27
కురుక్షేత్రంలో చివరి అంకం…
రణక్షేత్రంలో శత్రుసంహారానికి స్వస్తివాక్యం మొదలైంది.
ఒక విధ్వంసానికి డెత్ సెంటెన్స్ అమలు కాబోతుంది.
**
ఎయిర్ పోర్ట్ వెళ్లే రహదారి…
అపరిమితవేగం ప్రముఖుల ప్రాణాలనే కాదు నిస్సహాయులనూ బలితీసుకున్న ఔటర్ రింగ్ రోడ్డు…
పోలీస్ నిఘా కెమెరాలు దాటుకుంటూ వెళ్లే పొగరుబట్టిన బడాబాబుల భరతం పట్టడానికి మహిషాసురమర్ధిని దిగిరావాల్సిన పని లేదు…ఒక అతివ కన్నెర్ర చేస్తే చాలు….
ఎక్కడైతే తర్జని ప్రాణాలు యాక్సిడెంట్ రూపంలో గాలిలో కలిసిపోయాయో…
ఎక్కడైతే ఒక రక్తపుచారికల విషాదం పురుడుపోసుకుందో…
అక్కడే ఆ రక్తపాతానికి బదులు చెప్పడానికి…
డెత్ సెంటెన్స్ ను అమలు చేయడానికి చట్టం మనిషి రూపంలో…
శిక్ష ఆయుధంగా మారి వస్తోంది.
***
విక్కీ కారు దుమ్మేరేపుకుంటూ ముందుకు దూసుకు వెళ్తోంది.ఖరీదైన ఆ కారులో అంతకన్నా ఖరీదైన నేరస్థులు వున్నారు…ఇంటర్ నేషనల్ క్రిమినల్స్…అమ్మాయిల శరీరాలను వ్యాపారానికి ముడిసరుకుగా భావించే లోఫర్స్ …
ఆ కారులో విక్కీతో పాటు మంతనాలు బేరసారాలు కొనసాగిస్తున్నారు…అమ్మాయిల శరీరాలకు వెల కడుతున్నారు.
ఆ కారు వెనుకే ఒక వ్యాను కారును అనుసరిస్తూ వస్తోంది.ఆ కారు స్పీడ్ ను అందుకోలేక వెనుకబడిపోతోంది.రెండు వెహికిల్స్ మధ్య దూరం పెరుగుతోంది.సరిగ్గా అప్పుడే ఈ రెండు వాహనాల మధ్య మరో వాహనం వచ్చింది.అది పోలీస్ వెహికిల్.
వ్యాన్ కు అడ్డంగా పోలీస్ వెహికల్ వచ్చి ఆగడంతో వ్యాన్ ను సడెన్ బ్రేక్ తో ఆపాల్సి వచ్చింది.
పోలీస్ వాహనంలో నుంచి మొదటిసారి దర్జాగా పోలీస్ గర్వంతో దిగాడు ముఖర్జీ…
నిజాయితీగా ఉంటే ఇంత ఆనందంగా ఉంటుందా?అనిపించింది ఆ క్షణం …
మొదట భయపడ్డ వ్యాన్ డ్రైవర్ ముఖర్జీని చూసి రిలీఫ్ గా నిట్టూర్చి “మీరా సార్…”అన్నాడు.
ముఖర్జీ వ్యాన్ డ్రైవర్ ని బయటకు లాగి చెంప మీద ఫట్ మని కొట్టాడు…“మీరా సార్ ఏమిట్రా?నేనేమైనా సినిమాలో కామెడీ విలన్ లా కనిపిస్తున్నానా? పో…లీ…స్ …:అన్నాడు.
వ్యాన్ డ్రైవర్ బిత్తరపోతూ చెంపను రుద్దుకుంటూ “అదేమిటివ్ సార్…మనం మనం ఒక్కటే కదా సార్ “అన్నాడు.
“మనం మనం ఒక్కటి కాదురా..”అంటూ మరోటి తగిలించి వ్యాన్ డోర్స్ ఓపెన్ చేసాడు.
వ్యానులో అమ్మాయిలు వున్నారు.కానీ స్పృహలో ఉన్నట్టు లేరు.
మహిళా కానిస్టేబుల్స్ పోలీస్ వెహికిల్ లో వున్న వాటర్ పైప్ తీసుకు వచ్చి వాటర్ ను అమ్మాయిల మొహాల మీద పడేలా చేసారు…ఒక్కొక్కరికి స్పృహ వస్తోంది.అప్పటికే వ్యాన్ లో మరో నలుగురు రౌడీలు వున్నారు…వాళ్ళు కిందికి దిగి వచ్చారు.
ముఖర్జీ అమ్మాయిల వైపు చూసి మహిళా కానిస్టేబుల్స్ కు సైగ చేసాడు.పోలీస్ వ్యాన్ లో నుంచి హాకీ స్టిక్స్ తీసుకు వచ్చారు.వ్యాన్ లో కిడ్నాప్ కు గురైన అమ్మాయిలకు ఆ హాకీ స్టిక్స్ ఇచ్చి…:
“కుమ్మేయండి..మిమల్ని ఎలా టార్చర్ చేసారో గుర్తు చేసుకోండి..ఇంకోసారి కిడ్నాప్ చేయాలంటే..చిటికెన వేలు చూపించి …పోసుకోవాలి….”చెప్పాడు ముఖర్జీ.
ఆ మాత్రం ధైర్యం చాలు.అమ్మాయిలు రెచ్చిపోయారు ..ఆ తతంగాన్ని వీడియో తీస్తున్నారు పోలీస్ లు…….
***
విక్కీకి సడెన్ గా డౌట్ వచ్చింది.తమ వెనుక వ్యాన్ రావడం లేదు.అతని డౌట్ కు ఆన్సర్ అన్నట్టు…. అప్పుడే సెల్ రింగ్ అయ్యింది.
“సార్..నేను వ్యాన్ డ్రైవర్ ని..ఇక్కడ ముఖర్జీ సార్…పిచ్చకొట్టుడు కొడుతున్నాడు…అమ్మాయిలతో హాకీ గేమ్ ఆడిస్తున్నాడు…చెప్పుకోలేని చోట అబ్బా హమ్మో కొడుతున్నాడు సార్…”డ్రైవర్ గొంతు అటువైపు నుంచి వినిపిస్తోంది.
“ఏయ్ ఆ ముఖర్జీగాడికి ఫోన్…ఇవ్వు .”ఇంకా విక్కీ మాటలు పూర్తి కాకుండానే..
“నేనేరా లపూట్ …”అన్నాడు ముఖర్జీ…
అంతే విక్కీకి కోపం తన్నుకు వచ్చింది.
“ఏంట్రా ఫీల్ అవుతున్నావా?వాచ్ మేన్ పవర్ కూడా చూపిస్తానురా … ఇంకేమన్నావ్? కుక్క అని కదా…పోలీస్ కుక్క పవర్… విశ్వాసం ఎలా ఉంటుందో చూడరా…నీలాంటి నీచ్ కమీనేలా దగ్గర చేయి చాచకుండా నీతిగా బ్రతికితే…నిన్ను ఎలా ఆడుకుంటానో..చూడు…”ముఖర్జీ అన్నాడు.
“ఏయ్ ఏయ్ వస్తున్నాను వుండు….నిన్ను షూట్ చేసి…”
“నీ మొహం …నువ్ ఇక్కడికి వచ్చావనుకో..నిన్నూ నీ కారులో వున్న చెంచాలను బట్టలూడదీసి ఎయిర్ పోర్ట్ వరకూ కొట్టుకుంటూ…తీసుకు వెళ్తాను..రా …ట్రై చేసుకో…అన్నట్టు మహిళా కానిస్టేబుల్స్ కూడా వున్నారు..అమ్మాయిలతో వ్యాపారం చేసావు కదరా..అందులో నాతో కూడా పాపాలు చేయించావు కదా..వాళ్ళతో చెప్పుకోలేని చోట కొట్టించపోతే నేను రియలైజ్ అయిన పోలీస్ నే కాదు…కమాన్ రారా ”
విక్కీకి బుర్ర తిరిగిపోయింది.తన మొహంలో ఫీలింగ్స్ చూసి “ఏమైంది అన్నట్టు చూసారు ఆ కారులో వున్న ఇంటర్ నేషనల్ క్రిమినల్స్
“వెనక్కి వెళ్తే ముఖర్జీ అన్నంత పని చేస్తాడు.ఇప్పుడు తాను తన గ్రూప్ పట్టుబడితే మొదటికే మోసం వస్తుంది.విక్కీ తెలివైన క్రిమినల్..అందుకే కారును ముందుకు పోనిచ్చాడు..అక్కడే మరో తెలివితక్కువ పనిచేసాడు తనకు తెలియకుండానే…
***
కారు ఎయిర్ పోర్ట్ వైపు వెళ్తోంది వేగంగా..ముందు తనూ,తనతో పాటే వీళ్లూ ఇక్కడి నుంచి బయటపడాలి.కారు స్పీడ్ వంద దాటింది..సరిగ్గా అప్పుడే కుడి వైపు నున్న చిన్న రోడ్డు లో నుంచి ఒక పెద్ద బుల్ డోజర్ రోడ్డు మీదికి వచ్చింది.డ్రైవింగ్ సీట్ లో వుంది ఎర్విక్.
ఊహించని విధంగా బుల్ డోజర్ రోడ్డుకు అడ్డంగా రావడంతో స్పీడ్ ను కంట్రోల్ చేయడం అసాధ్యమైంది.పైగా నిర్లక్ష్యంగా సీట్ బెల్ట్ లు కూడా పెట్టుకోలేదు.కారు బుల్ డోజర్ ను గుద్దుకుంది.కారులోని భాగాలు చెల్లా చెదురయ్యాయి,తలో వైపు ఎగిరిపడ్డారు..కొందరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు…విక్కీ ఓ మూలకు పడ్డాడు…అతని ప్రాణాలు ఇంకా పోలేదు..అందులో వున్న వాళ్లంతా నేర చరిత్ర వున్న కరుడుగట్టినవాళ్ళే.
విక్కీ మెల్లిగా తలెత్తి చూసాడు…బుల్ డోజర్ మీద డ్రైవింగ్ సీట్ లో వున్న ఎర్విక్ అపరాకాళిలా కనిపించింది..
బుల్ డోజర్ స్టార్ట్ అయ్యింది.విక్కీ లేచి పరుగెత్తే స్థితిలో కూడా లేడు. బుల్ డోజర్ కదులుతోంది…రోడ్డు మీద హాహాకారాలు చేస్తున్నారు క్రిమినల్స్ లో బ్రతికి వున్న వాళ్ళు..విక్కీతో సహా.
బుల్ డోజర్ కదిలింది…బుల్ డోజర్ కింద నుజ్జ నుజ్జయిపోయారు…విక్కీతో సహా…
మానవత్వమని వాహనాలు నడవడానికి దానవత్వాన్ని రోడ్డుగా మార్చాలి…ఎక్కడైతేతర్జని యాక్సిడెంట్ కు గురై ప్రాణాలు విడిచిందో..
ఎక్కడైతే ఎన్నో ప్రాణాలు విక్కీ లాంటి నేరస్థుల చేతుల్లో యాక్సిడెంట్ రూపంలో నెత్తురు ముద్దలుగా మారాయో…
అక్కడే విక్కీ అతనితో పాటు మిగితా క్రిమినల్స్ శాశ్వత సమాధి అయ్యారు.
***
“సర్ పాపం కదూ”అన్నది అన్నాడు అప్పటి వరకూ ఆ తతంగాన్ని అక్కడే ఆ ప్రాంతంలోనే ఉంది చూస్తోన్న శామ్యూల్
“పాపం కాదు దుష్టశిక్షణ…గుండెలో ముళ్ళు కుచ్చుకుని ప్రాణాలు తీస్తున్నప్పుడు పాపం ముళ్ళు అని తీసి రోడ్డున పడేస్తే..మరొకరి గుండెలోనే కాళ్ళోనో కంటిలోనో దిగుతుంది.ఆ ముల్లును నలిపి పాతేయాలి. మనం అరెస్ట్ చేసి శిక్షించాలంటే ఎఫ్ ఐ ఆర్ రాయాలి.కోర్టు కు తీసుకువెళ్లాలి సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయాలి…ఇంకా బోల్డు ఫార్మాలిటీస్…ఇవ్వన్నీ పూర్తయ్యేలోగా మనకు ప్రెషర్స్…బ్లడ్ ప్రెజర్స్….ఇవ్వన్నీ అవసరమా..”
ఎర్విక్ అనిరుద్ర దగ్గరికి వచ్చింది.”థాంక్యూ సర్ ..మీరు నాకన్నా ముందే ఇక్కడికి వచ్చారని సమీర్ చెప్పారు…నాకు తెలుసు మీరు ధర్మయుద్ధాన్ని నాతో చేయిస్తారని..నన్ను ఇప్పుడు చట్టబద్ధంగా అరెస్ట్ చేయవచ్చు…”చేతులు చాచిఅంది
“సారీ మిస్..నాకు బోలెడు పనులున్నాయి.తర్జని ఒకమ్మాయి కనిపించడం లేదని మాకు రిపోర్ట్ వచ్చింది.ఆ అమ్మాయిని ట్రేస్ చేసే పనిలో బిజీగా వున్నాను.ఇన్స్పెక్టర్ ముఖర్జీ కూడా అదే పనిలో వున్నాడు.కదూ శామ్యూల్ “అన్నాడు శామ్యూల్ వైపు చూసి అనిరుద్ర.
తల అడ్డంగా నిలువుగా ఊపాడు కన్ఫ్యూజన్లో శామ్యూల్ .
దుష్టశిక్షణ పూర్తయింది.ఒకప్పుడు అమ్మాయిల నిస్సహాయుల రక్తంతో తడిసిన ఆ రోడ్డు ఇప్పుడు దుర్మార్గుల రక్తంతో…ప్రక్షాళన జరిగింది.
***
ఎయిర్ పోర్ట్
ఎర్విక్ సమీర్ మౌనంగా వున్నారు.వాళ్లకు కాసింత దూరంలో అనిరుద్ర.
“వెళ్ళిపోతున్నాను సమీర్…ఒక బంధాన్ని వెతుక్కుంటూ వచ్చాను…మరో బంధాన్ని వదిలేసి వెళ్తున్నాను..”చెప్పింది ఎర్విక్.
“బంధం అని నువ్వనుకుంటున్నావు..ప్రాణం అని నేనుకుంటున్నాను..ఒక ప్రాణాన్ని వదిలేసి..నన్ను ప్రాణంలేనివాడిని చేసి వెళ్తున్నావు”సమీర్ గొంతుకు ఎర్విక్ శ్వాస అడ్డు పడింది.
ఎర్విక్ తన మనసును అక్కడే వదిలేసి శరీరాన్ని రన్ వే వైపు నడిపించింది.
***
అనిరుద్ర సమీర్ భుజం మీద చేయివేసి నడుస్తున్నాడు.
“సమీర్ ఇంకేమిటి సంగతులు…నాకుతెలిసిన బ్యాంక్ మానేజర్ తో మాట్లాడాను…లోన్ వస్తుంది.హాయిగా ట్రావెల్ పెట్టుకో..నాకెప్పుడైనా అవసరమైతే ఫ్రీగా కారు ఇవ్వాలి…అన్నట్టు నాకు తెలిసిన ఓ మంచి సంబంధం ఉంది.హన్మకొండ అమ్మాయి..కాస్త తింగరి…బీకామ్ వరకు చదివింది.బాగా చూసుకుంటుంది…నువు “ఊఁ” అంటే చూసొద్దాం”సమీర్ వైపు చూస్తూ అన్నాడు.
సమీర్ కు కళ్ళలో నీళ్లు తిరిగాయి,అతనికి ఎర్విక్ గుర్తొస్తుంది.
“సర్ ఫ్లయిట్ టేకాఫ్ తీసుకుని ఉంటుంది.గాల్లో అప్పుడే ఎగురుతోన్న విమానాన్ని చూసి అన్నాడు సమీర్.
“టేకాఫ్ కాదు..ఇప్పుదు ల్యాండ్ అయ్యింది…ఎదురుగా”అంటూ చూపుడు వేలుతో చూపించాడు.
ఎదురుగా ఎర్విక్..అచ్చు తర్జనిలా చీర కట్టుకుని.
విచిత్రం ఏమిటంటే ..సమీర్ పరుగెత్తుకు వెళ్లి ఎర్విక్ ను గట్టిగా వాటేసుకున్నాడు.గాలి కూడా చొరబడనంతగా…
***
“హాలో ఇది ఎయిర్ పోర్ట్”అనిరుద్ర అనడంతో సమీర్ చిన్నగా సిగ్గు పడుతూ ఆమె నుంచి కొద్దిగా దూరం జరిగాడు.
“అనిరుద్ర సర్…నా పేరు కృష్ణస్వామి నేను ఈ అమ్మాయికి బాబాయ్ ని ..ఇతను ముఖర్జీ …ఇన్స్పెక్టర్..ఈ అమ్మాయికి అన్నయ్య…మా అమ్మాయికి ఈ అబ్బాయికి పెళ్లి చేద్దామనుకుంటున్నాం”కృష్ణస్వామి అన్నాడు..
అప్పుడు కదిలింది…కన్నీటి గంగమ్మ కృష్ణమ్మతో గోదారమ్మతో కలిసి….ఎర్విక్ కళ్ళలో కన్నీళ్ళై .
“నో ప్రాబ్లమ్…టాక్సీ నడుపుకుంటాడు..ఖాళీగా ఉంటే వాళ్లావిడను తీసుకుని ఢిల్లీ వరకూ వెళ్ళొస్తాడు…”చెప్పాడు అనిరుద్ర.
అక్కడ ఆ దృశ్యం అద్భుతంగా ఉంది.
“అనాథలా వచ్చిన నాకు ఇంత మంది ఆత్మీయులను ఇచ్చిన నా దేశమా…నీకు వేనవేల కృతజ్ఞతలు…”ఎర్విక్ మనసులో అనుకుంది.
తర్జని ఆత్మ ఎర్విక్ కంటిలో కన్నీటి చెమ్మ అయ్యింది.
***
“సర్..మీకు ఫోన్ …రెస్టారెంట్ లో టేబుల్ మీద రింగవుతోన్న అనిరుద్ర ఫోన్ అతని చేతికి ఇస్తూ చెప్పింది ఎర్విక్…”
“ఎవరు ?యథాలాపంగా అడిగాడు..అనిరుద్ర.
“హన్మకొండ నుంచి అనుకుంటా…తనపేరు ఏదో పిటిఆర్ అనే అక్షరాలతో మొదలవుతుంది…మీకు సంబంధమై ఉంటుంది”వస్తోన్న నవ్వును ఆపుకుంటూచెప్పింది ఎర్విక్.
“మిస్టర్ అనిరుద్ర నేను సిబిఐ చీఫ్ ని…హైద్రాబాద్ లో అమ్మాయిల రాకెట్ ను చేధించారు.ఢిల్లీలో మీకు పని పడింది..తొందరగా బయల్దేరండి”అటువైపు నుంచి సిబిఐ చీఫ్ గొంతు.
“ఫోన్ కట్ చేసాక ఎర్విక్ వైపు చూసి..ఢిల్లీలో మళ్లీ డెత్ సెంటెన్స్ సీరియల్ మొదలవ్వబోతుంది…వస్తావా? అడిగాడు అనిరుద్ర.
“సారీ సార్ నాక్కాబోయే మా ఆవిడను ఇన్వాల్వ్ చేయకండి”ఎర్విక్ ను దగ్గరకుతీసుకుంటూ అన్నాడు సమీర్.
***
THE END
డెత్ సెంటెన్స్ ఫినిష్…ఎక్కడైతే అమ్మాయిలను వ్యాపారంగా మారుస్తారో..మళ్లీ అక్కడ అప్పుడు డెత్ సెంటెన్స్ మొదలవుతుంది.
ఒక మాట
నా మొట్టమొదటి ఫిక్షన్ డెత్ సెంటెన్స్ ను ఆదరించిన మేన్ రోబో పాఠకులకు శతసహస్రకోటి కృతజ్ఞతలు.
ఇది నా తొలి సీరియల్..అందులోనే క్రైమ్ సస్పెన్స్ నిండిన సీరియల్ .
క్రైమ్ సీన్ అంటే ఏమిటి?
నేర పరిశోధన అంటే ఏమిటి?
ఏ పాత్రను ఎలా నడిపించాలి?
ఎక్కడ హాస్యం?
ఎక్కడ ఎమోషన్స్?
ఎక్కడ బలమైన సంభాషణలు ఉండాలి..లాంటి విషయాలు పెద్దగా తెలియవు..
దాదాపు నాలుగైదు సార్లు తిరగరాసి ఉంటాను..నాకు మాత్రమే కాదు..మేన్ రోబో కూ నచ్చేవరకూ…
ఒక పాఠకురాలిని రచయితగా చేసి,పాఠకాదరణ కలిగేలా తీర్చిదిద్దిన క్రెడిట్ మేన్ రోబోకే చెందుతుంది.
నా మొదటి ధారావాహిక “నేను క్యాన్సర్ ని జయించాను…
ఆ తరువాత వచ్చిన”అనగనగా ఒక మనస్సు కథ..
ఇపుడు డెత్ సెంటెన్స్..మీ ఆదరణతో ధన్యమయ్యాయి.
డెత్ సెంటెన్స్ ఈ బుక్ రూపంలో కినిగె ద్వారా మీ ముందుకు వచ్చింది.ఆదరించండి…మీ అభిమానాన్ని ఇలానే కొనసాగించండి…
థాంక్యూ సో మచ్
…తేజారాణి తిరునగరి
తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.