(గత సంచిక తరువాయి)
”ఈ కాళ్లు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. ఎక్కడ నా పిల్లలిద్దరికీ ఒక్కపూట భోజనమైనా దొరికితే అక్కడికి” నిర్వేదంగా చెప్పింది యశోద.
ఆమె మనసులో తనకెవరూ లేరన్న బాధ …తనను వెన్నంటి వుండే భర్త దూరమయ్యాడనే శోకమూ వుంది.
”అదేమిటి ఇక్కడ వుండొచ్చుగా” కాస్త బాధగానే అంది చందన.
”వద్దమ్మా…ఇక్కడ నీకు బరువు కాదల్చుకోలేదు. ఇన్నాళ్లు నా భర్త దగ్గర వున్నాను. వృద్ధాప్యంలో ఆయన్ని కనిపెట్టుకుని వుండడం భార్యగా నా బాధ్యత కాబట్టి వున్నాను. ఇప్పుడు ఆయనే పోయిన తర్వాత ఏ హక్కుతో, ఏ హోదాతో ఉండాలి? ఈ ఇంటిమీద నాకు హక్కులేదు. ఇది నీ తండ్రి స్వార్జితం. నేను నా భర్త ప్రేమకోసమే వచ్చానుతప్ప ఆస్తికోసం కాదని నమ్మితే చాలమ్మా…పదండి పిల్లలూ…” అంది ముందుకు కదులుతూ.
బుజ్జిగాడు పాక్కుంటూ వెళ్లి కాళ్లకు అడ్డం పడ్డాడు.
”వద్దు పిన్నీ…నువ్వు వెళ్లొద్దు…నువెళ్తే నాకు అన్నం ఎవరు తినిపిస్తారు? వద్దు పిన్నీ” ఏడుస్తున్నాడు. పిన్నిని వెళ్ళొద్దని “చెప్పాక్కా …నువ్వు నాకు డబ్బులు మాత్రమే ఇస్తావు. కానీ పిన్నీ నాకన్ని పనులూ చేస్తుంది.తన పిల్లల కన్నా నన్నే ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది.నువ్వయినా చెప్పక్క” చందనను అడుగుతున్నాడు బుజ్జిగాడు.
”మీ నాన్న చనిపోయేముందు కనీసం ఈ ఇల్లు అయినా నీ పేరుమీద రాస్తాననని మీ పిన్నితో అంటే ‘వద్దండీ…నేనూ, నా పిల్లలం ఎలాగైనా బ్రతగ్గలం…పాపం బుజ్జిగాడు ఎలా బ్రతుకుతాడు వాడిపేరుమీద రాయండి’ అని బలవంతపెట్టింది” లాయర్ అంకుల్ చెప్పాడు.
యశోద కదిలి పోతోంది శోకదేవతలా వైధవ్యాన్ని వెంట పెట్టుకుని.
అప్పుడు…అప్పుడు కదిలివచ్చింది ఓ అమృతతుల్యమైన పిలుపు చందన హృదయాంతరాళంలోనుంచి.
”అమ్మా…అమ్…మ్మా…”
‘కలా? నిజమా? సంభ్రమా?’ వెనక్కి తిరిగి సంశయంగా చూసింది యశోద.
చందన లేచి పరుగెత్తి యశోద కాళ్లను చుట్టుకుంది. ”అమ్మా…ఇన్నాళ్లు నిన్ను అమ్మా అని పిలవనందుకు నన్ను శపించమ్మా…సవతి తల్లి అంటే రాచి రంపాన పెడుతుందనే భ్రమతో నేనే నిన్ను రాచిరంపాన పెట్టాను” ఏడుస్తోంది
”నువ్వు మాతోనే వుండమ్మా…నా తండ్రి నన్ను వదిలివెళ్లాడు. నన్ను అనాథను చేసి నువ్వు వెళ్లిపోకమ్మా”
”అమ్మా…చందన …’ భుజాలుపట్టి లేపి దగ్గరకు హత్తుకుంది. ” చాలమ్మా ఈ పిలుపు చాలు. నా కొనవూపిరి వున్నంతవరకూ ఈ ఇంట్లోనే వుంటానమ్మా” అంది.
హారిక తమ్ముళ్లను దగ్గరకు తీసుకుంది. ”నేనే ఈ క్షణంనుంచి మీ అక్కయ్యను” అంది.
వాళ్ళు ఓ క్షణం భయంతో సందేహించి దగ్గరకు వెళ్లారు.
అక్కడ ఆర్ద్రత ఉద్విగ్నభరితంగా ఆ దృశ్యాన్ని మాస్తోంది.
* * *
తండ్రి పోయాక కాస్త చిక్కిపోయింది చందన .తండ్రి వుండగా ట్యూషన్లు అవి చెప్పేవాడు. బరువు బాధ్యతలుకూడా పెరిగాయి. దానికితోడు ప్రెగ్నెన్సీ టైం కాబట్టి మందులు, మంచి ఆహారం తీసుకోవాలి.
చరణ్ ఇంటికి రమ్మని చెప్పినా విన్లేదు. రోజూ వచ్చి చూసి వెళ్తున్నాడు.
* * *
తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్