రద్దు కంగారు వద్దు నోట్ల మార్పిడి విషయంలో కంగారు అవసరం లేదు.మీడబ్బు మీకు భద్రం అన్న మోదీ హామీ.డబ్బును సులువుగా ఇలా మార్చుకోవచ్చు. .

చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లు మొత్తాన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మంగళవారం రాత్రి ఆయన ఈ సంచలన నిర్ణయం ప్రకటించిన దగ్గరి నుంచీ ప్రజల్లో ఎన్నెన్నో సందేహాలు. తమ దగ్గర ఉన్న నోట్లు ఏం చేయాలి? కొత్త నోట్లు పొందడం ఎలా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అన్నింటికీ మించి భయం సామాన్యుల్లో నెలకొంది.

తమ కష్టార్జితం,పోగుచేసుకున్న సొమ్ము ఏమవుతుందోనని భయం…
అయితే మీదగ్గర వున్న నోట్లు మార్చుకోవడం,మీ డబ్బు సురక్షితంగా ఉంచుకోవడమే కష్టమేమీ కాదు.
బుధ, గురువారాల్లో ఏటీఎంలు పనిచేయవు. బ్యాంకులు బుధవారం ఒక్క రోజు పనిచేయవు. సాంకేతికపరమైన చర్యలు సకాలంలో పూర్తయిన చోట్ల గురువారం ఏటీఎంలు పనిచేసే అవకాశం ఉంది.
నోట్లను ఇలా మార్చుకోవచ్చు
చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లు వున్న వారు గురువారం (10వ తేదీ) నుంచి డిసెంబరు 30లోగా బ్యాంకులు లేదా హెడ్‌ పోస్టాఫీసులు, సబ్‌ పోస్టాఫీసులకు వెళ్లి వాటిని ఇచ్చేసి చెల్లుబాటయ్యే వేరే డినామినేషన్‌ నోట్లు తీసుకోవచ్చు. నోట్లు మార్చుకునే ప్రతి వ్యక్తీ తన ఐడీ కార్డును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
*ఈనెల 24 వరకు ఒక్కో వ్యక్తీ రూ.4 వేల వరకే మార్పిడి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఈ మార్పిడిపై పరిమితిని ఎత్తేస్తారు.
బ్యాంకు ఖాతాలో ఎంతైనా డిపాజిట్‌ చేసుకోవచ్చు.
*బ్యాంకుల్లోని తమ ఖాతాల్లోనైతే ఈ పాత నోట్లను ఎన్నింటినైనా తీసుకెళ్లి డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఇక్కడ పాన్‌, ఐటీకి సంబంధించిన పాత నిబంధనలు యథాతథంగా వర్తిస్తాయి.
విత్ డ్రా ఎంత చేసుకోవచ్చు?
ప్రజల రద్దీని బట్టి బ్యాంకుల్లో వితడ్రాయల్స్‌పై ఎక్కడికక్కడ పరిమితులు విధిస్తారు. మొదట్లో రోజుకు రూ.10 వేలు, వారానికి రూ.20 వేల మేరకు మాత్రమే వితడ్రాయల్స్‌ను అనుమతిస్తారు. ఈ పరిమితి 24వ తేదీ వరకు కొనసాగుతుంది. తర్వాత రద్దీని బట్టి సడలింపు ఉంటుంది.
ఖాతాలో ఉన్నా విత్‌డ్రా చేసుకోలేకుంటే చెల్లింపులు ఎలా?
రద్దయిన నోట్లను ముందు బ్యాంకులో వేసేశాం. బాగానే ఉంది. కొత్తవి తీసుకుందామంటే వితడ్రాయల్స్‌పై పరిమితులు పెట్టారు. ఇలాంటప్పుడు మరి చెల్లింపులు ఎలా అన్న సందేహం రావడం సహజం. నగదేతర లావాదేవీలకు ఎలాంటి అంతరాయమూ ఉండదు.
అంటే ఖాతాలో వేశాక చెక్కుల ద్వారాను, డెబిట్‌ కార్డుల ద్వారాను, నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌, ఐఎంపీఎస్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రూపంలోనూ చెల్లింపులు, నగదు బదిలీలు యథాతథంగా చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్‌ కార్డుల ద్వారానూ చెల్లింపులు చేయొచ్చు. డిమాండ్‌ డ్రాఫ్ట్స్‌నూ తీసుకొని వాడుకోవచ్చు.
ఏటీఎంల నుంచి కొత్త నోట్లే వస్తాయా?
ఏటీఎంలలో ఉన్న రద్దయిన పాత నోట్లన్నింటినీ తీసేసి, కొత్తవి పెట్టేందుకే బుధ, గురువారాలు వాటిని మూసేస్తారు. అవి పనిచేయడం ప్రారంభించగానే అన్నీ చెల్లే కొత్త నోట్లే వస్తాయి. కాకుంటే వితడ్రాయల్‌పై పరిమితి, ప్రజలకు చిన్న నోట్ల అవసరం దృష్ట్యా కొద్దిరోజుల పాటు రూ.50, 100 నోట్లే ఏటీఎంలలో ఉంచుతారు.
డిసెంబరులోపు మార్చుకోలేక పోతే? 
అనివార్య కారణాల వల్ల డిసెంబరు 30లోగా బ్యాంకుకు వెళ్లి పాత నోట్లను మార్చుకోలేకపోయిన వారు మిగిలి ఉంటే వారికి మరో అవకాశమూ ఇస్తారు. నిర్దేశిత ఆర్‌బీఐ కార్యాలయాలకు వెళ్లి, నిర్ణీత ప్రమాణ పత్రం సమర్పించి 2017 మార్చి 31లోగా పాత నోట్లను వారు మార్చుకోవచ్చు.
ఏటీఎంల నుంచి ఎంతైనా తీసుకోవచ్చా?
ఇప్పటికిప్పుడు అలా తీసుకోవడం కుదరదు. కొత్త నోట్ల కోసం ఉండే భారీ డిమాండ్‌ను ఎదుర్కోవడం కోసం ఏటీఎం వితడ్రాయల్స్‌పైనా పరిమితులు విధించారు. ఈ నెల 18 వరకు ఒక్కో కార్డుపై రోజుకు రూ.2 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి కుదురుతుంది. 19 నుంచి రూ.4 వేలు తీసుకునేందుకు అనుమతిస్తారు.
ఈ గుర్తింపులో ఎదో ఒకటి ఉంటే చాలు
బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవడానికి గుర్తింపు పత్రాలు తప్పనిసరి చేశారు. పాన్ కార్డు, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి పాస్ పోర్ట్ లలో ఏదో ఒకటి తప్పనిసరిగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చూపించి మాత్రమే ఈ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డులు లేకుండా పాత నోట్లను మార్చుకోవడం కుదరదు. అందువల్ల నల్లధనం దాచుకున్న వ్యక్తులు కట్టల కొద్దీ రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లను మార్చుకోవడం అంత తేలిక కాదు.

NO COMMENTS

LEAVE A REPLY