ఫీడ్ బ్యాక్
బ్రహ్మదేవుడు వున్నాడో లేడో తెలియదు కానీ..అక్షరాలతో అద్భుతాలు సృష్టించే అపర బ్రాహ్మలు రచయితలు …అని నిరూపించిన మా అభిమాన రచయిత్రి శ్రీసుధామయి గారికి హేట్సాఫ్ ….ప్రామిసింగ్ రైటర్ అన్న మాటకు అర్థం మీరే.
” నాకు పునర్జన్మినిచ్చి…నాలాంటి వాళ్ళెందరికో అమ్మవై మా నుదుట తలరాతను పునర్లిఖించిన అపర విధాత నీకు పాదాభివందనం”
ఇద్దరూ ఆప్యాయంగా చేతులు కలుపుకున్నారు.మానవత్వపు వృక్షానికి రెక్కలు తొడిగిన కొమ్మలు …
దానవత్వం కొమ్ములు విరిచి …కుళ్ళిన సమాజానికి శస్ర్తచికిత్స చేయడానికి అక్షర కరవాలం,చట్టం చేతులు కలిపాయి…మీ అద్భుతమైన రచన పటిమకు ఈ వాక్యాలు చాలు..మీకు హృదయపూర్వక అభినందనలు…ఆర్వీ .శ్రీజ ,సుందరమూర్తి ,మహేష్ ,సుకన్య (రాజమండ్రి)
8
రెండు చేతులు కలుసుకున్నాయి.కరచాలనం చేసుకున్నాయి.ఆత్మబంధం.పేగు కలిపిన బంధం కాదు…ఆకలిపేగులు పెనవేసుకుపోయిన సంబంధం.ఎక్కడో పుట్టి ఎక్కడో కలుసుకుని ఒకే ప్రాంగణంలో పెరిగిన కొమ్మలు…
ఆ ఇద్దరి చూపులు సుగాత్రి వైపు తిరిగాయి.
గుండెలో కొలువైన దైవానికి కన్నీటి చెమ్మతో కైమోడ్పు పలికింది.
“చిన్న రిక్వెస్ట్ ఏసీపీ మేడం”సుగాత్రి అంది ఏసీపీ వసుమతి వైపు చూస్తూ
“అమ్మ లాంటివారు..కాదు అమ్మకంటే ఎక్కువైన వారు..బిడ్డను..మీరు పెంచిన చిన్న మొక్కను…పేరుపెట్టి పిలవండి అమ్మా….”వసుమతి కన్నీటిచెమ్మతో సుగాత్రి దగ్గరికి వచ్చి అంది చేతులు జోడిస్తూ…
ఇంకా సిఐ షాక్ లో నుంచి కోలుకోలేదు.
“అమ్మాయిల మీద యాసిడ్ పోస్తానని బెదిరించే దాసును మీరే పట్టుకున్నట్టు ఉండనివ్వండి…ఈ అమ్మాయి పేరును బయటకు రానివ్వకండి.”అంది సుగాత్రి.
ఏసీపీ వసుమతి సిఐ వైపు చూసింది.వెంటనే బుద్ధిగా తలూపాడు సిఐ .ఏసీపీ లాంటి వ్యక్తే రెండుచేతులు జోడించింది..అంటే వచ్చిన వ్యక్తి ఎంత పవర్ ఫుల్ అన్నది తెలిసిపోతుంది.
“సిఐ సర్ ..ఈ దాసును పట్టుకున్న క్రెడిట్ మీకే ఇద్దామనుకుంటున్నాను..ఫ్రంట్ పేజీలో యాసిడ్ దాసును సాహసోపేతంగా పట్టుకున్న సిఐ అని సగం తాటికాయలంత అక్షరాలతో మా అగ్నికణంలో మీరు సంచలనం అవుతారు.మిగితా మీడియా కు కూడా మీరు ఇదే క్యాసెట్ వేసారనుకోండి..మీకు బోల్డు మైలేజీ…ఏమంటారు?అంది నందిని.
ఏసీపీ కూడా మౌనంగా ఉండడంతో ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్దమయ్యాడు సిఐ.అంతే కాదు అతని తరపు నుంచి ఒక స్టేట్మెంట్ కూడా పబ్లిష్ కాబోతుంది.ప్రెస్ నోట్ గా…
సిటీ లో ఏ ఒకడైనా యాసిడ్ బాటిల్ తో కనిపించినా,అమ్మాయిలను బెదిరించినా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని వార్నింగ్ కూడా…ఇచ్చాడు.
ఒక్కరోజులో సిఐ హీరో అయ్యాడు…అతని యాటిట్యూడ్ లో కూడా మార్పు తీసుకువచ్చింది ఆ సంఘటన.
ఒక మంచిపని చేస్తే ఇంత సంతోషంగా వుంటుందా?ఎందుకంటే మరుసటిరోజు అతను రోడ్డు మీద కనిపిస్తే ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు కాలేజీ అమ్మాయిలు.ఓ ముసలావిడ సిఐ రెండు చేతులు పట్టుకుని అభినందించింది.ఆశీర్వదించింది.
సుగాత్రి ఎవరో ఏమిటో తెలియపోయినా ఆమె గొప్పతనం తెలిసింది.మరుసటి రోజు ప్రతిమ సూపర్ మార్కెట్ కు వెళ్లి రెండు చేతులు జోడించి నమస్కరించాడు సిఐ
కొన్ని సంఘటనలు జీవితంలో అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి.
***
సుగాత్రికి నిద్ర రావడం లేదు.టైం అర్థరాత్రి పన్నెండు కావస్తోంది.కూతురు చలికి దగ్గరగా ముడుచుకుని పడుకుంది.చిన్నప్పుడు పొత్తిళ్ళలో పడుకున్న కూతురు గుర్తొస్తోంది.అప్పటికీ ఇప్పటికీ ఎంత ఎదిగిపోయింది? హాలులో బెలూన్స్ అక్కడక్కడా విసిరివేయబడ్డట్టు వున్నాయి.కొని బెలూన్స్ పగిలిపోయాయి.రంగురంగుల కాగితాల తోరణాలు ..ఓ మూలకు పేపర్ ప్లేట్స్..టేబుల్ మీద మిగిలిపోయిన కేక్…కూల్ డ్రింక్ గ్లాసులు….
నవ్వుకుంది సుగాత్రి..మూడుగంటలు ముందు హడావుడి…డాన్స్ లు వెల్లువెత్తే హుషారు గీతాలు….అభినందనలు గ్రీటింగ్స్…అల్లర్లు…ఎవ్వరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు..ఎవరిపనుల్లో వాళ్ళు..అందరూ నిద్రలోకి జారుకుని వుంటారు.
ఒక రచయిత రాసిన మాటలు ఆమె మనసుపొరల్లో నుంచి బయటకు వచ్చాయి.
“అది పెళ్లి కావచ్చు..వేడుక కావచ్చు…అంతా హడావుడి..షామియానాలు..ప్రముఖుల గ్రీటింగ్స్…కలర్ ఫుల్ వాతావరణం…రంగుల ప్రపంచం…అర్థరాత్రి దాటుతుంది.వేడుక పూర్తవుతుంది…అందరూ వెళ్ళిపోతారు..చివరికి మిగిలేదెవరు?
అతిథులు తినగా మిగిలిన పదార్థాలు..విసిరివేయబడ్డట్టున్న కుర్చీలు..షామియానాలు తీసేసేవాడు…మిగిలిన తినుబండారాల కోసం అడుక్కునేవాళ్ళు….ఆర్గనైజర్లు ఫంక్షన్ డబ్బుల కోసం…తెల్లవారితే షరా మాములే…ఉన్నవాడి ఇంట్లో చావు కూడా పెళ్లిలానే ఉంటుందేమో…
సింబల్..
స్టేటస్ సింబల్…లేదా ఒక క్రేజ్ …ఆర్భాటం….చివరికి మిగిలేది మనం…లేనివాడికైతే ఫంక్షన్ కు చేసిన అప్పులు….
ఇలాంటి ఆలోచనలు ఆమెను కాసేపు డిస్ట్రబ్ చేసాయి.అంత కన్నా ఆమెను డిస్ట్రబ్ చేసింది కూతురు అన్న మాటలు…
“అమ్మా…నాన్న కూడా ఉండి ఉంటే బావుండు కదా?ఒక్కో అక్షరం పదునుతేలిన కరవాలమై ,ఆమె దెబ్బతిన్న హృదయాన్ని మళ్ళీ మళ్ళీ మళ్ళీ ముక్కలు చేసినట్టు…
ఏ తండ్రి కూతురిని కడుపులోనే నిర్ధాక్షిణ్యంగా హత్య చేయాలనుకున్నాడో…
ఏ తండ్రి తన స్వార్థంతో నాన్న అనే పిలుపును ప్రపంచానికి వినిపించకుండా చేయాలనుకున్నాడో…
ఏ తండ్రి తన తల్లిని..తనను మాటలతో చేతలతో చేతులతో…తన మనసును శరీరాన్ని చిత్రవధ చేసాడో…తన శరీరమ్మీద రక్తసిక్త వ్యథను రంపపుకోతగా మిగిల్చాడో…
ఆ తండ్రి గురించి..తనను వేధించిన గతం గురించి తెలిసిన కూతురు..
“అమ్మా …నాన్న ఉంటే బాగుండని ..అడిగినప్పుడు..అప్పుడు కనుకొలుకుల సరిహద్దులు దాటిన అశ్రువొక్కటి రుధిర వర్ణమై ..విషాద వివర్ణమై..ఆమె చెక్కిలి దాటి…ఆత్మార్పణ చేసుకుంది.
ఆకాశంలో నుంచి…కిటికీలో నుంచి ఆ గదిలోకి చూసిన నక్షత్రమొకటి…కంటతడిపెడుతూ…నేలరాలుతోంది.
(గుప్పెడంత ఆకాశంలో చిన్న విరామం)
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్