(4 )
నాటకం – నా పాత్ర
నేను 8 క్లాస్ చదువుతున్న రోజులు.
స్కూల్ లో క్లాస్ కన్నా మిగిలిన ఆక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. క్లాస్ లో కూర్చునిలెసన్స్ వినడం అంటే చాలా విసుగు. నాకే కాదు దాదాపు ప్రతి స్టూడెంట్ పరిస్థితి అదే అనుకుంటా. ఎప్పుడైనా అవకాశం దొరికితే క్లాసు నుండి జంప్ అయిపోవడంలో నేను ఫస్ట్.
స్కూల్ లో ఏ పోటీలు జరిగినా మనం ఉండాల్సిందే. పైగా టీచర్స్ కి నేను పెట్ స్టూడెంట్.
ఒకరోజు క్లాసులో ఉండగా ప్యూన్ వచ్చి మా క్లాస్ టీచర్ కి సర్కులర్ అందజేశాడు.
క్లాస్ లో మేం అందరం సర్కులర్ లో ఏముందో అనుకుంటూ ఆసక్తిగా చూస్తున్నాం.
“స్కూల్ డే సందర్భoగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు తమ పేర్లను నమోదు చేసుకోవలసింది” సర్ సర్కులర్ ముగించి క్లాస్ స్టార్ట్ చేశారు.
చిన్నప్పటి నుండి సినిమాల ప్రభావమో ఏమో కాని మనం కూడా ఏదైనా చెయ్యాలని ఒక్కటే కోరిక. సాంస్కృతిక కార్యక్రమంలో డ్రామా ఉండడంతో మన పని ఈజీ అయ్యింది. క్లాస్ లో చెబుతున్న సబ్జెక్టు మైండ్ లోకి చేరడం లేదు. ఎప్పుడు పేరు ఇద్దామా అని వెయిటింగ్.
సాయంత్రం క్లాస్ అయ్యాక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను స్టాఫ్ రూమ్ కి రమ్మనడంతో నేను వెళ్లాను.
చాలా మంది జనం ఉన్నారు. జూనియర్స్, సీనియర్స్ తోపాటు మా క్లాస్మేట్స్ ఉన్నారు.
అక్కడ ఉన్న రష్ చూస్తే ఒక్కసారి నీరసం వచ్చింది. ఇంతమందిలో మనకు గ్యారంటీ లేదు. మనకు టీచర్స్ ఎంత తెలిసి ఉన్నా ప్రయోజనం లేదు.
ఎలాగూ ఇంత దూరం వచ్చాం. పైగా క్లాస్ లో కూర్చుంటే బోర్ కొట్టేస్తుంది. ఇక్కడైనా కాస్త టైం పాస్ చేద్దామని డిసైడ్ అయ్యి లోపలి అడుగుపెట్టాను.
*****
స్టాఫ్ రూమ్ లో దాదాపు అందరూ తెలిసిన వాళ్ళే…
టీచర్స్ కూడా బాగా పరిచయం. మా క్లాస్ కి రాకపోయినా నేను బాగా తెలుసు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పేర్లు ఇచ్చిన స్టూడెంట్స్ అందరూ వచ్చినట్టు ఉన్నారు.
అందరికి కింద కూర్చోబెట్టారు.క్లాస్ ప్రకారం అమ్మాయిలు అబ్బాయిలు కూర్చున్నారు.
స్టాఫ్ రూమ్ గోలగోలగా ఉంది. డ్రామా, డాన్స్, శాస్త్రీయ సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, ఫోక్ డాన్స్ లాంటివి చాలా ఉన్నాయి.
స్పోర్ట్స్ లో మనం పాల్గొన్నా ఎప్పుడూ ఒక్క ప్రైజ్ కూడా రాలేదు. కనీసం డ్రామాలో అయినా పాల్గొనాలన్న ఆశ ఒకవైపు ముందుకు తోస్తుంటే, అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని చూసి మైండ్ బ్లాంక్ అయ్యి ఏమి చెయ్యాలో తోచక ఏదైతే అది అవుతుందని మొండి ధైర్యంతో మా క్లాస్మేట్స్ పక్కన కూర్చున్నా.
కల్చరల్ ఆక్టివిటీస్ కి కొంతమంది టీచర్స్ ను స్కూల్ మేనేజ్ మెంట్ అపాయింట్ చెయ్యడం వల్ల సదరు టీచర్స్ ఇంకా రానందువల్ల మా రచ్చ స్టాఫ్ రూమ్ ను దాటి బయటకు వ్యాపించింది.
మా అల్లరితో స్కూల్ బద్దలు అయిపోతుందన్న టైంలో కొంతమంది టీచర్స్ లోనికి అడుగుపెట్టారు.
అంతవరకు గందరగోళంగా ఉన్న స్టాఫ్ రూమ్ ఒక్కసారి సైలెంట్ అయ్యింది.
టీచర్స్ గంభీరంగా తమ చైర్స్ లో కూర్చున్నారు.
వాళ్ళు ఏమి చెప్తారో అన్న టెన్షన్ తో స్టూడెంట్స్ ఎవరూ మాట్లాడ్డం లేదు.
అక్కడ కూర్చున్న టీచర్స్ లో ఒకతను లేచాడు. ఊపిరి బిగబట్టి అతను చెప్పబోయే విషయంపై అందరూ దృష్టి పెట్టారు.
“స్టూడెంట్స్! మీరు ఏ విభాగాల్లో పేరు ఇచ్చారో వాటిపై మీ టాలెంట్ టెస్ట్ చేస్తాం. అందరూ రెడీనా” అని అనగానే స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా ఓ ఎస్ అనడంతో హాల్ దద్దరిల్లిపోయింది
ముందుగా ఫోక్ డాన్స్ తో సెలెక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. గ్రూప్ డాన్స్ కావడంతో ఫోక్ డాన్స్ చూస్తున్న టీచర్ తనకు కావాలసిన అమ్మాయిలను సెలెక్ట్ చేసుకోవడం కోసం అక్కడ పేరు ఇచ్చిన అమ్మాయిలను వేరే రూమ్ లోకి తీసుకువెళ్ళింది.
డ్రామా కోసం పేర్లు ఇచ్చిన వారు మాత్రం మిగిలారు. అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం కలిసి 40 పైనే ఉన్నారు. అందులో నేను ఒకణ్ణి.
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్