అది స్వామిజీ ఆశ్రమప్రాంగణం. స్వామిజీ ఆ వేళ మాత్రమే మౌనవ్రతం వీడి భక్తులతో మాట్లాడే రోజు. అందుకే ఆశ్రమమంతా భక్తులతో కిటకిటలాడిపోతోంది. స్వామిజీని తాకాలని ఆయన ఆశీర్వాదం పొందాలని భక్తులు ఆరాటపడుతున్నారు. ఆ జనసమూహాన్ని అతి కష్టం మీద అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తున్న స్వామిజీ శిష్యులకు అసహనం రెట్టింపు అవుతోంది.
క్యూ లో వస్తూ కానుకలు ముడుపులు సమర్పించుకుంటున్న భక్తులను చూస్తూ స్వామిజీ తన ప్రముఖశిష్యుడు అందిస్తున్న నీళ్లసీసాను అందుకుంటూ అందరికీ “గంగాజలం” ప్రసాదిస్తున్నారు.
ఆ పవిత్రమైన గంగాజలాన్ని భక్తులు భయభక్తులతో స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు. అనంతరం స్వామిజీ బోధనలు ఆరంభమయ్యాయి. ఖంగుమంటూ మోగే కంఠంతో స్వామిజీ ప్రవచనాలు వల్లిస్తుంటే వేలాదిమంది భక్తులు తన్మయత్వంతో వింటున్నారు.
***
ప్రవచనాలను చెప్పడం ముగించిన తర్వాత స్వామిజీ శిష్యులు చుట్టూ కవచంలా ఏర్పడి ఆశ్రమం లోపలికి తీసుకెళ్లారు. ఆశ్రమం లోపలికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు గావించి రక్షణ కల్పించుకున్నాడు స్వామిజీ ప్రముఖ శిష్యులు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే బాబా ఆంతరంగిక మందిరంలోకి ప్రవేశం ఉంది. మిగిలిన శిష్యులందరు మందిరం బైట అనుక్షణం వేయికళ్లతో పహారా కాస్తుంటారు.
స్వామిజీ భక్తులకు ప్రసాదించే గంగాజలాన్ని నీళ్లసీసాలలో నింపి భక్తులకు ప్రసాదిస్తుంటాడు స్వామిజీ. ఆ నీటిని స్వామిజీ హిమాలయాల నుండి ప్రత్యేకంగా భక్తుల కోసం తీసుకొస్తారని స్వామిజీ శిష్యులు ప్రచారం చేస్తుంటారు.
ఆ నీళ్లసీసాలను శిష్యులు తమకు అందుబాటులో ఉంచుకుని వాటిని స్వామిజీకి అందిస్తుంటారు. ఆ గంగాజలం పరమ పవిత్రమైనదని ఆ గంగాజలం తమ దోసిట పడగానే తమ కష్టాలన్నీ తీరిపోయి తమకు సుఖశాంతులు లభిస్తాయని నమ్మే భక్తులు స్వామిజీ కు వేలాదిమంది ఉన్నారు. అందుకే ఆ గంగాజలం కోసం పోటీలు పడుతూ స్వీకరిస్తుంటారు.
***
తన ఆంతరంగిక మందిరంలోకి ప్రవేశించిన స్వామిజీ తన ప్రధాన శిష్యుడైన రాంచంద్ ను పిలిచాడు. స్వామిజీపిలుపుతో పరుగుపరుగున అక్కడికి వచ్చిన రాంచంద్ స్వామిజీ పులిచర్మాలు ఏనుగుదంతాలు అన్నీ సిద్దంగా ఉన్నాయి అని చెప్పాడు. అది విన్న స్వామిజీ సంతృప్తిగా తలాడించి ఒక రహస్య అర లో ఉన్న సెల్ ఫోన్ బయటకు తీసి ఎవరితోనో మాట్లాడటం మొదలుపెట్టాడు.
ఆ రాత్రి స్వామిజీ ఆశ్రమానికి కొద్ది దూరంలో ఒక పెద్ద లారీ వచ్చి ఆగింది. ఆ లారీ నుండి దిగిన వ్యక్తి అక్కడే ఉన్న స్వామిజీ వద్దకు వచ్చి నమస్కరించి తన చేతిలో ఉన్న బ్రీఫ్ కేసును అందచేశాడు. అది తెరిచి చూసిన స్వామిజీ సంతృప్తిగా తలాడించి పక్కనున్న శిష్యులకు సైగ చేశాడు. వారు కొంతదూరంలో దాచి ఉంచిన కొన్ని వస్తువులను మోసుకొచ్చి లారీలో అమర్చసాగారు.
అవన్నీ ఏనుగుదంతాలు ,పులిచర్మాలు.
స్వామీజీ అవతారంలో ప్రజలతో సత్సంబంధాలు పెంచుకొని తద్వారా తన చీకటివ్యాపారాన్ని విస్తరించుకున్నాడు.
తన శిష్యులు అతి రహస్యంగా సేకరించుకు వచ్చే ఏనుగుదంతాలను పులిచర్మాలనే కాక అనేక వస్తువులను “స్మగ్లింగ్ ” ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లాది ఆస్తులను తన ఆశ్రమ నేలమాళిగలలో భద్రపరుచుకునేవాడు.
స్వామిజీకి బ్రీఫ్ కేసును అందచేసిన వ్యక్తి లారీ ఎక్కాడు. స్వామిజీ మిగిలిన శిష్యులు తిరిగి ఆశ్రమం వైపు వెళ్లబోయేంతలో…..
దూరం నుండి ఏదో వెలుగు స్వామిజీ కంటపడింది. అది చూడగానే స్వామిజీ తన దుస్తులలో దాచుకున్న గన్ బయటకు తీశాడు.
శిష్యులు ఆ వెలుగు వచ్చిన వైపు శరవేగంగా పరుగు తీశారు. వారి వెనక స్వామిజీ కూడా వెళ్లసాగాడు.
అక్కడ ఒక వ్యక్తి తన దగ్గరున్న సెల్ ఫోన్ లో బాబా శిష్యులు ఏనుగుదంతాలను పులిచర్మాలను లారీ ఎక్కించడం గమనించి వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఆ చీకటిలో ఫోన్ నుండి ఫ్లాష్ అయిన వెలుతురు స్వామిజీమీద పడి ఆ వ్యక్తిని వెంటాడసాగారు.
వీరిని చూసిన ఆ వ్యక్తి పరిగెత్తడం మొదలుపెట్టాడు. తమ గుట్టు రట్టు అయితే ప్రజలు తనను తన ఆశ్రమాన్ని నామరూపాల్లేకుండా చేస్తారని అనుకుంటున్న అలోక్ స్వామిజీకి ఎలాగైనా ఆ వ్యక్తిని ప్రాణాలతో వదలకూడదని వెంటాడసాగాడు.
అయితే చీకటిలో ఎంతో దూరం పరిగెత్తలేని ఆ వ్యక్తి ఒకచోట పడిపోయాడు. ఆ వ్యక్తి కి దగ్గరగా వచ్చిన స్వామిజీ తన గన్ తో ఆ వ్యక్తిని కాల్చేశాడు. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదులుతూ త్రుటిలో తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ను అల్లంతదూరానికి విసిరేశాడు. ఆ సెల్ ఫోన్ కోసం స్వామిజీ శిష్యులు వెళుతుండగా సర్రున దూసుకొచ్చిన ఒక వాహనం ఆ సెల్ ఫోన్ ను ముక్కలుగా చేసి అంతే వేగంగా అక్కడినుండి వెళ్లిపోయింది.
అది చూసిన స్వామిజీ, శిష్యులు తమ రహస్యం బట్టబయలు కాలేదని సంతోషించి స్వామిజీ చేతిలో బలైన ఆ వ్యక్తిని రోడ్డు మీదకు లాగి ఏమీ ఎరగనట్టు ఆశ్రమానికి వెళ్లిపోయారు.
కానీ ఆ వ్యక్తి స్వామిజీ నుండి తప్పించుకోవడానికి పరిగిడుతున్నపుడు ఒక వీడియోను ఎవరికో పంపించడం తెలియని స్వామిజీయథాప్రకారంగా తన భక్తులకు గంగాజలాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు.
***
గత రాత్రి ఒక మనిషిని కిరాతకంగా బలి తీసుకుని ఏమీ ఎరగనట్టు భక్తులకు గంగాజలం అనబడే నీటిని ప్రసాదిస్తున్న స్వామిజీని చూసి రాంచంద్ కి క్షణకాలం తానుంటున్న ఆశ్రమం మీద విరక్తి కలిగింది.
ఇంకేదో ఆలోచిస్తున్న రాంచంద్ కు భక్తుల మధ్య ఏదో కలకలం వినిపించి అటువైపుగా చూశాడు. అక్కడ ఒక వ్యక్తి స్వామిజీ జై అంటూ ముందుకు రాసాగాడు. స్వామిజీని వద్దకు వచ్చిన ఆ వ్యక్తి తన దగ్గరున్న ఒక చిన్న సంచిని స్వామిజీని ముందు ఉంచిన ఆ వ్యక్తి స్వామిజీని ముందు మోకరిల్లాడు. తెరుచుకున్న ఆ సంచి నుండి బంగారునాణాలు బయటపడ్డాయి. అది చూసిన స్వామిజీని కళ్లు మిరుమిట్లు గొలుపుతుండగా ఆ వ్యక్తిని గమనించాడు. ఆ వ్యక్తి బాగా సంపన్నుడిలా కనిపిస్తూ ఖరీదైన ఆహార్యంలో ఉన్నాడు. స్వామిజీని సైగతో ఆ వ్యక్తిని స్వామిజీ ఆంతరంగికమందిరానికి తీసుకెళ్లాడు రాంచంద్ .
యథాప్రకారం కవచంలా ఏర్పడిన శిష్యులు బాబా ను లోపలికి తీసుకెళ్లారు.
***
స్వామిజీ కోసం వేచి ఉన్న ఆ వ్యక్తి స్వామిజీ ముందు ప్రణమిల్లి ” స్వామిజీ నేను మీ ప్రియభక్తుడను నా పేరు భన్సీలాల్ నాకు వజ్రాలవ్యాపారం ఉంది ” అంటూ తన దగ్గరున్న వజ్రాలను తీసి చూపించాడు.
ఆ వజ్రాలను చూసి కళ్లు బైర్లు కమ్మిన స్వామిజీకి ఆ వజ్రాలను ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఆశ కలిగింది.
అంతలో భన్సీలాల్ స్వామిజీని మీ దగ్గర పులిచర్మం దొరుకుతుందని తెలుసు పులిచర్మం నాకు అందచేస్తే ఈ వజ్రాలన్నీ మీకు ఇస్తానంటూ ఆశ చూపాడు.
అప్పటికే ఆ వజ్రాలు సొంతం చేసుకోవాలనుకున్న స్వామిజీ ముందూ వెనక ఆలోచించకుండా ఒప్పేసుకుని ఆ రాత్రి ఆశ్రమానికి కొద్దిదూరంలో ఉన్న ఒక ప్రదేశంలో వేచి ఉంటే మా శిష్యులు పులిచర్మాన్ని మీకు అందచేస్తారని ఇప్పుడు వజ్రాలు తనకు అందచేసి వెళ్లిపొమ్మని చెప్పిన స్వామిజీ మాటలకు అడ్డంగా తలూపాడు భన్సీలాల్
అలా కాదు స్వామిజీ మీరు పులిచర్మం అందజేయగానే నేను మీకు ఈ వజ్రాలు అందచేస్తానని చెప్పగానే అయిష్టంగా ఒప్పుకున్నాడు స్వామిజీ.
ఆ రాత్రి భన్సీలాల్ ఆశ్రమానికి కొద్ది దూరంలో వేచిఉన్నాడు. కొద్ది సేపటి తర్వాత స్వామిజీ తన శిష్యులతో అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి ఒక లారీ వచ్చి ఆగి ఉంది. ఆ లారీ స్వయంగా ఎక్కిన స్వామిజీ ఒకదానిపై ఒకటి దొంతరలుగా పేర్చి ఉన్న పులిచర్మాలను బయటకు తీయసాగాడు.
అంతలో లారీ బయట ఏదో కలకలం కంగారు పడిన స్వామిజీ లారీ నుండి బయటకు దూకబోయాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.
అక్కడున్న కమాండోలు స్వామిజీని అతడి శిష్యులను అరెస్టు చేశారు. అంతలో అక్కడికి చేరుకున్న మీడియా ఫోటోఫ్లాష్ లు కురిపించసాగింది.
అదంతా బిత్తరపోయి చూస్తున్న స్వామిజీని చూసి నవ్వుతూ తన వేషాన్ని తొలగించాడు భన్సీలాల్ . అతడు మారువేషంలో ఉన్న “డిటెక్టివ్ సిద్దార్థ”
***
స్వామిజీని అరెస్టు చేయడంతోనే మిగిలిన శిష్యులందరూ లొంగిపోయారు. స్వామిజీ ఆశ్రమాన్ని పోలీసు బలగం చుట్టుముట్టారు.
డిటెక్టివ్ సిద్దార్థను చూసిన మీడియా ప్రశ్నలవర్షం కురిపించసాగింది.
స్వామిజీ స్మగ్లింగ్ చేస్తాడని మీకెలా తెలుసు??
స్వామిజీ ఆశ్రమంలోకి అనుమతి లేకుండా చీమ కూడా వెళ్లలేదని చెప్పుకుంటారు మరి మీరెలా ఆశ్రమంలోకి ప్రవేశించారు??
స్వామిజీని ఇలా రెడ్ హ్యాండెడ్ గా ఎలా పట్టించారు??
మీరొక్కరే ఈ టాస్క్ పూర్తి చేశారా??
మీడియా అడుగుతున్న ఈ ప్రశ్నలను వింటున్న సిద్దార్థ అందరినీ ఆగమని సైగ చేసి చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే నిశ్శబ్దం ఆవరించుకున్న ఆ ప్రదేశంలో ఖంగుమంటూ మోగిన సిద్దార్థ కంఠం ఇలా చెప్పడం మొదలుపెట్టింది.
“నేను ఒక రోజు ఫోన్ ఉపయోగిస్తున్న సమయంలో ఒక వీడియో నా ఫోన్ కు వచ్చింది అదేమిటా అని చూశాను. అందులో మారువేషంలో ఉన్న స్వామిజీ తన శిష్యులతో కలిసి పులిచర్మాలను ఏనుగుదంతాలను తరలించడం చూశాను. వీడియో అక్కడితో ఆగిపోయింది. ఆ వీడియోలో ఉన్నది స్వామిజీఅనే నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియో మాత్రమే ఉపయోగపడదని అర్థమైంది. అందుకే భన్సీలాల్ వేషంలో స్వామిజీ ఆశ్రమంలోకి ఆంతరంగిక మందిరంలోకి అడుగుపెట్టాను. గంగాజలం పేరుతో అక్కడున్న నీళ్లసీసాల మధ్య నేను తీసుకెళ్లిన ఒక నీళ్లసీసాను అమర్చాను.
ఆ నీటిసీసా మూతలో ఒక “స్పై కెమెరా” అమర్చబడి ఉంది. అది తెలియని స్వామిజీ యథాప్రకారం తన స్మగ్లింగ్ కార్యకలాపాలను నిర్వర్తించేవాడు. ఆ కెమెరా లో రికార్డయిన దృశ్యాలన్నీ మీకు అందచేస్తాను ఆ దృశ్యాలను ప్రజలకోసం విడుదల చేయండి. లేదంటే స్వామిజీని అరెస్టు చేశారని ప్రజలు తిరగబడే ప్రమాదముందని డిటెక్టివ్ సిద్దార్థ వివరించగానే ఆ ప్రదేశమంతా కరతాళధ్వనులు మారుమ్రోగాయి.
***
(దక్షిణకొరియాలో నీటిసీసాలలో మూతలలో చిన్నపాటి “స్పై కెమెరా” లను అమర్చి యువతుల కార్యకలాపాలను వీడియోలుగా మార్చి ఆన్ లైన్ లో సొమ్ము చేసుకుంటున్నారని తెలిసిన సమాచారం ఆధారంగా)
( వచ్చేవారం మరో డిటెక్టివ్ కథ )
జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
డిటెక్టివ్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్