ఆ శిథిలభవనంలోకి అడుగుపెట్టాడు కొఠారి.అంతే వందలాది తీతువుపిట్టలు ఒళ్లు జలదరించేలా అరుస్తూ ఆ అడవిలో ఎగిరాయి….హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకుల కోసం ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి …మృత్యుక్రీడ (ఘోస్ట్ స్టోరీస్) 11-03-2018

(11)
అది నల్లమల అటవీప్రాంతం. ఎక్కువగా దట్టమైన కీకారణ్యం తో నిండి ఉంది. సూర్యరశ్మి ఏ మాత్రం సోకని ప్రదేశాలు ఆ అడవిలో చాలా ఉన్నాయి. దుర్లభం దుర్భేధ్యమైన ఆ అడవిలో అనేకమైన భయంకర సంఘటనలు జరుగుతాయని వినికిడి.
కొఠారి ఒక గైడ్ . గైడ్ అయినందువలన అనేక ప్రదేశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం వాటిలో కొన్నింటిని డాక్యుమెంటరీ గా చిత్రించడం అతనికి చాలా ఇష్టమైన విషయం.
నల్లమల అడవిలో ఎక్కడో అశ్వత్థామ ఆలయం ఉందనీ అది అత్యంత పురాతనమైనదీ దేశంలోనే అరుదైనది అని తెలుసుకున్నాడు. అక్కడికి ఎలాగైనా వెళ్లి ఆ ఆలయంపై ఒక డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయానికొచ్చాడు. కానీ అడవిలో కొంతవరకు మాత్రమే ప్రవేశం ఉంది. దట్టమైన కీకారణ్యంలో అడుగు పెట్టాలంటే అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ అధికారులు కొఠారికి అనుమతి ఇవ్వలేదు. అడవి జంతువుల సంచారం ఎక్కువనీ ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలిసిందే అని చెప్తూ అనుమతి ఇవ్వబోమని స్పష్టంగా చెప్పారు. ఆ మాటలు ఏ మాత్రం రుచించని కొఠారి అటవీ అధికారుల కళ్లు గప్పి అడవిలో కొంత దూరం వరకూ అక్కడక్కడా ఉన్న కెమెరా కన్నుల నుండి దాక్కుంటూ చివరికి దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు.
దారితెన్నూ తెలియక ఆ కీకారణ్యంలో అలా ముందుకు సాగుతున్నాడు. దట్టమైన గుబురు చెట్లు వాటి మీద రకరకాల పక్షుల అరుపులతో పాటు అడవి జంతువుల అలికిడి తో కొఠారికి చిన్నగా భయం మొదలైంది. అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని నిషిద్దప్రాంతంగా ఎందుకు ప్రకటించారో అవగతమైంది. భుజాన ఉన్న బ్యాగులో డాక్యుమెంటరీ కోసం అన్ని వస్తువులు ఉన్నాయి. అక్కడనుండి తొందరగా ఆలయాన్ని వెతికి పట్టుకుని తాను అనుకున్నది చేయాలని పట్టుదలగా ఉన్న కొఠారికి అక్కడక్కడా ఉన్న చీకటి ప్రదేశాలు వెలుతురు సోకని ప్రాంతాలు భీతిని కలిగిస్తున్నాయి. అలాంటిచోట్ల తనదగ్గరున్న టార్చిలైటును వేసుకుంటూ అలా ముందుకు సాగుతున్నాడు కొఠారి.
మరికొంతదూరం వెళ్లాక దాపులనే ఉన్న పొదల నుండి పులి గాండ్రింపు వినిపించింది. భయపడిన కొఠారి చుట్టూ చూశాడు. అక్కడికి కొంచెం దూరంలో ఒక శిథిలభవనం కనిపించింది. అక్కడకు వెళితే పులి బారినుండి రక్షించుకోవచ్చు అనుకుంటూ అటువైపుగా అడుగులు వేశాడు. కానీ మానవసంచారం లేని ఆ దట్టమైన కీకారణ్యంలో ఆ శిథిలభవనం ఎలా వచ్చిందో అన్న ఆలోచనను పులిభయం రానివ్వలేదు. భయం ఆలోచనలను నిర్వీర్యం చేస్తుంది అనడానికి ఉదాహరణగా..
ఆ శిథిలభవనంలోకి అడుగుపెట్టాడు కొఠారి.అంతే వందలాది తీతువుపిట్టలు ఒళ్లు జలదరించేలా అరుస్తూ ఆ అడవిలో ఎగిరాయి. అది భవనం కాదు మొండిగోడలు మాత్రమే ఉన్నాయి. కానీ బయటికి భవనంలా ఎలా కనిపిస్తోందో అర్థం కాని కొఠారి ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. కారణం బయటనుండి పులిగాండ్రింపు అతనికి వినిపించడం మానలేదు. అలా అక్కడే ఉండిపోయిన కొఠారి అలాగే నిద్రలోకి జారుకున్నాడు. కొంతసేపు తర్వాత మెలకువ వచ్చిన కొఠారికి అప్పుటికే మసకచీకటి ఉండటం కనిపించింది. వాచీ చూసాడు అందులో సాయంత్రం నాలుగు చూపుతోంది. ఏమీ అర్థం కాలేదు. బహూశా అడవిలో కదా అందుకే చీకటి అయింది అనుకుంటూ బయటికి రావాలని అడుగు ముందుకు వేశాడు
