గతి తప్పని కాల గమనాలు…విస్తరించిన విశ్వములో… స్వల్ప బిందువులు మన జీవనాలు..కృష్ణ స్వప్న కవితాక్షర భావధార

ముప్ఫై ఒకటి ముగింపుకి రాక ముందే మొదలవుతాయి
“నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ అచ్చ తెలుగులో
ఆంగ్ల సంవత్సర మహా పర్వదినానికి సందేశాలు …
వైభవోపేతంగా ఆంగ్ల వత్సరానికి ఆహ్వానాలు ..

నూతన సంవత్సరం అంటే కేవలం రోజులో మార్పేనా ?
పంచాంగం ప్రకారం పండగలు జరుపురుకునే దేశమేనా…
ఇంగ్లీష్ పండుగలని కౌగిలించుకుంటున్నాము ..
మన సంస్కృతీ, సంప్రదాయాలని అటకెక్కించేసాము ..

ముఫై ఒకటికి, ఒకటికి మధ్యన తేడా ఏముంది ..?
ఋతువులో తేడా లేదు, కాలం లో మార్పు లేదు ..
మధు మాసపు కోయిలల కిల కిల స్వాగతాలు లేవు ..
మరుమల్లెల పరిమళాలతో విరుల సిరి నగవులతో
వసంతంలో స్నానమాడిన ప్రకృతి సోయగాలు లేవు ..
పసుపు పూతల గడపలతో, మామిడాకుల తోరణాలతో

వేప పూతల సువాసనలతో పక్షుల పాటల కచేరీలతో
షడ్రుచుల సమ్మేళనాల ఉగాది పచ్చడితో..
పంచాంగ శ్రవణాలతో, సాహితి వేత్తల కవనాలతో .
హరివిల్లు వర్ణాల రంగవల్లుల ముంగిళ్లతో ..
సిరిమువ్వల రవళుల అలికిడితో చిగురించే ఆశలతో
వేంచేసే తెలుగింటి అలివేణి వసంత రాణి
చైత్ర మాస ఆరంభాన మింటి రథంలో ఊరేగు
పాడ్యమి నాటి చంద్రుని కి పలికే స్వాగతాలు లేవు
పచ్చని పసిడి రాశులతో పంట రైతన్న ఇంట చేరలేదు ..
వసంతోత్సవపు రంగులను అద్దుకున్న
మోదుగ కెంజాయ వర్ణాలతో వెల్లి విరియలేదు

హేమంతం జరిపే సీమంతం తో పుడమి వెలవెల బోతున్న వేళ..
శిశిరానికి వీడ్కోలు పలుకుతూ గ్రీష్మం విచ్చేయని వేళ
ఏల ఈ నూతన సంవత్సర ఆనందాల హేల ?
పరాధీనత నుండి దేహం బయట పడింది
కానీ, మనసు స్వాతంత్రం కోల్పోయింది ..
నూతన సంవత్సర వేడుకల పేరుతొ
మధ్య రాత్రి మధిర పానం తో జరిగే
దుర్ఘటనలకి, అత్యాచారాలకి ఆనకట్ట వేద్దాము
స్వాతంత్ర కాలం నాటి భావాలను జాగృతం చేద్దాము ..
ముప్ఫై ఒకటులను మరిపించి మన పర్వాలను జరుపుకుందాము .
అనురాగం, ఆప్యాయతలతో ముంగిళ్లను అలంకరిద్దాము ..
కృష్ణ స్వప్న ..29/12/17
అనంత కాల గమనం లో
అఖండ బ్రహ్మ్మండం ఒడిలో
యుగాలు యుగాలు ఆటలాడుకుంటున్నాయి
అనంత కాల గమనం లో
గ్రహాలు తమ కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయి…
తోక చుక్కల రాకపోకలు..
నక్షత్రాల మిణుకు మిణుకులు..
క్షణం పాటు మెరిసి పోయే ఉల్కలు..
నిరంతరం గా సాగిపోతున్న క్రీడలు..
మంద గతి తో సాగిపోయే వసుంధర వెంట సాగే
శశిధరుని ఒక్క ప్రదక్షణ
పూర్తయితే ఒక సంవత్సరమే.
సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు..
ఆరు రుతువుల ఆహార్యాలు
గతి తప్పని కాల గమనాలు..
విస్తరించిన విశ్వములో స్వల్ప బిందువులు మన జీవనాలు..
అనంత కాల గమనం లో
కొన్ని క్షణాలు..
విధి ఆడే ఆటలో
క్షణికమైన ప్రతిబింబాలు..
ఆది, అంతం లేని ఈ క్రీడలో
సంవత్సరం అంతం అనబడే
ఒక చిన్న మలుపులో
కొద్ది సేపు ఆగి మనమందరం
కొత్త సంవత్సరానికి కొత్త సలామ్ కావిద్దాం..

కృష్ణ స్వప్న(31-12-2017)

NO COMMENTS

LEAVE A REPLY