చిన్నప్పుడు నేను ఎన్‌ టి ఆర్‌ ఫ్యాన్‌. కత్తి యుద్దాలు, మాయలు మంత్రాలు అబ్బో అదో అద్భుతప్రపంచం.స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటినేను

జ్ఞాపకాల దొంతరలో నుంచి రాలిపడిన క్షణాలు ,అనుభూతుల అంతరంగాన్ని పలకరిస్తూ కరచాలనం చేస్తోంది. స్మార్ట్ రైటర్ సురేంద్ర అలనాటి చిగురించిన జ్ఞాపకాల్లోని నిన్నటి నేనుని కదిలిస్తే …
ఈ వారమే ప్రారంభం.మీ స్పందనకు ఆహ్వానం …చీఫ్ ఎడిటర్

నా చిన్ననాటి ముచ్చట్లు (1) –
సినిమా కబుర్లు…
చిన్నప్పుడు నేను ఎన్‌ టి ఆర్‌ ఫ్యాన్‌. కత్తి యుద్దాలు, మాయలు మంత్రాలు అబ్బో అదో అద్భుతప్రపంచం.. మాయాలోకంలో విహరించేవాడిని. అదృష్టవశాత్తు నా మిత్రబృందంలో ఒకరిద్దరు అలాంటి వారే ఉన్నారు. తిరుపతి వీదుల్లో సైకిల్‌ పై సర్వే చేసి ఏ థియేటర్‌ లో ఏ చిత్రాలున్నవో వెదికేవాళ్ళం. మాకు తెగ నచ్చిన థియేటర్లు శ్రీ మహావీర్‌, దేవేంద్ర, జ్యోతి, రామక్రిష్ణా డీలెక్స్‌. కారణం…వీటన్నింట్లో కేవలం పాత చిత్రాల ప్రదర్శనే…
తిరుపతిలో ప్రాంతీయ ప్రసారాలలో దూరదర్శన్‌ లో మొదట ప్రసారం చేసిన చిత్రం సుడిగుండాలు… నాకెందుకో నచ్చలేదు. అందులో నాగేస్వర రావు చనిపోవడం బాగాలేదు అనిపించింది ఆ వయసులో…
తిరుపతికి చెన్నై (అప్పటి మద్రాస్‌) దగ్గర కాబట్టి కొన్ని టీవీలలో తమిళ చానెల్‌ ప్రసారాలు అందేవి. ఎం.జీ.ఆర్‌, శివాజీ గణేషన్‌ సినిమాలు బాష అర్థం కాకపొయినా తెగ చూసేవాళ్ళం. హీరొయిన్‌ లందరూ మనకు తెలిసిన తెలుగువారే కావడం, కథ అర్థమయ్యే రీతిలో సాగడం వల్ల కావచ్చు…
మా అమ్మమ్మకు పౌరాణిక చిత్రాలంటే చాలా ఇష్టం. తనతో పాటు మేము కూడా తయరయ్యేవాళ్ళం. మిత్రబృందంలో చాలా మంది ఇరుగు పోరుగు వారే… మా అమ్మమ్మ వాళ్ళతో తో చాలా కలసి పోయేవారు. ఆదివారం మధ్యాహ్నం అందరిని వెంటేసుకుని వెళ్ళేవారు.

తిరుపతిలో పాత చిత్రాలు వారం వారం మారేవి. ఆదివారం పొద్దున్నే సైకిల్‌ పై మిత్రులం బయలుదేరి సినిమా వార్తాసేకరణ కావించేవాళ్ళం. చిత్రం మార్నింగ్‌ షోన, మ్యాటనీన అని వివరాలు సేకరించి మా అమ్మామ్మకు చేరవేసేవాళ్ళం. ఆవిడ తొందరగా వంట ముగించి, మమ్ములను బయలుదేరదీసేవారు.

శనివారం అయితే చాలు… టిఫన్‌ తినడం ఆలస్యం క్రికెట్‌ గ్రౌండ్‌ లో తేలేవాళ్ళం. ఎండ లెక్క చెయ్యక ఆడి.. ఇంటికి వచ్చి పెట్టింది తిని నిద్రకుపక్రమించితే, సాయంకాలం దూరదర్శన్‌ లో తెలుగు చిత్రం వచ్చే సమయానికి లేచేవాళ్ళం
నాకు ఊహ తెలిసిన తరువాత నేనుగా (ఒంటరిగా) చూసిన మొదటి చిత్రం భాగ్దాద్‌ గజదొంగ. మా దూరపు బంధువుకు ఎవరో ఆ చిత్రానికి (బెనిఫిట్‌ షో అనుకుంటాను) పాస్‌ ఇస్తే, ఆయన నాకిచ్చి చూడమన్నారు. ఎన్‌.టి.ఆర్‌ ఉత్సాహపూరితమైన నటన చూసి థ్రిల్‌ అయ్యాను.

(చిగురించిన జ్ఞాపకాలకు చిన్న విరామం..వచ్చేవారం వరకూ)
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY