అక్కడ పనిచేసే సెక్రటరీలు వరుసగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంతకు ఇవి హత్యలా ? ఆత్మ హత్యలా?…శ్రీసుధామయి అపరాధ పరిశోధన కథ …( ఆత్మ ) హత్యలు (20-01-2019)

ఆటో దిగి సూర్య ఇండస్ట్రీస్ లోకి అడుగుపెట్టింది రచన.తన భవిష్యత్తును పరీక్షించుకోబోతుంది.ఇక్కడ తనకు దొరికే ఉద్యోగం తన జీవితాన్ని చిదిమేస్తుందని తెలియని రచన తన అదృష్టాన్ని పరిశీలించుకోవడానికి ముందుకు నడిచింది.తను నడుస్తున్నది మృత్యువు వైపు అని తెలియక.
అక్కడ పనిచేసే సెక్రటరీలు వరుసగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంతకు ఇవి హత్యలా ? ఆత్మ హత్యలా?
***
సూర్య ఇండస్ట్రీస్ ఛైర్మన్ అయిన శ్యాంసుందర్ సాహూ కారు అతని ఆఫీసు ముందు వచ్చి ఆగింది. అందులో నుండి మొదటగా డ్రైవర్ దిగి పరుగుపరుగున వచ్చి కారు డోరు తెరిచాడు. అందులో నుండి దిగిన అయిన శ్యాంసుందర్ ఠీవిగా కారు దిగి లోపలికి వెళ్లి అందరూ విష్ చేస్తుండగా తన ఛేంబర్ లోకి వెళ్లిపోయాడు. సూర్య ఇండస్ట్రీస్ నగరంలో పేరు మోసిన సంస్థ. ఆ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్యాంసుందర్ అతి తక్కువ కాలంలోనే సూర్య ఇండస్ట్రీస్ ను లాభాలబాటలో నడిపిస్తున్నాడు. అందులో పని చేసే ఉద్యోగులందరికీ శ్యాంసుందర్ సాహూ దేవుడితో సమానం.
తన ఛేంబర్ లో ఫైల్ చూస్తున్న శ్యాంసుందర్ ఏదో గుర్తొచ్చిన వాడిలా మేనేజర్ ను పిలిచాడు. లోపలికి వచ్చిన మేనేజర్ సర్ మీరు చెప్పినట్టే మీకు సెక్రటరీ కావాలని పేపర్లలో ప్రకటన ఇచ్చాను. వచ్చిన వారికి ఇంటర్వూ చేయడం మిగిలింది అని అన్నాడు. ఇప్పటికే ఇంటర్వూ కు వచ్చినవారు వేచి ఉన్నారన్న మేనేజర్ మాటలకు సంతృప్తిగా తలాడించిన శ్యాంసుందర్ సెక్రటరీ వస్తే తనకు పనిలో వెసులుబాటు ఉంటుందని అనుకున్నాడు.
వచ్చిన వారందరినీ ఇంటర్వూ లో పరిశీలించడం మొదలు పెట్టాడు శ్యాంసుందర్ . ఇంటర్వూ నుండి అందరూ వెళ్లిపోగా రచన ను ఎంపిక చేశాడు శ్యాంసుందర్
అనతికాలంలోనే రచన శ్యాంసుందర్ ఆఫీస్ లో సెక్రటరీగా తన కర్తవ్యాలను నిర్వర్తించడం మొదలుపెట్టింది.
ఆ వేళ శ్యాంసుందర్ ఢిల్లీలో జరిగే మీటింగ్ కోసం ఇంటి నుండి బయలుదేరాడు. శ్యాంసుందర్ తో పాటు సెక్రటరీ రచన కూడా బయలుదేరింది. తన భర్తకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన శ్యాంసుందర్ భార్య రాధిక రచనను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.
ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన శ్యాంసుందర్ తిరిగి తన ఆఫీసు పనులలో మునిగిపోయాడు. ఆ వేళ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయనుకుంటూ రచన కోసం ఎదురు చూడసాగాడు. కానీ ఆ వేళ రచన ఆఫీస్ కు రాలేదు. చాలాసేపటి తర్వాత పోలీసులు సూర్య ఇండస్ట్రీస్ లో అడుగుపెట్టారు. సరాసరి శ్యాంసుందర్ ఛేంబర్ లోకి ప్రవేశించారు. వారిని చూసిన అతను ఖంగుతిన్నాడు. అది చూసిన పోలీసులు అతడి సెక్రటరీ అయిన రచన ఆత్మహత్య చేసుకుందని కొన్ని విషయాలను విచారించడానికి వచ్చామని చెప్పి తమ పని పూర్తి గావించుకుని వెళ్లిపోయారు.
రచన ఆత్మహత్య శ్యాంసుందర్ ను ఎంతగానో కలచివేసింది. ఆఫీసులో అందరూ ఎంతగానో విచారించారు.
తర్వాత శ్యాంసుందర్ మరో సెక్రటరీ కోసం పేపరు ప్రకటన ఇచ్చాడు.
***
మరో సెక్రటరీ గా రశ్మిక సూర్య ఇండస్ట్రీస్ లో జాయినైంది. కొద్ది రోజుల తర్వాత రశ్మిక ఆత్మహత్య చేసుకుందని తెలిసిన శ్యాంసుందర్ ఆశ్చర్యపోయాడు. పోలీసులు వచ్చి అతడిని విచారించి అనుమానంతో అదుపులోనికి తీసుకున్నారు. శ్యాంసుందర్ పోలీసుల కస్టడీలోకి వెళ్లడంతో సూర్య ఇండస్ట్రీస్ కార్యకలాపాల మీద లావాదేవీల మీద ప్రభావం పడి ప్రాభవం తగ్గడం మొదలైంది.
అతికష్టం మీద ఆ కేసులో నుంచి బయటపడ్డ శ్యాంసుందర్ ఈ సారి అన్ని జాగ్రత్తలతో తనకు బాగా తెలిసిన కుటుంబం నుండి వచ్చిన రేణు ను సెక్రటరీగా చేర్చుకున్నాడు శ్యాంసుందర్ . అంతే కాక ముందు జరిగిన సంఘటనలన్నింటినీ గుర్తుంచుకుని రేణుతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు శ్యాంసుందర్ ఏదైనా మీటింగ్ లకు వెళ్లాల్సి వస్తే తానొక్కడే వెళ్లి వస్తున్నాడు.
అతను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దురదృష్టం మరోసారి శ్యాంసుందర్ ని పలకరించింది.
రేణు కూడా చనిపోయిందన్న వార్త శ్యాంసుందర్ ను వణికించింది. అతనా పరిస్థితిలో ఉండగానే అతడిని పోలీసులు అరెస్టు చేసారు. సూర్య ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్యాంప్రసాద్ సాహూ అరెస్టు కలకలం రేపింది.
వ్యాపార ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది.
***
సూర్య ఇండస్ట్రీస్ కంపెనీ ని మాత్రమే కాక శ్యాంసుందర్ ఛేంబర్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసారు సిసి పుటేజీని ఎక్కడా వదలకుండా అంతా పరిశీలించారు. ఎక్కడా చిన్న ఆధారం కానీ మరే విధమైన అనుమానాస్పద విషయం కానీ పోలీసులకు అగుపించలేదు. సూర్య ఇండస్ట్రీస్ ఉద్యోగులందరూ తమ యజమాని శ్యాంసుందర్ సాహూ మంచివాడని తమ కుటుంబాలను పోషిస్తున్న దేవుడని వివరించారు.
మంచివాడైన శ్యాంసుందర్ వద్ద పని చేసిన సెక్రటరీలు మాత్రమే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆ సెక్రటరీల కుటుంబసభ్యులను విచారించినా ఫలితం లేకపోయింది.
ఏ ఆధారాలు లేకపోవడంతో శ్యాంసుందర్ విడుదల అయ్యి తిరిగి తన కంపెనీ పనులు యథావిధిగా చూసుకోసాగాడు. అతని వద్ద సెక్రటరీగా చేరడానికి ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. పేపరు ప్రకటన ఇచ్చినా సెక్రటరీ పోస్టుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
***
శ్యాంసుందర్ తొలి సెక్రటరీ అయిన రచన సోదరుడు రజిత్ తన సోదరి మరణంతో బాగా కుంగిపోయాడు. శ్యాంసుందర్ కంపెనీలో పని చేసిన మిగిలిన సెక్రటరీ ల మరణాలు యాదృచ్చికంగా జరిగినవి కావని అతడికి బలంగా అనిపించసాగింది. వెంటనే అతడు ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు.

* * *
శ్యాంసుందర్ ఆ వేళ తన ఛేంబర్ లో ఫైళ్లను పరిశీలిస్తూ ఉన్నాడు. అంతలో ” మే ఐ కమిన్ ” అన్న వాయిస్ వినిపించింది. కమిన్ అంటూ వచ్చిన ఆ వ్యక్తిని చూసాడు శ్యాంసుందర్
వచ్చిన ఆ యువతి తన పేరు రేఖ అనీ సెక్రటరీ ఉద్యోగం కోసం వచ్చానని చెప్పగానే ఉలిక్కిపడ్డాడు శ్యాంసుందర్ . ఏదో చెప్పబోతున్న శ్యాంసుందర్ ను చూసిన రేఖ ఇక్కడ పని చేసిన సెక్రటరీలు అందరూ ప్రాణాలతో లేరని నాకు తెలిసే వచ్చానని చెప్పింది రేఖ. మరి అన్నీ తెలిసి రావడం అని ఇంకేదో అనబోతున్న శ్యాంసుందర్ కు తన దగ్గరున్న ఏదో కార్డు చూపింది రేఖ.
ఆ కార్డును చూడగానే శ్యాంసుందర్ కలవరపాటు మాయమైపోయింది. చిరునవ్వు నవ్వుతూ తానే స్వయంగా అప్పాయింట్మంట్ ఆర్డర్ తయారుచేసి రేఖ చేతికిచ్చాడు శ్యాంసుందర్
ఆ క్షణం నుండి రేఖ శ్యాంసుందర్ సెక్రటరీగా చేరిపోయింది
***
రేఖ సెక్రటరీగా చేరినప్పటి నుండి శ్యాంసుందర్ కు భయం వెంటాడుతునే ఉంది. తన దగ్గర పని చేసే సెక్రటరీలందరూ ప్రాణాలు పోగొట్టుకోవడంతో కలిగిన భయం అది. ఇప్పుడు ప్రస్తుత సెక్రటరీ రేఖ కు ఏదైనా జరిగితే తన కంపెనీకి ఉన్న ప్రాభవం మొత్తంగా పడిపోతుందని అనుక్షణం కలత చెందుతూనే ఉన్నాడు శ్యాంసుందర్ .
ఆ రోజు సూర్య ఇండస్ట్రీస్ రిసెప్షన్ లో ఉన్న ఫోన్ గణగణ మోగడం మొదలుపెట్టింది. అక్కడే ఉన్న రిసెప్షనిస్టు ఆ ఫోన్ లో మాట్లాడి సరేనంటూ శ్యాంసుందర్ ఛేంబర్ లోకి వెళ్లింది. ఆ వేళ రేఖ ఆఫీసుకు రానని ఫోన్ చేసిందని చెప్పగానే ఉలికిపాటుగా విన్న శ్యాంసుందర్ వెంటనే సర్దుకున్నాడు. అది చూసిన రిసెప్షనిస్టు రేఖ ఆఫీస్ కు రాకపోతే అంత కలవరపాటు ఎందుకో అనుకుంటూ బయటకు వచ్చింది.
ఆఫీసుకు ఫోన్ చేసిన రేఖ ఒక ఆవిడ తో కలిసి బయటకు బయలుదేరింది. పక్కనున్న ఆవిడ రేఖతో ఇలా అంది.
ఇక్కడికి కొద్ది దూరంలో ఒక హోటల్ ఉంది లంచ్ కు అక్కడికి వెళదాం అందులో రుచికరమైన భోజనం మాత్రమే కాక పరిశుభ్రంగా ఉంటుంది హోటల్ అక్కడికి వెళదామని చెప్పిన ఆవిడ మాటలకు సరేనంటూ తలూపింది రేఖ. ఇద్దరూ కలిసి అక్కడికి బయలుదేరారు.
ఆ ఇద్దరినీ రెండు కళ్లు నీడలా వెంటాడుతున్నాయని తెలియని ఆవిడ రేఖ తో కలిసి ఆ హోటల్ లో అడుగు పెట్టింది.
రేఖ పక్కనున్న ఆవిడను చూడగానే అక్కడున్న వారు కనులతో సైగ చేసుకున్నారు. అది గమనించిన రేఖ కంగారుపడి వెంటనే మామూలుగా అయిపోయింది.
తనను లంచ్ కు తీసుకొచ్చిన ఆవిడ ఆ వేళ తనకు హెల్త్ బాగాలేదని తానేమి తినలేనని నీవు మాత్రమే లంచ్ చేయమని రేఖతో చెప్పింది.
ఆ సమయంలో ఆ హోటల్ లో పనిచేసేవారు తప్ప మరెవరూ లేరు. వారు రేఖకు మాత్రమే వడ్డించారు. నెమ్మదిగా తింటున్న రేఖను చూసిన ఆవిడ నువ్వు తింటూ ఉండు ఇప్పుడే వస్తానంటూ లేచి బయటికెళ్లింది. ఆవిడ తిరిగి వచ్చేలోపు తినడం పూర్తి చేసిన రేఖ వెంటనే నోటిలో నురగలు కక్కుతూ పడిపోయింది. అది చూసిన ఆవిడ వికటంగా నవ్వుతూ అక్కడే ఉన్న మరో ఇద్దరి సాయంతో రేఖను కారు వద్దకు తీసుకెళ్లసాగింది.
కారు డోరు తెరవబోతుండగా…
వెనకనుండి చల్లగా రివాల్వర్ ఆవిడకు తగిలింది. “హ్యాండ్సప్ మిసెస్ శ్యాంసుందర్ సాహూ ” అనే మాటలు వినిపించాయి.
వెనుకకు తిరిగి చూసిన ఆవిడకు తన భర్త శ్యాంసుందర్ తో సహా మరొక వ్యక్తి రివాల్వర్ తో నిలబడి ఉన్నాడు.
వారిని చూసిన ఆవిడ ( రాధిక) ముచ్చెమటలు పోసాయి. అంతలో రేఖ నవ్వుతూ లేచి నిలబడింది.
ముగ్గురు అమాయకులైన అమ్మాయిలను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఈ రాధికను అరెస్టు చేయండి అని రివాల్వర్ పట్టుకున్న డిటెక్టివ్ సిద్దార్థ ఆదేశించగానే లేడీకమాండోలు మిసెస్ శ్యాంసుందర్ ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.
ఇదంతా ఏమిటి సర్ అని శ్యాంసుందర్ డిటెక్టివ్ సిద్దార్థను ప్రశ్నించగా సిద్దార్థ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు
” మీ దగ్గర చేరిన సెక్రటరీ లను కేవలం అనుమానంతో మీ భార్య రాధిక వరుసగా హత్యలు చేసింది. మీరు మీ సెక్రటరీ లను మీటింగ్ లకు తీసుకెళ్లడం మీ భార్యలో అనుమానాన్ని ఇంకా పెంచింది. అందుకే అందరినీ ఈ హోటల్ కు తీసుకొచ్చి ఇక్కడున్న తన మనుషుల సాయంతో వారిని హత్యలు చేయడమే కాక అవన్నీ ఆత్మహత్యలుగా చిత్రీకరించింది. మీ మొదటి సెక్రటరీ అయిన రచన మరణాన్ని భరించలేని ఆమె సోదరుడు రజిత్ నన్ను కలిసి తన సోదరి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఏదో జరుగుతోందని తన అనుమానాన్ని వివరించి ఈ కేసును పరిశీలించమని కోరాడు. అందుకే మా కమాండోలలో ఒకరైన రేఖను మీ దగ్గరికి సెక్రటరీగా పంపించాను. అది తెలుసుకున్న మీ భార్య రేఖ ను కూడా చంపాలని ప్లాన్ చేసి లంచ్ కు పిలిచింది. రేఖను అనుక్షణం వెన్నాడుతున్న నేను కూడా ఈ హోటల్ దరిదాపులకు వచ్చాను. రేఖకు భోజనం వడ్డించిన రాధిక మనుషులు అందులో విషం కలిపారు. రేఖ తింటుండగా చనిపోతుందని ఊహించిన రాధిక రేఖ శవాన్ని తీసుకుపోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టింది. అది ముందే గ్రహించిన రేఖ తినకుండా తిన్నట్టు నాటకమాడి స్పృహ తప్పినట్టు నటించింది. అది చూసిన రాధిక అదంతా నిజమేననుకుంటూ ఆత్మహత్యగా చిత్రీకరించడానికి కారులో తీసుకుపోవాలని రేఖను మోసుకొచ్చారు. అంతలోపే మనం ఇక్కడికి చేరుకున్నాం.” అంటూ ముగించాడు.
అంతా విన్న శ్యాంసుందర్ అనుమానం పెనుభూతం లా మారి ముగ్గురి అమాయకులైన అమ్మాయిలను మింగేసింది అనుకుంటూ విచారంతో ముందుకు నడిచాడు!!
***

( వచ్చేవారం అపరాధ పరిశోధన కథ)

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

డిటెక్టివ్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY