విజయభాను కోటే …
పిల్లలంటే ప్రాణం..విద్యాబోధన ఆరోప్రాణం..
తనకు నచ్చినట్టు ఉంటుంది..ఎవరినీ నొప్పించకుండా…ఉంటుంది.
చదువు బరువు దరువు కాకూడదని కష్టంగా కాక ఇష్టంగా చదవాలని…చాలా ఇష్టంగా చదువు చెప్పే ఉపాథ్యాయిని.
చందమామ కథలు కాశీమజిలీ కథలు రాబిన్ హుడ్ కథలు పేదరాశి పెద్దమ్మ కథలు…ఒకనాటి నిన్నటి హిమసమూహాలు…
వాటిని మర్చిపోతున్న రోజుల్లో కార్పొరేట్ విద్య కమర్షియల్ చట్రాల మధ్య నలిగిపోతున్న తరుణంలో….
విద్యార్థులను కథా ప్రపంచంలోకి అలతి అలతి పదాలతో ఆహ్లాదాన్ని ఆలోచనను కలిగిస్తున్న విజయభాను కోటే కథ “చిన్ని కుందేలు బాధ “
డియర్ పేరెంట్స్..మీ పిల్లలకు మీరూ ఇలాంటి కథలు చెప్పండి.తెలుగు బాష పట్ల సాహిత్యం పట్ల…వారికి అభిరుచి కలిగేలా చేయండి.వారి మేథో వికాసానికి మీ వంతు కృషి చేయండి…
బోధన ఒక వృత్తిగా కాక తపస్సులా భావిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచే విధంగా కృషి చేస్తోన్న విజయభాను కోటే ను మేన్ రోబో అభినందిస్తుంది.
“చిన్ని కుందేలు బాధ ” ఈ ఆదివారం చిన్నారులకు ప్రత్యేకం…చీఫ్ ఎడిటర్
చిన్ని కుందేలు బాధ
(చిట్టిపొట్టి చిన్నారులు…ఆటపాటలతో గెంతులేసే అల్లరి పిడుగులూ శ్రమ తెలియకుండా
“చిన్ని కుందేలు బాధ ” కథ వింటారా మరి…)
పాయకరావుపేటలో అంబేద్కర్ పార్క్ ఉంది. ఒక రోజు సాయంత్రం స్కూల్ అయ్యాక ఆ పార్క్ లో ఆడుకోవడానికి యజ్ఞ వెళ్ళింది. ఆమె స్నేహితులు సాయి, జాన్, సిరి కూడా ఆమెతో ఆడుకోవడానికి పార్క్ కి వెళ్ళారు. యజ్ఞ తన స్కూల్ బ్యాగ్ భుజానికి తగిలించుకునే ఆడుతూ ఉంది. మిగిలిన వాళ్ళు తమ స్కూల్ బ్యాగ్స్ ను ఒక గట్టు మీద పెట్టి ఆడుతూ ఉన్నారు. దొంగాటలో భాగంగా యజ్ఞ పార్క్ లోని చెరువు ప్రాంతానికి వెళ్లి దాక్కుంది. యజ్ఞ ఎదురుగా ఒక చిన్న కుందేలు పిల్ల దుముకుతూ వచ్చింది. అది యజ్ఞను గమనించలేదు. తన మానాన ఒకటే గెంతులు వేస్తూ, హుషారుగా ఆడుకుంటూ ఉంది.
“అబ్బ! ఎంత ముద్దుగా ఉందో కుందేలు!” అనుకుంది యజ్ఞ.
ఆ కుందేలును తనతో తీసుకువెళ్ళాలి అనుకుంది. కుందేలు పిల్ల వెనుక నుండి ఒక్క ఉదుటున ఒడిసి పట్టుకుంది. కుందేలు పిల్ల భయంతో వణికిపోయింది. యజ్ఞ చేతిలోంచి జారడానికి ప్రయత్నం చేసింది కానీ కుదరలేదు. యజ్ఞ వెంటనే తన స్కూల్ బ్యాగ్ తీసి, కుందేలు పిల్లని అందులో పెట్టి క్లిప్స్ పెట్టేసింది. పాపం కుందేలు పిల్ల బ్యాగ్ లో బిక్కు బిక్కు మంటూ పడుకుంది.
యజ్ఞ గబగబా తన ఇంటికి బయలుదేరింది. ఆటను మధ్యలోనే వదిలేసింది. దొంగాటలో దొంగలను ఒక్కొక్కరిని పట్టుకుంటున్న సాయి, యజ్ఞ పరుగులాంటి నడకతో పార్క్ బయటికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయాడు. యజ్ఞ తగిలించుకున్న స్కూల్ బ్యాగ్ లోపలినుండి కదలికలు రావడం చూసి, యజ్ఞను పిలిచాడు.
“యజ్ఞా! నీ సంచిలో ఏదో కదులుతుంది. పాము కానీ దూరిందేమో! చూసుకో!” అని అరిచాడు.
యజ్ఞ ఆగలేదు.
“ఏమీ లేదు. నీళ్ళ సీసా కదులుతుంది.” అని వెనక్కి తిరక్కుండానే సమాధానం చెప్పి, పరుగున ఇంటికి వెళ్ళిపోయింది.
ఇంటికి వెళ్ళాక నెమ్మదిగా తన స్కూలు బ్యాగ్ క్లిప్స్ తీసింది. ఒక్కసారిగా ఊపిరి అందినట్లు కుందేలు పిల్ల బ్యాగ్ బయటికి దూకింది. ఇది చూసిన యజ్ఞ వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది.
ముద్దుగా ఉన్న కుందేలు పిల్లను చూసి ఆమె కూడా ముచ్చట పడింది. తినుబండారాలు ఏమి పెట్టబోయినా కుందేలు తినలేదు.
ఈ లోపు యజ్ఞ స్నేహితుడు కార్తిక్ అక్కడికి వచ్చాడు. చుట్టుప్రక్కల ఇళ్ళల్లోని పిల్లలంతా ఆ కుందేలును చూడడానికి యజ్ఞ వాళ్ళింటికి వచ్చారు. ఆట అయిపోయిన తర్వాత సాయి, జాన్, సిరి కూడా యజ్ఞ మధ్యలో ఎందుకు హడావుడిగా ఆట వదిలి వచ్చిందో తెలుసుకోవడానికి ఆమె ఇంటికి వచ్చారు.
“భలే ముద్దుగా ఉంది కుందేలు. చెవులు భలే ఉన్నాయి, కళ్ళు భలే ఉన్నాయి” అంటూ ఒక్కొక్కరు కుందేలును చేతుల్లోకి తీసుకుని దాని ఒళ్ళు నిమరడం మొదలు పెట్టారు.
“ ఎక్కడ పడితే అక్కడ పట్టుకోకూడదు. కుందేలును చెవులు మాత్రమే పట్టుకోవాలి” అని ఈ హడావుడి గమనించి అక్కడికి వచ్చిన ప్రక్కింటి తాత చెప్పాడు.
వరుణ్ తన ఇంటికి వెళ్లి ఒక క్యారెట్ పట్టుకొచ్చాడు. ప్రేమ్ కాస్త పచ్చ గడ్డి తెచ్చాడు. అందరూ ఆనందంతో కేరింతలు కొడుతూ కుందేలుతో ఆడుకుంటున్నారు.
కానీ కుందేలు పిల్ల మాత్రం ఏ మాత్రం హుషారు లేకుండా ఉంది. ఏమి పెట్టినా తినలేదు. భయపడుతుందేమో అనుకున్న పిల్లలు దాన్ని ఆ రాత్రి ఒక గంప క్రింద పెట్టి ఉంచారు. మర్నాడు ఆదివారం. ఆ రోజు కూడా అది ఏమీ తినలేదు. దిగులుగా ఒక మూల కూర్చుంది.
ఆ మధ్యాహ్నం పార్కు లో పనిచేసే సాంబయ్య అటుగా పోతూ పిల్లల్ని, కుందేలు పిల్లనీ చూసాడు.
“అయ్యో! పిల్లలు….ఈ కుందేలు పిల్ల కోసం దాని తల్లి బెంగ పెట్టుకుంది. పార్కులో దిగులుగా పడుకుని ఉంది. పాపం, ఈ పిల్ల కూడా అమ్మ కోసం బెంగ పెట్టుకున్నట్లు ఉంది. దాన్ని తల్లి దగ్గర వదలండి” అని చెప్పాడు.
పిల్లలకు అప్పుడు అర్థం అయింది కుందేలు పిల్ల ఎందుకు దిగులుగా ఉందొ! యజ్ఞ తను చేసిన పనికి చాలా బాధ పడింది. స్నేహితులు అందరూ కలిసి పార్కుకు వెళ్ళారు. కుందేలు పిల్లని పార్కులోని ఆ చిన్న తటాకం దగ్గర వదిలేసారు. కుందేలు గెంతుకుంటూ తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ రెండు కుందేళ్ళు హుషారుగా గెంతడం చూసిన పిల్లలకు తల్లి కోసం పిల్లలు ఎందుకు బెంగ పెట్టుకుంటారో అర్థం అయింది. ఇంకెపుడూ ఇటువంటి పని చెయ్యకూడదని నిర్ణయించుకున్నారు.
(ఈ కథ నేను చెప్పడం, ఒకటో తరగతి పిల్లలు దాన్ని డ్రామా వెయ్యడం జరిగింది…విజయభాను కోటే)
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ కథను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్