(గత సంచిక తరువాయి)
మరుసటి ఆదివారం..
నేను బాలవికాస్ లో అడుగుపెట్టగానే ఆంటీ నన్ను ప్రదీపన్నను కలవమని ఇంట్లోకి పంపించింది.
బాలవికాస్ పుణ్యమా అని నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో అందరికి క్లోజ్ అయ్యాను. అప్పటికే అన్న నా కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపించాడు.
నేను అన్న దగ్గరకు వెళ్ళగానే నన్ను చూసి రారా… అంటూ లోనికి తీసుకువెళ్ళాడు.
అన్న రూమ్ ఉన్న ర్యాక్ నుండి ఒక ఫైల్ తీశాడు. నాకు సస్పెన్స్ అంటే చాలా టెన్షన్. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆరాటం ఎక్కువ.
అన్న ఆ ఫైల్ నుండి ఏదో పేపర్స్ తీసి నా చేతులో పెట్టాడు. ఏమిటా పేపర్స్ అనుకుంటూ ఓపెన్ చేశాను.
ముందు వారం ఆంటీ దానవీరశూర కర్ణ మూవీలో నుండి రాసిన డైలాగ్స్. ఒరిజినల్ కాపీ అన్న పెట్టుకుని జిరాక్స్ చేసిన పేపర్స్ నా చేతిలో పెట్టాడు.
ఆ పేపర్స్ తీసుకుని నేను వెళ్లి ఆంటీని కలిశాను.
“ఏరా! పేపర్ లో ఉన్న మేటర్ చదివావా?” అని అడిగింది
“ఇంకా లేదు ఆంటీ” అని చెప్పాను
“నీకు 10 నిముషాలు టైం ఇస్తున్నా… ఆ చైర్ లో కూర్చో.. నిన్ను ఎవరూ డిస్టర్బ్ చెయ్యరు. చదివి నీ అభిప్రాయం చెప్పు” అన్నారు
ఇక్కడ అభిప్రాయాలకు తావులేదు. ఇచ్చింది ఇచ్చినట్టు చచ్చినట్టు నేర్చుకోవాలి. పైగా డ్రామా నాకు ప్రాణం. ఏ పని చేసినా రానిపేరు ప్రఖ్యాతులు ఇందులో వస్తాయి. పైగా నేను యాక్ట్ చేస్తుంటే కొన్ని వందలమంది చూస్తారు. ఇంత మందిలో మనం గుర్తింపు పడడం అంటే చిన్న విషయం కాదు.
5 నిముషాలలో పేపర్ లో ఉన్న మేటర్ చదివేసి ఆంటీ ముందు నిలబడ్డాను.
“ఏరా… ఎలా ఉంది?”
“సూపర్ గా ఉంది ఆంటీ…” అని చెప్పాను
నిజానికి నేను ఆ పేపర్ లో ఉన్నవి సరిగ్గా చదవలేదు. డ్రామా విషయం కాబట్టి ఎలా అయినా మేనేజ్ చేసేయాలి. వచ్చిన అవకాశం పోగొట్టుకునే ఆలోచన లేదు. పైగా ఏకపాత్రాభినయం.
ఏకపాత్రాభినయంలో ఒక అడ్వాంటేజ్ ఉంది. మరో నటుడు స్టేజి పైన ఉండదు. డైలాగ్ మోడులేషన్ అవసరం లేదు. స్టేజి అంతా మనదే. మనం ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. అడ్డుకునేవారే ఉండరు.
“వారం రోజుల్లో నీకు డైలాగ్స్ నోటికి రావాలి” అంటూ ఆర్డర్ వేసింది ఆంటీ.
“అలాగే ఆంటీ” అంటూ ఆ పేపర్స్ లో ఉన్న మేటర్ చదవడంలో బిజీ అయ్యాను.
ఆ ఆదివారం మిగిలిన స్టూడెంట్స్ భజన్స్ లో బిజీగా ఉంటే నేను మాత్రం డైలాగ్ పేపర్స్ ముందేసుకుని కుస్తీ పట్టడం ప్రారంభించాను.
డైలాగ్స్ చూస్తే ఒక్కొక్కటి కొండవీటి చాంతాడంత ఉంది. సమాసాలు, క్లిష్టమైన పదాలు..
ఎన్టీఆర్ మహానుభావుడు…ఎంత శ్రమపడి ఈ డైలాగ్స్ రాయించి బట్టీ పట్టి సినిమాలో యాక్ట్ చేశాడో అనిపించింది. మన యాక్టింగ్ తో కనీసం ఆయన పరువు తీయకూడదని డిసైడ్ అయ్యాను.
(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్