అమ్మ గుర్తొచ్చి గొంతు బొంగురుపోయింది. నాన్న గుర్తొచ్చి కన్నీటి గోదారి పొంగి కనుకొలుకులపై జారిపోయింది..రాధాప్రశాంతి

(పరువు ప్రతిష్ట సినిమాతో తెరంగేట్రం చేసి,హీరోయిన్ గా కీలకమైన పాత్రల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన రాధాప్రశాంతి ఇపుడు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టింది.తన బాల్యం గురించి రాధా ప్రశాంతి చెప్పిన విషయాలు ..చీఫ్ ఎడిటర్ )

ఆకాశంలో చందమామను చూపించి “చందమామ రావే…మా కృష్ణవేణి కి బోల్డు బొమ్మలు తీసుకురావే”అన్న అమ్మ లాలిపాట విన్న జ్ఞాపకం…
చిట్టి పొట్టి గౌనులతో పొలాల వెంట…పువ్వుల తోటల వెనుక పరిగెత్తిన జ్ఞాపకం…
బొమ్మలంటే ఇష్టం…అందుకే అ మాట్లాడలేని బొమ్మలా నన్ను ఆ దేవుడు మార్చాడా?
బొమ్మల పెళ్ళిలో పంచదారతో చిలకలు చేసేయాలని అమ్మ చేతిలో చావు దెబ్బలు తిన్న తియ్యటి జ్ఞాపకం…
అందమైన బాల్యాన్ని ఇచ్చిన ఆ దేవుడు అప్పుడపుడూ…బాధ పెట్టె భవిష్యత్తునూ ఇస్తాడా?
నా బాల్యాన్ని వెనక్కి తీసుకు వెళ్తోన్న కాలయంత్రానికి నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు..
నా జ్ఞాపకాల తోటలో నేనే తోటలోని పూలని ..నేనే తోటమాలిని…
ప్రతీ జ్ఞాపకం ఒక పుష్ప విలాపమేనా ?
****
అమ్మ గుర్తొచ్చి గొంతు బొంగురుపోయింది.
నాన్న గుర్తొచ్చి కన్నీటి గోదారి పొంగి కనుకొలుకులపై జారిపోయింది
****
పువ్వులు కోసుకురావాలి.పూజారి చూస్తే వీపు విమానం మోత….తెల్లవారు ఝామునే మా దొంగతనానికి ముహూర్తం.వేకువ సమయం..నాలుగు దాటింది.నేను మా పిల్ల గ్యాంగ్ కదిలాం.ఒక్కొక్కర్కి ఒక్కో చెట్టు….ఓ వైపు పూజారి వస్తాడన్న భయం..మరో వైపు త్వరగా పువ్వులు కోసేయాలి.పూలు తెంపడం …గౌనులో పోసుకోవడం.అప్పుడప్పుడు దొంగ చూపులు..
దొరికితే తీర్థం,ప్రసాదం రెండూ తప్పవు.
ఇంకా తెల్లవారనే లేదు…గబా గబా పువ్వులు తెంపేస్తున్నాను .
ఆ గీత కన్నా నేనే ఎక్కువ పువ్వులు కోయాలి.
ఎంత గొప్ప పోటీ…
ఉడుకుమోత్తనం…ఏమీ తెలియనితనం
దేవుడు ఇంత అందమైన బాల్యాన్ని ఇలానే వుంచేస్తే ఎంత బావుండేదో?
పూలు కోస్తున్నాను..చేతికి మెత్తగా తగిలింది.
అది చెట్టు కొమ్మ కాదు.మ…ల్లె…నా…గు.
దాని తోక మెల్లిగా జారుతోంది.
ఓ పక్క అదేమిటో చూడాలన్న కుతూహలం…మరో పక్క భయం…
మల్లెనాగు తోక నా చేతిలోకి వచ్చింది.ముద్దుగా జారుతోంది.
పెద్దగా అరిచేసాను … ఊరంతా వినపడేలా…
పా…పా…పాము రోయ్…
పువ్వులన్నీ నేలమీద పడ్డాయి.నాతో వచ్చిన పిల్ల గ్యాంగ్ అరుపులే అరుపులు…
అలాంటి పరిస్థితిలోనూ “ఓ సారి కింద పడ్డ పువ్వులు…నేను కోసిన నా పువ్వులు తీసుకు వస్తే?
“ఆ నాడు నేను కోసిన నా ప్రియమైన పువ్వుల్లారా…..మీ నవ్వులను చెట్టు మీది నుంచి కోసి మిమ్మల్ని ఏడిపించినందుకు నన్ను క్షమించండి.
మీరు వాడిపోయినా,రాలిపోయినా,నలిగిపోయినా…మా కోసమే..
నిస్వార్థమైన మీ త్యాగం…మీ పరిమళం మాకు గొప్ప జీవిత సత్యాన్ని చెబుతోంది.”

NO COMMENTS

LEAVE A REPLY