దానికి ఇరువైపులా కోరలు ..ముందుభాగంలో డ్రాక్యులా బొమ్మ చెక్కబడి ఉన్నాయి. ఆ సింహాసనంపై ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు…ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి…డార్క్ నైట్ (19-08-1018)

( హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకులకోసం )
3
అది ఒక నిర్మానుష్యమైన నిర్జన ప్రదేశం.. అక్కడ ఎలాంటి మానవసంచారం లేని ప్రాంతం. దూరంగా ఎండుటాకుల గలగలలు. ఎవరో పరిగిడుతూ వస్తున్న శబ్దం.
ఆ పరిగెడుతున్నది ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి మొహంలో భయం తాండవిస్తున్నది. ఆ అమ్మాయిని వెంబడిస్తూ ముగ్గురు వ్యక్తులు. ఆ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలని శరవేగంగా వస్తున్నారు. ఆ అమ్మాయి వారికి అందే దూరంలోకి వస్తూ తప్పించుకుంటోంది. పట్టు వదలని ఆ ముగ్గురూ ఆ అమ్మాయిని వెంటాడుతునే ఉన్నారు. వేగంగా పరిగెడుతూనే ఆ అమ్మాయి చుట్టూ పరికిస్తోంది తనను కాపాడటానికి ఎవరైనా కనిపిస్తారేమో అని. కానీ నిర్మానుష్యప్రాంతం అయినందున అక్కడెవరూ లేరు.
అలా భయంతో భీతిగా పరిగెడుతున్న ఆ అమ్మాయికి కొద్దిదూరంలో ఒక పెద్దకోట కనిపించింది.శరవేగంతో ఆ అమ్మాయి కోట లోపలికి దూసుకుపోయింది. అది చూసిన ఆ ముగ్గురు వ్యక్తులు కూడా కోట లోపలికి ప్రవేశించారు. కానీ కోటలో అమ్మాయి ఎక్కడా కనిపించలేదు.

ఆ అమ్మాయిని వెతుకుతూ ఆ ముగ్గురు కోట అంతర్భాగంలోకి ప్రవేశించారు. ఎంతో పెద్దది ఎన్నో గదులున్న ఆ కోట భయం గొలుపుతూ భయంకరంగా అగుపిస్తోంది. కోట లోపల ఎన్నో వికృతమైన శిల్పాలు .రక్తపిశాచుల చిత్రాలు. డ్రాక్యులాలను తలపించే అనేక రకాల బొమ్మలు నిండి ఉన్నాయి. ఆ ముగ్గురూ అవన్నీ చూస్తు భయపడుతునే ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఒక చోట ఒక గది తలుపులు తెరిచి ఉన్నాయి. ఆ గదిలో అమ్మాయి ఉందేమో చూడాలని ముగ్గురూ గదిలో అడుగుపెట్టి అక్కడున్న దృశ్యం చూసి భయభ్రాంతులై అక్కడే ఆగిపోయారు.
ఎంతో పొడవైన విశాలమైన ఆ గదిలో ఒక భయంకరమైన సింహాసనం లాంటిది ఉంది. దానికి ఇరువైపులా కోరలు ..ముందుభాగంలో డ్రాక్యులా బొమ్మ చెక్కబడి ఉన్నాయి. ఆ సింహాసనంపై ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. నల్లటి దుస్తులు ధరించిన ఆ వ్యక్తి చీకటికి ప్రతిరూపంలా ఉన్నాడు. నోటినుండి ఇరువైపులా పొడుచుకొచ్చిన కోరలతో భయం కొలిపే విధంగా ఉన్న ఆ వ్యక్తి ఈ ముగ్గురు వ్యక్తులను కదలకుండా కనురెప్ప వేయకుండా చూస్తునే ఉన్నాడు. అతని ముందు ఉంచబడిన అతి పెద్ద పాత్ర ఎర్రటి ద్రావకంతో నింపి ఉంది.
అది చూసిన ఆ ముగ్గురు జడుసుకుని భయంతో బయటికి పరిగెడుతూ వచ్చారు. అలా కొంచెం ముందుకు రాగానే ఆ ముగ్గురూ తమ ముందుకు వస్తున్న ఆకారాన్ని చూసి మంత్రముగ్దుల్లా అక్కడే ఆగిపోయారు. ఆ ఆకారం ఎవరో కాదు. తాము వెంటపడి కోటలోకి తరుముకొచ్చిన అమ్మాయి.
అంతే వారు సర్వం మరిచిపోయి ఆ అమ్మాయి వైపు అడుగులు వేశారు. అంతలో ఉన్నట్టుండి ఆ అమ్మాయి వికృతంగా నోటినుండి పొడుచుకొచ్చిన కోరలతో గట్టిగా నవ్వసాగింది. అది చూసిన ఆ ముగ్గురూ స్పృహ తప్పి అక్కడే పడిపోయారు..

“డ్రాక్యులా ఇన్ రియ(రీ)ల్ లైఫ్ ” అనే చిత్రంలోని ఈ సన్నివేశాన్ని వెండితెరపై చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆ అమ్మాయి నవ్వును చూసి జడుసుకుని.. సర్దుకుని మరల సినిమా చూడటంలో లీనమైపోయారు. సినిమాహాలులో ఒక పక్క చివరగా కూర్చుని సినిమాతో పాటు అందరి హావభావాలు గమనిస్తున్న ఒక వ్యక్తి ముఖంలో చిరునవ్వు కదలాడింది. అతని నోటికి ఉన్న కోరలు ఆ మసకవెలుతురులో తళుక్కుమన్నాయి.
అతడు అదే సినిమాలో డ్రాక్యులా వేష పాత్రధారి అయిన నటుడు “హారిసన్ “.
(కోట్లాది మంది ప్రేక్షకులను భయభ్రాంతులను చేసిన డ్రాక్యులా మొట్టమొదటిసారిగా 1931 సంవత్సరంలో వెండితెర మీద ప్రత్యక్షమయ్యాడు. హాలీవుడ్ నటుడైన లుగోసియా తొలిసారిగా ఈ పాత్రను ధరించాడు. ఈ పాత్ర ధరించడం ద్వారా లుగోసియా ఎంత ప్రాచుర్యం సంపాదించాడంటే 1956 సంవత్సరంలో అతను చనిపోయినప్పుడు డ్రాక్యులా మేకప్ తోనే అంత్యక్రియలు నిర్వహించారు.
1946 నుండి క్రిస్టఫర్ లీ డ్రాక్యులా పాత్రలను పోషించడం మొదలుపెట్టాడు.
డ్రాక్యులా ఇతివృత్తంలో ఇప్పటివరకు సుమారు రెండువందలకు పైగా చిత్రాలు వచ్చాయి.)
హారిసన్ కు తాను నటించిన చిత్రాలను ప్రేక్షకుల మధ్య కూర్చుని చూడటమే కాక వారి హావభావాలను గమనిస్తూ ఆనందించడం అతనికి సరదా. అందరూ సినిమా చూడటంలో లీనమై ఉంటే హారిసన్ ను మాత్రం అతని వెనుకే ఉన్న ఇద్దరు వ్యక్తులు హారిసన్ ను గమనిస్తూ అతని కోరలు తళుక్కుమన్నపుడు ఒకరికొకరు సైగలు చేసుకుంటున్నారు. సినిమా ముగిసాక హారిసన్ తన కారులో ఇంటికి బయలుదేరాడు. సినిమాహాలులో హారిసన్ ను గమనించిన ఆ ఇద్దరు వ్యక్తులు హారిసన్ ను వెంబడించసాగారు.
కారును నడుపుతున్న హారిసన్ యథాలాపంగా వ్యూ మిర్రర్ నుండి బయటికి చూశాడు. తన కారును అనుసరించి ఒక నల్లపిల్లి వస్తోంది. తాను సినిమాలలో డ్రాక్యులా వేషాలు ధరించేటపుడు నల్లపిల్లి గురించి చూపడం వాంపైర్ గురించిన సన్నివేశాలలో గబ్బిలాలను చూపడం గుర్తొచ్చి తనలో తానే నవ్వుకున్నాడు. సినిమాలలో చూపినట్టు నిజజీవితంలో కూడా నల్లపిల్లి వెంట రావడం విచిత్రంగా అనిపించింది. కొద్దిదూరం వెళ్లాక వ్యూ మిర్రర్ నుండి మరల బయటికి చూశాడు. ఈ సారి రెండు నల్లపిల్లులు హారిసన్ కారును అనుసరిస్తున్నాయి. వాటిని చూసి తనలో తానే నవ్వుకుంటూ కారును షెడ్ లో పెట్టి ఇంటిలోపలికి నడిచాడు హారిసన్ .
హారిసన్ తో పాటు ఆ రెండు నల్లపిల్లులు ఇంటిలోపలికి ప్రవేశించాయి. అదేమీ తెలియని హారిసన్ ఇంటిలోకి వెళ్లిపోయి తాను పెట్టుకున్న కోరలు తీసిపెట్టి తాగడం మొదలుపెట్టాడు.
(బ్రిటన్ కు చెందిన నెస్ వ్లాడ్ అనే 25 ఏళ్ల కుర్రాడు నిజజీవితంలో డ్రాకులా గా జీవిస్తున్నాడు. రక్తం తాగుతూ శవపేటికలో నివాసం ఉండటం ఇతడి దినచర్య. డ్రాకులా ట్విల్ట్ లాంటి భయంకరచిత్రాలు తనను ప్రభావితం చేసాయని చెప్పుకుంటాడు.)
కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వచ్చిన నల్లపిల్లులు అతని ఎదురుగా వచ్చిఉన్నాయి. అది చూసిన హారిసన్ కు ఏమీ అర్థం కాలేదు. బహూశా ఎక్కువగా తాగినందున తన కారును వెంబడించిన నల్లపిల్లులు అలా కనిపిస్తున్నాయని అనుకున్నాడు. కానీ హారిసన్ కు ఎక్కడ పడితే అక్కడ నల్లపిల్లులు కనిపిస్తున్నాయి. వాటిని చూస్తూనే ఉన్న హారిసన్ కు అవి ఎందుకలా కనిపిస్తున్నాయో అర్థం కావడం లేదు. హఠాత్తుగా పిల్లులు రెండూ హారిసన్ మీదకు దూకాయి. వాటికి కోరలు రాసాగాయి. అది చూసిన హారిసన్ భయంతో బిగుసుకుపోయాడు. పిల్లులు రెండూ మనుషుల ఆకారం సంతరించుకుని కోరలమనుషులై హారిసన్ ముందు నిలిచారు.
ఆ ఇద్దరూ సినిమాహాలు లో హారిసన్ వెనుక ఉన్న వ్యక్తులే..
నల్లపిల్లులను అలా మనుషుల రూపంలో చూసేసరికి హారిసన్ కు స్పృహ తప్పింది.
కొద్దిసేపటి తర్వాత మెలకువ వచ్చిన హారిసన్ కు అక్కడ పిల్లులు కానీ కోరలమనుషులు కానీ ఎవరూ కనిపించలేదు. తన పెట్టుడుకోరల కోసం లోపలికి వెళ్లిన హారిసన్ కు కోరలు తన నోటికే ఉన్నట్టు అనిపించడంతో అద్దంలో చూసుకున్నాడు. తన పెట్టుడుకోరలతో అలాగే ఉన్నాననుకుంటూ తను తాగిన చోటులో కనిపించిన దృశ్యాన్ని నిర్ఘాంతపోయి చూస్తూ నిశ్చేష్టుడయ్యాడు.
అక్కడ తన పెట్టుడుకోరలు ఉండటమే కాక వాటికి రక్తం కారుతూ కనిపించాయి!!
హారర్ స్టోరీస్ నేపథ్యంలో …
ఐర్లాండ్ కు చెందిన బ్రాంస్ట్రాకర్ డ్రాకులా మీద వినిపించే కథలను సేకరించి 1897 లో ఒక నవల రాయడం ద్వారా డ్రాకులా ప్రపంచానికి పరిచయం అయ్యాడు.
1922 లో సినిమా వచ్చిన తర్వాత మరింత ప్రాచుర్యం పొందాడు.
అనేక చలనచిత్రాలలో ఇతర ప్రతికూల పాత్రలు భయానక పాత్రలు ఎన్ని ఉన్నా కానీ డ్రాక్యులా పాత్ర మాత్రమే అత్యంత ప్రాచుర్యం పొందినది.
ఈ పాత్ర పోషించిన నటులు..
మాక్స్ స్క్రెక్ ,బెలా లుగోసియా,క్రిస్టఫర్ లీ,డెన్హాల్మ్ ఎలియట్ ,జాక్ పాలన్స్ ,లూయిస్ జోర్డాన్ ,ఫ్రాంక్ లాంగెల్లా , క్లౌస్ కిన్స్ కీ,గారీ ఓల్డ్ మాన్ ,లెస్లీ నీల్సన్ ,జార్జ్ హామిల్టన్ ,గెరార్డ్ బట్లర్ ,రిచర్డ్ రాక్స్ బర్గ్
రట్గర్ హౌర్ ,స్టీఫెన్ బిల్లింగ్ టన్ ,డొమినిక్ పర్సెల్
వీరందరూ డ్రాక్యులా వేషధారణతో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేశారు!!

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

 హారర్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY