అందరూ ఎన్టీఆర్ కి నీరాజనాలు పడుతున్నారు. ఎన్టీఆర్ అందరినీ చూస్తూ చెయ్యి ఊపుతున్నాడు. మేడపైన ఉన్న మమ్మల్ని చూసి ఓ చిరునవ్వు విసిరి…స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటినేను (11-12-2016 )

                                                     3

ఇంతలో దూరం నుండి దుమ్ము రేపుకుంటూ కొన్ని వెహికాల్స్ వస్తూ కనపడ్డాయి
అందరిలో టెన్షన్.ఊపిరి బిగబట్టి దూరంగా వస్తున్న వెహికల్స్ ను చూస్తున్నారు. పెట్రోమాక్స్ లైట్స్ లో ఆ ప్రాంతం పట్టపగల్లా ఉంది.
రెండు నిముషాల తరువాత దుమ్ము రేపుకుంటూ ముందుగా ఎస్కార్ట్ తో టాప్ లేని జీప్ నెమ్మదిగా వస్తోంది. దూరంగా టాప్ లెస్ జీప్ లో నందమూరి తారక రాముడు…
నాకు ప్రపంచం మొత్తం మాయమై ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఆ రాజసం… ఆ చిరునవ్వు… గంభీరమైన కంఠం… నా మైండ్ పని చేయడం ఆగిపోయి చాలా సేపయ్యింది. ఎన్టీఆర్ ను దేవుడుగా ఎందుకు కొలుస్తారో అప్పుడు అర్థం అయ్యింది. ఆకర్షణీయమైన రూపం. ఎంత సేపు చూసినా తనివి తీరడంలేదు.
జీప్ చాలా స్లోగా వెళుతోంది. అందరూ ఎన్టీఆర్ కి నీరాజనాలు పడుతున్నారు. ఎన్టీఆర్ అందరినీ చూస్తూ చెయ్యి ఊపుతున్నాడు.
మేడపైన ఉన్న మమ్మల్ని చూసి ఓ చిరునవ్వు విసిరి చెయ్యి ఊపాడు.
నాతో పాటు ఉన్న డజన్ల కొద్దీ జనంలో ఒక్కటే సంతోషం… కేరింతలు
అంతలోనే చటుక్కున గుర్తుకు వచ్చింది. మా బాసిగాడు ఎక్కడ ఉన్నాడో అని చూశాను
అంతవరకు నాతో ఉన్న బసిగాడు మాయం…
ఎక్కడకు పోయాడో అంటూ జనంలోకి నా చూపులు సారించాను… ఎక్కడా కనపడ్డం లేదు.
ఎక్కడో మాయం అయ్యాడులే అనుకున్నా… పైగా ఎన్టీఆర్ అంటే ఇష్టం లేదు. అందుకని ఎక్కడికో పారిపోయి ఉంటాడు అనుకున్నా.
నా గెస్ తప్పు అని అర్థం అయ్యింది… ఎన్టీఆర్ జీప్ పక్కన్నే కనపడ్డాడు… ఎన్టీఆర్ కు అతి దగ్గరగా నడుస్తూ నన్ను చూసి చెయ్యి ఊపాడు…
వాడి అదృష్టానికి నాకు అసూయ కలిగింది.
అయినా వాడికి ఉన్నంత గట్స్ మనకు లేవు… నాకున్న టెన్షన్ కి ఎన్టీఆర్ స్వయంగా పిలిచినా ఆయన వద్దకు పోవడానికి ధైర్యం లేదు.
ఎన్టీఆర్ కి వేసిన పూలమాలలను ఆయన తీసి జనంపైకి విసురుతున్నాడు. దాన్ని అందుకోవడానికి జనం విపరీతంగా ఎగబడుతున్నారు.
అబ్బ… వాళ్ళది ఎంత అదృష్టమో అనుకున్నా…
ఎన్టీఆర్ జీప్ మమ్మల్ని దాటుకుని నెమ్మదిగా వెళ్ళిపోయింది.
అప్పటివరకు ఉన్న సంతోషం ఒక్కసారిగా మనసును వదిలి పోయినట్టు అనిపించింది.
బాసిగాడి కోసం చూశాను… ఎక్కడా కనపడలేదు. ఎన్టీఆర్ జీప్ తో పాటుగా వెళ్లిఉంటాడు అనుకున్నా.
అంతవరకూ గుర్తురాని ఆకలి అప్పుడే మొదలయినట్టు ఒక్కసారిగా నీరసం ఆవహించింది. మా మిద్దె పై నుండి ఎన్టీఆర్ చూడడం ఒక విధంగా అడ్వాంటేజ్ అయ్యింది. మెట్లు దిగి ఇంట్లోకి వెళ్ళగానే మా అమ్మమ్మ డిన్నర్ రెడీ చేసి ఉంది.
ఆకలి, ఎన్టీఆర్ ను చూసిన ఆనందంతో ఆ రోజు మామూలు కన్నా కాస్త ఎక్కువే తిన్నాను.
భోజనం ముగించే సమయంలో బాసిగాడు ప్రత్యక్షం…
“అవ్వా… నాకు కూడా అన్నం పెట్టు” అంటూ నా ఎదురుగా కూర్చున్నాడు
“ఏరా ఎదవా… నన్ను వదిలి ఎక్కడకు పోయావు?” వాడు ఎక్కడకు పోయాడో తెలిసి కూడా అడిగాను.
“ఎన్టీఆర్ ను దగ్గరగా చూడ్డానికి”
“నీకు ఎన్టీఆర్ అంటే నచ్చదు కదరా… మరి ఎందుకు పోయావు”
“ఎంతైనా సినిమా హీరో కదరా..”
“ఐతే”
“మనం ఎప్పుడూ సినిమా లోనే చూడ్డం.. నేరుగా చూడడం అంటే అవకాశం రాదు. వచ్చినప్పుడే చూడాలి”
నాకంటికి వాడు జ్ఞానం కలిగిన బుద్దుడిలా కనిపించాడు.
“ఎడిసావులే…నీ ఎదవ లాజిక్కులు” అతని అదృష్టానికి లోలోపలే అసూయపడుతూ అన్నాను
భోజనం అయ్యాక నా దగ్గరకు వచ్చాడు.
నన్ను చూసి నవ్వుతూ నిలబడ్డాడు
“ఈ ఎదవ నవ్వుతోనే నన్ను ఇంప్రెస్ చేస్తున్నావు రా దరిద్రుడా” ఎంత కోపం ఉన్నా వాడి నవ్వు అంటే నాకు ఇష్టం
వాడు నవ్వును కంటిన్యూ చేస్తూనే పాకెట్ లో చెయ్యి పెట్టాడు.
వాడు ఏమి బయటకు తీస్తాడో అన్న టెన్షన్ మొదలైంది. పాకెట్ నుండి గుప్పెడు బంతిపూలు బయటకు తీశాడు
“సూరీ… ఎన్టీఆర్ విసిరిన పూలదండలో నుండి నీకోసం తెచ్చాను”
ఆ మాటతో వాడి మీద లవ్ విపరీతంగా పెరిగిపోయింది
“ఒరే బాసిగా… ఈ రోజు సాయంత్రం సినిమాకు నేనే స్పాన్సర్ చేస్తా” ఆనందంలో డిక్లేర్ చేశాను వాడు అందించిన పూలను అతి భాద్రంతో అందుకుంటూ. మా బాసిగాడి మొహం చాటంత అయ్యింది
సాయంత్రం సినిమాలో వాడిని పట్టడం నా తరం కాలేదు.
పాట పాటకు విజిల్స్… ఆ దిక్కుమాలిన విజిల్ నాకు మాత్రం రాదు. ఎంతగా ట్రై చేసినా నేర్చుకోలేకపోయాను
                                            ***
సెలవులు అయిపోవడంతో నేను తిరుపతికి వెళ్ళిపోయాను.
ఎలక్షన్స్ అయిపోయాయి. ఎన్టీఆర్ ప్రభంజనం ముందు ఎవరూ నిలబడలేకపోయారు. తెలుగు దేశం పార్టీకి మెజారిటీ వస్తోంది అన్న న్యూస్ వింటూనే ఏదో తెలియని సంతోషం
ఎలక్షన్స్ లో నేనే గెలిచినంత ఫీలింగ్. మా స్కూల్ ఎన్టీఆర్ ఫాన్స్ ను ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. అంత ఆనందంలో కూడా నేను మరిచిపోలేని పాయింట్ ఏమంటే మా బాసిగాడు చెప్పిన గొప్పలు.
ఎలక్షన్స్ లో నిలబడ్డ మునిరత్నం పరిస్థితి ఏమిటనే.. ఇంట్లో ఎవరిని అడిగినా తెలియదు అన్న సమాధానమే వచ్చింది.
తిరుపతిలో రిలీజ్ ఐన కొత్త సినిమాలను చూడ్డానికి వచ్చిన బాసిగాడిని పట్టేశాను. మునిరత్నం ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి అడుగుతుంటే సినిమాకి టైం అయ్యింది అంటూ తప్పుకోవడానికి చూశాడు.
దాంతో నా డౌటానుమానం తీరిపోయింది.
మునిరత్నం ఓడిపోయాడు. అది ఒప్పుకోవడానికి ఇబ్బంది పడ్డ బాసిగాడు సినిమాకి టైం అయ్యిందన్న సాకుతో నేను పిలుస్తున్నా పలక్కుండా తుర్రుమన్నాడు
***
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY