జీవితంలో అన్నింటినీ,అందరినీ కోల్పోయిన అతనికి…మనసు కోరుకునే సాన్నిహిత్యం. శరీరం కోరుకునే సాంగత్యం…వెరసి ఓ సెక్యూర్డ్‌ ఫీలింగ్‌….విజయార్కె కథ విభ్రమ

(ఆంధ్రజ్యోతి (నవ్య) వీక్లీలో దాదాపు ఎనిమిదేళ్ల క్రితం రాసిన కథ…విజయార్కె )
“మనసు అలసిపోయిన చోట శరరీం స్వాంతనమైతే.. శరీరం ఒంటరిగా మారిన క్షణాన, మనసు బాసటగా నిలిస్తే, నన్ను చుట్టు ముట్టిన వేదనల మధ్య, తను శృంగార నైవేద్యమై నన్ను చేరితే, నా ముందు మోకరిల్లి, నా ఊహలకు ప్రణమిల్లి, నా తనువున సేదతీరి, నా తనువును సేదతీర్చి, నాలోని భావోద్వేగాల మేఘాల్ని కరిగించి, శృంగారోద్వేగ వర్షంలో నన్ను చుట్టేసి, సంభ్రమాశ్చర్యంలో నుంచి, విభ్రమాశ్చర్యంలోకి తీసుకు వెళ్లి నాలోని ఒంటరి తనాన్ని, తన సాంగత్యంతో నియంత్రించి, తను అభిమంత్రించిన చందన చర్పిత మంత్ర పుష్పమైతే.. ఇది నా భ్రమా.. తను నా విభ్రమా…?’’
 ***

మబ్బులన్నీ ఒకేచోట చేరి ముచ్చట్లాట మొదలు పెట్టాయి. చెట్లు వింజామరలై, చల్లగాలితో మరులు గొలుపుతూ మబ్బులతో అందాల క్రీడ మొదలు పెట్టాయి. చుట్టూ కొండలు కొలతలు చూసి చెక్కినట్టు .., నేలమీద పచ్చగడ్డ గ్రీన్‌ కార్పెట్‌లా వుంది.వర్షానికి ముందు వచ్చే మట్టివాసన.. వేనవేల పెర్‌ఫ్యూమ్‌లను కలిపి స్ర్పే చేసినా రాని గొప్పవాసన.. ఒక్కసారిగా మబ్బులన్నీ గాఢాలింగనంలో మునిగి తేలాయి. ఆ రాపిడిలో, ఆ తాకిడిలో మబ్బులు కరిగి, వర్షం చినుకులు ముత్యాల్లా, భూమి తలమీద తలంబ్రాలై కురుస్తున్నాయి.
ఆ క్షణం, ఆ దృశ్యం,ఏ అదృశ్య శక్తో తన అనుభూతిని లాక్కెళ్తోన్న ఫీలింగ్‌.ఒకే దృష్టి.. రెండు దృశ్యాలు.ఓ చిత్రకారుడిగా.. ఓ ప్రకృతి ప్రేమికుడిగా.. ఓ భావుకుడిగా..ఆ దృశ్యం ఎంత అబ్బురంగా ఉంది? కానీ.. ఇప్పుడో.. దృష్టి మారింది. దృశ్యం విషాదభరితమైంది.సర్వం కోల్పోయిన సామ్రాట్టు.. విషాదాన్ని గుండెల్లో దాచుకున్న ఒంటరి.. ఓదార్పును వెతుక్కుంటూ వెళ్తోన్న బాటసారి.. అతడు మొన్నటి వరకూ ప్రముఖ చిత్రకారుడు. పేరు కార్తికేయ. అతని చేతివేళ్లు కాన్వాసు మీద కదిలితే కనకవర్షమే. జీరో స్థాయినుంచి నెంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగిన విశ్వవిజేత నిన్నటి వరకూ.. కానీ నేడు..?
“జీవితమనే కాన్వాసు మీద…అతడి భార్య చేసిన వివర్ణవర్ణ సంతకం అతడి జీవితగమనాన్ని, జీవితాన్నే మార్చింది. అతడి గెలుపును ఏమార్చింది. అతడి మనశ్శాంతిని మరణానికి చేరువగా చేర్చింది. కారణం… అ..ను..మా..నం. భర్తను అర్థం చేసుకోకపోవడం.తను అనాథ అనే విషయం అతనికెప్పుడూ గుర్తుకురాలేదు. ఆర్థిక దారిద్య్రం శాపం అనుకోలేదు. తన పట్టుదలే వరం అనుకున్నాడు. కనిపించిన చిత్తుకాగితం వదలకుండా, దానిమీద పెన్సిల్‌ ముక్కతో, చివరాఖర మిగిలిన పెన్సిల్‌ ముక్కతో గీతలు గీసేవాడు. ఆ గీతల్లో ఎన్నో దృశ్యాదృశ్యాలు గోచరమయ్యేవి. అంచెలంచెలుగా ఎదిగాడు. చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నాడు.

అతడి జీవితంలోకి భార్యగా ప్రవేశించింది ఆమె.
అతని దృష్టి అనాచ్ఛాదితంగా వెల్లకిలా పడుకొని, విరహ వేదనను సూచిస్తూ, నిద్రిస్తోన్న ఆమె మీద లేదు. ఆమె సౌందర్యాన్ని కాన్వాసు టేబుల్‌ మీద, బ్రష్‌తో స్కాన్‌ చేస్తున్నట్టు వున్నాడు. కొద్ది క్షణాల క్రిందట వరకూ జీవం లేకుండా, రంగులుగా పడివున్న ఆ రంగులు, ఇప్పుడు జీవం పోసుకున్న వర్ణఖచిత వజ్రాభరణాల్లా మెరిసిపోతున్నాయి.వెల్లకిలా అనాచ్ఛాదితంగా పడుకుని వున్న ఆ యువతి నగ్నదేహాన్ని కాన్వాసుమీద పునః ప్రతిష్ఠించాడు.
కాన్వాసు మీద బొమ్మకు ప్రాణం పోసాడు. పరికించి, పరిశీలనగా చూస్తే, కాన్వాసు మీద అతను సృజించిన బొమ్మే జీవం ఉన్నట్టుంది. క్షణాలు గడిచినా, నిమిషాలు నడిచినా, చీకటి ప్రపంచాన్ని ఆవరించినా అతను అలసిపోలేదు.
***
ఆమె లేచి బట్టలు వేసుకుంది. అతని వైపు తిరిగి చూడను కూడా చూడలేదు. కానీ ఒక్కక్షణం కాన్వాసులో వున్న తన బొమ్మ వంక చూసుకుని మురిసిపోయింది. తను ఇంత అందంగా వుందా? ఆ బ్రహ్మ సృష్టించిన తనకన్నా, తనను మరింత అందంగా తీర్చిదిద్దిన ఈ బ్రహ్మే గొప్ప కాబోలు…అనుకుంది. తన ఆర్థిక సమస్య పరిష్కారం చూపే ఈ వృత్తి కన్నా, తన దగ్గర మాడల్‌గా పనిచేసే స్ర్తీని, కళ్లతో చూడకుండా, మనసుతో మాత్రమే చూసి బొమ్మ వేసే అతని సంస్కారాన్ని చూసి ఆనందిస్తోంది.
తన శరీరంలో కోరిక పుట్టినప్పుడల్లా వికృత క్రీడను ఆడుకునే మొగుడిని తలుచుకుని, వచ్చే జన్మలోనైనా కార్తికేయ లాంటి మనసున్న వాడు భర్తగా రావాలని కోరుకుంది.అదీ అతని క్యారెక్టర్‌…

కార్తికేయ దారిలో కారు ఆపి సన్నజాజులు తీసుకున్నాడు. వర్షం వచ్చేలా వుంది. ఇలాంటి వాతావరణంలో భార్యతో గడిపే అనుభవం అతనికిష్టం.. మరి ఆమెకు?
***
‘‘ఏంటివి?’’ భర్త రాగానే అడిగింది మొహం చిట్లించి‘‘సన్నజాజులు.. నీ అందంలా మెరిసిపోతున్నాయి’’ భార్య కళ్ళలో ఆనందం ఎక్స్‌పెక్ట్‌ చేస్తూ చెప్పాడు.

‘‘ఈ పువ్వులేంటి? సెకండ్‌ హ్యాండ్‌వా?’’బాత్రూంలోకి వెళ్లబోతున్న కార్తికేయ ఆగాడు. భార్య వంక చూశాడు.‘‘ఎవరికైనా ఇచ్చి, వాళ్లు తలలో పెట్టుకొని, వాడేసేక, వాడిపోయేక ఇస్తున్నారా.. అని’’ ఆమె మాటల్లో హాస్యం లేదు.. అపహాస్యం.. అనుమానం.. చేతల్లో అవమానం.

‘‘అది కాదు.. నీ కోసం కారు పార్క్‌ చేసి ఎంత దూరం నడిచి తెచ్చానని..’’‘‘ఏం.. అమ్మేది అమ్మాయా? అందుకే అంతదూరం నడిచెళ్లి తెచ్చారా?’’అతను బాధతో కణతలు రుద్దుకున్నాడు…”ఏంటి.. ఇవ్వాళ ఆలస్యమైంది? అది వదల్లేదా?’’‘‘ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లో మీరు వేసిన పెయింటింగ్‌ సెక్సీగా వుందిటగా… చూసి వేసారా? ఆ అమ్మాయిని చే.. వేసారా?’

అతనికి ఆమె మాటలు వినడం కూడా అసహ్యంగా ఉంది. ఆలస్యంగా వస్తే ‘‘అమ్మాయిలు రానివ్వడం లేదా?’’ అనే ప్రశ్న.
తొందరగా వస్తే ‘‘అప్పుడే వదిలేసిందా?’’సరదాగా బయటకు వెళ్దామంటే ‘‘ఇవ్వాళ ఎవ్వరూ రావడం లేదా?’’ అని.వదిలేసి ఊర్కుంటే ‘‘పెళ్ళాన్ని బయటకు తీసుకు వెళ్ళద్దని అది చెప్పిందా?’’ అనే దెప్పి పొడుపు.

కార్తికేయలోని భావుకుడు ప్రతిక్షణం చచ్చిపోతున్నాడు. ఫోన్‌ లిఫ్ట్‌చేయాలంటే భయం..
ఫోన్‌లో అవతలి వాళ్ళతో మాట్లాడాలంటే భయం.ఓసారి అతను ఓ అమ్మాయిని కాన్వాస్‌ మీద చిత్రిస్తుండగా వచ్చింది. వస్తూనే గొడవ మొదలు పెట్టింది. ఆ అమ్మాయి బిక్కచచ్చిపోయింది. అంతా రసాభాసా..
అతను ఏ పెయింటింగ్‌ వేసినా, ఆ అమ్మాయిలో తనకు తెలిసినవాళ్ల పోలికలను తనే ఊహించేస్కొని, వాళ్లవే అని గొడవ చేయడం.. ఫలితంగా అతని కాన్‌సెంట్రేషన్‌ దెబ్బతింది. అతని పెయింటింగ్స్‌కు వున్న డిమాండ్‌ తగ్గుతూ వచ్చింది.

అతనికి మోడల్‌గా పని చేయడానికి అమ్మాయిలు అతడి భార్యకు భయపడి దూరం జరిగారు.అదే సమయంలో ఆర్థిక యిబ్బందులు చుట్టుముట్టాయి. నిరాశ.. నిస్పృహలు..ఎప్పుడైతే అతని ఆర్థిక పరిస్థితి తలకిందులైందో, ఆమె రెచ్చిపోయింది. సంపాదించడం చేతకానివాడనే ముద్ర వేసింది. భర్తను ఇతరులతో పోల్చడం మొదలు పెట్టింది. చివరకు విడాకులు ఇవ్వడానికీ సిద్ధపడింది.
అతను మొదటిసారిగా ‘‘దేముడా.. నా భార్యను తీసుకు వెళ్ళిపో’’ అని కోరుకున్నాడు.

ఇప్పుడతనికి ఓ సాహచర్యం కావాలి.. తనకోసం సర్వాన్ని ధారపోసి ‘తనే జీవితంగా, తన ఊహలకు ప్రాణం పోసే’ ఓ సాన్నిహిత్యం కావాలి.
***
ఎండ..వాన..చలి..ఆకలిదప్పులు.. ఒంటరితనపు ఛాయలు.. నిరాశ నిస్పృహలు..ఆ క్షణం అతనికి ఓ బలమైన కోరిక కలిగింది.తనకు ఈ క్షణం ఓ తోడు కావాలి. తన శరీరాన్ని దుప్పటిలా చుట్టి, తన మనసును మంచుపొరలా ఆవహించి, తనలోని విషాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించే ఓ మనిషి కావాలి.అవును తనకంటూ ఓ తోడు కావాలి…

సరిగ్గా అప్పుడే ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపులో ఓ మెరుపుతీగ. అతను ఆశ్చర్యంలోనుంచి తేరుకోకముందే.. ఆమె అతడిని సమీపించింది. అతను చలితో వణుకుతున్నాడు. వర్షంలో తడుస్తున్నాడు. వేదనతో రోదిస్తున్నాడు. ఒంటరితనంతో దిగాలు పడిపోతున్నాడు. ఓటమిలో గెలుపు స్ఫూర్తినిచ్చే వాళ్ళకోసం నిరీక్షిస్తున్నాడు.ఇవ్వన్నీ ఓ స్ర్తీ సాంగత్యంలో…శృంగారోద్వేగంలో దొరుకుతాయని అన్వేషిస్తున్నాడు.

అప్పుడామె అతని ముందు నిలబడింది. రెండు చేతులూ చాచింది. వర్షం ఆమె తలనుండి జారిపడుతోంది. ఒక్కో చినుకు చెంపలపై జారి, మెడను దాటి, ఇరుకు దారినుంచి నాభిని చేరి, ప్రదక్షిణం చేసి.. అలా.. అలా.. జారిపోతూనే ఉంది. వలువలు సమస్తం ఆమె పాదాల చెంతకు చేరి దాసోహం అన్నాయి. అనాచ్ఛాదితమై ఆమె. అతని ముందు మోకరిల్లింది.
‘‘ఎ..ఎవ..ఎవర్నువ్వు?’’

‘‘నేనా…ఎవరికోసం మీరు ఎదురు చూస్తున్నారో.. ఎవరి సహచర్యం మిమ్మల్ని గెలుపు శిఖరాలపైకి చేరుస్తుందని భావిస్తున్నారో.. ఆ నేను…మీ…వి..భ్ర..మని’’

ఎన్నో వేల వేల క్షణాల.. రోజుల విరహం.. మనసు కోరుకునే సాన్నిహిత్యం. శరీరం కోరుకునే సాంగత్యం.. వెరసి ఓ సెక్యూర్డ్‌ ఫీలింగ్‌…పచ్చగడ్డి కార్పెట్‌లా మారింది. ఆమె అనాచ్ఛాదిత దేహం అతనికి వేదికైంది. వాళ్ల కదలికలు చూసి చెట్లు తలలు తిప్పుకున్నాయి. వర్షం దిశ మార్చుకుంది.చెకుముకి రాళ్ల రాపిడిలో అగ్గిపుడితే, ఆ రెండు శరీరాల రాపిడిలో కోరిక పుట్టింది. తను కోల్పోయిన ప్రాభవం తన పాదాల చెంతకు చేరుతుందనే ధైర్యం పుట్టింది. సెక్స్‌లో భావప్రాప్తి మాత్రమే కాదు.. అంతకన్నా గొప్ప సెక్యూర్డ్‌ ఫీలింగ్‌ వుంటుందని ఆ క్షణమే తెలిసింది అతడికి.., అనుభవవేద్యమయ్యేక!

వాళ్ళిద్దరూ విడిపడ్డారు.
‘‘ఇది నా భ్రమా..నువ్వు నా విభ్రమవేనా?’’ కార్తికేయలో అనుమానం.ఆ అడవిలో వాళ్ళిద్దరే వున్నారు.

ఆమె ప్రకృతిగా మారింది. అతను పూర్ణ పురుషుడయ్యాడు. కాన్వాసు మీద అతని చేతిలోని బ్రష్‌ కవాతు చేస్తోంది. అందమైన కవాతు.ఎన్ని రోజులైందో లెక్క తేలలేదు.
ఎన్ని నెలలు గడిచాయో తెలియడం లేదు. అతను నిరంతరం తపస్సులోనే వున్నాడు. అతని తపస్సు అందమైన వర్ణ చిత్రాల కోసం.. ఆపై అలిసిన అతని మనో శరీరాలకు సేదతీర్చి, ఓదార్పునిచ్చే అందమై కలయిక కోసం. అతనికోసం విభ్రమ ఏదైనా చేస్తుంది. ఎందుకంటే ఆమె అతని వి…భ్ర…మ
***
కార్తికేయ తను కోల్పోయింది తిరిగి సాధించుకున్నాడు.విభ్రమ సాన్నిహిత్యం.. సాంగత్యం.. అతడికి వేనవేల ధైర్యాన్నిచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో అతని ఆత్మవిశ్వాసం, నిజాయితీ, మేధస్సుకు ‘పోటీ’ లేరని నిరూపించాడు. దానిక్కారణం వి..భ్ర..మ.
వేనవేల విషాదాలు విభ్రమ స్పర్శలో కొట్టుకుపోయాయి.
వేనవేల ఒంటరితనాలు విభ్రమ సాన్నిహత్యంలో దూరమై పోయాయి.
అతను అలసిపోయి ఏ అర్ధరాత్రో వస్తాడు. అతనికోసం విభ్రమ ఎదురు చూస్తూ వుంటుంది. అతనికోసం బాత్రూంలో గీజర్‌ ఆన్‌ చేస్తుది. టవల్‌ అందిస్తుంది. అవసరమైతే కలసి స్నానం చేస్తుంది.అతను డైనింగ్‌ హాలులోకి వచ్చేలోగా వేడివేడి అన్నం సిద్ధం చేస్తుంది. కొసరికొసరి వడ్డిస్తుంది. అతని అలసటను పడగ్గదిలో తన స్పర్శతో దూరం చేస్తుంది. ఆ ఇంట్లో పడగ్గదిలోనే కాదు, ప్రతీ అంగుళాన్ని అతనికి వేదికగా మారుస్తుంది.
ఆమె మనసు, శరీరమూ అతని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటాయి. పరిమళిస్తూనే ఉంటాయి.

విభ్రమ…కార్తికేయ భ్రమా.. కళ్లముందు కనిపించే వాస్తవమా…?అన్నది మీ ఊహలకే వదిలేస్తున్నాను.
విభ్రమ లాంటి జీవిత భాగస్వామి వుంటే, కార్తికేయ లాంటి వారు జీవితాన్ని జయించినట్టే! మీలోనూ ఓ విభ్రమ ఉంది. ఓ కార్తికేయ ఉన్నాడు. సాన్నిహిత్యంతో, సాంగత్యంతో, ఒకరినొకరు అర్థం చేసుకుని, జీవితాన్ని జయించండి.

అందుబాటులో వున్న విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY