(10)
అది ఒక గ్రామం. పచ్చని పంటపొలాలతో నిండి ఉంది. పంటలు కోతలకు వచ్చిన సమయం అది. పంట కోయాలంటే పగటిపూట మాత్రమే కోస్తారు. కానీ శనగపంట కోయాలంటే రాత్రి చల్లగా ఉన్న సమయంలోనే కోయాలి. ఎండ సమయంలో మరింతగా పులుపుగా మారే ఆ పంటను కోయలేరు. ఆ రాత్రికి పొలానికి వెళ్లి శనగపంటను కోయాలని 15 మంది మహిళలు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు.
వారందరూ ఇలా మాట్లాడుకున్నారు. పొలాలలో మాత్రమే కాకుండా చీకటి పడగానే ఎక్కడ పడితే అక్కడ చీకటి ఆకారాలు తిరుగడం ఎక్కువయిందనీ రాత్రి సమయాలలో బైట తిరిగేవారు పొలాలకు వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నారు
కారుచీకటి కాటుకదుప్పటిని కప్పుకోవడం మొదలుపెట్టింది. ఆ చీకటిరాత్రిలో ఆ పదిహేనుమంది పొలానికి బయలుదేరారు. వారివెంట ఆ రాత్రి వారికి అవసరమైన సరంజామా కూడా ఉంది.
కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్న వారిలో ఒక మహిళ తాము వెళ్లేదారిలో ఒక పక్కగా ఉన్న నీటిమడుగును చూసింది. అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించడంతో అందరూ ఆగి తమ దగ్గరున్న లైటు వేసి చూశారు. అక్కడ ఎవరో మహిళ పడిపోయి ఉంది. అయ్యో పాపం అనుకుంటూ అందరూ అటు వెళ్లబోయారు. అంతలో వారిలో ఒక మహిళకు ఏదో అనుమానం వచ్చింది.
ఆమెకు దగ్గరగా వెళ్తున్న అందరినీ వారించి తాము పంట కోయడానికి వెంట తెచ్చుకున్న కొడవళ్లను చేతిలో పట్టుకుని ముందుకు నడవమని హెచ్చరించింది. అలా ఎందుకు చేయాలో అర్థమయ్యి కానట్టుంది వారికి. మారుమాట్లాడక అందరూ అలా ముందుకు సాగారు.
వారు వెళ్లిన దారిలోనే ఒక వ్యక్తి సైకిలు మీద వస్తున్నాడు. అతను ఆ నీటిమడుగు దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది. దగ్గరగా వచ్చాక చూస్తే ఒక మహిళ. సైకిలు దిగకుండానే ఆ వ్యక్తి ఆమెను పలకరించాడు. ఇక్కడెందుకున్నావు ? అని అడిగాడు. ఆ మహిళ ఏమీ బదులివ్వలేదు. ఆ వ్యక్తి ముందుకు సాగిపోయి నీటిమడుగు దాటగానే…
ఆ వ్యక్తి కి వెనుకనుండి ఒక వికృతమైన నవ్వు గుండెలవిసేలా వినిపించింది. వెంటనే ” ఇనుము మీద కూర్చుని నువ్వు ఇనుము చేతిలో పట్టుకుని ఆ పదిహేనుమంది మహిళలు తప్పించుకుని బ్రతికిపోయారనే” మాటలు వినిపించాయి..
ఆ మాటలు విన్న ఆ వ్యక్తికి భయంతో వణుకు మొదలైంది. వెంటనే అక్కడినుండి గాలితో సమానంగా వెళ్లడం మొదలుపెట్టాడు. కానీ అది కొంతదూరం మాత్రమే. కొంచెం ముందుకు వెళ్లగానే సైకిలు వెళ్లకుండా మొరాయిస్తోంది.
సైకిలు వదిలేస్తే తన ప్రాణానికే ముప్పు అనే విషయాన్ని భయం మరిచిపోయేలా చేసింది. అంతే సైకిలు అక్కడే వదిలేసి పరుగెత్తడం ప్రారంభించాడు. అలా వెళ్లి చివరకు అక్కడ వెళుతున్న ఆ పదిహేనుమంది కంటే ముందుకు వెళ్లి పడిపోయాడు. ఉలిక్కిపడిన వారందరూ అతడెవరా అని చూడటానికి ప్రయత్నిస్తుండగా ఒక పక్క నుండి ఏదో కలకలం వినిపించింది. అటుపక్కగా చూసిన అందరూ ఒక్కసారిగా వణికిపోయారు. అక్కడ పదుల సంఖ్యలో తలలపై మండుతున్న మంటలతో కొరివిదయ్యాలు. వీరిని చూసిన అవన్నీ వీరివైపు రావడం మొదలుపెట్టాయి. ప్రమాదాన్ని శంకించిన ఒక మహిళ వెంటనే తమ వెంట తెచ్చుకున్న కాగడాను వెలిగించింది. అంతే వాటికి అడుగు ముందుకు పడటం లేదు.
వారి ముందు పడిపోయిన వ్యక్తి మెల్లిగా లేచాడు. కలలో ఉన్న వాడి మాదిరిగా అడుగులు వేస్తున్నాడు. అతడి అడుగులు కొరివిదయ్యాల వైపు పడుతున్నాయి. పదిహేనుమంది మహిళలు అదంతా చూస్తునే ఉన్నారు. అతడిని వారించాలని అనుకుంటున్నారు. కానీ ఎవరికీ భయంతో నోరు పెగలడం లేదు. మాట బయటికి రావడం లేదు. మెల్లిగా అతడు ఒక రూపు సంతరించుకుంటున్నాడు. కొరివిదయ్యంగా మారి వాటితో కలిసిపోయాడు. చూస్తున్న అందరూ కొయ్యబారిపోయి నిలబడిపోయారు!!
ఒక గ్రామంలో 20 సంవత్సరాల క్రిందట జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా!!
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్