అంత కట్టుదిట్టమైన కాపలా ల మధ్య కూడా ఆ వేళ వజ్రాలు పొదిగిన మూడడుగుల మురుగన్ విగ్రహం మాయమైపోయింది. …శ్రీసుధామయి అపరాధ పరిశోధన కథ ” బ్లాక్ ” సీక్రెట్ (16-12-2018)

కుల్దీప్ సింగ్ తను ఏర్పాటు చేసిన మ్యూజియంలోకి అడుగుపెట్టాడు. తను ఎంతో కష్టపడి దేశదేశాలనుండి సేకరించిన ఎన్నో వస్తువులను శిల్పాలను కళాఖండాలను ప్రజల సందర్శనార్థం మ్యూజియం ఏర్పాటు చేశాడు.
అది రెండంతస్తుల భవనం. ఆ భవనం మొదటి అంతస్తులో ఎన్నో పురాతన వస్తువులు పేర్చబడి ఉన్నాయి. వాటిలో ఎన్నో రకాల వస్తువులు బొమ్మలు శిల్పాలు కళాఖండాలున్నాయి. అవన్నీ అత్యంత విలువైనవి దేశవిదేశాల నుండి సేకరించినవి. రెండవ అంతస్తులో మరింత విలువైన బంగారంతో చేసిన శిల్పాలు, అత్యంత విలువైన మణులు మాణిక్యాలు , వజ్రాలతో తాపడం చేసిన చిన్నవి పెద్ద శిల్పాలు వాటన్నిటినీ ఎవరూ తాకడానికి వీలు లేకుండా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నాయి. వాటన్నిటినీ సేకరించి ఆ రెండంతస్తులను మ్యూజియంగా మార్చిన కుల్దీప్ సింగ్ తన ఛేంబర్ లో సిసి కెమెరాలు అమర్చబడి ఉన్న ఆ రెండంతస్తులను కంప్యూటర్ లో జాగ్రత్తగా గమనిస్తున్నాడు.
***
మ్యూజియంలో ఉన్న వస్తువులపై ఎవరైనా చేయి వేస్తే కనీసం వాటిపై ఈగ వాలినా కూడా అలారం మోగేటట్టూ అందరూ అప్రమత్తమయ్యేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు కుల్దీప్ సింగ్ . తన మ్యూజియాన్ని ఎప్పటికప్పుడు రకరకాల హంగులతో ఆకర్షణలతో నింపేవాడు. ఏదైనా పండగ వస్తే అందుకు తగ్గట్టు మ్యూజియాన్ని అలంకరించి అక్కడికి వచ్చే వారికి లాటరీ పద్దతిలో చిన్నచిన్న గిఫ్టులు ఇవ్వడం చిన్నపిల్లలకు చాక్లెట్లు పంచడం లాంటివి చేసేవాడు. కుల్దీప్ సింగ్ అనుసరిస్తున్న పద్దతులకు అందరూ బాగా ఆకర్షితులై మ్యూజియం చూడటానికి ఎగబడి వచ్చేవారు.
అలా మ్యూజియం ఎప్పుడూ సందర్శకులతో ఎంతో సందడిగా ఉండేది. అక్కడ అడుగడుగునా ఉండే కాపలాదారులు ఎంతో జాగ్రత్తగా కాపలా ఉండేవారు. వచ్చిన సందర్శకులు ఏ వస్తువునూ తాకకుండా చూసుకునేవారు. వారందరినీ కుల్దీప్ సింగ్ తన కంప్యూటర్ లో పరిశీలిస్తూ ఉండేవాడు.

క్రిస్టమస్ నెల. క్రిస్టమస్ సంబరాలు మొదలయ్యాయి. కుల్దీప్ సింగ్ తన మ్యూజియంలో పెద్దదైన క్రిస్టమస్ ట్రీని ఏర్పాటు చేశాడు. ఆ చెట్టు ఎంతో ఆకర్షణీయంగా ఉండటమే కాక ఆ చెట్టుకొమ్మలకు అక్కడక్కడా చాక్లెట్లు వేలాడుతున్నాయి. అక్కడకు వచ్చే పిల్లలు పెద్దలు వాటిని చూసి ఎంతో ముచ్చట పడుతూ మరీ మరీ రావడం మొదలుపెట్టారు.

రెండో అంతస్తులో అక్కడున్న శిల్పాలకు కొద్దిదూరంలో శాంటాక్లాజ్ బొమ్మలను పెట్టించాడు కుల్దీప్ సింగ్ . దూరం నుండి చూస్తే అక్కడ నిజమైన శాంటాక్లాజ్ వేషాలు వేసుకున్నారేమో అన్నట్టుగా ఆ బొమ్మలన్నీ సహజత్వం ఉట్టిపడుతున్నాయి.
***
ఆ రోజు క్రిస్టమస్ కుల్దీప్ సింగ్ మ్యూజియంలో పని చేసే అందరూ అక్కడే క్రిస్టమస్ వేడుకలను జరుపుకుంటున్నారు. అక్కడికి వచ్చిన సందర్శకులు కూడా ఆ వేడుకలలో కలిసిపోయారు. వేడుకలు ముగిసాక ఆ రోజు అందరికీ సెలవు ప్రకటించాడు కుల్దీప్ సింగ్ . అందరూ సంతోషంగా ఇళ్లకు వెళ్లిపోయారు. అందరూ అక్కడనుండి వెళ్లిపోయిన తర్వాత కుల్దీప్ సింగ్ తీరికగా అన్నీ పరిశీలించడం మొదలుపెట్టాడు.
మొదటి అంతస్తులోని పురాతన వస్తువులన్నీ పరిశీలిస్తూ రెండో అంతస్తులోకి అడుగుపెట్టాడు.
అక్కడున్న బంగారు శిల్పాలను వజ్రాలు పొదిగిన కళాఖండాలను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్న కుల్దీప్ సింగ్ ఒకచోట ఉలిక్కిపడి ఆగిపోయాడు. కారణం అక్కడ ఉండాల్సిన రెండడుగుల శ్రీకృష్ణుని బంగారు విగ్రహం లేదు. ఆ విగ్రహం లేకపోవడం చూసి కలత చెందిన కుల్దీప్ సింగ్ అక్కడ అంతా పరిశీలించాడు.
కనీసం అలారం కూడా మోగలేదు. శ్రీకృష్ణుని విగ్రహం ఎలా మాయమయ్యిందో అర్థం కాలేదు. పోనీ ఎవరైనా తాకితే అలారం హెచ్చరించి ఉండేది. అది కూడా జరగలేదు. మరి విగ్రహం ఎలా మాయమయ్యిందో తెలియక కుల్దీప్ సింగ్ ఖిన్నుడై అలాగే ఉండిపోయాడు. మరుసటిరోజు వచ్చిన పనివారిని కాపలాదారులను అందరినీ అడిగి చూశాడు కానీ వారందరూ ఆశ్చర్యపోయి విగ్రహం ఎలా మాయమయిందో తెలియదని తేల్చేశారు.
***
కృష్ణుని విగ్రహం మాయమయ్యాక కుల్దీప్ సింగ్ కాపలాను మరింత కట్టుదిట్టం చేశాడు. ఎంతో జాగ్రత్తగా కాపలా ఉండమని అందరినీ హెచ్చరించాడు. కుల్దీప్ సింగ్ కూడా సిసి కెమెరాలలో రికార్డు అయిన వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటున్నాడు.
అంత కట్టుదిట్టమైన కాపలా ల మధ్య కూడా ఆ వేళ వజ్రాలు పొదిగిన మూడడుగుల మురుగన్ విగ్రహం మాయమైపోయింది. అదెలా మాయమయిందో అర్థం కాక కుల్దీప్ సింగ్ నిశ్చేష్టుడై ఉండిపోయాడు. అంతలో అక్కడికి వచ్చిన కుల్దీప్ సింగ్ ప్రాణస్నేహితుడైన చేతన్ సింగ్ తన స్నేహితుడి బాధ చూసి విగ్రహాలు ఎలా మాయమయ్యాయో తెలుసుకోవడానికి “డిటెక్టివ్ సిద్దార్థ” కు సమస్యను అప్పచెప్పాడు.

* * *
చేతన్ సింగ్ కుల్దీప్ సింగ్ ఇరువురూ ప్రాణస్నేహితులు. కుల్దీప్ సింగ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసినప్పుడు చేతన్ సింగ్ విగ్రహాలను కళాఖండాలను తెప్పించడంలోనూ అమర్చడంలోనూ కుల్దీప్ సింగ్ కు ఎంతగానో సహాయపడ్డాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మీదట డిటెక్టివ్ సిద్దార్థ మ్యూజియంలోకి అడుగుపెట్టాడు.

కొన్ని గంటల తర్వాత డిటెక్టివ్ సిద్దార్థ వెంట కుల్దీప్ సింగ్ ఛేంబర్ లో అడుగుపెట్టిన కమాండోలు చేతన్ సింగ్ ను అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు. ఏ మాత్రం ప్రతిఘటించకుండా మారుమాట్లాడక వెళుతున్న చేతన్ సింగ్ ను చూసి నివ్వెరపోతూ డిటెక్టివ్ సిద్దార్థను ఏమిటి మీరు చేస్తున్న పని నా ప్రాణ స్నేహితుడిని ఎందుకు అరెస్టు చేశారని అడిగిన కుల్దీప్ సింగ్ కు డిటెక్టివ్ సిద్దార్థ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.
***
” చేతన్ సింగ్ తన స్నేహితుడు కుల్దీప్ సింగ్ సంపాదించిన వస్తువులు కళాఖండాలని చూసి అబ్బురపడేవాడు. అందులో కొన్ని శిల్పాలను తనకు అమ్మేయమని అడగడం మొదలుపెట్టాడు చేతన్ సింగ్ . తనెంతో కష్టపడి ఇష్టపడి సేకరించిన వాటిని అమ్మడానికి ఏ మాత్రం ఒప్పుకోలేని కుల్దీప్ సింగ్ ను చూసి ఏమీ అనలేక అదను కోసం ఎదురు చూశాడు చేతన్ సింగ్ . క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న చేతన్ సింగ్ ఒక ప్లాన్ ను తయారు చేసుకున్నాడు అందులో భాగంగా చేతన్ సింగ్ మనిషి ఒకడు శాంటాక్లాజ్ వేషం వేసుకుని రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన శాంటాక్లాజ్ బొమ్మల మధ్య కలిసిపోయాడు. అన్ని బొమ్మలు సహజంగా ఉండటం చేత చేతన్ సింగ్ మనిషిని గుర్తు పట్టే పరిస్థితి లేకపోవడం వాడికి కలిసి వచ్చింది. రాత్రి కాగానే అక్కడున్న సిసి కెమెరాకు ఒక పక్కనుండి నల్లటి బట్టను కప్పేసి అక్కడనుండి ఆ బంగారు విగ్రహాల వద్దకు వెళ్లి వాటి చుట్టూ “పాదరసం” పోసేవాడు. తర్వాత ఏమీ తెలియనట్టు సిసి కెమెరాలకు అడ్డం వేసిన నల్లటి బట్టను తొలగించి తిరిగి శాంటాక్లాజ్ వేషంలో బొమ్మల మధ్యలో చేరేవాడు. బంగారాన్ని తాకిన పాదరసం క్రమక్రమంగా బంగారాన్ని తినేసేది. ఆనవాలు కూడా మిగలకుండా బంగారం మొత్తం పాదరసంలో కరిగిపోయేది. శ్రీకృష్ణుని విగ్రహం మొత్తం అలాగే కరిగిపోయింది. తర్వాత మురుగన్ విగ్రహం కూడా అలాగే కరిగిపోయింది. మురుగన్ విగ్రహానికున్న వజ్రాలు ఇదిగో అంటూ అక్కడనుండి జారుకోవాలని చూస్తున్న ఒక వ్యక్తిని ముందుకు లాగి అతని దగ్గర ఉన్న వజ్రాలను స్వాధీనం చేసుకున్నాడు డిటెక్టివ్ సిద్దార్థ. ”
అంతా నివ్వెరపోయి వింటున్న కుల్దీప్ సింగ్ ఇదంతా ఎలా కనిపెట్టారు అని గొంతు పెగుల్చుకుని అడిగాడు డిటెక్టివ్ సిద్దార్థను.
అందుకు ఏమీ మాట్లాడకుండా కుల్దీప్ సింగ్ ఛేంబర్ కు వెళ్లి సిసి పుటేజీ ఆన్ చేశాడు సిద్దార్థ. అందులో అందరూ సందర్శకులు కాపలాదారులతో సహా క్రిస్టమస్ చెట్టు చుట్టూ మూగిన పిల్లలు అందరు ఉన్నారు. కానీ ఒకచోట కొన్ని క్షణాలపాటు సిసి పుటేజీ ఏమీ లేకుండా నల్లగా ఉండటం కనిపించింది.
నల్లగా కనిపించిన ఆ కొన్ని క్షణాలలో చేతన్ సింగ్ మనిషి విగ్రహం చుట్టూ పాదరసం పోసేవాడని చెప్పిన డిటెక్టివ్ సిద్దార్థ మాటలు విని ఆశ్చర్యచకితుడై నిలబడిపోయాడు కుల్దీప్ సింగ్ !!

( వచ్చేవారం మరో డిటెక్టివ్ కథ )

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

డిటెక్టివ్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY