7
“నిజానికి మేము నిన్నుఇంటర్ వ్యూ చేసాము ,అందరికి నీ లాగే కండిషన్ లు పెట్టాం ,ఎవ్వరూ డిపాజిట్లు కట్టలేదు ఐనా సరుకులు ఇచ్చాము.చాలా కొద్దీ మంది మాత్రం సరుకులు రిటర్న్ చేశారు .మిగితా వాళ్ళు ఉడాయించారు ,సరుకులతో సహా…పైగా నీలాంటి సిన్సియర్ మాకు కావాలి… నువ్వు సరుకులు ఇవ్వకపోయినా మేము చేసేది ఏమి లేదు ,అయినా సిన్సియర్ గా సరుకులు ఇవ్వడమే కాక నీ పరిస్థితి , ఉద్దేశం చెప్పావు మాక్కావాల్సింది ఇదే.మా కంపెనీ నష్టాలలో వుంది, నీ లాంటి సమర్దుని వల్ల ఏమైనా లాభాలొస్తాయోమో చూద్దాం” అన్నాడు
“థాంక్యూ సార్…”సంతోషంగా అన్నాడు.
“వెల్ కమ్ మై బాయ్” చేయి అందిస్తూ అన్నాడు నటేశన్.
“నాకు ఆనంద భాష్పాలు వస్తున్నాయి సార్” అలాంటి ఎక్సప్రెషన్ ఒకటిస్తూ అన్నాడు చరణ్
“అంటే…?”
“హ్యాపీ టియర్స్ సార్”
“అలాగే నాక్కుడా హ్యాపీ టియర్స్ వస్తున్నాయి”కళ్ళు తుడుచుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు .
“రేపే డ్యూటీ లో జాయిన్ అవ్వాలి “అన్నాడు నటేశన్.
“అలాగే సార్ ఎల్లుండే మ్యారేజ్ కూడా ” అంటూ బయటకు నడిచాడు .
“ఏంటో పిచ్చి మాలోకం” గొణుక్కున్నాడు నటశేన్!
చాలా హ్యాపీ గా వున్నాడు చరణ్
జేబులో చేయి పెట్టాడు.ఏదో కాగితం తగిలింది బైటికి తీసాడు ఐదు రూపాయల నోటు .
ఆశ్చర్య పోయాడు . తన జేబులోకి ఈ నోటు ఎలా వచ్చింది , పొరపాటుగా ప్రసాద్ గాని తన జేబులో మర్చిపోయాడా?…ఛ…వాడి దగ్గర డబ్బులుండడం ఏమిటి?అంత దృశ్యం వాడికి లేదు .
నోటు వైపు పరిశీలనగా చూసాడు ,తెల్లగా ఖాళీగా ఉన్న స్థలంలో , కాఫీ,టీ లకు పనికొస్తుంది చందన” అని రాసి వుంది.
అంటే తన పక్కనే నడుస్తూ ,తన కోసం తన జేబులో తనకు తెలియకుండా నోటు జేబులో పెట్టిందన్న మాట.
మనసు ఆనందం తో పులకించింది.కొన్ని సందర్భాలలో కొన్ని ఎమోషన్స్ కు అక్షరాలుండవు..మొహంలో ఎక్స్ ప్రెషన్సే ఉంటాయి.
ఆకలి వేస్తుంది. టైం చూసుకున్నాడు ,పన్నెండు .. చందన లంచ్ కు రమ్మంది.ఇంకా గంట టైం వుంది .ఈ లోగా ఏవైనా కొనుక్కొని నమిలితే… ఆలోచన బాగానే వుందనిపించింది.
ఎదురుగా ఎగ్జిబిషన్ వుంది.లోపలికి నడిచాడు ,రకరకాల తినుబండారాలు వున్నాయి .ఓ వైపు మిరపకాయ బజ్జీలు అమ్ముతున్నారు .అది చూడగానే నోరూరింది చరణ్ కి, వేడి వేడిగా వేస్తున్నారు .
ప్రసాద్ పేస్ గుర్తొచ్చింది .ఉదయమే దీనంగా పేస్ పెట్టి “ఒరేయ్ చరణ్ ,ఓ ఫైవ్ ఉంటే అప్పివ్వరా ?గర్ల్ ఫ్రెండ్ తో ఎగ్జిబిషన్ కు వెళ్ళాలి కనీసం మిరపకాయ బజ్జీ లైనా కొనిపెట్టలేని ఎదవనయ్యాను ” సినిమా పక్కీలో డైలాగ్ కొట్టాడు .
“పాపం అనిపించింది ,వాడికోసం రెండు రూపాయల మిరపకాయ బజ్జీలు ప్యాక్ చేయించాలని ఆ కొట్టు దగ్గరికెళ్ళాడు.
“ఏయ్ మిరపకాయలబ్బీ… ఓ ఐదు రూపాయల మిర్చీలు ప్యాక్ చేయ్”
ఆకంఠం ఎక్కడో విన్నట్లనిపించింది .పక్కకు తిరిగాడు, ప్రసాద్ బ్యాక్ పాకెట్లో చేయ్ పెట్టి ,దర్జాగా పదిరూపాయలు నోటు తీసి కొట్టు వాడితో అంటున్నాడు .
అదే సమయం లో చరణ్ ని చూసాడు ఖంగు తిన్నాడు .
“రేయ్… మిత్ర ద్రోహి… నాతొ డబ్బుల్లేవని బిల్డప్ ఇచ్చి…
“గట్టిగా అరవకురా…గర్ల్ ఫ్రెండ్ వింటే ఫీలవుతుంది. అసలు జరిగిందేమిటంటే…”
ప్రసాద్ ఏదో చెవిలో పువ్వెట్టే స్టోరీ చెప్పబోయాడు.
“ఇంటికొచ్చాక నీ పని చెబుతా”అంటూ ముందుకు కదిలాడు.
“ఎవరు ప్రసాద్…అలా నీకేదో వార్ణింగ్ ఇచ్చి వెళ్తున్నాడు”
“అదా… సాయంత్రం డిన్నర్కు రాకపోతే ఉరి పెట్టుకుంటానని బెదిరిస్తున్నాడు పిచ్చి వెదవ… చిన్నపాటినుండి నేనంటే ఎంతో అది వాడికి”అన్నాడు వీరలెవల్లో అబద్దాలాడేస్తూ.
***
“ఇక్కడ యురేకా…అని గాల్లోకి ఎగిరి అరుస్తే మీ స్టాఫ్ కు ఏమైనా ఇబ్బందా ?” పట్టలేని ఆనందంతో అడిగాడు చందనను .
“ఎందుకు?” అడిగింది అయోమయంగా లంచ్ టైం ఇది. అందరూ క్యాంటీన్ కి వెళ్లారు.
“ముందు నోరు తెరువు… అన్నాడు
“ఎందుకు?”
“చెప్పినట్టు చేస్తావా లేదా?”
“బలవంతంగా నోరు తెరిపిస్తాడని అర్థమైంది. నోరు తెరిచింది.మైసూరుపాక్ నోట్లో పెట్టాడు .కొరక్కుండా మింగు” అన్నాడు ఆనందంతో.
వళ్ళు మండింది చందనకు
“అలా సీరీయస్ గా చూడమాకోయ్ . నాకు ఉద్యోగంవచ్చేసింది …మన పెళ్లి నీ ఇష్టం…ఎప్పుడంటే అప్పుడే…”
“అంటే…”అలాగే మింగేసింది మైసూర్ పాక్ ముక్కని.
“నిజమా?”ఆనందంతో అంది.
“అవును మీ మేనేజర్ మీద ఒట్టు”అన్నాడు
చందనకు చెప్పలేనంత ఆనందంగా వుంది .
లంచ్ ఇద్దరు కలసి చేశారు.ఇలా లంచ్ ని షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది”చందన అంది.
“అవును”అన్నాడు చరణ్ .
“నాకిలాంటి చిన్న చిన్న పనులంటే చాలా ఇష్టం.కలసి బోంచేయడం…ఆఫీస్ వదలగానే కలసి ఇంటికెళ్ళడం…
ఒకరి కోసం ఒకరు ఎదురు చూడడం…”
“హోల్డన్…హోల్డన్…డ్రీమ్స్ లోకి వెళ్లొద్దు”అన్నాడు
“కలలు కాదు. జీవితంలో నీ ద్వారా తీర్చుకోవాలనుకుంటున్న కోరికలు చరణ్”అంది.
“అలాగే అన్నికోరికలు ప్రాప్తిరస్తు”అన్నాడు దీవిస్తున్నట్టుగా.
“వచ్చే నెలలో ముహుర్తాలు బావున్నట్టున్నాయి”అంది చందన.
“ఒకే నా తరుపున పెళ్లి పెద్దవి నువ్వే”అన్నాడు
***
(మిగితా వచ్చేవారం)
తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్