మెట్లు దిగుతుంటే వారితో పాటు మరెవరో మెట్లు దిగుతున్న సవ్వడి. వారు ఆగితే ఆ అడుగులు కూడా ఆగిపోతున్నాయి…ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి…డబ్లిన్ బై నైట్ (12-08-1018)

           ( హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకులకోసం )
2
చీకటి తెరలు కమ్ముకుంటున్న వేళ ఆ ప్రదేశమంతా గాడాంధకారం ఆవరిస్తోంది. ఆ గాడాంధకారంలో అక్కడున్న ప్రదేశం అంతా ఏదో తెలియని భీతావహం ఆవరిస్తోంది.
ఆ అంధకారంలో ఒక మూలగా విసిరేసినట్టున్న ఆ పురాతనమైన కోట చీకటిని తాగుతున్నట్టుంది.
ఆ పురాతనమైన కోట ఐర్లాండ్ దేశంలోని ఒక పట్టణంలో నిర్మించబడిన “డబ్లిన్ కోట”. నిర్మానుష్యమైన ప్రదేశంలో నెలకొనిఉన్న ఆ కోట కు దరిదాపులలో ఎటువంటి కట్టడాలు కాని జనసంచారం కాని లేదు.
ఆ పురాతనమైన కోటలో గడపడానికి అమెరికా నుండి ఇద్దరు స్నేహితులు ప్రపంచపర్యాటకులైన జాన్ఫ్రెడ్, హెన్రీ ఐర్లాండ్ కు వచ్చారు. ఒక గైడ్ సాయంతో వారు డబ్లిన్ కోటకు చేరుకున్నారు.
ఆ గైడ పర్యాటకులను “డబ్లిన్ బై నైట్ ” అనే టూర్ కి తీసుకెళ్లే గైడ్ ఆ విషయం తెలియని ఆ స్నేహితులిద్దరూ ఆ కోటలోకి అడుగుపెట్టారు.
(డబ్లిన్ బై నైట్ అనగా … ఐర్లాండ్ దేశంలో దయ్యాలమీద అతీంద్రియ శక్తుల మీద నమ్మకాలు చాలా ఎక్కువ. పర్యాటకులెవరైనా దయ్యాలను చూడాలని అనుకుంటే గైడ్స్ వారిని ప్రతి ఊరులో ప్రతీ నాలుగో ఇంటిలో వదిలి వస్తుంటారు. దీనినే డబ్లిన్ బై నైట్ అని పిలుస్తారు.)
అలా కోటలో ప్రవేశించిన ఆ స్నేహితుల వద్ద నుండి గైడ్ సెలవు తీసుకుని తెల్లవారి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
ఎంతో పెద్దదైన పురాతనమైన ఆ కోటలో ముందు భాగం మాత్రమే అధునాతనంగా పర్యాటకుల కోసమే తీర్చిదిద్ది ఉంది. మిగిలినదంతా యదాతథంగా ఉంది. అనేక రకాల చిత్రపటాలతో జీవకళ ఉట్టిపడే శిల్పాలతో ఆ ప్రదేశమంతా నిండి ఉంది. ఒక మూలగా పైకి వెళ్లడానికి మెట్లు ఉన్నాయి. ఆ కోటను కలియచూస్తున్న జాన్ఫ్రెడ్ హెన్రీ లిరువురూ కోట లో అంతస్తు కూడా చూడాలని మెట్లు ఎక్కడం మొదలెట్టారు. అలా ఎక్కుతున్న ఆ ఇరువురూ ఒక విషయం గమనించారు. వారిద్దరూ మాత్రమే కాకుండా ఇంకెవరో మెట్లు ఎక్కుతున్నారు. వారి అడుగులతో పాటు మరెవరో అడుగులు కూడా పడుతున్నాయి. వారు ఆగిపోతే ఆ అడుగుల శబ్దం కూడా ఆగిపోతోంది. స్నేహితులిద్దరూ ఒక్కక్షణం ఆగి చుట్టూ పరికించారు. కానీ అక్కడ వారిద్దరు తప్ప ఎవరు లేరు. తాము భ్రమ పడుతున్నామని నవ్వుకుంటూ కోట పై అంతస్తులో అడుగుపెట్టారు.
ఆ పై అంతస్తులో ఎన్నో గదులున్నాయి. దాదాపు అన్ని గదులకు వేసిన తాళాలు తుప్పు పట్టి ఉన్నాయి. ఆ కోట కింది అంతస్తులో వెలిగించిన విద్యుద్దీపాల కాంతి పై అంతస్తులో మసకగా ప్రసరిస్తోంది. అక్కడ గదులు తప్ప ఇంకేమీ లేవు. అక్కడున్న గదులలో ఒక గది హెన్రీ ని ఆకర్షించింది. ఆ గదికి తాళాలు వేసి లేవు. అన్ని గదులకంటే కొంచెం విభిన్నంగా ఉన్న ఆ గదిలో ఏముందో చూడాలని హెన్రీకి అనిపించి ఆ గది బరువైన తలుపులను తోశాడు. అవి కిర్రుమంటూ తెరుచుకున్నాయి. ఆ శబ్దం విని జాన్ ఫ్రెడ్ కూడా అక్కడికి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఆ చీకటిగదిలోకి అడుగుపెట్టారు. తమ దగ్గరున్న పెన్ టార్చ్ సాయంతో గది అంతా పరికించారు. ఆ గది ఖాళీ గా ఉంది కానీ గోడలకు అనేక రకాల చిత్రపటాలు వేలాడుతున్నాయి. వింతవింత ఆకారాలతో విచిత్రమైన బొమ్మలతో భయానకం గొలుపుతున్నాయి. వాటన్నిటినీ చూసిన జాన్ఫ్రెడ్ హెన్రీ వెనుకకు తిరిగారు. ఆ మరుక్షణం అక్కడున్న చిత్రపటాలలో ఒక చిత్రానికి కదలిక వచ్చింది. దాని కళ్లు తెరుచుకున్నాయి. వికృతంగా ఉన్న ఆ చిత్రం మరింత వికృతంగా మారిపోయింది. అదేమీ తెలియని ఆ స్నేహితులు కిందకు దిగాలని మెట్లపై అడుగుపెట్టారు.
మెట్లు దిగుతుంటే వారితో పాటు మరెవరో మెట్లు దిగుతున్న సవ్వడి. వారు ఆగితే ఆ అడుగులు కూడా ఆగిపోతున్నాయి. ఇద్దరు స్నేహితులు అది గమనించి గబగబా మెట్లు దిగి ఆఖరిమెట్టుపై అడుగుపెట్టారు.
అంతే పై అంతస్తు గదిలో వికృతాకారం ఉన్న చిత్రపటం కిందపడి భళ్లున పగిలింది. ఆ శబ్దం విన్న ఇద్దరికి భయం కలగసాగింది. ఎవరూ ఏమి మాట్లాడుకోకుండా తమకు కేటాయించిన పక్కల వద్దకు చేరుకున్నారు
అంతలో ఇద్దరికీ ఎవరో తమను గమనిస్తున్నట్టు అనిపించసాగింది. కానీ అక్కడ వారిద్దరు తప్ప మరెవరూ లేరు. జాన్ …ఇక్కడ ఎవరో మనలని గమనిస్తున్నట్టు అనిపిస్తోంది . కదా అంటూ హెన్రీ జాన్ఫ్రెడ్ ను అడిగాడు. అవును నిజమే అంటూ జాన్ తలాడించాడు. రాన్రాను ఇద్దరికీ తమను ఎవరో చూస్తున్నట్టుగా బలంగా అనిపించసాగింది. ఎటు తిరిగితే అటువైపు తిరిగి చూస్తున్నట్టు. ఎలా కదిలితే అలా వాళ్ల వెనుకే కదులుతున్నట్టు వారిద్దరూ పసిగట్టారు. అతిజాగ్రత్తగా అంతా పరికించారు. కానీ అక్కడ ఎవరూ లేరు.
చేసేదేమి లేక జాన్ఫ్రెడ్ హెన్రీ ఇద్దరూ కొద్ది దూరంలో పడుకున్నారు. కొద్దిసేపయ్యాక హెన్రీ పక్కన ఎవరో పడుకున్నారనిపించి ..జాన్ ఇక్కడే పడుకున్నావా అని అడిగాడు. సమాధానం లేకపోయేసరికీ తిరిగి చూశాడు అక్కడెవరూ లేరు కొద్ది దూరంలో పడుకున్న జాన్ అక్కడ లేడు. చాలా దూరంలో ఉన్నాడు
గబగబా వెళ్లి జాన్ ను తట్టి లేపాడు హెన్రీ. తానక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాక ఆశ్చర్యపోయాడు జాన్ఫ్రెడ్ . ఇద్దరికీ భయంతో వణుకు ప్రారంభమైంది. ఆ భయానికి భీతి జడుపు జత కావడానికి సూచనగా పై అంతస్తు నుండి ఏవో వికృతశబ్దాలు మొదలయ్యాయి. ఆ శబ్దాలు ఇంకా ఎక్కువవుతునే ఉన్నాయి. జడుసుకున్న ఇద్దరు స్నేహితులు తమ మెడలో వేసుకున్న “క్రాస్ ” ను బయటికి తీశారు. కానీ ఇద్దరికీ క్రాస్ లేవు. అది చూసి ఇద్దరూ అక్కడ ఉండలేక కోట నుండి వెళ్లిపోదామని బయటికి వచ్చారు. సమయం అర్దరాత్రి దాటుతోంది. చుట్టూ చిమ్మచీకటి. అంతేకాక కోటలో వినిపించిన వికృతశబ్దాలు వారికి దరిదాపులలో వినిపిస్తున్నాయి.
అక్కడనుండి బయట పడాలని గబగబా ముందుకు నడిచారు. ఏవో వింతశబ్దాలు వారి చుట్టుపక్కలనుండి భీతి గొలుపుతున్నాయి. అలా కొద్దిదూరం ముందుకు నడిచాక తమ ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి వారు స్థాణువైపోయారు. వారి ఎదురుగా డ…..బ్లి…….న్ …..కో……..ట
వారు ఏ కోట నుండి అయితే బయటికొచ్చారో ఆ కోట వారి ఎదురుగానే ఉంది. భయపడుతునే వారు ఆ కోటకు వ్యతిరేకదిశలో నడవడం మొదలుపెట్టారు. కొద్దిదూరం ముందుకు వెళ్లాక వారి ఎదురుగా అదే కోట. ఎలా వెళ్లినా ఎటు వెళ్లినా కోట మాత్రమే ఎదురు పడుతోంది. నిర్మానుష్యమైన ఆ నీరవ నిశీధిలో వాతావరణం వారిని భయవిహ్వవులను చేస్తోంది. ఇక చేసేదేం లేక ఆ రాత్రికి ఆ కోటలోనే గడిపి తెల్లవారి అక్కడనుండి బయట పడాలని నిశ్చయించుకుని తిరిగి కోటలోకి అడుగు పెట్టారు.
కోటంతా నిశ్శబ్దంగా ఉంది. అంతకుముందు భయపెట్టిన వికృతమైన ధ్వనులు కానీ విపరీతమైన శబ్దాలు కానీ ఏమీ లేవు. అది చూసి ఊపిరి పీల్చుకున్న ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు. కానీ మనసులో మెదుల్తున్న భయం వారిని నిద్రపోనివ్వడం లేదు. అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ నిశ్శబ్దంలో అంతస్తు మెట్ల మీద ఏదో అలికిడి. ఎవరో మెట్లు దిగుతున్న శబ్దం. అక్కడ ఎవరో వ్యక్తి మెట్లు దిగుతున్నట్టు ఇద్దరికి కనిపిస్తోంది. వారు భయంగా చూస్తుండగా మెట్లు దిగిన ఆ వ్యక్తి వీరి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆ వ్యక్తిని చూసిన ఇద్దరూ భయభ్రాంతులయ్యారు. వారి నోట మాట పెగల్లేదు.
ఆ వ్యక్తి వారిని కోటలోకి వదిలిపెట్టిన …..”గైడ్ “…… నోటి నుండి పొడుచుకొచ్చిన పొడవాటి కోరలతో భయంకరంగా కనిపిస్తున్నాడు.

* * *
చీకటి ఆ రోజుకి సెలవు తీసుకుంది. చీకటి స్థానంలో వెలుగు వచ్చింది.
“డబ్లిన్ బై నైట్ ” టూర్ కి పర్యాటకులను ఆకర్షించడంలో ఆ గైడ్స్ ఇద్దరూ బిజీ గా ఉన్నారు. వీరిని చూసిన ఇద్దరు పర్యాటకులు తమను “డబ్లిన్ బై నైట్ ” టూర్ లో భాగంగా తమను “డబ్లిన్ కోట” కు తీసుకెళ్లమని కోరారు. వారు కోరినట్టే డబ్లిన్ కోట కు తీసుకెళ్లిన ఆ ఇద్దరు గైడ్స్ తెల్లవారి వస్తామని వారి వద్ద సెలవు తీసుకుని బయటకు వచ్చారు.
వారిద్దరు అమెరికా నుండి వచ్చిన స్నేహితులు ప్రపంచపర్యాటకులైన “హెన్రీ… జాన్ఫ్రెడ్ “.
అలా బయటికి వచ్చిన వారిద్దరూ తమ నోటినుండి పొడుచుకొచ్చిన కోరలతో బిగ్గరగా నవ్వసాగారు!!
ఉపసంహారం……
మెట్లు దిగి వచ్చిన గైడ్ ను చూసి జాన్ ఫ్రెడ్ . హెన్రీ లిరువురికీ స్పృహ తప్పింది. స్పృహ తప్పిన ఆ ఇరువురి నీ తన కోరలతో రక్తం పీల్చసాగాడు ఆ గైడ్ . రుధిరపు చుక్కలు సాక్ష్యంగా అక్కడున్న శిల్పాల వద్దకు వెళ్లిన ఆ గైడ్ అక్కడ తాను ఒక శిల్పమైపోయాడు. పై అంతస్తులో కిందపడి పగిలిన చిత్రపటం ఒక్కసారిగా అతుక్కుని గోడపై తన స్థానంలో యథాతథంగా నిలిచిపోయింది!

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

 హారర్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY