంలో సుగాత్రి ఆశయం…ఒక జీవితసత్యం …పాఠక ప్రపంచానికి చేరాలి….
అంతర్మథనం నా సహవాసి అయ్యింది…
మెదడుపొరల్లో విస్ఫోటనం…ఎప్పుడూ నాకు తోచిన పదాలను కలిపి..కవితలను రాసే నేను పూర్తిస్థాయి నవలను అందులోనూ కీలకమైన ముగింపును రాస్తుంటే తెలుస్తోంది అక్షరసృజనలోని పురిటివేధన.
అపుడు గుర్తొచ్చింది చాలాకాలం క్రితం..నేను కాలేజీ చదివే రోజుల్లో చదివిన పుస్తకం…
ఆ పుస్తకంలో ప్రారంభానికి ముందు అధ్యాయం..ఇలా ఉంటుంది…
“అతనికి తాను మరో ఇరవైనాలుగు గంటల్లో చనిపోతానని తెలుస్తుంది.అప్పడు అతని ప్రపంచం తల్లక్రిందులు అవుతుంది.అతని ఆలోచనా విధానం మారిపోతుంది.తనవల్ల బాధ పడ్డ వాళ్ళను పిలుస్తాడు.తన భార్యతో చివరి ఒకరోజు గడుపుతాడు…ఆ ఒక్కరోజు …క్షణాలు నిముషాలు గుడుస్తుంటే భార్య తనకోసం ఎంతగా తపించిందో అర్థమవుతుంది.ఈ అద్భుతమైన ప్రపంచంలో తాను కోల్పోయిన అనుభూతులు గుర్తొస్తాయి…
చివరగా తన తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇమ్మంటాడు…కానీ అప్పటికే అతని ఆయుష్షు తీరుతుంది…
ఒక్కరోజు మరణం అంటే ఇంత మార్పు వస్తుంది.అలాంటిది ఎలాగు చనిపోతామని తెలుసు..మరణించాక మన శరీరమే మనతో రాదని తెలిసినా ఈ స్వార్థం..ఉన్మాదం..మారణకాండ ఎందుకు?
“అధికారంలో వున్న మంత్రి …అంగబలం అర్థబలం వున్నవ్యక్తి రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను ఓ మలుపు తిప్పగల వ్యక్తి…అతను కనుసైగ చేస్తే రాష్ట్ర శాంతి భద్రతల భవిష్యత్తే ప్రశ్నకర్థం అయ్యే ఒక బలమైన శక్తి …ఇప్పుడు యుద్ధం తర్వాత సమస్త సైన్యాన్ని కోల్పోయిన వ్యక్తిలా వున్నాడు…
అతని ముందు చేతులు కట్టుకుని నిలబడే అతని కొడుకులు మంత్రాంగం మొదలుపెట్టారు..పంచాయితీ ప్రారంభించారు.
తండ్రి మరణానికి ముందే పోస్టుమార్టం చేస్తున్నారు.
తండ్రికి వారసులు ఎవరో తేలిపోవాలని కొడుకులు చేస్తోన్న యుద్ధం…
బాగుకోరే బావమరిది నేనూ ఉన్నానంటూ తన వర్గాన్ని బల పరీక్షకు తీసుకువచ్చాడు..
ఇదంతా చూస్తోన్న శేషాచలానికి క్యాన్సర్ వచ్చింది తనకేనా?
అధికారవ్యామోహంతో కళ్ళముందే రాలిపోబోతున్న వ్యక్తి ముందు అధికార ఆస్తుల పంపకం చేసుకుంటున్న తన వాళ్ళు అనుకున్న ఈ మనుష్యులకా ?
మొదటిసారి అతనికి ప్రాణభయం కన్నా భయంకరమైన అంతర్ఘర్షణ మొదలయింది.”
ఇలా మొదలైన శేషాచలం పాత్ర …ఒక మరణరహస్యాన్ని ఈ ప్రపంచానికి చెబుతుందన్న ఆశతో కొనసాగించాను.
“అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినపుడు ఏడ్చానో లేదో…నాకు తెలియదు..ఊహ తెలిసాక నా స్వార్థంతో అధికారదాహంతో ఎందరినో ఏడ్పించాను..మీతో సహా…అమ్మలా నాకు విచక్షణ అనే జన్మను ఇచ్చారు..నేనిక చచ్చినా బాధ లేదు”
ఈ మాటలు రాయడానికి నేను శేషాచలం పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
ఈ ఆలోచనతో ఈ నవల క్లయిమాక్స్ ప్లాన్ చేశాను…
నా నవల క్లయిమాక్స్ కు స్ఫూర్తిని ఇచ్చిన పుస్తకం పేరు”మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి”
కాకతాళీయమైన విషయం ఏమిటంటే నన్ను రైటర్ గా ప్రోత్సహించిన మేన్ రోబో చీఫ్ ఎడిటర్ విజయార్కె గారే ఈ పుస్తక రచయిత కావడం….
థాంక్యూ సర్…
నా ఆలోచనలను ఆశయాలను అక్షరాలుగా మార్చే ప్రయత్నమే గుప్పెడంత ఆకాశం.కేవలం ఒక ఆర్టికల్ గా రాద్దామనుకున్నాను..కానీ కథగా అయితే విపులంగా కాస్త అందంగా చెప్పొచ్చు అనిపించింది.పాఠకుల ఆదరణ నాలుగు వారాలు అనుకున్న సీరియల్ ను పన్నెండు వారాలు కొనసాగించేలా చేసింది.
ఈ పదమూడవ వారం మీతో ముచ్చటించే అవకాశాన్ని కలిగించింది.
సుగాత్రి వ్యక్తిగత జీవితం…ఈ నవలలో చర్చించలేదు.కేవలం గుప్పెడంత ఆశయాన్ని,మేన్ రోబో అనే ఆకాశమంత కాన్వాసు మీద చూపించాలనుకున్న చిన్ని ప్రయత్నమే…గుప్పెడంత ఆకాశం.
సీరియల్ కు చివరివాక్యం రాస్తున్నప్పుడు..నా చూపుడు వేలు చివరి అక్షరాన్ని స్మార్ట్ ఫోన్ మేనిని తాకినప్పుడు…ఇన్నాళ్ల శ్రమ అక్షర తపన…ఆలోచనల అసిధారా వ్రతం…గుప్పెడంత ఆకాశానికి ,విశ్వమంత మీ అభిమానానికి .నా సాహితీ ప్రస్థానానికి శుభారంభగా శ్రీకారం చుట్టిన నిలిచిన మేన్ రోబో కు…
తమ ఉత్తరాలతో,ప్రతీవారం స్పందించి,ప్రతిస్పందించిన అభిమాన పాఠకులకు,
అనాథలు నిరాశ్రయులు అభాగ్యులు అన్న పదాలు వినిపించని రోజుకు …
అందుకు కృషి చేసే మహానుభావులకు…
పేస్ బుక్ స్నేహితులకు,,హితులకు…కృతజ్ఞతాభివందనాలు…
గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్

http://kinige.com/book/Guppedanta+Akasam

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY