(గుప్పెడంత ఆకాశంతో ఆకాశమంత అభిమానాన్ని స్వంతం చేసుకున్న శ్రీసుధామయి “అక్షరాలతో నేను…”శీర్షికతో విజయదశమి శుభాకాంక్షలతో మీ ముందుకు వస్తుంది..ఈ శీర్షిక మీద మీ ఫీడ్ బ్యాక్ పంపించండి..చీఫ్ ఎడిటర్ )
విధాత విరచించి…వాగ్దేవి కరుణించి అక్షరమొక్కటి పుడమితల్లి పురిటినొప్పలతో పురుడుపోసుకుని వేనవేల భావాలకు అనుసంధానమై..చదువరుల హృదయాల్లో ఆత్మీయనేస్తమై…
విషాదమై..వినోదమై ..ఖేదమై ..మోదమై..మోహమై…స్వార్ధమై …సంకుచితమై…త్యాగమై…తేటతెనుగై…
వివిధరూపాల్లో అక్షరాల చేరికతో.అల్లికతో అర్థాలు సైతం మారిపోయే పరిస్థితులతో…ఎన్నో రూపాల్లో కనిపించే అక్షరమా…
“మీతో ప్రయాణించాలని…నా ఆలోచనలను..నా అనుభవాలను నేను చూసిన సంఘటనలను..నా స్పందనలను..నాకే స్వంతమైన అభిప్రాయాలను..నా కోణంలో…ఒక దృక్కోణంలో నీతో కలిసి అందించాలనే నా సంకల్పాన్ని …పాఠకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను…
అందుకే మీతో (అక్షరాలతో )ప్రయాణిస్తున్నాను.”
ఈ అక్షరాలు…
మెదడులో ఉద్భవించి మదిలో ప్రాణం పోసుకుని చేతివ్రేళ్ల కుంచె ద్వారా చదువరుల మస్తిష్కంపై అక్షర రూపమయ్యాయి
మనసు నుండి జాలువారిన మధురపదాలై సుమధురభాష్యాలై భావాన్ని వెదజల్లుతాయి!!
అక్షరప్రభలై విజయపథంలో పయనిస్తూ వెలుగులు విరజిమ్ముతాయి!!
శతాబ్దాల చరిత్రలో భావోద్వేగాల ఉలితో చెక్కబడి అక్షరశిల్పాలై అలరారుతాయి!!
అక్షరాలలో అన్ని భావాలు నింపి చెప్పగలిగితే భాష చాలదు మరి!!
అక్షరపరిమళాలు అనునిత్యం పరిమళిస్తునే ఉంటాయి!!
అక్షరాలు అమరం..అజరామరం అనునది అక్షరసత్యం!!..ఇది తథ్యం…
ఈ శీర్షిక ఏ మకుటంతో మొదలుపెట్టను?
తల్లి గర్భంలో ఊపిరి పోసుకున్న పసిగుడ్డు ఆడబిడ్డ అని తెలిసి భ్రూణహత్యకు సిద్ధపడ్డ నిస్సిగ్గు సమాజం దాష్టీకాన్ని చెప్పనా?
నడిరోడ్డుపై కామోన్మాదంతో యాసిడ్ దాడులు చేసే మగమృగాలను…అక్షరాల యాసిడ్ తో వాళ్ళ శరీరాలను కడిగేయాలనుందని చెప్పనా?
మనకేం జరిగినా పట్టనట్టు..మనకే సంబంధమూ లేనట్టు మానవత్వం ఉనికి కోల్పోయిన మనుష్యుల గురించి చెప్పనా?
శరీరంలో ఏ అవయవం పని చేయకపోయినా ఆత్మవిశ్వాసమునే అవయవంతో చరిత్రన నిలిచిన స్ఫూర్తి గురించి చెప్పనా?
ఒంటరిపోరాటంతో పసిగుడ్డుతో జనారణ్యంలో బ్రతుకు పోరాటం చేసిన అతివ తెగువ గురించి రాయనా?
“ఈ డబ్బు హోదా ఆడంబరాలు అక్కర్లేదు..సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చే భర్త కోసం ఎదురుచూస్తూ…భర్త అనురాగం నీడలో నిశ్చింతగా సేదతీరాలనుకునే సగటు భార్య అందమైన ఫీలింగ్స్ గురించి రాయనా?
నన్ను కదిలించిన సంఘటనలు
నన్ను ప్రేరేపించిన విషయాలు
నన్ను నిలదీసిన ప్రశ్నలు…
అక్షరాలతో నేనుగా…
మీ ముందుకు వస్తున్నాను.
అక్షరాలతో ఈ ప్రయాణం కొనసాగుతుంది
గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్