(3 )
సాహసం సేయరా అర్భకా
నేను 8 క్లాస్ చదవే రోజులు. క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయ్యాక ఇచ్చే సెలవుల్లో ఎలా అయినా ఏదో ఒక ఊరు వెళ్ళాలి. దానికి కారణం స్కూల్ ఓపెన్ చేశాక ఫ్రండ్స్ నేను పలానా ఊరు వెళ్లాను, నేను పలానా ఎక్స్ కర్షన్ వెళ్లాను అని గొప్పలు పోతుంటే మనకు తలకొట్టేసినట్టు ఉంటుంది. వాళ్ళ ముందు మన ప్రతాపం చూపాలంటే ఏదో ఒక ప్లేస్ కి పోవలసిందే. మనకా బంధువులంటూ ఎవరూ లేరు. ఉన్నా తిరుపతికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపానాయుడుపేటలో ఉన్నారు. చెన్నైలో తాత తరపున బంధువులు ఉన్నా రిలేషన్ దూరం కావడంతో వెళ్ళడం తక్కువ. శ్రీ కాళహస్తిలో మరికొంతమంది. మనకు నచ్చింది మనం మెచ్చింది పాపానాయుడుపేటే…
హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే బట్టలు సర్దుకుని బస్ స్టాండ్ లో ప్రత్యక్షమయ్యాను. ఎప్పుడెప్పుడు ఊరు చేరుతామా అని ఉత్సాహం ఉవ్విళ్ళూరుతోంది. బస్ కోసం వెయిటింగ్ స్టార్ట్ అయ్యింది. చుట్టూ చూస్తే తెలిసిన మొహం ఒక్కటి కూడా లేదు. ఇక తప్పదు అన్నట్టు అక్కడే కూలబడ్డాను. టైం చాలా స్లోగా కదిలినట్టుంది. ఎంతసేపు వెయిట్ చేసినా బస్ రాలేదు. ఇక చిరాకు వేసి ఊరికి నడిచే పోదామని డిసైడ్ అయ్యాను.
ఆ డెసిషన్ ఎంత పెద్ద తప్పో తరువాత తెలిసొచ్చింది.
బస్ స్టాండ్ దాటి బయటకు వచ్చాను. దూరం తలియక నేను చేసిన మొదటి ప్రయత్నం. నెమ్మదిగా మా ఊరు వైపు నడక ప్రారంబించాను. కొన్ని రోజుల క్రిందటే గుండు కొట్టుకోవడం వల్ల అదృష్టం కొద్ది తలపై కేప్ ఉంది.
పొద్దున్న 9.00 టైం… అప్పుడే సూర్యుడు నాపైనే కక్ష కట్టినట్టు తన ప్రతాపం చూపుతున్నాడు. క్యాప్ ఉన్నా కూడా ఎండకు తల వేడెక్కిపోతోంది. ఒక్కసారి డిసైడ్ ఐతే నా మాట నేనే వినను అన్న మహేశ్ బాబు డైలాగ్ లా మొండిగా ముందుకే నడిచాను. టైం గడిచేకొద్దీ ఎండ ఎక్కువై సూర్యుడు నన్ను ఇబ్బంది పెట్టేస్తునాడు. అలా దాదాపు 6.5 కిలోమీటర్లు నడిచాను.
తిరుపతికి దగ్గరలోని మోపెడ్స్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే ఇక నా పని ఐనట్టు అనిపించింది. ఎండకు దాహంతో నోరు ఎండుకుపోవడమే కాక ఆకలి కూడా దంచేస్తోంది. దగ్గరలోని షాప్ లో ఒక కూల్ డ్రింక్ తాగి అక్కడే ఉన్న బెంచ్ పై కూలబడ్డాను.
నడుస్తున్నంతసేపూ ఏమి అనిపించలేదు కాని నీడలో కూర్చున్నాక ఎక్కడలేని నీరసం. అలసటతో పటు కాళ్ళు లాగడం స్టార్ట్ అయ్యింది. డిస్టెన్స్ చూస్తే ఇంకా సగం కూడా కవర్ ఐనట్టు లేదు. నెక్స్ట్ ప్లాన్ ఏమిటి అని ఆలోచిస్తుండగానే దేవుడు పంపినట్టు బస్ ఒకటి వచ్చి అక్కడ ఉన్న బస్ స్టాప్ లో నిలిచింది.
ఇక మరో ఆలోచన లేకుండా రన్నింగ్ లో వెళ్లి బస్ ఎక్కేశాను.
బస్ లో పడ్డాక వచ్చిన పెద్ద డౌట్ ఏమిటంటే ఇంతకూ అది మా ఊరు వెళ్ళే బస్ ఔనో కాదో…
అనుమానంతోనే కండక్టర్ ను అడిగాను. నన్నోసారి ఎగాదిగా చూసి పోదు అన్నాడు.
కధ మళ్ళీ మొదటికి వచ్చింది అనుకుని అక్కడకు దగ్గరలోని రేణిగుంటకు టికెట్ తీసుకున్నాను.
అక్కడనుండి రేణిగుంట 4 కిలోమీటర్లు మాత్రమే… 5 నిముషాలలో బస్ రేణిగుంట చేరింది…
ఆరోజు నా టైం అసలు బాగాలేదు. బస్ స్టేషన్ వెళ్ళేవరకు కూడా ఆగకుండా మధ్యలోనే దిగేశాను.
అక్కడ నుండి పాపానాయుడుపేటకు బస్ విషయం కనుక్కుంటే మా ఊరు బస్ అక్కడ ఆగదని తేలింది.
నటరాజ సర్వీస్ ప్రారంభం. అదృష్టం కొద్దీ బస్ స్టాండ్ అక్కడకు దగ్గరలోనే ఉంది. కాస్త కష్టపడితే బస్ స్టాండ్ చేరొచ్చు అనుకుంటూ బయలుదేరాను. అర్థగంటలో బస్ స్టాండ్ చేరాను.
టైం 12 దాటింది.
రేణిగుంట బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిటింగ్ స్టార్ట్ అయ్యింది, అలసట ఆకలితో మోపెడ్స్ వద్ద తిన్నది ఎప్పుడో అరిగిపోయింది.
అదృష్టం తలుపు తడితే దురదృష్టం తలుపు బద్దలు కొడుతుందంట…
అలా తయారైంది నా పరిస్థితి.
మరో అర్థగంట గడిచింది… మా ఊరు బస్ మాత్రం రాలేదు
చిరాకు పెరిగింది. చిరాకుతో పాటు బీపీ కూడా బాగా పెరిగింది.
మా ఊరు అక్కడ నుండి 6 కిలోమీటర్లు..
అసహనం హద్దు దాటిపోగా మా ఊరికి నడిచే వెళ్లాలని డిసైడ్ అయ్యాను
రేణిగుంట నుండి మా ఊరికి నడిచిపోవడానికి కారణం ఉంది. రేణిగుంట దాటంగానే మా ఊరికి వెళ్ళే దారిలో పొలాలు ఉంటాయి. వాటి మధ్య నడిచివెళ్తుంటే అదో హాయి.
నడక స్టార్ట్ అయ్యింది…
పొలాలకు అడ్డం పడి నడవడం స్టార్ట్ చేశాను. ఎండ మాత్రం మొహమాటం లేకుండా మండిపోతోంది.
పొలాల్లో ఉన్న పంపుసెట్ లో బాగా నీళ్ళు పారుతున్నాయి. తలపై ఉన్న క్యాప్ నిండా నీళ్ళు నింపుకుని తలపై పెట్టుకున్నాను.
చల్లగా ఆనందంగా అనిపించింది.
నా జన్మభూమి ఎంత అందమైన దేశమూ మా ఊరు అందులోని కమ్మని ప్రదేశమూ అని పాడుకుంటూ లెఫ్ట్ రైట్ ప్రారంబించాను.
ఒక గంట గడిచింది. మా ఊరు పొలిమేరలు కనిపించాయి.. ప్రాణం లేచి వచ్చినట్టైంది.
నా ముందు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు
“ఈ అబ్బాయి రేణిగుంట నుండి నడిచి వస్తున్నాడు మామా”
“వయసులో ఉన్నాడు కదా”
నేను రేణిగుంట నుండి నడచి వస్తున్నాను అని ఇతనికెలా తెలిసిందా అని నాకు ఒక్కటే ఆశ్చర్యం.
కాసేపటి తరువాత తెలిసింది నేను రేణిగుంట దాటగానే నా ముందు ఒక ట్రాక్టర్ వెళ్ళిన సంగతి అప్పటికి గుర్తుకు వచ్చింది. బహుశా ఇతను ఆ ట్రాక్టర్ లో ఉంది ఉంటాడు.
వాళ్ళు అన్న మాటలతో నా చాటి 2 ఇంచిలు గర్వంతో పొంగింది.
అదే ఊపుతో ఊళ్ళో అడుగుపెట్టాను.
అప్పటికి సాయంత్రం 4 అయ్యింది.
రాబోయే ప్రమాదం తెలియక నేను జాలీగా పాట పాడుకుంటూ ఊళ్లోకి అడుగుపెట్టగానే మా నానమ్మ ఊరికి ఎంట్రన్స్ లో ఉన్న శివాలయం దగ్గర ఏడుస్తూ కనిపించిది.
నేను హడావిడిగా వెళ్లి విషయం కనుక్కుంటే అక్కడ తేలిందేమిటంటే…
పొద్దున్న 9 కి బయలుదేరిన నేను 4 కూడా ఊరికి చేరలేదని ఇన్ఫర్మేషన్ మా బంధువులకి మొత్తం తెలిసిపోయింది. అందరూ ఒక్కటే కంగారు పడుతున్నారు…
17 కిలోమీటర్ల డిస్టెన్స్ ను 7 గంటలలో కవర్ చేసిన నాకు గిన్నీస్ బుక్ లో చోటు ఎందుకు దొరకలేదో ఎంత ఆలోచించినా ఇప్పటికీ అర్థం కాదు.
(మరికొన్ని ముచ్చట్లు వచ్చేవారం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్