ఆ అమ్మాయి అమన్ చతుర్వేదిని చూడగానే సర్ దయచేసి నన్ను రక్షించండి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రార్థించింది.. ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి డిటెక్టివ్ స్టోరీస్ ” మై ఫ్రెండ్ కేలా ” (25 -11 -2018)

సమయం రాత్రి పదకొండు కావొస్తోంది. దాదాపుగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. వాహనాలు కూడా ఒకటీ అరా మాత్రమే వెళుతున్నాయి. రోడ్డు కిరువైపులా ఉండే దుకాణాలు తోపుడుబండ్లు అన్నీ సర్దేశారు. అక్కడక్కడా మందులషాపులు , వైన్ షాపులు తప్ప ఏమీ కనిపించడం లేదు. వీధిలైట్లు అక్కడక్కడా మినుకుమినుకుమంటున్నాయి.
నిర్మానుష్యమైన ఒక వీధిలో అమన్ చతుర్వేది వేగంగా నడుస్తున్నాడు. ఆ వీధి నుండి ముందుకు కుడివైపు తిరిగి కొంతదూరం నడిస్తే అతని ఇల్లు వస్తుంది. ఇంకో ఐదు నిమిషాలలో ఇంటికి చేరతాను అనుకుంటుండగా..
దూరంగా రక్షించండి రక్షించండి అనే కేకలు వినిపించసాగాయి. ఆ కేకలు విన్న చతుర్వేది నడక వేగం తగ్గించాడు. అంతలో అక్కడికి ఒక అమ్మాయి పరిగెడుతూ వచ్చింది. ఆమెను తరుముకుంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ అమ్మాయి అమన్ చతుర్వేదిని చూడగానే సర్ దయచేసి నన్ను రక్షించండి ఈ గూండాలు వెంటపడి తరుముతున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రార్థించింది. ఆ అమ్మాయి చెప్తుంటే ఆ వ్యక్తులిద్దరూ చతుర్వేదిపైకి దూసుకువచ్చారు. వారిద్దరినీ లాఘవంగా ఎదుర్కొని తరిమికొట్టాడు చతుర్వేది. చతుర్వేది ధాటికి తట్టుకోలేక ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడనుండి పలాయనమయ్యారు.
ఒక పక్క వణుకుతూ నిలబడ్డ ఆ అమ్మాయిని సమీపించిన చతుర్వేది అమ్మా నీకేం భయం లేదు. వారు వెళ్లిపోయారు అన్నాడు. కృతజ్ఞతలు తెలుపుకున్న ఆ అమ్మాయి తన పేరు అదితి అని స్కూల్లో టీచరుగా పని చేస్తున్నానని చెప్పింది.
ఈ సమయంలో ఇక్కడ….
అని అర్దోక్తిలో ఆగిపోయిన చతుర్వేది మాటలకు తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని అందుకే ఆ సమయంలో మందుల కోసం రాగా ఆ గూండాలు తన వెంట పడ్డారని తెలుపుతూ.. మీరు ఆ గూండాలను కొట్టిన దెబ్బలు కరాటే కిక్స్ లాగా ఉన్నాయి. మీరేం చేస్తుంటారు అని అడిగింది. అందుకు చతుర్వేది తన పేరు అమన్ చతుర్వేది అని ఒక పత్రికాఫీసులో జర్నలిస్టుగా పని చేస్తున్నానని ఆమె చేతిలో ఉన్న మందుల వంక చూస్తూ చెప్పాడు.
ఆ తర్వాత అదితి చతుర్వేది గారు నన్ను ఇంటి దగ్గర దిగబెట్టగలరా ఆ గూండాలు మరీ వస్తారేమో అని భయంగా ఉందని అడిగింది.
ఆ మాటలకు చతుర్వేది సరే అంటూ ముందుకు నడవసాగాడు. ఎన్నో వీధుల తర్వాత ఉన్న మెయిన్ రోడ్ నుండి ఎడమవైపు ఉన్న వీధిలో ఉన్న మూడో ఇంటికి తీసుకెళ్లింది. తాళం తీసి చతుర్వేదిని లోపలికి ఆహ్వానించింది. అక్కడ ఉన్న సోఫాలో కూర్చోమని చెప్పి టీ తీసుకొస్తానంటూ లోపలికి వెళ్లిపోయింది. ఇంకో గది నుండి ఖళ్ ఖళ్ అంటూ దగ్గుతున్న శబ్దం . బహూశా అదితి వాళ్ల నాన్నగారు అయ్యుంటారు. అనుకుంటూ చతుర్వేది ఆ ఇంటిని పరిశీలించసాగాడు.
అంతలో టీ తీసుకువచ్చిన అదితికి థ్యాంక్స్ చెప్తూ టీ తాగేసి ఇక బయలుదేరతానంటూ రెండడుగులు వేయగానే ముందుకు తూలి స్పృహ తప్పి పడిపోయాడు. అది చూసిన అదితి క్రూరంగా నవ్వుకుంటూ చతుర్వేదిని లోపలికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది.

* * *
అది చతుర్వేది ఇల్లు. దిగాలుగా ఉన్న అమన్ చతుర్వేది భార్య మీనాచతుర్వేది పాప ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చింది. అమన్ చతుర్వేది అప్పటికి ఇల్లు చేరక రెండురోజులు గడిచిపోయాయి. అప్పటివరకు అమన్ ఇంటికి రాకపోవడం అంటూ ఎప్పుడూ జరగలేదు. ఒకవేళ రాకపోయినా తనకు తప్పకుండా సమాచారం ఇచ్చేవాడు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్న మీనాచతుర్వేదికి హఠాత్తుగా ఒక విషయం స్ఫురించింది. తన భర్త చేసే ఉద్యోగం తనకు స్పష్టంగా తెలియకపోయినా దేశానికి సంబంధించిన సంస్థలో పని చేస్తాడని తనకు తెలుసు. ఒకసారి తనకు తన భర్త ఒక అడ్రస్ రాసిచ్చాడు. అది ఎప్పుడైనా తాను ఎటువంటి సమాచారం లేకుండా రెండు లేదా మూడు రోజుల వరకు ఇంటికి రాకపోతే ఆ అడ్రస్ కి వెళ్లి తన గురించి చెప్పమని చెప్పాడు. ఆ విషయం గుర్తొచ్చిన ఆ అడ్రస్ కోసం వెతకసాగింది

అడ్రస్ తీసుకుని తన ఆరునెలల పాపను ఎత్తుకుని మీనాచతుర్వేది బయలుదేరింది. ఆ అడ్రస్ లో ఉన్న ఒక ప్రదేశానికి చేరుకుంది. అది ఒక ఆఫీసులాగా ఉంది. అక్కడున్న ఒక వ్యక్తికి తన చేతిలో ఉన్న అడ్రస్ కాగితం చూపించగానే ఆ వ్యక్తి ఉలికిపాటుతో సర్దుకుని వెంటనే మీనాచతుర్వేదితో మీ భర్త తప్పకుండా తిరిగివస్తాడు. కానీ వచ్చేవరకు మీరు ఇక్కడే ఉండటం మీకు మీ బిడ్డకు క్షేమం అని చెప్పగానే మీనా చతుర్వేది ఆందోళనకు లోనైంది. అది చూసిన ఆ వ్యక్తి మీరు కంగారు పడవలసినది ఏమీ లేదని ధైర్యం చెప్తూ మీనా చతుర్వేదిని అక్కడే ఉండమని బయటకు వెళ్లిపోయాడు.

* * *

అది ఒక చిన్న గది ఆ గదిలో ఒక రహస్య సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో “రా” చీఫ్ శుక్లా తో పాటు ఇంకో నలుగురు ఉన్నారు. వారందరూ కలిసి అమన్ చతుర్వేది కిడ్నాప్ జరిగి ఉంటుందని అనుకున్నారు. అమన్ చతుర్వేది కనిపించటం లేదని బయటకు తెలిస్తే అమన్ ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చు. అలా అని పోలీస్ కంప్లయింట్ ఇచ్చే పరిస్థితి లేదు. అలా ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాత చివరకు వారందరికీ అక్కడే ఉన్న రాజీవ్ చేసిన సూచన బాగా నచ్చింది. అదేమిటంటే ఒక ప్రైవేటు డిటెక్టివ్ కు కేసును అప్పగించడం. అలా డిటెక్టివ్ ను కలవడం కూడా అందరూ కలిసి రాజీవ్ కే అప్పచెప్పారు.
రాజీవ్ ఒక ఆఫీస్ గదిలో కూర్చుని ఎవరికోసమో ఎదురుచూస్తున్నాడు. మాటిమాటికీ టైం చూసుకుంటున్నాడు. పది నిమిషాలలో కలుస్తానన్న ఆ వ్యక్తి సరిగ్గా పదోనిమిషంలో ఆ రూంలోకి వచ్చాడు. అతడే డిటెక్టివ్ సిద్దార్థ.
డిటెక్టివ్ సిద్దార్థ ను చూడగానే రాజీవ్ కు సిద్దార్థ తప్పకుండా అమన్ ను తీసుకురాగలడని మనసులో బలంగా అనిపించసాగింది. సిద్దార్థ రాజీవ్ ను చూస్తూ మీరేం పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా అని అడిగిన ప్రశ్నకు రాజీవ్ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.
రాజీవ్ చెప్పినదంతా శ్రద్దగా విన్న సిద్దార్థ తాను తప్పకుండా అమన్ ను తీసుకురాగలనని చెప్పాడు. అమన్ వచ్చాకే ఫీజు తీసుకుంటానని కానీ తనకు కొన్ని డీటైల్స్ కావాలని.. రాజీవ్ చెప్పిన విషయాలన్నీ మైండ్ లో నోట్ చేసుకున్నాడు డిటెక్టివ్ సిద్దార్థ.

* * *
కుర్చీ లో కట్టేసి ఉన్న అమన్ చతుర్వేదికి ఒక్కసారిగా మెలకువ వచ్చి రెండురోజుల క్రితం జరిగింది గుర్తొచ్చింది. అదితి అనే అమ్మాయిని తాను రక్షించడం వారింటికి వచ్చి టీ తాగి తను స్పృహ తప్పి పడిపోవడం మెలకువ వచ్చాక ఇద్దరు వ్యక్తులు తనను “రా” యొక్క రహస్యకార్యాలయం ఎక్కడుందో చెప్పమని హింసించడమే కాక తీవ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలోక్ వర్మను ఎక్కడ దాచి ఉంచావని తనను తీవ్రంగా హింసించడం గుర్తొచ్చి బాధగా కళ్లు మూసుకున్నాడు అమన్ . విచిత్రమేమిటంటే అదితి తో కలిసి తనను హింసించిన ఆ ఇద్దరువ్యక్తులు ఆ రోజు రాత్రి అదితిని వెంటాడుతూ తన చేతిలో దెబ్బలు తినినవారే. అంటే ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగిందని అమన్ కు అర్థమైంది. అంతలో ఆ గది తలుపు చప్పుడైంది. లోపలికి అదితి ఆ ఇద్దరు వ్యక్తులతో లోపలికి వచ్చింది.
అమన్ ను చూస్తూ .. మా లిస్టులో ఉన్న అలోక్ వర్మను దాచిపెట్టి మా పనులకు అడ్డం తగిలావు. అలోక్ వర్మ మాకు సంబంధించిన వ్యక్తికి మరణశిక్ష విధించి మమ్మల్ని నామరూపాల్లేకుండా చేయాలని చూశాడు. అందుకే అలోక్ వర్మ మా లిస్టులో ఉన్నాడు. నీకు ఇప్పటికే రెండురోజులు గడువిచ్చాం. ఇప్పటికైనా అలోక్ వర్మ ఎక్కడున్నాడో చెప్పు అనవసరంగా ప్రాణం పోగొట్టుకోకు అన్నది. ఆ మాటలు వింటూ నిర్వికారంగా చూస్తూ మౌనంగా ఒక్కమాట కూడా మాట్లాడకుండా అలా చూస్తుండిపోయాడు అమన్ . అది చూసిన ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి అదితీ ఇక లాభం లేదు ఆ పిస్తోలు ఇలా ఇవ్వు అన్నాడు. వారిలో ఇంకొకడు వీడి భార్య బిడ్డ ఇద్దరూ తప్పించుకున్నారు లేకుంటే వారిని బంధిస్తే వీడు నోరు విప్పేవాడు అన్నాడు. వాడి మాటలు విన్న అమన్ కు మనసులో పట్టరాని సంతోషం కలిగింది. కానీ తన భావాలను ముఖంలో ప్రతిఫలించకుండా జాగ్రత్తపడ్డాడు.
అంతలో పిస్తోలు తో వచ్చిన అదితి ట్రిగ్గర్ ను అమన్ కు గురి పెట్టి ఇది నీకు ఆఖరినిముషం అంటూ ట్రిగ్గర్ నొక్కబోయేంతలో..
బైట ఎవరో తలుపు కొట్టిన చప్పుడు .. అది విని ఆ ఇద్దరు వ్యక్తులు కర్టెన్ చాటున దాక్కున్నారు. అదితి బైటకు వెళ్లి సెక్యూరిటీ హోల్ నుండి బయటకు చూసింది. అక్కడ టెలిఫోన్ ఆఫీస్ నుండి వచ్చిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఊపిరి పీల్చుకున్న అదితి తలుపు తెరిచింది.
ఫోన్ పని చేయడం లేదని మాకు కంప్లయింట్ వచ్చిందంటూ లోపలికి వచ్చాడు ఆ వ్యక్తి. అక్కడున్న ఫోన్ దగ్గరికి వెళ్లాడు. అతడిని నిశితంగా పరిశీలిస్తోంది అదితి.
అంతలో అక్కడికి వచ్చిన కమెండోలు మెరుపువేగంతో అదితిని ఆ ఇద్దరు వ్యక్తులను పట్టి బంధించారు. టెలిఫోన్ ఉద్యోగి వేషంలో ఉన్న డిటెక్టివ్ సిద్దార్థ అమన్ కట్లు విప్పేసి మెల్లిగా నడిపించుకుంటూ బయటకు తీసుకెళ్లాడు.
***
ఆ గదిలో “రా” చీఫ్ శుక్లా తో పాటు రాజీవ్ ఇంకా మిగిలిన గూఢాచారులు మాత్రమే కాక అమన్ చతుర్వేది మీనా చతుర్వేది అందరూ ఉన్నారు. వారందరినీ చూస్తూ డిటెక్టివ్ సిద్దార్థ అమన్ ను ఎలా రక్షించాడో చెప్పడం మొదలుపెట్టాడు.

అమన్ కనిపించడం లేదు అన్న వార్త తప్ప అమన్ ఎక్కడికి వెళ్లాడో లేదా ఎవరైనా కిడ్నాప్ చేసారో అనే దానికి ఆధారం లేదు కాబట్టి నాకు ఏం చేయాలో తొలుత అర్థం కాలేదు. కానీ అమన్ ప్రాణాలకు ముప్పు ఉందేమో అని నాకు అనిపించింది. అందుకే వాళ్లింట్లో ఏవైనా ఆధారాలు లభించవచ్చు అని అనుకున్నాక
రాజీవ్ నాకు పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న అమన్ ఇంటి తాళాలు ఇచ్చి వెళ్లిన వెంటనే నేను అమన్ ఇంటికి వెళ్లాను.
ఇల్లంతా సునిశితంగా నిశితంగా పరిశీలించాను. ఫోన్ కూడా వారింట్లో పని చేయడం లేదు. అనుమానాస్పదంగా ఏదీ కూడా నాకు కనిపించలేదు. ఇక్కడేమీ ఆధారం లభించేటట్టు లేదనుకుంటూ అమన్ పని చేసే పత్రికాఫీసుకు వెళ్లి అక్కడ విచారించాలనుకుని బయటకు వచ్చే సమయంలో..
కాలికి ఏదో తగిలింది. చూస్తే అదొక బొమ్మ. అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. అమన్ కు ఒక చిన్న పాప ఉందని. ఆ పాప కోసం ఆ బొమ్మ తెచ్చి ఉంటారనుకుంటూ ఆ బొమ్మను చేతిలోకి తీసుకున్నాను. ఆ బొమ్మ చాలా బాగుంది. పిల్లలకోసం అంత అందమైన బొమ్మలను తయారుచేసిన వారిని మనసులోనే మెచ్చుకుంటూ బొమ్మను అటూ ఇటూ తిప్పి చూశాను. చిత్రంగా తాకిన వెంటనే ఆ బొమ్మ కనురెప్పలు ఆర్పడం మొదలుపెట్టింది. ఆ కనురెప్పలు ఆర్పడం అలా చూస్తుంటే నాకు ఏదో అనుమానం కలుగుతోంది. అదేమిటో తట్టడం లేదు. కానీ ఏదో ఉందనిపించింది. నిదానంగా బొమ్మను నిశితంగా పరిశీలించి చూశాను. ఆ బొమ్మకు అతి సన్నని వైరు చుట్టబడి ఉంది. ఆ వైరును విప్పదీస్తుంటే బొమ్మ లోని భాగాలు బైట పడ్డాయి. అందులో అత్యాధునికమైన
“బ్లూటూత్ ” పరికరం అమర్చబడి ఉంది. అది చాలా శక్తివంతమైనది. అంటే అమన్ వాళ్లింట్లో మాట్లాడే విషయాలన్నీ బొమ్మలో ఉన్న బ్లూటూత్ ద్వారా అవతలివారికి చేరిపోయేవని అర్థమైంది. ఆ బ్లూటూత్ మీద అతిసన్నని కనీకనిపించని విధంగా మేడ్ ఇన్ జర్మనీ అని రాసుంది. అది “మై ఫ్రెండ్ కేలా” అనే బొమ్మ అని అర్థమైంది. వెంటనే ఇంటర్ నెట్ ద్వారా ఆ బొమ్మకు సంబంధించిన వెబ్ సైట్ లో యాక్సెస్ అవడం ద్వారా ఆ ముఠా వాళ్లు ఎక్కడున్నారో కనుకుని అమన్ ను కూడా అక్కడే బంధించి ఉంటారని ఊహించాను. వెంటనే టెలిఫోన్ ఆపరేటర్ గా వేషం మార్చుకుని కమెండోలను వెంటబెట్టుకుని అక్కడికి చేరుకున్నాను. నేను అనుకున్నట్టే అక్కడే అమన్ బంధించబడి ఉన్నాడని చెప్తూ ముగించాడు డిటెక్టివ్ సిద్దార్థ. ఆ మరుక్షణమే ఆ గదిలో కరతాళధ్వనులు మారుమ్రోగాయి!!
***
( వచ్చేవారం మరో డిటెక్టివ్ కథ )

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ డిటెక్టివ్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY