అక్షర తపస్వి .. ” కొమ్మనాపల్లి గణపతిరావు ” స్వర విపంచి..

( విజయార్కె)

అతనొక అక్షర తపస్వి
నిరంతర అన్వేషి
తెలుగు సాహిత్యానికి ..
సొబగులు అద్దిన రుషి
అలతి అలతి పదాలతో అలవోకగా ..
అమ్మాయిల అంతరంగాన్ని
ఆవిష్కరించే సవ్యసాచి…
                   ***
“మనం పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయిరా..డింభకా “అంటూ మాయాబజార్ లో తన సాహితీ మాయాజాలం చూపించిన సీనియర్ సముద్రాల ఎంతమందికి గుర్తున్నారు?
తల్పం గిల్పం అన్నా,అసమదీయులు తసమదీయలు అన్నా తనకే చెల్లింది.
పాండవులు కనిపించకపోయినా కథంతా పాండవుల చుట్టే తిరిగేలా,పాండవులు  వున్నట్టుగా భ్రమింపజేసిన  చలనచిత్ర మాయాజాలం మాయాబజార్.
అక్షరాలు సృష్టించే అద్భుతాలు అనన్యం
అక్షరాలు అవే ..వాటి   వరుస మారి,పదాలలో చేరి సరికొత్త అర్థాలు సృష్టించే సాహితీసృజన వాగ్దేవి కంఠాభరణమే .

తెలుగు సాహిత్యంలో ఎందరో ఉద్దండులు .తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన అక్షర హాలికులు .
యద్దనపూడి సులోచనారాణి ,మాదిరెడ్డి సులోచన,కోడూరి కౌసల్యాదేవి  లాంటి రచయిత్రుల సామ్రాజ్యం లో ప్రవేశించే ధైర్యం చేయలేని కాలం.మగ రచయితలు ఆడ పేర్లతో రాస్తే తప్ప పాఠకులు చదవారేమోనన్న సందేహం
అమ్మాయిల ఊహ ప్రపంచంలో పడవలాంటి కార్లు,
ఆభిజాత్యం ఆత్మాభిమానం ఉన్న కథానాయికలు
నవలాచిత్రాలు రాజ్యమేలాయి
సెక్రటరీ,ప్రేమనగర్,గిరిజాకల్యాణం ,,చెప్పుకుంటూ పొతే ఎన్నో సినిమాలు.
ఆంధ్రజ్యోతి,ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రభూమి,యువ జ్యోతి,విజయ లాంటి పత్రికలు
అదొక స్వర్ణయుగం
ఆ స్వర్ణయుగంలో మొదలైన అక్షర సంచలనం మల్లాది యండమూరి తో  కొనసాగింది.
పాపులర్ సాహిత్యానికి కొత్తపుంతలు మొదలయ్యాయి.
పోటాపోటీగా యండమూరి మల్లాది శకం మొదలైంది.
ఇద్దరిదీ విభిన్నమైన శైలి.
సరిగ్గా అప్పుడే మరో రచయిత మిస్సైల్ లా దూసుకువచ్చాడు.
నవలా ప్రపంచంలో కొత్త ఒరవడి మొదలుపెట్టాడు
” మల్లాది యండమూరి ని అనుసరిస్తూ రాస్తే అనుకరణే అవుతుంది
అంతకు మించి రాస్తే,వాళ్ళ శైలికి భిన్నంగా వెళ్తే…
అలా మొదలైంది అక్షర సంచలనం
అక్షరాలకు భావకవిత్వాన్ని అద్దాడు
పాత్రలకు భావోద్వేగాలను ఆచ్ఛాదన గా తొడిగాడు
శబ్దరత్నాకరం తడిమి చూసుకుంది
సూర్యరాయాంధ్ర నిఘంటువు  విస్తుపోయింది.
సీనియర్ సముద్రాల చెప్పినట్టు భావోద్వేగాలు,భావుకతా సొబగు సృష్టించకపోతే పాత్రలు ఎలా సజీవమవుతాయి?
కన్నీటి చెమ్మతో మాట్లాడించాడు
సాహిత్యాన్ని సంధించాడు.
అనుభవవేద్యాన్ని అనుభూతి పరం చేసాడు.
అందులోనూ ఆడపిల్లలు అంటే కాసింత ఎక్కువ ప్రేమ.
ఇప్పుడు చెప్పుకునే మహిళాసాధికారత ..
దశాబ్దాలకు పూర్వమే తన నవలల్లో అమ్మాయిల పాత్రల ద్వారా ఆవిష్కరించాడు
అతని రచనల్లో అమ్మాయిలు ఆటబొమ్మలు కాదు,వేటాడే చిరుతలు,
సమాజాన్ని ప్రభావితం చేసే అతివలు
వ్యక్తిత్వాన్ని ఆచ్ఛాదనగా చేసుకున్న పరిపూర్ణ మహిళలు
కొమ్మనాపల్లి గణపతిరావు నిర్మించిన సాహితీ సామ్రాజ్యంలో ప్రమదావనం వుంది.
ధీరోదాత్తత కలిగిన హీరోయిజం వుంది.
అన్నింటికీ మించి జీవితాన్ని తన కోణంలో ఆవిష్కరించే సాహితీ ఇంద్రజాలం వుంది.
సముద్రాన్ని చూసాను,
ఆకాశాన్ని చూసాను.
ఈ రెండు తనలో కలుపుకున్న “అమ్మ ప్రేమను” స్పర్శించలేదు..అంటూ పాఠకుల హృదయాలను అక్షరాల చెమ్మతో స్పృశించే సాహితీ తపస్వి
అతనే కొమ్మనాపల్లి గణపతిరావు
మొదటిసారిగా ఒక రచయిత,అదీ మగ రచయిత ఫోటోను ముఖచిత్రంగా అందించింది ఆంధ్రభూమి వారపత్రిక..ఒక అక్షర సంచలనానికి తెరతీస్తూ..
ఆంధ్రభూమి వీక్లీ లో ది రైటర్ నవల ఒక సంచలనం
నాలుగు దశాబ్దాలకు పూర్వమే మొదలైన రచనా ప్రస్థానంలో
గోరువెచ్చని సూరీడు,అసావేరి,గ్రాండ్ మాస్టర్, ది  రైటర్ ,పడిలేచే కడలి తరంగం..ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో నవలలు.
ప్రతీవారం పాఠకులు ఎదురు చూసేలా చేసిన నవలలు.
వార పత్రిక మార్కెట్ లోకి వచ్చిన తొలి మొదటి గంటలోనే కాపీలు అయిపోయాయి..అనే మాట వినిపించే స్వర్ణయుగం.
కొమ్మనాపల్లి శైలి విభిన్నం.
ఎంచుకునే కథావస్తువు వైవిధ్యం,
ఆ నవలలు ఇప్పుడు ఆడియో రూపంలో ఉంటే
ఆ పాత్రలు మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది
తరం మారినా అక్షరం మారదు.
అక్షరం స్వరంగా మారి ,
నవలా వైభవాన్ని మీ కళ్ళముందు ఉంచితే…
కథా ప్రాంగణం అందుకు వేదిక అయ్యింది.
సుప్రసిద్ధ నవలా రచయిత,
కొమ్మనాపల్లి  గణపతిరావు మస్తిష్కం నుంచి,కాగితంపై జాలువారిన కథా కథన కుతూహలం ..
మీ మనసుపొరల్లో నిలిచిపోయే కొమ్మనాపల్లి సాహితీ సృజన.
కథాప్రాంగణంలో కొమ్మనాపల్లి గణపతిరావు,విజయార్కె వసుంధర,వాణిశ్రీ ,అర్నాద్ ప్రభాకరాజైని వంటి సుప్రసిద్ధ రచయితల రచనలు ఆడియో రూపంలో అందుబాటులో వున్నాయి.
కథా ప్రాంగణం యు  ట్యూబ్ ఛానల్ లో కొమ్మనాపల్లి  గణపతిరావు ఆడియో నవలలు.
మీ కోసం కొమ్మనాపల్లి గారి ఆడియో నవలల లింక్…

NO COMMENTS

LEAVE A REPLY