WARNINIG …పిల్లలను మృత్యువుకు దగ్గర చేసిన .డేంజరస్ ( డెత్ ) గేమ్ ..శ్రీసుధామయి అపరాధ పరిశోధన కథ (09-12-2018)

 ( 3 )
ఆశిష్ ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు. చాలా రోజుల తర్వాత ఆ రోజే స్కూల్ కి వచ్చాడు ఆశిష్ . ఇన్నిరోజులు ఏమైపోయావురా అని స్నేహితులందరూ అడుగుతుంటే జబ్బు పడి తేరుకున్నాను. అందుకే స్కూల్ కి రాలేదని ముభావంగా సమాధానం చెప్పాడు. ఆశిష్ అలా కొత్తగా ముభావంగా ఉండటం చూసిన అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. అందరితో ఎంతో కలివిడిగా ఉండే ఆశిష్ అలా ఉండటం చూసిన అందరూ బహూశా అనారోగ్యకారణాల వలన అలా ఉన్నాడేమో అని సరిపెట్టుకున్నారు.
కానీ ఆశిష్ ప్రాణస్నేహితుడైన అమర్ ఆశిష్ లో ఏదో మార్పు వచ్చిందని గమనించాడు.
సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వెళ్లిన ఆశిష్ కు అమ్మ కనిపించలేదు. కొద్ది రోజుల క్రితం తన తండ్రితో విడాకులు తీసుకుని వెళ్లిపోయిన అమ్మ గుర్తొచ్చి ఆశిష్ కళ్లలో నీరు సుడులు తిరిగింది. అంతలో తినడానికి రమ్మని పిలిచిన ఆయా పిలుపుతో తెప్పరిల్లిన ఆశిష్ తినేసి టీవి చూడటం మొదలుపెట్టాడు. ఆ వేళ ఆడుకోవడానికి వెళ్లకుండా టీవి చూస్తున్న ఆశిష్ ను చూసి ఆయా అన్ని జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్లిపోయింది.
క్రమంగా చీకటి పడింది. చీకటి పడటంతోనే ఆశిష్ కు వణుకు మొదలైంది. కారణం తన తండ్రి తాగి రావడం. తన తల్లి విడాకులు తీసుకుని వెళ్లినప్పటి నుండి తండ్రి విపరీతంగా తాగి వచ్చి ఇంట్లో వస్తువులను పగలగొట్టడం పరిపాటి అయిపోయింది. తన తల్లిదండ్రులు చీటికిమాటికి గొడవ పడుతూ అరుచుకుంటూ ఉంటే ఆశిష్ ఇంట్లో భయంభయంగా గడిపేవాడు. తండ్రి మీద ఉన్న చిరాకును తల్లి ఎప్పుడూ తన మీద చూపేది. చివరకు ఒకరోజు తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని ఆయా చెప్పగా విని ఉన్నాడు. విడాకులంటే తన తల్లి తనను వదిలి వెళ్లిపోవడమే అని ఆ చిన్నిమనసుకు అర్థమైంది. ఒకరోజు తనను చూడటానికి వచ్చిన అమ్మను లోపలికి రానివ్వకుండా తనను అమ్మ దగ్గరికి వెళ్లనివ్వకుండా తన తండ్రి అడ్డుకున్నాడు. అప్పుడు బెంగ పెట్టుకున్న ఆశిష్ జబ్బు పడి స్కూల్ కు వెళ్లలేకపోయాడు.

తన తండ్రి తాగొచ్చి ఇంటిలో వస్తువులను పగలగొడుతూ ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయేవాడు. తండ్రి నిద్రపోయేవరకూ ఒక మూలగా భయంభయంగా గడుపుతూ తల్లి గుర్తొస్తుంటే వెక్కివెక్కి ఏడుస్తూ గడిపేవాడు.
కొద్దిరోజుల తర్వాత ఆశిష్ లో మార్పు కనిపించసాగింది. తండ్రి చేసే పనులకు అలవాటు పడిపోయి నిర్లిప్తంగా ఉండటం నేర్చుకున్నాడు. ఎప్పుడూ తన స్కూల్ బ్యాగు ముందేసుకుని ఉండటం అలవాటు చేసుకున్నాడు. అది చూసిన ఆశిష్ తండ్రి ఆశిష్ ను మొత్తంగా పట్టించుకోవడం మానేశాడు.
ఎప్పుడూ విచారంగా ఉండే ఆశిష్ ఆ వేళ అత్యుత్సాహంగా ఉండటం చూసిన అమర్ సంతోషించాడు. ఆ రోజు క్లాస్ లో కూడా ఆశిష్ ఉత్సాహంగా పాఠాలు విన్నాడు.
స్కూల్ అయిపోగానే ఇంటికి వెళుతున్న ఆశిష్ అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్దారించుకుని తన స్కూల్ బ్యాగు నుండి సెల్ ఫోన్ తీసి సంగీతం వినసాగాడు. అంతలో ఎక్కడినుండో వచ్చిన అమర్ ఆశిష్ చేతిలో సెల్ ఫోన్ చూసి ఆశ్చర్యపోయాడు. అందులో నుండి వస్తున్న సంగీతం అమర్ ను ఎంతో కలవరపెట్టింది. ఈ సంగీతం ఏమిటిరా ఇలా ఉంది అని అడిగిన అమర్ ను చూసి ఆశిష్ ఉలికిపాటు తో సెల్ ఫోన్ ను దాచేశాడు.

ఒక సెలవు రోజున అమర్ ఆశిష్ వాళ్లింటికి వచ్చాడు. అయితే ఇంట్లో ఆశిష్ ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో ఎవరూ లేరు. ఆశిష్ ఎక్కడున్నాడో అర్థం కాక అమర్ బయటకు వెళ్లిపోతూ అక్కడున్న ఆశిష్ స్కూల్ బ్యాగు నుండి బయటకు వచ్చిన ఒక పేపర్ ను చూసి చేతిలోకి తీసుకున్నాడు. అందులో చిత్రించిన ఒక బొమ్మను చూసి ఆశ్చర్యంగా దాన్ని చూస్తుండిపోయాడు అమర్ . ఆశిష్ అంత బాగా బొమ్మలు గీస్తాడని అప్పటివరకు తెలియని అమర్ ఆ విషయాన్ని రేపు స్కూల్ లో మిగతా స్నేహితులందరికీ చెప్పాలని నిశ్చయించుకుని అక్కడనుండి వెళ్లిపోయాడు.
అమర్ వెళ్లిపోగానే ఒక చీకటిగదిలో ఉన్న ఆశిష్ నవ్వుకుంటూ బయటికొచ్చాడు.
రానురాను స్కూల్ లో పాఠాలమీద శ్రద్ద తక్కువైన ఆశిష్ క్రమంగా తన లోకంలో తానుండటం నేర్చుకున్నాడు. తెలివైన కుర్రాడైన అమర్ ఆశిష్ ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తున్నాడు.
ఒకరోజు ఆశిష్ రైలు పట్టాల మీద నడుస్తుండగా అల్లంత దూరాన రైలుకూత వినిపించసాగింది. ఆ శబ్దం విన్న ఆశిష్ పట్టాల మీద నుండి పక్కకు రాకపోవడాన్ని గమనించిన ఒక వ్యక్తి ఆశిష్ ను పక్కకు లాగి రక్షించాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు. ఆశిష్ స్కూల్ టీచర్ అయిన ముఖర్జీ. ఆశిష్ ప్రవర్తనను గురించి వారింట్లో చెప్పడానికి ఆ సాయంత్రం ఆశిష్ వాళ్లింటికి వెళ్లాడు ముఖర్జీ. కానీ అక్కడ ఆశిష్ వాళ్ల నాన్న తప్పతాగి స్పృహ లేకుండా పడి ఉన్నాడు.
ఇంకో పక్క ఆశిష్ గోడ మీద ఏవో బొమ్మలు గీస్తూ టీచర్ ను గమనించాడు. ఉలికిపాటుగా తన చేతిలో ఉన్న వస్తువును దాచుకున్నాడు. ఆశిష్ చేతిలో ఉన్న వస్తువును గోడలపై చిత్రించిన బొమ్మలను చూసిన ముఖర్జీ కి ఏదో అనుమానం బలపడింది. అంతే మరేమీ మాట్లాడక అక్కడనుండి వెళ్లిపోయాడు.
ఆశిష్ క్రమంగా తనలోకంలో ఉండిపోతూ చదువును నిర్లక్ష్యం చేయసాగాడు. తరచూ క్లాస్ రూం లో సెల్ ఫోన్ వాడటమే కాక ఒకరోజు బ్లేడుతో తన చేతిని కోసుకోవాలని ప్రయత్నిస్తూ అమర్ కు దొరికిపోయాడు. అది చూసిన అమర్ వెంటనే తమ టీచర్ అయిన ముఖర్జీ కి జరిగినదంతా వివరించాడు. అంతా విన్న ముఖర్జీ తానేం చేయాలో నిర్ణయించుకున్నాడు.
ఆ రోజు ఆదివారం.
స్కూల్ లో ఎవరూ లేరు. గేటు బయట వాచ్ మెన్ కునికిపాట్లు పడుతున్నాడు. అంతలో అక్కడికి ఆశిష్ వచ్చాడు. ఏంటి బాబూ ఇలా వచ్చావు ఇవాళ ఆదివారం కదా అన్న వాచ్ మెన్ మాటలకు నిన్న స్కూల్ లో కొన్ని పుస్తకాలు మర్చిపోయాను అవి తీసుకుపోవాలని వచ్చాను అన్నాడు. సరే వెళ్లమని చెప్పిన వాచ్ మెన్ మరల కునికిపాట్లు పడసాగాడు. ఆశిష్ లోపలికి వెళ్లాడు. స్కూల్ బిల్డింగ్ రెండో అంతస్తు పైకి చేరుకున్నాడు. అక్కడనుండి కళ్లు మూసుకుని కిందకు దూకేశాడు.
అప్పటికే స్కూల్ గ్రౌండ్ లో తన కమాండో టీం తో రెడీగా ఉన్న “డిటెక్టివ్ సిద్దార్థ” ఆశిష్ ను పెద్ద వల లో పడేటట్టు చేశారు. వలలో పడిన ఆశిష్ ను డిటెక్టివ్ సిద్దార్థ కిందకు దించాడు. అదంతా చూస్తున్న ఆశిష్ తండ్రి ఆశిష్ ను గుండెలకు అదుముకున్నాడు.
అంతలో స్కూలు లోపల నుండి ముఖర్జీ మాత్రమే కాక మరికొంతమంది టీచర్లు, ఆశిష్ స్నేహితుడు అమర్ మరికొంతమంది పిల్లలతో కలిసి బయటకు వచ్చారు. వారందరినీ చూసిన ఆశిష్ తలదించుకున్నాడు.
కన్నీటి పర్యంతమవుతున్న ఆశిష్ తండ్రిని చూస్తూ డిటెక్టివ్ సిద్దార్థ ఇలా చెప్పసాగాడు.
“మీరు మీ భార్యతో విడిపోవడం మీ అబ్బాయి మీద బాగా ప్రభావం చూపింది. దానికి తోడు మీ తాగుడు ప్రభావంతో ఆశిష్ మరింత డిప్రెషన్ కు లోనయ్యాడు. మీరు తీసిచ్చిన సెల్ ఫోన్ మీ అబ్బాయి ప్రాణాలకు ప్రమాదం తెచ్చింది. బాగా డిప్రెషన్ లో ఉన్న ఆశిష్ తన ఫోన్ లో “బ్లూ వేల్ ” అనే డెత్ గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. ఆ గేమ్ లో ఉన్న యాభై టాస్కులు చేయాలనుకున్నాడు ఆశిష్ కానీ ఎవరికైనా అనుమానం వస్తుందని జాగ్రత్త పడ్డాడు. ఆశిష్ ప్రవర్తించే తీరు ఆశిష్ స్నేహితుడైన అమర్ కు ఆందోళన కలిగించింది.
అందుకే తమ టీచర్ అయిన ముఖర్జీ కి ఆశిష్ ప్రవర్తన గురించి వివరించాడు. ఆశిష్ ను రైలు పట్టాల మీద చూసినప్పుడు ముఖర్జీకి అనుమానం బలపడింది. ఆశిష్ గురించి వాళ్ల నాన్నగారితో చెప్పాలని చూసిన ముఖర్జీ భంగపడ్డాడు. ఆశిష్ ను అలా వదిలేయలేక ఆశిష్ ను కాపాడటానికి ముఖర్జీ నన్ను సంప్రదించాడు. నేను ఎప్పటికప్పుడు అమర్ ద్వారా ఆశిష్ కదలికలను తెలుసుకుంటూ ఆశిష్ బ్లూ వేల్ గేమ్ లో చివరి టాస్క్ అయిన భవనంపై నుండి దూకి ప్రాణాలు తీసుకోవడం తప్పక చేస్తాడని ఊహించాను. ఆశిష్ ను వెంటాడుతూ నేను మా కమెండోలు ఈ స్కూలు లోకి వచ్చి ఆశిష్ ను రక్షించాము” అని డిటెక్టివ్ సిద్దార్థ వివరించగానే స్కూలు ఆవరణ అంతా చప్పట్లతో మారుమోగింది!!

( వచ్చేవారం మరో డిటెక్టివ్ కథ )

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

డిటెక్టివ్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY