“ముందుగా అటాక్ చేసే ఆప్షన్ నాదే” అంటూ హిమాంషు అతని వద్ద ఉన్న గన్ ని….స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి (07-08-2016)

“నథింగ్ టు వర్రీ” అంటూ హిమాంషును వెనక్కు పుష్ చేశాడు ఖలీల్
సీట్ మద్యలో ఉన్న కవర్ జిప్ ను పైకి లాగుతూ ఓపెన్ చేశాడు
సీట్ మద్యలో అందంగా పేర్చబడి ఉన్నాయి ఆరు డజన్ల బాంబులు. దాని పక్కగా సెట్ చేయబడి కనిపించాయి అరడజను షాట్ గన్స్. దాని ప్రక్కన్నే బాక్సుల కొద్దీ బుల్లెట్స్.
“వామ్మో! నన్ను ఈ బాంబులపై కూర్చోబెడతారా… అదీ ఏ విషయం చెప్పకుండా… పొరపాటున ఏ ఒత్తిడో కలిగి బాంబులు పేలి ఉంటే నా గతేం కాను? పైగా నేను మా అమ్మకు ఒక్కడే పెద్ద కొడుకును.. ఖలీల్ ఇది చాలా అన్యాయం… నేను దీన్ని బలంగా ఖండిస్తున్నా!” అంటూ ఖలీల్ పై వీరంగం వేశాడు హిమాంషు
అతని మాటలకు నవ్వుకుంటూ అందుబాటులో ఉన్న షాట్ గన్ ను అందుకున్నాడు.
“ముందుగా అటాక్ చేసే ఆప్షన్ నాదే” అంటూ హిమాంషు అతని వద్ద ఉన్న గన్ ని అమాంతం లాక్కున్నాడు.
ఖలీల్ మారుమాట్లాడక ముందు సీట్ లో కి మారాడు.
సత్యమూర్తిని వెనుక సీట్ కి షిఫ్ట్ చేసి తన ఎదురుగా ఉన్న డాష్ బోర్డ్ ఓపెన్ చేశాడు ఖలీల్.
సత్యమూర్తిని కవర్ చేస్తూ అగస్త్య అతనికి ఒక వైపు, హిమాంషు మరో వైపు కూర్చున్నారు. తమ శత్రువుకు కావలసింది సత్యమూర్తి మాత్రమే అని అక్కడ ఉన్నవారందరికీ తెలుసు.
అగస్త్య తమ పొజిషన్ అంచనా వేసుకున్నాడు. తమకు ప్రమాదం అంటూ ఉంటే అది ఒక్క ఆకాశం నుండి శత్రువు చేసే దాడి వల్లే అవుతుంది. అది కవర్ చేస్తే నేలపై ఉన్న అటాక్ ను ఎదుర్కోవడం పెద్ద పని కాదు.
అగస్త్య మనసులోని మాటను అర్థం చేసుకున్నవాడిలా నవ్వాడు ఖలీల్
“ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు బ్రో… నీ మనసులో ఏముందో చెప్పేస్తే మాకు టెన్షన్ తగ్గిపోతుంది కదా… ఏమిటో ఇక్కడ నేను ఒక్కడినే మాట్లాడుతున్నా. మిగిలిన వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు” అగస్త్య వంక చూస్తూ అన్నాడు హిమాంషు.
అతని మాటలను పెద్దగా లెక్కచెయ్యక తన వద్ద ఉన్న టెలిస్కోపిక్ గన్ లో డిస్టెన్స్ చెక్ చేశాడు అగస్త్య.
శత్రువులు తమ రేంజ్ కి రావడానికి కనీసం 5 నిముషాలు పడుతుంది. ఆలోపల మంచి ప్లాన్ చెయ్యడం పెద్ద కష్టం కాదు.
ఖలీల్ ఏం చేస్తున్నాడో చూద్దామని ముందు సీట్ కి వంగిన హిమాంషు అలాగే వెనక్కు విరుచుకు పడ్డాడు. తన తలపై నుండి దాదాపు తాకుతూ వెళ్ళింది బులెట్. కార్ విండోస్ ఓపెన్ చేసి ఉండడంతో అదృష్టం కొద్దీ ఏ డ్యామేజ్ జరగలేదు.
“బ్రోస్.. యాక్ట్ ఫాస్ట్. ఇక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నా” అంటూ లబలబలాడాడు హిమాంషు.
ఖలీల్ డాష్ బోర్డ్ నుండి లాప్ తాప బయటకు తీశాడు. లాప్ టాప్ ఆన్ చెయ్యంగానే ఆలస్యం కాకుండా స్క్రీన్ పై తాము కూర్చున్న లొకేషన్ చూపుతూ మాప్ హిమాన్శుకి కనపడ్డది.
“బ్రో… ఏం చేస్తున్నావ్?” ఆలస్యం అవుతున్న కొద్దీ ఆందోళన అధికం అవుతుండగా అడిగాడు హిమాంషు
ఖలీల్ ఏదో టార్గెట్ చేస్తున్నట్టుగా టచ్ స్క్రీన్ పై కొన్ని బటన్స్ నొక్కాడు. కార్ ముందు బాగంలో ఏంటినాలా ఉన్న ఇనుప కమ్మి విచిత్రంగా గొడుగులా తెరుచుకుంది. అది చూడడానికి చిన్న సైజ్ శాటిలైట్ లా కనిపించింది హిమాంషుకి.
“చేసేదేదో చెప్పి చేస్తే నీ సొమ్మేం పోయిందంట” చిరుకోపం ప్రదర్శిస్తూ అన్నాడు హిమాంషు
అతని మాటలను కేర్ చెయ్యక ఒక బటన్ నొక్కాడు ఖలీల్. కార్ బానెట్ తెరుచుకుని ఒక చిన్న రాకెట్ లాంటిది బయటకు వచ్చింది.
ఎవరో ఆదేశించినట్టుగా తన డైరెక్షన్ మార్చుకుని ఆకాశం వైపుకు దూసుకుపోయింది. సరిగ్గా 4 సెకండ్స్ లో తమను అనుసరిస్తూ వస్తున్న హెలికాప్టర్ పెద్ద శబ్దం చేస్తూ ఆకాశంలో మండిపోయింది.
(క్షిపణిలో చిన్నబ్రేక్ …వచ్చేవారం వరకూ)

ఈ సీరియల్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…
…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY