అసలే దేశం కరువుకాటకాలతో వుంది…దానికి తోడు యుద్ధం ముంచుకువచ్చింది… డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి జానపద కథ “మహామంత్రి ఎంపిక “

(మనం మన పిల్లలకు కథలు చెబుతున్నామా?నీతికథలు,చిన్నారులలో తెలివిని మరింత పెంపొందించేకథలు ,బుద్ధికుశలత తెలియజేసే కథలు పిల్లలకు చెప్పాలి.చదివి వినిపించాలి.వాళ్ళ చేత చదివించాలి. ఇలాంటి కథలు మీరు కూడా రాసి పంపించవచ్చు.రచనకు ఇదే మా ఆహ్వానం…చీఫ్ ఎడిటర్)
శూరదేశాదీషుడు గోపాలసేనుడికి ఒక సమస్య వచ్చిపడింది. ప్రజారంజక పాలనతో ఆ దేశం వర్ధిల్లడానికి మహారాజు పరిపాలన ఒక కారణమైతే…ఎప్పుడూ మహారాజు వెన్నంటి ఉంటూ, కుడిభుజంలా వుండే మహామంత్రి కుశాగ్రబుద్ధి మరో కారణం. మహామంత్రి వృద్ధుడు అయిపోవడంతో “మహారాజా…నేను వృద్ధాప్యభారంతో వున్నాను… నన్ను ఈ పదవి నుంచి విముక్తుడిని చేయ ప్రార్థన “అంటూ విన్న వించుకున్నాడు.
అసలే దేశం కరువుకాటకాలతో వుంది.దానికి తోడు పొరుగు దేశం అదును చూసి తమపై దండెత్తాలని పన్నాగం వేగుల ద్వారా తెలిసింది.ఈ సమయంలో మహామంత్రి లేకపోతె సమస్య జటిలం అవుతుందని విజయసేనుడు ఆలోచన.
“మహారాజా …ఇందులో యోచించవలిసినది ఏమీ లేదు.మహామంత్రి ఎంపికకు నేను అంతా సిద్ధం చేశాను.భుజబలం,బుద్ధిబలం,వినయవిదేతల్లో ఎవరు నేగ్గుతారో వారే ఈ మహారాజు కు విశ్వాసమైన మంత్రిగా వుంటారు.”అంటూ ధైర్యవచనాలు పలికాడు మహామంత్రి.
                                                          ****************
మహామంత్రి పదవికి దండోరా వేయబడింది.యుద్ధవిద్యల్లో,ఆరితేరిన యువకులు ,రాజ్యపరిపాలన గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు…పరీక్షకు సిద్ధమయ్యారు.మహారాజు అభ్యర్థుల సమాధానాలను,భుజబలాన్ని ,బుద్ధిబలాన్ని పరీక్షిస్తున్నారు .
శూరదేశం మీద దండెత్తాలన్న పన్నాగం పన్నిన పొరుగుదేశం రాజు “ఈ మహామంత్రి ఎంపిక “సంగతి తెలుసుకుని “ఎలాంటి అర్హతలు వున్న వ్యక్తిని మహామంత్రిగా నియమిస్తారో తెలుసుకోవడానికి రహస్యంగా గూడచారిని పంపించాడు.
పోరాటంలో ఆరితేరిన వారిని గమనిస్తున్నాడు మహారాజు.చివరగా మిగిలిన కొందరిని రహస్యంగా తన రాజమందిరానికి పిలిపించాడు.
ఒక్కొక్కరిని లోపలి పిలిచాడు.”మన దేశం కరువుకాటకాల్లో వుంది. మరో వైపు పోరుదేశం దండెత్తడానికి సిద్ధంగా వుంది .ఈ పరిస్థితుల్లో మీరే మహామంత్రి అయితే ఏం చేస్తారు? ?అని అడిగాడు.
ఒక అభ్యర్థి మీసం మీద చేయివేసి “యుద్ధం ప్రకటించి శత్రువులను తరిమికొడతాను “అన్నాడు.
మరో అభ్యర్థి “ముందు ప్రజల మీద పన్నులు వేసి,ఆయుధాలు సమకూర్చుకుంటాను “అని చెప్పాడు.
ఇలా ఒక్కో అభ్యర్థి ఒకోలా చెప్పాడు.
చివరికి ఒక అభ్యర్థి వంతు వచ్చింది.అతను వినయంగా మహారాజుకు నమస్కరించి ..
“నేనే మహామంత్రి బాధ్యత నిర్వర్తిస్తే .ముందు ప్రజల క్షేమం ఆలోచిస్తాను.మన ధనాగారంలో వున్న సంపదను పేదలకోసం వినియోగిస్తాను.ధనవంతులను పేదలను ఆదుకోమని కోరుతాను.ప్రతీ మనిషి కష్టించి ఈ కరువుకాటకాల నుంచి దేశాన్ని ముందుకు నడిపించావలిసిన బాధ్యతను యువకులకు అప్పగిస్తాను. పొరుగు రాజుకు సంధి సందేశం పంపుతాను.యుద్ధం మంచిది కాదని వివరిస్తాను.అయినా వినకపోతే మన దేశ పౌరులే,ప్రతీ పౌరుడు ఒక యోధుడు అవుతాడు.ప్రజలను కరువు నుంచి ఆడుకున్న మహారాజు కు కష్టం వస్తే ప్రజలే కాలరుద్రులు అవుతారు.”చెప్పాడు.
మహారాజు ముగ్ధుడు అయ్యాడు.అతనినే మహామంత్రిగా నియమించాడు.నిజమైన రాజు ముందు ప్రజల గురించి ఆలోచించాలి.మహామంత్రి బుద్ధికుశలత రాజును కాపాడుతుంది.
మహామంత్రిగా నియమించబడిన ఆ యువకుడి పేరు రాజసింహ.
                                                *****************
ఆ రాత్రి తన ఆంతరంగిక మందిరానికి పూర్వమంత్రిని పిలిపించి “మహామంత్రీ ..మీరొక నిజం దాచారు.పరీక్షలో నెగ్గిన యువకుడు,నాకు మహామంత్రిగా వున్న రాజసింహ మీ ఒక్కగానొక్క వారసుడే కదా…”
“క్షమించండి మహాప్రభు….మహామంత్రి పదవి వారసత్వం కాకూడదు.మిమ్మలిని,దేశాన్ని కంటికి రెప్పలా కాపాడవలిసిన వ్యక్తి ,తన స్వయంప్రతిభతోనే రాణించాలనే స్వార్థంతోనే నిజం దాచాను.ప్రభువులు మెచ్చితేనే ప్రతిభ రాణిస్తుంది.తండ్రిగా నా బిడ్డ గురించి సంతోషిస్తాను “చెప్పాడు మంత్రి.
అతని మాట అక్షరాల నిజమైంది.కరువుకాటకాల్లో ఉన్నవారిని ఆదుకుని ప్రజల్లో రాజు పట్ల విశ్వాసం పెరిగేలా చేసాడు రాజసింహ.
ప్రజలు ఆ దేశపు రాజును ప్రాణంగా భావించడం చూసి “ఆ దేశం మీద దాడి చేస్తే ప్రజలే సైనికులై తిరగబడతారని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు…పొరుగుదేశం రాజు.
అంతే కాదు రాజసింహ లాంటి మంత్రి కోసం అతనూ దండోరా వేయించాడు.

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY