నాన్నతోపాటు చేతిసంచీతో నాన్న చేతిని పట్టుకుని వెళ్లిన జ్ఞాపకం…

(టి.రాణి,హైద్రాబాద్)
వర్షాకాలంలో సీతాఫలం ఒక మర్చిపోలేని జ్ఞాపకం…చిన్నప్పుడు నాన్నతోపాటు చేతిసంచీతో నాన్న చేతిని పట్టుకుని వెళ్లిన జ్ఞాపకం.బుట్టెడు సీతాఫలాలు అయిదు రూపాయలకే…పెద్దపెద్ద గుడ్లు…చూడగానే నోరూరకపోతే ఒట్టు.
నాన్న సీతాఫలం చేతి సంచీ ఓ చేత్తో పట్టుకుని,నన్ను మరో చేత్తో పట్టుకుని ఇంటికి తీసుకువెళ్తుంటే మధ్యలోనే ఓ సీతాఫలం నొక్కేసి తినాలనిపించేది.నాన్నకు తెలియకుండా మెల్లిగా ఓ సీతాఫలాన్ని నా గౌనులో దాచుకునేదాన్ని.
అందరికీ సమానంగా పంచే అమ్మ ఎవరూ చూడకుండా “నేను చిన్నపిల్లనని” ఓ పండు ఎక్కువిస్తే,అదే ఫీలింగ్ తో నాన్నొక్కటి…అక్కలు ఒక్కోటి..నావంతుకు బోల్డు.ఒకో గుడ్డు(వాటిని కన్నుఅని పిలుచుకునేవాళ్ళం)తీసుకుంటూ గోటితో గుజ్జును తీసుకుని జుర్రుకుంటుంటే…ఏ పిజ్జాలు బర్గర్లు పోటీకి వస్తాయి..?
స్వర్గం కళ్ళ ముందు కనిపించేది.నాన్నకైతే బోల్డు ఇష్టం…
ఎంతిష్టమంటే “ఒరే చిట్టీ….నాలో పండు అప్పివ్వరా…నీ కడుపున పుట్టి ఋణం తీర్చుకుంటా..”అని అమ్మకు తెలియకుండా నా పండు ఒక్కటి తీసేసుకునేంత ఇష్టం…
నాన్న పోయాక సీతాఫలం మీదే ఇష్టం పోయింది.
కానీ నాన్న పదేపదే గుర్తొచ్చి ఇలా సీతాఫలాన్ని నాన్న ఫోటో ముందు పెట్టి తింటుంటే నాన్నే ఎదురుగా ఉన్నంటుంది.
నాన్న నాకు దేవుడిచ్చిన వరం….నాన్న దూరమవ్వడం శాపం…
ఆ దూరాన్ని మర్చిపోయేలా చేసే జ్ఞాపకం అంటే నాకు ఇష్టం.
అన్నట్టు…
సీతాఫలాలు నులిపురుగులను బయటకు నెట్టివేస్తాయి. జ్వరం తగ్గించే గుణం ఉంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రక్త విరేచనాల నుంచి విముక్తికి ఉపకరిస్తాయి. బి కాంప్లెక్స్‌, విటమిన్‌ సీ, ఖనిజ, లవణాలు లభిస్తాయి.
ఇన్ని గుణాలున్న సీతాఫలాన్ని ఈ సీజన్లో మిస్ చేసుకోకండి.

NO COMMENTS

LEAVE A REPLY