వాటి తర్వాత ముందుకు ఒకే ఒక్క కిటికీ ఉంది అది కూడా 13 ఆకారంలో ఉంది. అది చూడాలని దానిమీద చేయి వేశాడు విల్సన్.. అంతే .హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకుల కోసం ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి … థర్టీన్ 13 (ఘోస్ట్ స్టోరీస్) 17-03-2018

(13 )
అది ఒక రాజమహలు. పర్యాటకులకు అదొక దర్శనీయ ప్రదేశం. ఎన్నో వందల గదులున్న ఆ రాజసౌధంలో పూర్వం రాజులు వాడిన వస్తువులతో కూడిన మ్యూజియం ను చూడటానికే చాలామంది వస్తుంటారు.
అక్కడున్న అనేక గదులలో రకరకాల కళాఖండాలు.. ఎన్నో చిత్రాలు ఎన్నో శిల్పాలున్నాయి. అయితే సాయంత్రం వరకూ మాత్రమే ప్రవేశం ఉన్న ఆ రాజమహలుకు రాత్రిసమయంలో ప్రవేశం నిషేధించబడింది.రాత్రిపూట అక్కడ శిల్పాలు చిత్రాలు ప్రాణం తో తిరుగుతూ కనిపించిన వారిని ప్రాణం తీస్తాయని ఒక కథ ప్రచారంలో ఉండటమే అందుకు కారణం. పగలు మనుషులతో కిటకిటలాడే ఆ మహలు రాత్రిపూట దెయ్యాలనిలయమనీ చెప్పుకుంటారు.
ఆ మహలు చూడటానికి విల్సన్ తన స్నేహితులతో అక్కడకు వచ్చాడు. అక్కడున్న అన్నీ చూసుకుంటూ ఆశ్చర్యపడుతూ ముందుకు వెళుతున్నారు. అక్కడ ఏ వస్తువునూ ఎవరూ  తాకకుండా కాపలాదారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలా వెళుతున్న విల్సన్ ను ఒక గది ఆకర్షించింది. ఆ గదికి తాళం తెరిచి ఉంది . అక్కడెవరూ లేరు ఆ గది బయట ప్రవేశం నిషిద్దం అని రాసి ఉంది. కుతూహలం పెరిగిన విల్సన్ స్నేహితులకు చెప్పి ఆ గదిలో ప్రవేశించాడు. అక్కడున్న వస్తువులను చూడటంలో మునిగి ఉన్న వారు సరే అంటూ అక్కడున్న శిల్పాలను చూడటంలో మునిగిపోయారు
అలా ఆ గదిలోకి ప్రవేశించిన విల్సన్ అలా ముందుకు నడవసాగాడు. ఆ గది చాలా పొడవుగా ఉంది. ఇంకొంత ముందుకు వెళ్లాక అక్కడ ఒక విచిత్రమైన తలుపులు కనిపించాయి. అవి నంబరు “13” ఆకారంలో ఉన్నాయి. ఒక తలుపు ఒకటి ఆకారంలో ఇంకో తలుపు మూడు ఆకారంలో చెక్కబడి ఉన్నాయి. వాటికి గడియ కానీ తాళం కానీ ఏమీ లేదు. వాటిని తెరవడానికి ప్రయత్నించినా అవి తెరుచుకోలేదు. ఆ గది అంతా పరికించి చూశాడు విల్సన్ అక్కడేవో వింత వస్తువులు పరికరాలు అనేకం ఉన్నాయి. అవన్నీ 13 ఆకారంలోనే ఉన్నాయి. వాటి తర్వాత ముందుకు ఒకే ఒక్క కిటికీ  ఉంది అది కూడా 13 ఆకారంలో ఉంది. అది చూడాలని దానిమీద చేయి వేశాడు విల్సన్.. అంతే 13 నంబరు వాకిలి కిర్రుమంటూ తెరుచుకుంది. ఆశ్చర్యపోయిన విల్సన్ లోపలికి అడుగుపెట్టాడు.
అంతలోపు సాయంత్రం అయినందున సందర్శకులను బయటికి పంపించేస్తున్నారు. విల్సన్ స్నేహితులు విల్సన్ ఎప్పుడో బయటికి వెళ్లిఉంటాడని అనుకుని వచ్చేశారు. విల్సన్ లోపలే ఉండిపోయిన విషయం అక్కడున్న వస్తువులకు తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు.
 లోపలికి అడుగుపెట్టిన విల్సన్ అక్కడున్న వింతశిల్పాలను చిత్రాలను భయంగా ఆశ్చర్యంగా చూస్తున్నాడు.  అవన్నీ భయం గొలిపే విధంగా ఉన్నాయి. ఇంతలో బయట చీకటి పడింది. విల్సన్ చూస్తున్న ఆ శిల్పాలు చిత్రాలు కదలడం మొదలుపెట్టాయి. అవన్నీ మెల్లిగా విల్సన్ దగ్గరగా కదులుతున్నాయి. అది చూసిన విల్సన్  భయంతో ఆగదిలో పరుగెత్తడం మొదలుపెట్టాడు. అవన్నీ అతడెటు వెళితే అటుపక్క వస్తున్నాయి. అలా పరిగెడుతూ విల్సన్ అక్కడున్న ఒక గోడకు గుద్దుకున్నాడు. అంతే ఆ గోడలో ఉన్న వాకిలి తెరుచుకుని విల్సన్ అవతలికి పడిపోయాడు. ఆ గోడ మూసుకుపోయింది. అక్కడొక దారి ఉంది ఆ దారిలో వెళుతూ వెనక్కి తిరిగి చూశాడు
 వెనుక ఎవరూ లేరు. ఊపిరి పీల్చుకున్న విల్సన్ అక్కడనుండి బయట పడటానికి దారి వెతుక్కుంటున్నాడు. కానీ ఏ విధమైన దారి లేదు. అలా ముందుకొచ్చిన విల్సన్ కు ఒక చోట భూగర్భంలోకి మెట్లు కనిపించాయి. వెలుతురు మసగ్గా ఉంది. ఆ మసక వెలుతురు లో మెట్లు దిగి వెళితే బయటికెళ్లే దారి ఉంటుందని ఆశపడి మొదటిమెట్టుమీద అడుగు పెట్టాడు. అదే సమయంలో ఆ మహలును కారుమబ్బులు కమ్ముకున్నాయి. తీతువుపిట్టలు గుడ్లగూబలు భయానకంగా అరిచాయి.
మొదటిమెట్టు దిగి రెండో మెట్టుమీద అడుగేశాడు. అంతలో ఆ మొదటిమెట్టు భయంకరమైన ఆకారాన్ని సంతరించుకుంది. మూడో మెట్టు మీద అడుగు పెట్టేసరికి రెండో మెట్టు ఆకారంగా మారింది. అవేమీ తెలియని విల్సన్ మెట్లు దిగుతున్నాడు. అలా అక్కడున్న పన్నెండు మెట్లు దిగేసరికి పన్నెండు భయంకరమైన ఆకారాలు విల్సన్ ను చుట్టుముట్టాయి..
ఆ రాత్రి గడిచింది. ఆ మహలు యథావిధిగా సందర్శకుల కోసం సిద్దమైంది.
విల్సన్ ఇంటికి రాలేదని తెలుసుకున్న స్నేహితులు మళ్లీ ఆ మహలుకు వచ్చారు
విషయం తెలుసుకున్న అధికారులు కెమెరా పుటేజిని పరిశీలిస్తున్నారు. అంతలో విల్సన్ నిషేధించిన గదిలోకి అడుగు పెట్టడం కనిపించింది. కంగారు పడిన అధికారులు కాపలాదారులను పిలిపించారు. వారి నిర్లక్ష్యం వలన విల్సన్ లోపలికి అడుగు పెట్టాడంటూ ఇద్దరిని విధులనుండి తొలగించారు. తర్వాత విల్సన్ ను వెతకడానికి ఆ గదిలోకి వారందరూ వెళ్లారు. 13 నంబరు ఆకారంలో ఉన్న గది తలుపులు తీశారు. అక్కడ శిల్పాలు మిగిలిన వస్తువులు యథాతథంగా ఉన్నాయి. రాత్రిపూట ఆ శిల్పాలు ప్రాణంతో కదులుతాయంటే ఎవరూ నమ్మలేరు. 
ఆ గది అణువణువూ పరిశీలించిన వారికి విల్సన్ ఎక్కడా కనిపించలేదు. అక్కడ గోడను తాకితే అది తెరుచుకుంటుందని ఏ మాత్రం ఊహించలేని అధికారులు బయటకు వచ్చి ఆ గదికి తాళం వేసారు. విల్సన్ ఎక్కడున్నాడో ఏమయ్యాడో ఎవరికీ తెలిసే అవకాశం లేదు.
అక్కడ 13 వ మెట్టుగా మారిన విల్సన్ 14 వ మెట్టుగా మారడానికి ఎవరు అక్కడికి వస్తారా అని మిగిలిన ఆకారాలతో కలిసి వేచిఉన్నాడు!!
అమెరికా అధ్యక్షభవనం వైట్  హౌస్ లో దెయ్యాలున్నాయన్న  కథనం తెలిసిన సమాచారం ఆధారంగా!!

ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/book/Ghost+Stories+13

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY