(2)
సినిమా షూటింగ్
ఏడూ లేదా ఎనిమిదవ క్లాస్ లో అనుకుంటాను.మా స్కూల్ కి సినిమా షూటింగ్ కోసం వచ్చారు. షూటింగ్ చిత్తూర్ జిల్లా చంద్రగిరి దగ్గర కొటాల గ్రామంలో… త్రిశూలం (కృష్ణంరాజు, జయసుధ మొదలగువారు..) హిందీలో తీస్తున్నారు. అందులోకి కొంతమంది స్కూల్ పిల్లలు కావలసి వచ్చి మా స్కూల్ కి వచ్చారు… వారికి కావలసిన వారిని ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళారు.
ఆ రోజు మిగిలిన వాళ్ళకు సెలవు.. మా క్లాస్మేట్స్ సీ జే ప్రసాద్, చంద్రమౌళి, రఫి (అనుకుంటాను), షూటింగ్ చూడాలని బయలుదేరాం. అదీ స్కూల్ నుండే. ఇంటిలో చెప్పాలి అనే విషయం కూడా జ్ఞప్తికి రాలేదు. ఎలా వెళ్ళాలి అని ఆలోచించకుండా నడక సాగించాం. లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ 2 గంటలు సాగాం. అప్పటికి 5 కిలోమీటర్లు అయ్యుంటుంది. మా యూనిఫారం చూసి దారిలో చాలా మందికి సందేహం కలిగింది. ఒకరిద్దరు మమ్మల్ని అడిగారు కూడా. పెద్ద హీరోల్లా బిల్డప్ ఇచ్చి ముందుకెళ్ళాం. కొంతసేపటికి తెలిసింది ఆకలి అనేది ఒకటి ఉంటుందని… వేళకు మేత పడాలని. ఎవ్వరి దగ్గరా చిల్లర కూడా లేదు. ఆకలి తాళ లేక వెనుదిరుగుదామని మెజార్టి ఫ్రెండ్స్ డిసైడైయ్యాం.
మా సీజే గాడికి చాలా పట్టుదల ఎలాగైనా షూటింగ్ లో పాల్గొనాలని వాడి కోరిక. చివరకు వాడే భోజనానికి స్పాన్సర్ చేస్తానని ముందుకొచ్చాడు. దారిలో దొరికింది తిని మళ్ళా బయలొదేరాం. అప్పటికి టైం మద్యాహ్నం 3. దారిలో మరో పెద్దమనిషి మమ్మల్ని ఆపి విషయం కనుక్కున్నాడు. మా సాహసానికి మెచ్చి మెత్తగా చివాట్లు పెట్టాడు. తిరుపతి పోయే బస్సునొకదాన్ని ఆపి మమ్మల్ని ఎక్కించాడు.
మరో రౌండ్ చివాట్లు పెట్టి టిక్కెట్టు తీసి మా చేతిలో పెట్టాడు. అప్పటికి మా ఆవేశం తగ్గి బుద్దిగా తిరుపతి చేరాం. బస్టాండ్ నుండి స్కూల్ మీదుగానే ఇంటికి పొవాలి. నేను స్కూల్ చేగానే విషయం తెలిసింది. స్కూలు పిల్లలు మిస్సింగ్ అని స్కూల్ అంతా హంగామా. అక్కడ ఎలాగోలా మేనేజ్ చేసి ఇల్లు చేరుకున్నా. అప్పటికే మా అన్నయ్య, చెల్లెళ్ళు ఇల్లు జేరి 5 గంటలు కావొస్తోంది. ఇంట్లో నేను మిస్సింగ్ అని ఏడుపులు దుఃఖాలు బడితపూజ తప్పదేమో అనుకున్నా కాని ఏమీ అనలేదు…
(చిన్ననాటి జ్ఞాపకాల్లో చిన్నివిరామం )