“నేను ఎవర్ని డ్రాప్ చేసిన వాళ్లతో సెల్ఫీ తీసుకుంటాను…అదో వ్యసనం నాకు.బాడ్ లక్ ఏమిటంటే వీళ్ళలో కొందరు చనిపోయారు..కొందరు కనిపించకుండా పోయారు”వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (04-12-2016)

                                                       (6)
ఒక్కక్షణం అక్కడ నిశ్శబ్దం పహారకాసింది.ఆ నిశ్శబ్దాన్ని తరిమేస్తూ సిన్సియర్ గా అంది .ఎర్విక్ “ప్రాణం పొసే దేవుడు పక్కన వున్నప్పుడు ప్రాణం తీసే యమపాశం ఏం చేస్తుంది?అయినా మీరు మృత్యువు అంచున వున్నవారిని పునర్జన్మ ఒడిలోకి చేర్చేవారే తప్ప మృత్యువుకు అప్పగించి ఊరుకునేవారు కాదు”
“అన్నివేళలా అందరినీ అంతగా నమ్మడం మంచిది కాదు కదా?అనిరుద్ర అన్నాడు.
“దేవుడు ఎప్పుడూ దేవుడిలానే ఉంటాడు..దేవుడిని ఎప్పుడైనా నమ్మొచ్చు …”చెప్పండి నన్నేం చేయమంటారు?
అనిరుద్ర సమీర్ వైపు చూసాడు
సమీర్ అనిరుద్ర దగ్గరికి వచ్చి ఎర్విక్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని “ఈ ప్రాణాన్ని బ్రతికించి నాకు ప్రాణం పోశారు..ఎందుకు సర్ సంకోచిస్తున్నారుమేమెప్పుడూ మీసేవలోనే….?అని ప్రశ్నించాడు.
“సమీర్ మీ సంస్కారం చాలా గొప్పది.కానీ ఇద్దరు బిడ్డలకు తల్లై భర్తతో పిల్లలతో హాయిగా ఉంటూ గృహిణిగా వున్నా ఎర్విక్ ను మళ్ళీ నేరప్రపంచంలోకి తీసుకువెళ్లి మీ ప్రశాంతతను డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేదు.”చెప్పాడు అనిరుద్ర.
“లేదు సర్..మీరు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అందులో మంచి ఉంటుంది.మీరు చేసే యుద్ధంలో ఎర్విక్ ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందంటే అంతకన్నా మాకు గొప్ప సంతోషం ఏముంటుంది? ఇక పిల్లల గురించి అంటారా?మిస్టర్ మామ్ అని పిలిపించుకోవడంలోని థ్రిల్ ను ఎంజాయ్ చేద్దామనుకుంటున్నాను.రేపు వీళ్ళు పెద్దయ్యాక నా పిల్లలకు గొప్పగా చెప్పుకోవచ్చు నేను మీ కిస్టర్ మామ్ ని అని…”నవ్వుతూ అన్నాడు సమీర్.
ఎర్విక్ లోపలి వెళ్లి కొద్దినిమిషాల్లో ఒకనాటి పాట గెటప్ లో బయటకు వచ్చింది..జీన్స్ టీ షర్ట్…సమీర్ నిరుద్ర అలానే చూస్తుండిపోయాడు.
“సర్ బయల్దేరుదామా?..షల్ వుయ్ స్టార్ట్?అడిగింది ఎర్విక్.
ఎర్విక్ పిల్లలిద్దరినీ ఓ సారి గుండెలకు హత్తుకుంది.అనిరుద్రతో కలిసి బయటకు నడిచింది.కొద్ది సమయంలోనే ఒక మలుపుతిరిగే సంఘటన జరుగబోతుందని వాళ్లకూ తెలియదు.
                                      ***
ఆమె రెండుచేతులు వెనక్కి విరిచి కట్టేసారు.నోటికి ప్లాస్టర్ వేశారు.చుట్టూ చీకటి.కళ్ళు చిట్లించి చూసినా కనిపించని చీకటి.ఆమె కళ్లు తెరిచింది.తలంతా బరువుగా వుంది.మగతలో వుంది.ఆమె కళ్ళు మెల్లిమెల్లిగా చీకటికి అలవాటు పడుతున్నాయి.అయినా పూర్తిగా కనిపించడం లేదు.
అప్పుడే అడుగులశబ్ధం ….మృతువు నడుస్తూ వస్తున్నట్టు…ఎప్పటి నుంచి అలా ఉందొ ఆమెకే గుర్తులేదు.ఆమెకు గుర్తున్నదల్లా తాము నార్త్ అవెన్యూ కు బయల్దేరడం..తర్వాత…
ఆమె గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.తలంతా బరువుగా వుంది.తలమీద బొప్పి కట్టింది.తనను వెనక నుంచి బలమైన వస్తువుతో కొట్టారు..అది మాత్రం గుర్తుంది.
ఆ రోజు రైలు దిగగానే ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.మెల్లిమెల్లిగా గుర్తు చేసుకుంటోంది.
ఆమెకు గుర్తుకొస్తోంది.
***
అయిదుగురిలో దిగాలు..నార్త్ అవెన్యూ దగ్గర డ్రాప్ చేయడానికి టాక్సీ లు రావడం లేదు.
“ఇలా జరిగిందేమిటి?నార్త్ అవెన్యూ కు మనం వెళ్ళలేమా?
“ఢిల్లీ నుంచి వచ్చి వెనక్కి తిరిగి వెళదామా ?
“చాలా డిస్సపాయింట్ అయ్యాం”
ఒకొక్కరు ఒక్కో కామెంట్ చేసుకుంటున్నారు.
‘మీరు నార్త్ అవెన్యూ కు వెళ్లాలా?చాలా ఖర్చు అవుతుంది?తమ పక్కనుంచి మాటలు వినిపించడంతో అదిరిపడి తలలు తిప్పారు.
“దెబ్బయేళ్ళ వృద్ధుడు..తల మీద వున్న దుప్పటి తొలిగించి చెప్పాడు…
“నువ్వు మీరు…ఏమనాలో అర్థం కాలేదు..”
“నేనో డ్రైవర్ ని…నా కారు ఆక్సిడెంట్ కు గురైంది.ఇన్సూరెన్స్ లేదు.నా బ్రతుకు బండి ఆగిపోయింది.నాదగ్గర పాతకాలంనాటి జీపు వుంది.దానిమీద మిమ్మల్ని నార్త్ అవెన్యూ కు తీసుకువెళ్తాను.మీ పని అయ్యేవరకూ అక్కడే వుంటాను.నాకు ఎంతయిస్తారో చెబితే మనీని బట్టి నాపని ఉంటుంది’క్లియర్ గా చెప్పాడు.
“సరే..మమ్మల్ని అక్కడ దించి వచ్చేయ్…నీకు ఎంత కావాలో చెప్పు…కానీ మమ్మల్ని అక్కడ దించి వచ్చినట్టు మరెవరికీ చెప్పొద్దు”
ఆ ఐదుగురిలో హరి అనే కుర్రాడు చెప్పాడు..
“నాక్కావలిసింది మనీ..మీకు కావలిసింది నాతొ పని”ఱంది అంటూ..స్టేషన్ వెనగ్గా వున్న పొదల్లాంటి ప్రదేశానికి తీసుకువెళ్లాడు.ఆ గుబురుచెట్ల మధ్య పాతకాలంనాటి జీపు వుంది.
కాసేపటిలో ఆ అయిదుగురిని తీసుకుని జీపు నార్త్ అవెన్యూ వైపు బయల్దేరింది.
జీపు సిటీ లిమిట్స్ దాటింది
“ఇప్పుడు చెప్పండి మీరెవరు?ఏంచేస్తుంటారు?ఇక్కడికి అదే నార్త్ అవెన్యూ కు ఎందుకు వచ్చారు?వాళ్ళవైపు సూటిగా చూస్తూ డ్రైవ్ చేస్తూనే అడిగాడు.
“మేము ఢిల్లీ నుంచి వచ్చాం.షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటాం.నార్త్ అవెన్యూ గురించి ఓ ఇంగ్లీష్ పేపర్ లో వచ్చిన స్టోరీ చదివాం.నార్త్ అవెన్యూ మీద ఓ షార్ట్ ఫిలిం తీద్దామని వచ్చాం…అన్నట్టు నార్త్ అవెన్యూ గురించి మీకు తెలుసా?అడిగాడు కిరణ్ అనే మరొకతను.
“అందరికీ తెలిసినట్టే నాకు తెలుసు…కాకపోతే కాస్త ఎక్కువ తెలుసు…ఎందుకంటే నార్త్ అవెన్యూ కుకొంత మందిని తీసుకు వచ్చాను “తాపీగా చెప్పాడతను
“వాట్..నార్త్ అవెన్యూ కు కొంతమందిని తీసుకువచ్చారా? మరి వాళ్లేమయ్యారు….?ఆదుర్ధాగా అడిగింది ఆ అయిదుగురిలో వున్న ఒకే ఒక అమ్మాయి గోమతి.
“నేను నార్త్ అవెన్యూ కు తీసుకువచ్చిన వారు ఎవరూ ఇంతవరకు బ్రతికిరాలేదు…నేనీ విషయం ఎవ్వరికీ చెప్పలేదు..చెబితే పోలీసులతో సమస్య…అయితే అందులో కొందరి మృతదేహాలు నార్త్ అవెన్యూ పరిసర ప్రాంతాల్లో దొరికాయి..ఎందుకైనా మంచిది మీరు కూడా జాగ్రత్తగా వుండండి”వారివైపు చూస్తూ చెప్పాడు.
ఒక్కసారిగా వాళ్ళ ఒంట్లో వణుకు పుట్టింది.ముఖ్యంగా గోమతి భయపడి పోయింది.
“మీరు మీరు చెప్పేది నిజమా?మరింత భయంగా అడిగింది గోమతి.
“కావాలంటే ఈ ఫొటోస్ చూడండి”అంటూ జీపుకు కుడివైపు వున్న చిన్న కవర్ వాళ్లకు ఇచ్చాడు.కవర్ లో ఫొటోస్ వున్నాయి.దాదాపు అన్నే సెల్ఫీలు.అన్నిట్లోనూ ఆ వృద్ధుడు వున్నాడు.
“నేను ఎవర్ని డ్రాప్ చేసిన వాళ్లతో సెల్ఫీ తీసుకుంటాను…అదో వ్యసనం నాకు.బాడ్ లక్ ఏమిటంటే వీళ్ళలో కొందరు చనిపోయారు..కొందరు కనిపించకుండా పోయారు”వాళ్ళ వైపు చూసి చెప్పాడు.
అతను చూసిన చూపుకు ఒక్కసారిగా కొద్దిక్షణాలు వణికిపోయారు.
ఆ కవర్ లో వున్న ఫొటోస్ లో వృద్ధుడితోపాటు వున్న వాళ్ళ మొహాల మీద ఎర్రరంగు స్కెచ్ తో ఇంటూ మార్క్ వుంది.కొన్ని ఫొటోస్ లో బ్లాక్ కలర్ స్కెచ్ తో ఇంటూ మార్క్ వుంది.
“రెడ్ కలర్ స్కెచ్ తో వున్నవాళ్లు చనిపోయారు.బ్లాక్ కలర్ స్కెచ్ తో వున్న వాళ్ళు కనిపించడం లేదు” చెప్పాడు వృధుడు.
“ఒక్కక్షణం వెనక్కి వెళ్తే బావుండు అనిపించింది గోమతి.ఆమె ఆ నిర్ణయాన్ని అమలు చేసినా బావుండేది.
జీపు అడవిలాంటి ప్రదేశంలోకి ఎంటర్ అయ్యింది.మట్టిరోడ్లు…రెండువైపులా గుబురుచెట్లు.మృత్యువుకు దగ్గరగా వెళ్తున్నట్టు వుంది.
ఒక్కసారిగా జీపు ఆపాడు.అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి.
“చీకటి పడుతుంది..మరో కాసేపటిలో నార్త్ అవెన్యూ చేరుకుంటాం..ఈలోగా మనం ఒక సెల్ఫీ తీసుకుందామా “ఆ వృద్ధుడు వాళ్ళ వంక చూస్తూ అడిగాడు.
(వాళ్ళు మృత్యువుతో సెల్ఫీ తీసుకుంటున్నారా?వచ్చే వచ్చేవారం వరకూ బీ అలర్ట్ …)
నార్త్ అవెన్యూ నేపథ్యం
(పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా )
ప్రాణం మీదికి తెచ్చిన సాహసం

కెనెడాలోని క్యూబెక్‌ నగరానికి చెందిన మార్కో లవోయి(44) రెండు నెలలు అడవిలో గడపాలనుకున్నాడు. అందుకోసం, లేక్‌ మాతగమీ అడవిని ఎంచుకున్నాడు. తనకు తోడుగా ఉంటుందని తన పెంపుడు కుక్క జర్మన్‌ షఫర్డ్‌ను తీసుకొని అందులోకి ప్రవేశించాడు.
మార్కో లవోయి అడవిలోకి వెళ్లిన కొన్ని రోజులకు క్యాంపుసైటు వద్దకు ఓ ఎలుగుబంటి వచ్చి ఎటాక్ చేసింది. క్యాంపుసైటులో ఉన్న ఆహారాన్ని, తిండి పదార్థాలను, వస్తువులను అది ధ్వంసం చేసింది. మార్కోపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా అతడి పెంపుడు కుక్క జర్మన్‌ షఫర్డ్‌ అప్రమత్తమయింది. వెంటనే భీకరంగా మొరుగుతూ ఆ ఎలుగుబంటిని తరిమేసి, యజమాని ప్రాణాలను కాపాడింది.
ఎలుగుబంటి చేసిన దాడిలో ఆహారం, వస్తువులు అన్నీ ధ్వంసం కావడంతో మార్కో కట్టుబట్టలతో మిగిలాడు. జనావాసాలకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. టెలిఫోన్‌ సిగ్నల్స్ అక్కడ లేవు. దీంతో, అత్యవసర సహాయం కోరేందుకు అవకాశం లేదు. తినడానికి తిండి లేదు.. కప్పు కోవడానికీ ఏమీ లేదు. తీవ్రమైన చలిలో కడు దుర్భర పరిస్థితుల్లో అడివిలోనే వుండవలిసిన పరిస్థితి ఏర్పడింది. ఆకలిని భరించలేక ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తనతో పాటు ఎంతో విశ్వాసంగా ఉన్న తన పెంపుడు కుక్క జర్మన్‌ షఫర్డ్‌ను ఆహారం కోసం చంపాలనుకున్నాడు. ఓ పెద్దరాయి తీసుకొని కుక్క తలపై మోదాడు. అది చనిపోయాక దాని మాంసాన్ని తిని ప్రాణాలు కాపాడుకున్నాడు.
సహాయక దళాలు అతడిని కనిపెట్టే వరకూ కుక్క మాంసం తింటూనే ప్రాణాలు కాపాడుకున్నాడు. ఒక వేళ అతడిని కనుక్కో లేకపోతే మరో రెండు రోజుల్లోనే అతడి ప్రాణాలు పోయేవని సహాయక దళం తెలిపింది. మార్కో మొత్తం మూడు నెలల పాటు అడవిలోనే ఉన్నాడు. దాదాపు సగం బరువు కోల్పోయాడు. సడిగ్గా మాట్లాడలేక పోతున్నాడు. ద్రవపదార్థాలు తీసుకోవడానకీ వీలు కావడంలేదు.
ఈ సంఘటన పట్ల జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ప్రాణాలమీదకు వచ్చినంత మాత్రాన.. ఎంతో విశ్వాసంగా ఉన్న పెంపుడు కుక్కను ఎవరైనా చంపి తింటారా? అతడికి తినడానికి వేరే ఏమీ దొరకలేదా? అని విమర్శలు గుప్పిస్తున్నారు
తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY