5
తెల్లవారింది.
అప్పటికే సుమన్ ను రాత్రి స్టషన్ కు తీసుకెళ్ళిన విషయాన్ని సుమన్ తల్లి అందరికీ తెలియపరిచింది.
లాయర్లు, శ్రేయోభిలాషులు, తల్లి అందరూ స్టేషన్ కు బయలుదేరారు. అసలు సుమన్ ఎక్కడున్నాడో వాళ్ళక్కూడా తెలియదు.
సుమన్ ను ఏ స్టేషన్ లో అయితే ఉంచారో అదే స్టేషన్ కు వచ్చాడు సుమన్ వెల్ విషర్స్ , లాయర్, తల్లి.
సుమన్ లేరని చెప్పారు వాళ్ళు.
తల్లి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా వున్నాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితి ఆమె కలలో కూడా ఊహించలేదు.
సుమన్ లోపలున్నాడు, చూస్తున్నాడు. తల్లి వచ్చింది. వెళ్ళింది చూశాడు. కానీ వాళ్ళు దూరంలో వున్నారు.
ఎందుకిలా జరుగుతోంది?
టీ ఇచ్చినా తాగలేకపోయాడు. అసలు తననెందుకు అరెస్టు చేశారో తెలియాలి. అప్పటివరకూ తనకి టార్చర్ తప్పదు.
మధ్యాహ్నం మరో ఇన్ స్పెక్టర్ వచ్చాడు. పేరు డేవిడ్. చూడ్డానికి మంచి వ్యక్తిలా వున్నాడు. అతనన్నాడు ”సారీ…మిమ్మల్ని స్టేషన్ లో ఉంచక మాకు తప్పదు. దయచేసి మీరు నన్నేం అడగవద్దు. మీకేం కావాలో చెప్పండి. మీకిష్టమైన ఫుడ్ తినండి.” అన్నాడు.
”అదేమిటండీ. అసలు నన్నెందుకు అరెస్టు చేశారో చెప్పండి. నా వెనుక ఏం జరుగుతుందో చెప్పండి. ప్లీజ్” సుమన్ అతన్ని రిక్వెస్ట్ చేశాడు.
”సారీ. దయచేసి నన్నేం అడగవద్దు. ఒక్కటి మాత్రం చెప్పగలను. మీకు ఏసు మంచి చేస్తాడు. మీకు న్యాయం జరుగుతుంది. మీరు బాగా భోంచేయండి. మళ్ళీ మంచి ఫుడ్డు ఎప్పుడు తింటారో!”బాధగా అన్నాడతను .
అతని మంచితనానికి చలించాడు సుమన్. కానీ అతని మాటల వెనుక ఏదో హెచ్చరిక వినిపించింది.
అప్పటికే సుమన్ అప్ సెట్టయ్యాడు.
”మిమ్మల్ని ఈవినింగ్ ఓ ప్లేస్ కు తీసుకెళ్తారు” చెప్పాడు ఇన్ స్పెక్టర్.
”ఎక్కడికి?” అని అడగాలకున్నాడు. కానీ లాభం లేదు. చెప్పరు కూడా.
* * *
సైదాపేట కోర్టు.
జనం ఎవ్వరూ లేరు. ఒక్క పోలీసులు, తాను తప్ప.
అన్ని గదులూ మూసేవున్నాయి. ఒక రూమ్ ఓపెన్ చేశారు.
స్పెషల్ మేజిస్ట్రేట్ (ప్రత్యేక న్యాయమూర్తి) వున్నారక్కడ.
”మీ మీద మూడు కేసులున్నాయి. మీరేమంటారు?” జడ్జి అడిగారు.
సుమన్ ఒక్క క్షణం షాక్ నుండి తెలుకోలేకపోయాడు.
తన మీద మూడు కేసులా?
తన మీద కేసులెందుకుంటాయి?
”సెక్షన్ 307 అట్టెంప్ట్ మర్డర్, సెక్షన్ 420 చీటింగ్, అంతేగాక గూండాస్ యాక్ట్ కింద కూడా కేసులు బుక్ అయ్యాయి.”
షాక్…మామూలు షాక్ కాదు! అతని కళ్ళముందు విస్ఫోటనం!
షూటింగ్స్ తప్పితే ఇల్లు, తప్పితే సరదాగా షాపింగ్. అలాంటి తనపైనే ఇలాంటి కేసులు బుక్ చేయడమేమిటి?
జడ్జి చెప్పారు
”మీరు మీ తరపున లాయర్ ని పెట్టుకోవచ్చు”
తనది నాన్ బెయిలెబుల్ కేసు.
అంటే తనకు బెయిల్ అవకాశం కూడా లేదు. సుమన్ కు ఆ క్షణం ఏమి తోచలేదు.
ఇదంతా నిజంగా నిజమా? ఆ షాక్ నుండి కోలుకోకముందే మద్రాసు సెంట్రల్ జైలుకు తరలించారు సుమన్ ని ..
ఆదివారం రాత్రి-
సాధారణంగా సాయంత్రం ఆరు దాటిందంటే జైలు గేట్ ఓపెన్ చేయరు.
సుమన్ ని క్లోజ్ ప్రిజన్ లో ఉంచారు.
కేవలం ప్రమాదకరమైన వ్యక్తులను, తీవ్రతమైన నేరస్థులను మాత్రమే క్లోజ్ ప్రిజన్ లో ఉంచుతారు. ఇక్కడ ఎంతకాలం గడపాలో?
చిత్రంగా అంత బాధలో ఒక కన్నీటి చుక్క కూడా నేలరాలలేదు.
తల్లి జ్ఞాపకం వచ్చింది. నిరంతరం తన శ్రేయస్సుకోసం, తనని కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి.
***
(ఇంకా వుంది)
మేన్ రోబో పాఠకుల కోసం పునః ప్రచురణ
ఈ పుస్తకం కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులో వుంది.
ఆంధ్రభూమి వీక్లీలో ఈ సీరియల్ వస్తోన్న సమయంలో (1991 ప్రాంతంలో) ఈ సీరియల్ చదివిన పాఠకులు అప్పటి అనుభవాలను షేర్ చేసుకోవచ్చు.
ఈ పుస్తకం కావాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చేయండి
http://preview.kinige.com/previews/7800/PreviewJailuGodalaMadhyaHeroSuman36533.pdf