కొత్త సీరియల్ ప్రారంభం
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు.
సమయం రాత్రి 7-30 ..
సాయంత్రం 5.15 నిమిషాలకు ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం రెండుగంటల ప్రయాణానంతరం రాత్రి 7.30 నిమిషాలకు శంషాబాద్ లో లాండ్ అయింది.
విదేశాలకు వెళ్ళేవాళ్ళు..స్వదేశానికి తిరిగివచ్చేవాళ్ళు…ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు…ఉద్యోగాల కోసం..సినిమా షూటింగ్స్ కోసం…వ్యాపారం కోసం..తమ వాళ్ళ కోసం…ఇలా ప్రయాణీకులను ఆకాశమార్గంలో తీసుకువెళ్లే / తీసుకువచ్చే ఎయిర్ పోర్టులోకి …అప్పుడే ఒకవ్యక్తి వచ్చాడు.
ఢిల్లీ నుంచి హైద్రాబాద్ వచ్చిన ఆ యువకుడు ఎలాంటి లగేజీ లేకుండా చేతులూపుకుంటూ అప్పుడప్పుడు చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుంటూ తనలో తనే పాటను హమ్ చేసుకుంటూ బయటకు వచ్చాడు.
తనవైపే వస్తోన్న క్యాబ్ ను చూసి విజిలేసాడు.
అది గమనించిన ఒక్కజంట విస్తుపోయింది.చూడ్డానికి హీరోలా వున్నాడు..ఈ జులాయి పనులేమిటా అన్నట్టు చూసింది ఆ జంట,
***
క్యాబ్ లో వెనుక సీట్ లో కూచోని రిలాక్స్ అవుతూ రెండు చేతులూ రెండువైపులా బార్లాచాపి “డ్రైవర్ భయ్యా..మన క్యాబ్ లో భక్తిపాటలున్నాయా? అడిగాడు.
ఒక్కక్షణం క్యాబ్ డ్రైవర్ కు అర్థం కాలేదు…అర్థం అయ్యాక ఏం చెప్పాలో అర్థం కాలేదు…
“సర్లే భాయ్ సాబ్…”డు యు యాక్సెప్ట్ డాలర్స్…”అడిగాడు ఆ యువకుడు
డ్రైవర్ డ్రైవ్ చేస్తూనే తల వెనక్కి తిప్పి ఆ యువకుడి వైపు చూసి..”లేదు సార్..డాలర్స్ మేమేం చేసుకుంటాం…”సాధ్యమైనంత పోలయిట్ గా చెప్పాడు…
“పోనీ ఫైవ్ హండ్రెడ్ ..థౌజండ్ నోట్స్..మన మోదీజీ బాన్ చేసాడే అవి…ఎనీ ఛాన్స్ “ఈసారి ఆ యువకుడే డ్రైవర్ సీట్ దగ్గర తలపెట్టి అడిగాడు.
డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేసి”జోక్ చేయకండి సర్..మీ దగ్గర డబ్బులున్నాయిగా…?లగేజీ కూడా లేదు”నసిగినట్టు అనుమానంగా అడిగాడు.
“ఓహ్…లగేజీ ..ప్లయిట్లో దొబ్బేస్తారని ట్రైన్ లో పార్సిల్ చేసి నేను ప్లయిట్ లో వచ్చా …యు డోంట్ వర్రీ..నన్ను కోఠి దగ్గర దింపేసేయ్…”అన్నాడు.
డ్రైవర్ కు అనుమానాలు బడాబాబుల స్కామ్స్ లా పుట్టుకొస్తున్నాయి.
“మీరు హైద్రాబాద్ కు ఏం పనిమీద వచ్చారు సర్?అడిగాడు డ్రైవర్
“పానీపూరి తిందామని’?తాపీగా చెప్పాడు ఆ యువకుడు
సడెన్ బ్రేక్ తో కారాపాడు డ్రైవర్
“పానీపూరి కోసమా?
“ఏ ..పానీపూరి కోసం హైద్రాబాద్ రాకూడదా?కూల్ గా అడిగాడు
“ఏదో తేడాలా వుందే “అనుకున్నాడు డ్రైవర్
క్యాబ్ కోఠి దగ్గర ఆగింది…ఆ యువకుడు క్యాబ్ దిగి డ్రైవర్ వైపు తిరిగి”లాస్ట్ స్మాల్ డౌట్ నువ్వు షాక్ అవ్వనంటే అడుగుతా? అన్నాడు
“ఏంటి సర్? భయం భయంగా అడిగాడు డ్రైవర్
“టెన్ రూపీ కాయిన్స్ ఇవ్వొచ్చా..రిజర్వు బ్యాంకు చెల్లుతున్నాయని చెప్పింది..”అంటూ జేబులో చేయిపెట్టాడు.
“సర్ నన్నేడిపించకుండా డబ్బులివ్వండి…”ఏడ్పు గొంతుతో అన్నాడు క్యాబ్ డ్రైవర్
ఆ యువకుడు పర్సులో నుంచి డబ్బు తీసిచ్చి “థాంక్యూ డ్రైవర్ సాబ్..ఐ లవ్ యు …అన్నట్టు నీ పేరేమిటి భయ్యా…”అడిగాడు
“జేమ్స్ ,,,అనిచెప్పి క్షణం ఆగకుండా డ్రైవర్ వెంటనే క్యాబ్ ను ముందుకు కదిలించాడు.
సరిగ్గా క్యాబ్ కోఠి నుంచి రెండు మలుపులు తీసుకుని మూడవ మలుపు దగ్గరికి వచ్చేసరికి ఒక కారు క్యాబ్ కు అడ్డంగా వచ్చింది.అందులో నుంచి ముగ్గురువ్యక్తులు దిగి క్యాబ్ డ్రైవర్ ను బయటకు లాగారు.తమ కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు
(క్యాబ్ డ్రైవర్ ని ఎక్కడికి ఎందుకు ?తీసుకువెళ్తున్నారో తెలుసుకోవాలంటే వచ్చేవారం వరకూ వెయిట్ చేయాల్సిందే)
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్