ఆ మసకచీకటిలో అక్కడెవరో ఉన్నట్టు అలికిడి. చుట్టూ చూశాడు. అక్కడ ఆ మొండిగోడల మీద లెక్కలేనన్ని ఏవో ఆకారాలున్నాయి. అవన్నీ మెల్లిగా కిందకు దిగుతున్నాయి. ముందుకు పోవడానికి వీలులేకుండా అవన్నీ కొఠారిని చుట్టుముట్టాయి. వాటిని చూసిన కొఠారికి భయంతో స్పృహ తప్పింది.
కొంతసేపు అయ్యాక కొఠారి నిద్రనుండి లేచినట్టు లేచాడు. భయంభయంగా చుట్టూ చూశాడు. మసకచీకటి కానీ ఏ ఆకారాలు కానీ అక్కడ లేవు. వాతావరణం సాధారణంగా ఉంది. ఊపిరి పీల్చుకున్న కొఠారి బయటికి వచ్చాడు. అలా చాలా దూరం నడిచాక ఒకచోట ఒక ఆలయం కనిపించింది. ఆ ఆలయ రూపురేఖలు తాను చూడాలనుకున్న అశ్వత్థామ ఆలయాన్నే పోలిఉంది.ఎగిరి గంతేసినంత పని చేశాడు కొఠారి.అంతలో ఒక విషయం గుర్తుకు వచ్చింది కొఠారికి. డాక్యుమెంటరీ తీయాలని వచ్చిన తాను తన బ్యాగును అక్కడ ఆ మొండిగోడల మధ్య వదిలేసి వచ్చాడు. అక్కడికి వెళ్లి వచ్చేసరికి రాత్రి అవుతుంది. చేసేదేం లేక కనీసం ఆలయం చూసి రావాలని అడుగు ముందుకు వేశాడు. ఆలయ ముఖద్వారం చూస్తూ అడుగు ముందుకేశాడు. కానీ అడుగు ముందుకు పడలేదు. ఆశ్చర్యం అడుగు ముఖద్వారం ముందుకు వేయాలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. ఏదో శక్తి వెనక్కిలాగినట్టుగా అవుతోంది. అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కొఠారి. ఏదో వెనక్కి లాగుతునే ఉంది.
రేయి గడిచింది తెల్లవారింది. అటవీఅధికారులంతా తమ తమ విధులలో నిమగ్నమై ఉన్నారు. విధులలో భాగంగా కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నారు. అడవిజంతువుల సంచారం .. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి కెమెరాలు అమర్చారు. అవన్నీ పరిశీలిస్తున్న ఒక అధికారికి ఒకచోట ఎవరో పడిపోయి ఉండటం పుటేజిలో కనిపించింది. వెంటనే మిగిలిన వారితో కలిసి అక్కడికి వెళ్లాడు. ఆ వ్యక్తి పడిపోయిన చోటుకి చేరుకున్నారు. అతడు అంతకుముందు రోజు దట్టమైన అడవిలోకి వెళ్లడానికి అనుమతి కోరిన కొఠారి. అక్కడ ప్రాణం లేకుండా పడి ఉన్నాడు
అలా పడిఉన్న కొఠారిని చూసి అటవీఅధికారులు ఏదో అడవిజంతువును చూసిన భయంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడని భావించారు.
కానీ మొండిగోడల మధ్య ఉన్న ఆత్మల ఆకారాలు కొఠారిని తమలో కలిపేసుకున్నాయి. అతడికి అశ్వత్థామ ఆలయం చూడటం కోరిక కావున అతడి ఆత్మ ఆలయాన్ని వెతుక్కుంటూ వెళ్లింది. ఆత్మ అయినందువలన ఎంత ప్రయత్నించినా ఆలయంలోకి ప్రవేశించలేకపోయింది. అతడి శరీరంతో మృత్యుక్రీడ ముగించి ఆ ఆకారాలు అక్కడే పడేసి వెళ్లిపోయాయి!!
ఆత్మగా మారిన కొఠారి. అందుకే అశ్వత్థామ ఆలయంలోకి అడుగు ముందుకు పడలేదా??
నల్లమల అడవులలో దట్టమైన కీకారణ్యం నడుమ అశ్వత్థామ ఆలయం ఉందనీ అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించినవారు ఆత్మలుగా మారి అక్కడే సంచరిస్తుంటారనీ తెలిసిన సమాచారం ఆధారంగా!!

ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/book/Ghost+Stories+13

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY