అతను ఉన్నది సముద్రఅలల దగ్గర కాదు.ఒక పురాతనమైన హవేలీ ముందు…ఆ రాత్రి …?హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకుల కోసం ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి ……(ఘోస్ట్ స్టోరీస్) 11-02-2018

                                                  (5)

అది సాయంసంధ్యా సమయం. నలువైపులనుండీ చిమ్మనిచీకట్లు చీకటికే భీతి గొలిపేలా శరవేగంగా మూగుతున్నాయి.. ఆకాశం నిండా దట్టమైన కారుమేఘాలు కమ్ముకుంటున్నాయి.. హఠాత్తుగా మారిపోతున్న ఆ చీకటి వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపడుతూనే నల్లటినిశీధికి అద్దం పడుతున్నట్టున్న నల్లటి ఇసుకలో పటేల్ భారంగా అడుగులు వేస్తున్నాడు
తన ప్రాణానికి ప్రాణంలా చూసుకునే తన అన్న మరణం పటేల్ ను తీవ్రంగా కలచివేసింది. అన్న ఆఖరిచూపుకు కూడా నోచుకోక ఇప్పుడిలా వేదనను అనుభవిస్తూ అలా తిరుగుతున్న పటేల్ కు అక్కడ వాతావరణంలో జరుగుతున్న భయంకరమైన మార్పులు ఝడుపును కలిగించడం లేదు. కానీ ఆ చీకటిలో హోరుమనే అలలశబ్దంలో కలిసిన ఏవో విచిత్రమైన శబ్దాలు ఏవో అరుపులు పటేల్ చెవులకు సోకుతున్నాయి.
ఆ అరుపులేమిటో వినాలని పటేల్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏదీ స్పష్టంగా వినిపించడం లేదు. ఉన్నట్టుండి ఒళ్లు జలదరించేలా వికటాట్టహాసం వికృతమైన నవ్వులు. అంతలోనే నీ అంతు చూస్తామనే అరుపులతో పటేల్ కు జలదరింపు మొదలైంది. అంతలో ఇంకో స్వరం
“వెంటనే ఇక్కడినుండి వెళ్లిపో లేకుంటే నీ ప్రాణాలు దక్కవనే “హెచ్చరింపులు వినవస్తున్నాయి. అదురుతున్న గుండెలతో జలదరించే శరీరంతో అటూఇటూ పరికించాడు పటేల్ ఆ సముద్రతీరాన అక్కడక్కడా దూరంగా విసిరేసినట్టున్న లైట్లవెలుతురులో హోరుమనే అలల శబ్దంలో నల్లటిఇసుక …మనుష్యుల జడ లేదు.
బాగా జడుసుకున్న పటేల్ అక్కడనుండి తొందరగా వెళ్లిపోవాలని వేగంగా నడవటం మొదలుపెట్టాడు.. దూరంగా సముద్రపు అలలు ఘోష పెడుతున్నాయి. ఆ నల్లటిఇసుక జడలమర్రిలా భయపెడుతోంది. వెనుకనుండి భయంకరమైన అరుపులు శబ్దాలు వినపడుతునే ఉన్నాయి. ఎంత వేగంగా నడిచినా పరిగెడుతున్నా దూరం తరగడం లేదు. ఆ తీరంలో పటేల్ తప్ప ఎవరూ కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఇంతలో బలమైన హోరుగాలులు బలంగా వీస్తూ విసిరికొడుతున్నాయి. ఆ ఈదురుగాలుల ధాటికి దూరంగా విసిరేయబడిన పటేల్ స్పృహ తప్పి పడిపోయాడు.కొద్దిసేపటి తర్వాత మెలకువ వచ్చిన పటేల్ మెల్లిగా లేచి వణకసాగాడు.
ఆ వణుకు అతను పూర్తిగా తడిసినందువలన వచ్చిన వణుకు. బహూశా సముద్రఅలలలో తడిసి ఉంటాననుకుంటూ చుట్టూ పరికించిన పటేల్ ఒక్కక్షణం గగుర్పాటుకు లోనయ్యాడు.
అతను ఉన్నది సముద్రఅలల దగ్గర కాదు.ఒక పురాతనమైన హవేలీ ముందు. అలల హోరు ఎక్కడో సుదూరంగా వినిపిస్తోంది.ఆ సముద్రతీరంలో అక్కడున్న భీతావహ వాతావరణంలో ఆ హవేలీ అక్కడెలా ఉందో పటేల్ కు అర్థం కాలేదు.
ఆ హవేలీ లైట్లవెలుగులో పట్టపగలును తలపిస్తోంది. అంతలో ఆ హవేలీ బాల్కనీలో ఎవరో నిలుచున్నట్టు అనిపించింది పటేల్ కు. ఇంకా ముందుకెళ్లి చూశాడు అక్కడ నిజంగానే ఎవరో నిలుచుని పటేల్ ను రమ్మని పిలుస్తున్నారు.
ఆ చిమ్మచీకటిలో మనిషి జాడ అగుపించని ఆ తీరప్రాంతంలో ఒక మనిషి కనిపించడం పటేల్ కు ఎంతో ధైర్యాన్నిచ్చింది. ముందూ వెనుక ఆలోచించకుండా ఆ హవేలీ లోపలికి దూసుకుపోయాడు పటేల్
అక్కడ ఉన్నది అపరిచిత వ్యక్తే అయినా ప్రాణం లేచి వచ్చింది పటేల్ కు. అంతలో ఆ వ్యక్తి మీరు ఇక్కడెందుకున్నారు ఈ ప్రదేశం అంత మంచిది కాదు. మీరు వెంటనే ఇక్కడినుండీ వెళ్లిపోండి అని పటేల్ తో చెప్పాడు.
అది విన్న పటేల్ తనకు కలిగిన భయానక అనుభవాలను ఆ వ్యక్తికి వివరించాడు
అన్నీ మౌనంగా విన్న ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా పటేల్ తో ఇలా చెప్పాడు.
“నేను మిమ్మల్ని ఈ ప్రాంతం దాటించి క్షేమంగా వదిలిపెడతాను అంటూ.. కానీ మీరు నా వెంట వెనుతిరిగి చూడకుండా రావాలని మరీ మరీ హెచ్చరించాడు పటేల్ ను.
ఆ అపరిచితవ్యక్తి ఇక మీకు ఎలాంటి భయం లేదు క్షేమంగానే తిరిగొచ్చారు అనిచెప్తూ వెనుతిరిగి చూడకుండా వెళ్లండని మరల మరల హెచ్చరించాడు
ఆ నల్లటిఇసుకలో ఆ వ్యక్తి వెంట నడుస్తూ వచ్చిన పటేల్ ఆ సముద్రతీరాన్ని దాటి ఆ వ్యక్తితో పాటు బయటకు వచ్చాడు. తనను క్షేమంగా జనసంచారానికి దగ్గర చేసిన ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు పటేల్
కొంతదూరం నడిచిన పటేల్ కుతూహలాన్ని అణచుకోలేక వెనుతిరిగి చూసి మ్రాన్పడిపోయి అక్కడే శిలావిగ్రహంలా నిలుచుండిపోయాడు!!
అక్కడ……..
పటేల్ ను క్షేమంగా బయటికి చేర్చిన ఆ అపరిచితవ్యక్తి మెల్లగా కరిగిపోతూ తెల్లటిపొగ రూపంలోకి మారిపోతున్నాడు..చివరికి అలా మొత్తం కరిగి ఏర్పడిన ఆ తెల్లటిపొగ చనిపోయిన పటేల్ అన్న రూపాన్ని సంతరించుకుంది!!
(గుజరాత్ లోని సూరత్ కు 21 కి.మీ. దూరంలో ఉన్న “డ్యూమస్ ” బీచ్ ఒకప్పుడు హిందూ శ్మశానవాటిక అనీ. అందుకే అక్కడ ఉన్న ఇసుక నల్లగా ఉంటుందనీ అక్కడ దహనం చేయబడ్డవారు దయ్యాలు గా తిరుగుతూ అందరినీ భయపెడుతూ ఉంటాయని ….తెలిసిన సమాచారం ఆధారంగా…)

గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY