HomeStoriesదేవుడిగా మారడం కోసం దేవుడి కోసం తపస్సు చేసాడు….మనిషి దేవుడయ్యాడు…కానీ ..? —విజయార్కె కథ
దేవుడిగా మారడం కోసం దేవుడి కోసం తపస్సు చేసాడు….మనిషి దేవుడయ్యాడు…కానీ ..? —విజయార్కె కథ
(మే 2016 స్వాతి సచిత్ర మాసపత్రికలో ప్రచురించబడిన కథ )
మనిషికి దేవుడవ్వాలని అనిపించింది దేవుడిగా మారడం కోసం దేవుడి కోసం తపస్సు చేసాడు. దేవుడు ప్రత్యక్ష్యమయ్యాడు.మనిషిని దేవుడిగా మార్చాడు మనిషి దేవుడయ్యాడు…పూజలందుకున్నాడు…వరాలిచ్చాడు…కానీ… ***
విశ్వక్సేనకు నిద్ర రావడం లేదు.ఒక కామన్ మేన్ ఇంటికన్నా నాలుగైదు రెట్లు పెద్దదిగా,విశాలంగా వున్న పడగ్గది.ఆరుగురు కంఫర్ట్ గా పడుకోవడానికి సరిపడా డబల్ కాట్ మంచం. ఇంపోర్టెడ్. పడగ్గదిలో నుంచి హాల్ లోకి వచ్చాడు.గ్లాస్ వాల్స్ నుంచి బయటకు చూసాడు.కొన్ని ఎకరాల స్థలం మధ్యలో నిర్మించిన అరవై గదుల సామ్రాజ్యం.హై టెక్ సెక్యూరిటీ…ఆ సామ్రాజ్యంలోకి దోమ ప్రవేశించినా,వెంటనే ఆటోమేటిక్ కెమెరాల్లో రికార్డు అవుతుంది.అవసరమైతే ఆ దోమను సైతం షూట్ చేయగల అత్యాధునిక ఆయుధాలు వున్నాయి.
విశ్వక్సేన ప్రపంచంలోని వందమంది టాప్ బిజినెస్ పీపుల్ లో ఒకరు.పద్మశ్రీ,మొదలు…ఎన్నో అవార్డ్స్,రాష్ట్ర మంత్రి,సియం మొదలు కేంద్ర మంత్రి వరకూ…అన్ని పదవులూ ఆయన ముందు వచ్చి వాలాయి.
డబ్బు,పలుకుబడి,పట్టుదల విశ్వక్సేనను ఒక గొప్ప పొజిషన్ లో నిలబెట్టాయి.డెబ్బై పడిలో వున్నా ఇంకా ఆయనలో హుషారు తగ్గలేదు. మొదటిసారి విశ్వక్సేనలో చిన్న అశాంతి.అర్థరాత్రి ఆయనలో అంతర్మథనం.
హాల్ లో నుంచ్గి తను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న మ్యూజియం వైపు కదిలాడు.వంద అడుగులు వేసి మ్యూజియం దగ్గరికి రాగానే అతని అడుగుల శబ్దం కోడ్ తో ఆ తలుపులు తెరుచుకున్నాయి.
లోపల మరో మయసభలా వుంది.విశ్వక్సేన అంచెలంచెల ఎదుగుదలకు ఛాయాచిత్రాల సాక్ష్యం.
జీవితంలో ఎప్పుడూ ఎదుగుతూ ఏదో ఒక గొప్ప పొజిషన్ లో ఉండాలనుకునే విశ్వక్సేన ఛాంబర్ అఫ్ కామర్స్ కు ప్రెసిడెంట్ కావాలనుకున్నాడు.అయితే ఆ మార్గంలో తను ప్రెసిడెంట్ కావడానికి వున్న అన్ని మార్గాలనూ .అతను ఉపయోగించుకున్నాడు .డబ్బు,పలుకుబడి,ఎదుటివాడి వీక్ నెస్ ఇలా అన్నీ విచ్చలవిడిగా ఖర్చు చేసాడు.ప్రెసిడెంట్ అయ్యాడు .
ఆ తర్వాత కార్పోరేట్ చైర్మన్ కావాలనుకున్నాడు. గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోవడానికి నిర్మాత కావాలనుకున్నాడు.అందమైన కథానాయికలను తన గదిలోకి రప్పించుకున్నాడు. రాష్ట్ర మంత్రి కావాలనుకున్నాడు.సియం కావాలనుకున్నాడు.కేంద్రంలో చక్రం తిప్పలనుకున్నాడు.కేంద్ర మంత్రి అయ్యాడు.అవార్డ్స్ కోసం చారిటీస్ స్థాపించాడు. ఇలా ప్రతీ దశను చేరుకున్నాడు.యాభయ్యేళ్ళ వ్యాపార,సినీ,సామాజిక సేవ ,రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సాధించాడు.డబ్బుతో,పలుకుబడితో,తెలివితో,లౌక్యం తో.పదవులతో… అతనిలో అన్ని వ్యసనాలు వున్నాయి.అమ్మాయిలు,అధికారం,పదవులు,పేరు ప్రతిష్టలు,అవార్డ్స్ … ప్రతీ మనిషి ఎప్పుడో ఒకప్పుడు వెనకి తిరిగి చూసుకుంటాడు .ఆలోచిస్తాడు…అంతర్ఘర్షణ మొదలవుతుంది.అన్నీ సాధించాక ఇంకేం సాధించాలి ?అనే ప్రశ్న ఉదయిస్తుంది.ఇప్పుడు విశ్వక్సేనలో కూడా అదే అంతర్ఘర్షణ . మ్యూజియంలో తను సాధించిన పదవులు,సంపాదించిన పేరు ప్రతిష్టలకు గుర్తులు,…ఇంకా మిగిలి వున్నది ఏమిటి?
యంపీలను తన వైపుకు తిప్పుకొని ప్రధాని కూడా అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది.
కానీ ఆరాత్రి అతనిలో ఏదో అసంతృప్తి.ప్రధాని అయినా కొత్తగా ఒరిగేది ఏమీ వుండదు.విదేశ రాయబారిగా కూడా పనిచేసాడు.ఇంకా..అంతకు మించి…అన్న ఆలోచనతో..అలానే పూజగదిలోకి వచ్చాడు.విశాలమైన పూజగది …నిలువెత్తు దేవుడి విగ్రహం. విశ్వక్సేనలో వున్న ఒకే ఒక మంచి అలవాటు.
తను ఎక్కడ వున్న,తను ఎలాంటి తప్పుడు పనులు చేసినా ,ప్రతీరోజు పొద్దున్నే లేచిదేవుడి ముందు కాసేపు ప్రశాంతంగా గడుపుతాడు.ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలు మనస్సులోకి రానివ్వడు. దేవుడి విగ్రహం ముందు కూచున్నాడు.అలానే కూచున్నాడు…కాలం కదులుతూనే వుంది…తథాస్తు దేవతలు దేవదేవుడి దర్శనానికి ఆకాశమార్గాన వెళ్ళే వేకువ వేళ…. విశ్వక్సేన కళ్ళు నిద్రలేమితో ఎర్రబడ్డాయి.అసంతృప్తితో అతని మనస్సు అశాంతిగా వుంది. దేవుడి ముందు మోకరిల్లాడు. “దేవుడా…నాకు వూహ తెలిసినప్పటి నుంచి నీకు ప్రతీ రోజు పూజలు చేస్తున్నాను,నిన్ను పూజించకుండా ఎక్కడికీ వెళ్ళను,పంచి మంచినీళ్ళు కూడా ముట్టను కదా…నేను డబ్బుతో సుఖాలు,పదవులు,హోదాలు కొనుక్కున్నాను…అయినా నాకు తృప్తిగా అనిపించడం లేదు.నాకు నీలా దేవుడిని కావాలని వుంది.అప్పుడు నాకున్న శక్తులతో తృప్తిని అన్వేషించాలని వుంది,దేవుడా నన్ను దేవుడిని చేయవూ…కావాలంటే నా సమస్త సంపద నువ్వే తీసేసుకో…”దేవుడు పాదాల మీద పడిపోయాడు.
పూజగదిలో పెద్ద మెరుపు…తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు. దేవుడు మానవుడిని దేవుడిని చేసాడు. సృష్టి కొద్ది క్షణాలు స్తంభించింది. ఇప్పుడు విశ్వక్సేన దేవుడు అయ్యాడు
*** విశ్వక్సేన కళ్ళు తెరిచి చూసాడు. సరికొత్త లోకం…. దేవలోకం… తన శరీరంలో గాలిలో తేలిపోతున్నట్టు వుంది.గాలి వింజామరలుగా మారాయి. తను ఓ పూలవనంలో వున్నట్టు భావించాడు.మరు క్షణం ఆ ప్రాంతం పూలవనంగా మారింది.రకరకాల పుష్పాలు…పారిజాత పుష్పాలతో సహా…. తను హాయిగా వెన్నెల్లో తడుస్తున్నట్టు అనిపించింది.మరు క్షణం వెన్నెల వర్షం కురిసింది.తన దేహం మెరిసిపోతుంది. తను కూచున్నాడో ,నిలబడి ఉన్నాడో తెలియడం లేదు.గాలిలో తేలిపోతున్నట్టు వుంది. ఎక్కడో భక్తులు స్మరిస్తున్నారు.కోటానుకోట్ల భక్తుల పూజలు, “దేవుడా నువ్వే నాకు దిక్కు..ఓ భక్తుడి గొంతు “దేవుడా నన్ను బ్రతికించు..దేవుడా నాకు సంపద ప్రసాదించు..ఇలా వేన వేల లక్షల గొంతులు వినిపిస్తున్నాయి.ఓ భక్తుడు తిడుతున్నాడు..ఓ నాస్తికుడు నువ్వు లేవు..అంటున్నాడు.అయినా విష్వక్సేన దేవుడిలో ఎలాంటి భావమూ లేదు.మానవుల కర్మఫలాలను చూస్తున్నాడు. భక్తుల వరాల స్వరాలు,విన్నపాల మొక్కులు దేవలోకం అంతా ప్రతిధ్వనిస్తున్నాయి. తన చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, రాత్రి లేదు,పగలు లేదు. ఆకలి లేదు.దప్పిక లేదు. కోరిక లేదు.నవ్వు లేదు . దుఖం లేదు.విచారంలేదు. విరహం లేదు .కోరికలసలే లేవు. ఆకలి వేయడం లేదు..కడుపు నిండా తిన్న భావం..ఎటువంటి కామప్రకోపాలు లేవు. ఎటువంటి భావాలూ కలగడం లేదు. తనిప్పుడు మానవుడు కాదు దేవుడు. అతని జ్ఞాన నేత్రాల ముందు ఎన్నో దృశ్యాలు కనిపిస్తున్నాయి. రక్తపాతాలు.మానవులలో ప్రతీకారేచ్చలు,ద్వేషాలు,ఆస్తి కోసం కొట్టుకోవడాలు,హత్యలు,ఒకరినొకరు మోసం చేసుకోవడాలు … అవ్వన్నీ దేవుడి రూపంలో వున్న అతనికి తుచ్చంగా అనిపించాయి. అతను తలుచుకోగానే పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్ష్యమయ్యాయి.కానీ అతనికి ఆకలి వేయడంలేదు.కడుపు నిండా భోజనం చేసినట్టు వుంది. అతను తలుచుకోగానే అప్సరసలు ప్రత్యక్ష్యమయ్యారు .వారితో రమించినట్టు భావప్రాప్తి కలిగినట్టు…అనిపించింది. అతను తన వంక చూసుకున్నాడు.ఒంటి నిండా స్వర్ణాభరణాలు … అతను తలుచుకోగానే అతనికి ఇష్టమైన దుస్తులు అతని ఒంటి మీద ప్రత్యక్ష్యమయ్యాయి. దుస్తులను విప్పి,మరో దుస్తులు వేసుకున్నట్టు… అతనేమి కోరుకున్నా చిటికెలో ప్రత్యక్ష్యమవుతున్నాయి.అయినా ఆనందాన్ని ఇవ్వడం లేదు.అసలు ఆనందించిన భావం అతనిలో కలుగడం లేదు. ఆకలి లేదు దప్పిక లేదు..కోరిక లేదు .స్పర్శతో కూడిన భావప్రాప్తి లేదు.ఏడుపు లేదు… నిద్ర రావడం లేదు.కళ్ళు మూతలు పడడం లేదు . అది పగలో,రాత్రో తెలియడం లేదు.అలసట లేదు.విశ్రమించాలనీ లేదు. దేవుడా ఎందికీ దేవుడి అవతారం..?అతను ఘోషించాడు…రోదించాడు..విలపించాడు..దేవలోకం ప్రతిధ్వనించేలా… దేవుడు ప్రత్యక్ష్యమయ్యాడు.
విశ్వక్సేన దేవుడి ముందు మోకరిల్లాడు
“దేవుడా ఏమిటిదంతా…”దేవుడిని ప్రశ్నించాడు.
“నువ్వు కోరుకున్న కోరిక…నువ్వు దేవుడివి కావాలనుకున్నావుగా?
“దేవుడు ఇలా ఉంటాడా?
“దేవుడు ఇలానే వుంటాడు.కోరికలకు అతీతుడు.సుఖ దుఖాలకు .
భావోద్వేగాలు,ఆకలిదప్పులు వుండవు…
మానవుల కర్మఫలాలను పర్యవేక్షిస్తూ ,భక్తుల కష్టాలను కడతేరుస్తూ..నిరంతరం,నిరతం సృష్టిని కొనసాగిస్తూ,మీ పాపపుణ్యాలను మీకే వదిలేస్తూ,వుంటాం.
మీరు సంపాదించే సంపద,పదవులు,కీర్తి ప్రతిష్టలు,మీలోని కోరికలు మీ దేహంలో ప్రాణం ఉన్నంత వరకే,ఆ తర్వాత మీరు సాధించిన కీర్తి ప్రతిష్టలు మాత్రమే భూమ్మీద వుంటాయి.
ఈ సత్యం తెలిసీ మీరు స్వార్థంతో, అశాశ్వతమైన సంపద కోసం పదవుల కోసం తాపత్రయపడుతారు. మానవజన్మలో వున్న ఆనందాన్ని కోల్పోతారు.
“సంపదను సంపాదించడంలోని ఆనందాన్ని ,ఇతరులను ప్రేమించడంలో పొందలేని అంధులు.”దేవుడు చెప్పాడు.
విష్వక్సేన తను మనిషిగా మారాలనుకున్నాడు .ఎప్పుడైతే అతను మనిషిగా మారాలనుకున్నాడో అప్పుడే మరుక్షణమే విశ్వక్సేనుడి కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీళ్లు వర్షించాయి.
దుఃఖంలో కూడా ఇంత ఆనందం ఉంటుందా?అనిపించింది.
దేవుడి ముందు మోకరిల్లి రెండు చేతులు దేవుడి పాదాల మీద పెట్టి మనస్సులోని భారాన్ని,ఆ దేవుడి పాదాల ముందు పెట్టి బరువు తీర్చుకున్నట్టు భావిస్తూ… “దేవుడా నాకు మనిషిగానే బ్రతకాలని వుంది.కానీ మనస్సున్న మనిషిగా బ్రతకాలని వుంది.ఆకలిదప్పులు కావాలి,సుఖ దుఃఖాలు కావాలి.సృష్టి సహజమైన కోరికలు తీర్చుకోవాలి.నా భార్య కళ్ళలో ఆనందం,నా పిల్లల కళ్ళలో తృప్తి,నా తోటివారి మనస్సుల్లో నా మీద ప్రేమ చూడాలి.నన్ను భూమ్మీదికి పంపించేయ్…”కళ్ళు మూసుకున్నాడు.
***
కళ్ళు తెరిచాడు విశ్వక్సేన
పూజగదిలో వున్నాడు..దేవుదిగది పైన వున్న వెంటిలేటర్ నుంచి అప్పుడే ఉదయించిన విభాకరుడి కిరణాలు అతని మీద జ్ఞాన కిరణాలుగా ప్రసరిస్తున్నాయి.
ఢిల్లీ నుంచి ఫోన్..మీరు పియం కావడానికి లైన్ క్లియర్ అయ్యిందని…
తను అన్నిరాజకీయ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు చెప్పాడు. తన శేషజీవితాన్ని తన కుటుంబానికి,స్వార్థ ఫలాపేక్షలేకుండా చారిటీస్ కు సేవ చేయడానికి కేటాయిస్తున్నట్టు ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు.
ఆ తర్వాత అతను చేసిన మొదటిపని… పాతికేళ్ళ తర్వాత కిచెన్ లో తన కోసం వంట చేస్తోన్న భార్య దగ్గరికి వెళ్లి వంటలో సాయం చేస్తూ,ఆమెతో కబుర్లు చెప్పడం.ఆమె కళ్ళలోని సన్నటి కన్నీటి మెరుపును చూడ్డం.
**** అందుబాటులో వున్న విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి