“ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడంట” అమృతవాక్కులా వినిపించింది మనం అసలే ఎన్టీఆర్ వీర ఫ్యాన్…స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటినేను (27-11-2016 )

(4)
ఎన్టీఆర్ రాజకీయ ప్రభంజనం
05 క్లాసు లో స్కూల్ సెలవులు రావడంతో పాపానాయుడు పేట(సొంత ఊరు) కి అమ్మమ్మ తాతలతో బయలుదేరాం…
ఎలక్షన్స్ సీజన్లో కావడంతో తిరుపతిలో హడావిడి ఎక్కువగా ఉంది.
కాంగ్రెస్, జనతా పార్టి పోటీలో ఉన్నాయి అనుకుంటాను.. ఎక్కడ చూసినా చెయ్యి గుర్తే..
మైక్ లో సినిమా పాటలు మధ్యలో రాజకీయ పార్టీల అభ్యర్దనలు..
సభలు సమావేశాలు ఉన్నా మనకు అంతగా పరిజ్ఞానం లేని రోజులు.
ఇంట్లో పెద్దల మాటల వల్ల నాకే అర్థం అయ్యింది ఏమిటంటే పోటీ చాలా గట్టిగా ఉంది. ఓట్ల కోసం వీదిలో సంబరాలు ఊరేగింపులు.. ఒక్కటే హడావిడి
“ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడంట” అమృతవాక్కులా వినిపించింది
మనం అసలే ఎన్టీఆర్ వీర ఫ్యాన్…
సినిమా వాళ్ళకు రాజకీయం ఏమి తెలుస్తుంది?
ఎన్టీఆర్ సినిమాలో హీరో కావొచ్చేమో రాజకీయాలకు పనికిరాడు
నాకు నచ్చని సంబాషణ
అయినా మనం మద్యలో మాట్లాడితే వీపు విమానం మోత మోగుతుందని బాగా తెలుసు
అందుకే సైలెంట్ గా అక్కడ నుండి పారిపోయాను.
ఎలక్షన్స్ లో ఎవరూ గెలుస్తారని మా ఫ్రండ్స్ మధ్యలో రసవత్తరమైన పోటీ
ఎన్టీఆర్ ఫాన్స్ ఒక పక్క… మిగిలినవాళ్ళు మరో పక్క… వీరలెవెల్లో ఆర్గుమెంట్
మనం తగ్గే ప్రసక్తి లేదు…
ఇటువంటి టైంలో సొంత ఊరికి ప్రయాణం.
***
ఊర్లో అడుగుపెట్టగానే ఎలక్షన్స్ హంగామా ఎదురయ్యింది.
మా బాచిగాడు (భాస్కర్… మా ఏజ్… పాపానాయుడు పేటలో చదువు.. పైగా మాకు దూరపు బంధువు కూడా) ఎదురయ్యాడు.
“ఏరా బాసిగా ఎలా ఉంది ఎలక్షన్ హడావిడి?”
“సూపర్”
“ఎవరుగెలుస్తారు?”
“మా మునిరత్నం మంచి ఊపులో ఉన్నాడు”
“అదేంటిరా… అంతా ఎన్టీఆర్ హవా నడుస్తుంటే” వాడికి ఎన్టీఆర్ అంటే ఇష్టం లేదని తెలిసీ అడిగాను
“ఎన్టీఆర్ లేదు ఏఎన్నార్ లేదు… ఇక్కడ లోకల్ బాబూ… మా సపోర్ట్ లేకుంటే ఎలా గెలుస్తాడు?” వాడికి ఓటు వేసే వయసులేదని తెలిసి కూడా గొప్పలు పోయాడు
ట్రావెల్ వల్ల అలసటతో మధ్యహ్నం తినగానే మంచి నిద్ర వచ్చింది.
సాయంత్రం మా బాచిగాడు వచ్చి నిద్ర లేపేశాడు.
“ఏమిరా బాసిగా నీ బాధ… సరిగ్గా పడుకోనీవు” విసుక్కుంటూ లేచాను
“సూరీ.. (నా ముద్దు పేరు) నీకో గుడ్ న్యూస్”
“నీ తలకాయ.. నిద్ర చెడగోట్టిందే గాక గుడ్ న్యూస్ అంటూ కవరింగా… పైగా పేట (పాపానాయుడు పేటను ముద్దుగా పిల్చుకునేవాళ్ళం) పెద్ద సిటీనా… ఉండేదే 4 వీధులు… ఇక్కడ ఏమి గుడ్ న్యూస్ ఉంటుంది” నిద్ర చెడగొట్టడంతో చిరాకుగా అన్నా
“ఇది మాత్రం ఖచ్చితంగా నీకు గుడ్ న్యూస్” నా విసుగును పట్టించుకోకుండా అన్నాడు
“చెప్పి తగలడు’ నిద్ర చాలకపోవడంతో వాణ్ని విసుక్కుంటూ అన్నాను
“ఈ సాయంత్రం ఎన్టీఆర్ మన ఊరు వస్తున్నాడంట” ఆ న్యూస్ దెబ్బకు నిద్రమత్తు ఒక్కసారిగా వదిలిపోయింది
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY