కమండలంలోని మంత్రజలం విజయుడి దోసిట్లోకి పడిపోతూ ..వేనవేల కాంతులతో దోసిలిలో నుంచి నేలమీద పడకుండా అదృశ్యమైపోసాగింది…శ్రీసుధామయి ” జ్వాలాముఖి…మంత్రాలదీవి “

2
డవిమధ్యలో అమ్మవారి కోవెలలా పర్ణకుటీరం…పచ్చికబయళ్ళు..పరుగులు తీసే హరిణిలు…లేగదూడలు..పాడినిచ్చే ఆవులు..పూల ఫలవృక్షాలతో ఆ ఆశ్రమప్రాంతం నిత్యశోభితమై వుంది.
అది సుధర్మ మహర్షుల వారి గురుకులాశ్రమం. సకలశాస్త్రపారంగతులు సకలకళాకోవిదులు మహా మహిమాన్వితులు అయిన సుధర్ముల వారి వద్దకు పలుదేశాల రాకుమారులు మాత్రమే కాకుండా విద్యలపై ఆసక్తి ఉన్నవారు శిష్యులుగా చేరేవారు అక్కడ సకల విద్యలు నేర్చుకుంటారు.
సుధర్ములవారు బీద ధనిక తేడా లేకుండా అందరికీ సమానంగా విద్యలను ప్రసాదిస్తూ నిష్ణాతులను గావించేవారు.
ఆశ్రమం అనేకరకాల పక్షుల కిలకిలరావాలతో ప్రశాంతవాతావరణంతో కూడి ఆహ్లాదకరంగా అగుపించేది.
ఆ వేళ అనేకదేశాల రాకుమారులు తమ విద్యాభ్యాసం ముగించుకుని ఆశ్రమం నుండి వీడ్కోలు తీసుకునే సమయం ఆసన్నమైంది.సుధర్ములవారు అందరినీ పిలిచి తమ తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించమని కోరారు. తమ తమ విద్యలలో నిష్ణాతులైన అందరూ తమ నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. కోసల యువరాజైన విజయుడి వంతు వచ్చింది. విజయుడు తన అనుంగుమిత్రుడు చిన్ననాటిచెలికాడు అయిన విక్రముడితో కత్తియుద్దంలో తలపడ్డాడు.
ఆశ్రమవాసులు సహమిత్రులు ఖడ్గవిద్యలో ఆ మిత్రుల …మహావీరుల సాహసం చూడాలని తహతహలాడుతున్నారు.
విజయుడు విక్రముడు గురువుగారి పాదాలకు నమస్కరించి బరిలోకి దిగారు.రెండుకత్తులు దూసుకున్నాయి,ఖడ్గవిన్యాసం మొదలైంది.
ఇద్దరూ హోరాహోరీగా కత్తియుద్దంలో తలపడ్డారు. ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోని విధంగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
విజయుడు లాఘవంగా తన కరవాలాన్ని తిప్పుతున్నాడు. గాలిని కోస్తూ కంటికి కనిపించని వేగంతో ఒడుపుగా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న తీరును చూసి సుధర్ములవారు మాత్రమే కాక సహాధ్యాయులంతా ఆశ్చర్యపోయి చూస్తుండిపోయారు. విక్రముడు కూడా తక్కువ తినకుండా విజయుడుతో సమానంగా ఉన్నాడు.
విజయుడి కరవాలం పైకి లేచింది.విక్రముడు కరవాలాన్ని నేలకూల్చడమే లక్ష్యంగా…
సరిగా అప్పుడు ఊహించని సంఘటన ఒకటి జరిగింది.
ఎక్కడి నుంచి వచ్చిన ఒక రంగురంగుల చిలుక విక్రముడు చేతిమీద వాలింది…లిప్తకాలంలో విజయుడు తేరుకున్నాడు…తనకరవాలాన్ని నేలమీదికి జారవిడిచారు.
తను ఏమాత్రం ఏమరుపాటు చూపించినా తన కరవాలం ధాటికి ఆ చిలుక శరీరం నేలకూలిపోక తప్పదు.
విజయుడు గెలుస్తాడని అనుకున్న సహమిత్రులు విక్రముడు గురుదేవులు సైతం ఈ దృశ్యాన్ని చూసి విస్తుపోయారు.
సుధర్ములవారు విజయుడిని దగ్గరగా పిలిచి ..
“కరవాలాన్ని నేలవిడిచావు,,అది నీ ఓటమి అని తెలియదా? అడిగాడు
విజయుడు వినమ్రుడై”మన్నించాలి గురుదేవా..మీకు తెలియని మానవతాధర్మామా ?
క్షత్రియధర్మం కన్నా,గెలుపుకన్నా మానవతాఃర్మమే అన్ని ధర్మాలలో మిన్న అని మీరే సెలవిచ్చారు.నేను మీ శిష్యుడిని..ఈ చిలుక ఎచటి నుంచో మన ఆశ్రమానికి అతిథిగానో ఆశ్రయాన్ని కోరో..దారి తప్పో వచ్చి ఉంటుంది.నా గెలుపు కోసం రావాలని ఝళిపిస్తే చిలుక ప్రాణం కోల్పోతుంది..నా కరవాలం ధాటికి నా మిత్రుడి హస్తం నేలరాలితే…నాకు గెలుపు కన్నా ఒకరిప్రాణం కాపాడడం రాజధర్మం కదా ఆచార్యా…అది మానవధర్మం కదా?చేతులు జోడించి అన్నాడు
” నీ సూక్ష్మబుద్ధికి ..నీ మానవతాధర్మానికి మిక్కిలి సంతోషం నాయనా..నీ తండ్రిగారు నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాను..అస్త్రశస్త్ర విద్యల్లో నిష్ణాతుడివి అయ్యావు..,సకల విద్యాపారంగతుడివిగా ఈ ఆశ్రమం నుంచి వెళ్తున్నావు..
నీవు అన్ని విద్యలతో పాటు నేను నేర్పించని మానవతావిద్యను కూడా అభ్యసించావంటూ నీ ఉన్నతమైన మనసుకు కడుసంతోషం.నాయనా విజయుడా .. ఇప్పుడు నేను నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను..ఈ మంత్రప్రభావము చేత నీవు కోరుకున్నది సంప్రాప్తిస్తుంది.ఆపదసమయంలో నిన్ను ఆదుకుంటుంది.ఈ మంత్రం ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది…ఇలా దగ్గరకు రానాయనా..నాకు నా గురుదేవులు వారికి వారి గురుదేవులు ఉపదేశించిన ఈ మంత్రోపదేశం ఈ మంత్రశక్తి ఇప్పుడు నీకు ధారపోస్తున్నాను..స్వీకరించు” మంత్రాన్ని ఉపదేశిస్తాను అది నీకు అత్యవసరసమయాలలో ఒక్కసారి మాత్రమే ఉపయోగపడుతుంది
విజయుడు చేతులు జోడించాడు…సుధాములు కళ్ళు మూసుకున్నాడు.కమండలంలోని మంత్రజలం విజయుడి దోసిట్లోకి పడిపోతూ ..వేనవేల కాంతులతో దోసిలిలో నుంచి నేలమీద పడకుండా అదృశ్యమైపోసాగింది.
విజయుడిలో చిన్న గగుర్పాటు..తెలియని గొప్పశక్తి తనలోకి వచ్చి చేరినట్టు అనిపించింది.అతని శరీరాన్ని ఒక కాంతివలయం చుట్టేసింది…గురుదేవుల పెదవులు మంత్రాలను ఉచ్చరిస్తున్నాయి..అవి గాలిలో ప్రయాణించి విజయుడి కర్ణభేరిని తాకాయి.
***
బయల్దేరండి నాయనలారా..విక్రమా నీ మిత్రుడికి చేదోడుగా ఉండి మిత్రధర్మాన్ని పాటించు…మీ మైత్రి కకాలం వర్థిల్లుగాక.” .అని విజయుడి వైపు తిరిగి..
“విజయోస్తు…నీ తండ్రి అభీష్టం మేర సింహాసనాన్ని అధిష్టించి జనరంజకమైన పాలనతో యశోచంద్రికలతో వర్ధిల్లు నాయనా”అని దీవించాడు.
(సశేషం )

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY