(గత సంచిక తరువాయి)
ఆంటీ వాళ్ళ ఇంటికి పోతుంటే దారిలో ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది…
పేపర్ పొతే పోయింది… నేను డైలాగ్స్ అన్నీ బట్టీ పట్టాను. అవన్నీ పేపర్ మీద రాసేస్తే… అదే నా డాక్యుమెంట్ అవుతుంది కదా..
ఇంత మంచి ఐడియా నాకు ముందే రానందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.
ముందు రోజు రాత్రి నుండి నేను పడ్డ టెన్షన్ అంతా ఒక్కసారిగా దూదిపింజలా ఎగిరిపోయింది.
మధ్యాహం కావడంతో ఎండ మండిపోతోంది… చుట్టుపక్కల ఎవరూ లేరు. షాప్స్ చాలా వరకు క్లోజ్ చేసి ఉన్నాయి.
అక్కడకు దగ్గరలోని ఒక స్టేషనరి షాప్ లో రెండు వైట్ పేపర్స్ ఒక పెన్ కొనుక్కున్నాను…
పక్కన్నే ఉన్న షాప్ క్లోజ్ చేసి ఉండడంతో అరుగుపై కూర్చుని రాయడం స్టార్ట్ చేశాను.
మొత్తం మూడు పేజీలు 10 నిముషాలలో రాసేశాను. మనసంతా హాయిగా ఎంతో రిలీఫ్ గా అనిపించింది.
అప్పటికే మా జూనియర్ బ్యాచ్ నన్ను వెదుక్కుంటూ వస్తున్నారు. నేను అక్కడ కూర్చుని ఉండడంతో అసలు ఏమి జరిగిందో నేను అక్కడ ఎందుకు ఉన్నానో అర్థం కాక బిక్కమొహం వేశారు.
వాళ్ళ ఫీలింగ్స్ నాకు అర్థం అయినా పెద్దగా పట్టించుకోకుండా వారితో పాటు బాలవికాస్ కి కదిలాను.
మరో పది నిముషాలలో బాల వికాస్ చేరాం. నేను ఆంటీ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ప్రదీపన్న ఎదురొచ్చాడు…
నేను అన్నను విష్ చేసి ఎదో చెప్పాలని నోరు తెరవగానే నన్ను ఏమీ మాట్లాడనీయ్యక చేయి పట్టి లోపలకు లాక్కొనిపోయాడు.
ఆంటీ వాళ్ళ హాల్… చాలా మంది కూర్చుని ఉన్నారు… నాకు అంతమందిని చూడగానే ఒక్కసారి భయం వేసింది.
నేను ఆంటీ వాళ్ళ హాల్ లోకి అడుగుపెడుతుండగానే కొన్ని మాటలు నా చెవినపడ్డాయి.
నేను కాస్త శ్రద్ధగా ఆ మాటలు విన్నాను… ఆంటీ నా గురించే మాట్లాడుతోంది.
ఆ కొన్ని మాటల్లో నాకు అర్థం అయిన సారాంశం ఏమిటంటే… నేను డ్రామా చాలా బాగా చేస్తాను. చాలా కష్టపడతాను… ఇప్పుడు కూడా ఇంతవరకు ఎవరూ చేయని ఏకపాత్రాభినయం చేయబోతున్నాను…
చచ్చాం రా దేవుడా అనుకున్నా…
ఎక్స్ పెక్టేషన్స్ చాలా దూరం పోతున్నాయి. నేను అంత దూరం అందుకోగలనో లేనో…
ఏ మాత్రం తేడా వచ్చినా నా పేరు, నన్ను నమ్మిన ఆంటీ పేరు గాల్లో కలవడం ఖాయం…
నాకు నిజంగా ఏదో మూడింది అనుకున్నా…
స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (08-10-2017)
ఆంటీ మాటలతో అక్కడ ఉన్నవారికి ఉత్సాహం వచ్చినట్టు గమనించాను. అదే నా కొంప ముంచుతుందని గ్రహించలేక నవ్వు మొహం పెట్టి హాల్ లోకి ఎంటర్ అయ్యాను.
అక్కడ ఉన్నవారు నన్ను మెచ్చుకున్నట్టు చూస్తున్నారు.. వారిలో ఆంటీ హజ్బండ్… ఆంటీ మరో ఇద్దరు పుత్రులు ప్రవీణ్ , ప్రశాంత్… కూతురు పూజాప్రశాంతి… మరి కొంతమంది ఉన్నారు.
వారిలో కొందరిని నేను మా స్కూల్ లో జరిగిన బాలవికాస్ ఫంక్షన్ లో చూసినట్టు గుర్తు.
వాళ్ళు ఇక్కడ ఉండడానికి కారణం మాత్రం నాకు అర్థం కాలేదు.
ఇంతలో ప్రదీపన్న నన్ను పక్కకు పిలిచాడు. విషయం ఏమిటో తెలుసుకుందామని నేను అన్న వెనుక వెళ్లాను.
ఆంటీ వాళ్ళతో మాట్లాడుతోంది. బహుశా ఫంక్షన్ ఏర్పాట్లు గురించి కాబోలు.
అన్న నన్ను వేరే రూమ్ లోకి తీసుకెళ్ళాడు.
“ఇప్పుడు నువ్వు వాళ్ళ ముందర నీ ఏకపాత్రాభినయం చూపించాలి” అంటూ ఒక బాంబు పేల్చాడు.
“అన్నా… నేను ఇంకా యాక్టింగ్ నేర్చుకోలేదు.. ఎలా చూపమంటావు?” అంటూ కన్ఫ్యూజన్ స్టేజ్ లో అడిగాను.
“ఎలానో ట్రై చెయ్యి… అక్కడ ఉన్నవారు ఆర్గనైజింగ్ కమిటీ మెంబెర్స్. వాళ్ళు ఓకే అంటేనే మన ప్రోగ్రాం ఉంటుంది” అని చెప్పి నా సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయాడు.
ఇక నా పని కుడితిలో పడ్డ ఎలుకలా అయ్యింది… ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి.
ఇంతలో హాల్ నుండి ఆంటీ పిలుపు…
“ఏరా… ఇంకా ఎంతసేపు” అంటూ హూంకారం…
ఇక తప్పదు… తప్పించుకునే మార్గమూ లేదు…
ఏదైతే అది అయ్యిందని…”వస్తున్నా ఆంటీ…” అంటూ రిప్లై ఇచ్చి డైలాగ్స్ ను చూసుకోవడంలో మునిగిపోయాను.
కేవలం రెండంటే రెండే నిముషాలలో ఆ రూమ్ దాటి హాల్ లో కొచ్చాను.
అప్పటికే మా జూనియర్స్ కూడా హాల్ లోకి చేరుకున్నారు.
దాదాపు 20 మంది వరకు అక్కడే ఉన్నారు. హాల్ మద్యలో నన్ను కసాయివాడి ముందర గొర్రెను వదిలినట్టు వదిలిపెట్టి ప్రదీపన్న పక్కన్నే ఉన్న చైర్ లో కూర్చున్నాడు.
గొంతు సవరించుకుని డైలాగ్స్ ని ఒక్కసారి మననం చేసుకున్నాను. ఎకపాత్రాభినయానికే ఒక వెలుగును తెచ్చిన ఎన్టిఆర్ ని తలుచుకుని ప్రారంభించాను
“కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తర భ్రమ…” డైలాగ్ నాకు అర్థం కావడంతో దానికి తగ్గట్టుగా నా యాక్షన్ కలిపాను
(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్