ముగ్గురు గజదొంగలు తమ రూపాలను మార్చుకుంటున్నారు . స్త్రీల వలే అలంకరించుకుని ముఖాన్ని వస్త్రంతో కప్పేశారు.కేవలం వారి కళ్ళు మాత్ర్రమే కనిపిస్తున్నాయి … శ్రీసుధామయి ” జ్వాలాముఖి…మంత్రాలదీవి “ ( 04 -11 -2018 )

3

దీపావళి శుభాకాంక్షలు
ఇద్దరూ గురువుగారి దగ్గర సెలవు తీసుకుని తోటి సహచరులకు వీడ్కోలు చెప్పి బయల్దేరారు….
సరిగా అదే సమయంలో ఇందాకటి చిలుక వచ్చి సుధర్ముల పాదాల మీద వాలింది…
సుధాములు ఆ చిలుకను చేతుల్లోకి తీసుకున్నాడు .కనులు మూసుకుని దివ్యదృష్టితో వీక్షించాడు.”ఓయీ చిలుకా నా మనసు అవగతమైంది..వెళ్ళు..నీకు శాపవిమోచనం తథ్యం…విజయోస్తు”అని దీవించి గాలిలోకి వదిలాడు చిలుకను.
ఆ చిలుక గాలిలోకి ఎగిరి ఆశ్రమం వదిలి తమ రాజ్యానికి బయల్దేరిన మిత్రుల్లో ఒకరైన యువరాజు విజయుడి భుజం మీద వాలింది.
విజయుడు ఆ చిలుకను తన చేతులలోకి తీసుకుని ” ఏ దేశవాసివి నువ్వు.? అడిగాడు నవ్వుతూ..
“మీరు సరే అంటే మీ దేశవాసిని” చిలుక పలుకులు పలికింది
“మాటలాడు చిలుకవా…భళి భళి..మాతో వస్తావా..”విజయుడు అడిగాడు
“భలే భలే వస్తాను”చిలుక పలికింది
“అయితే నువ్వు .మా నేస్తానివి..మా విక్రముడికి కూడా” విక్రముడి వైపు తిరిగి అన్నాడు
అశ్వాలను అధిరోహించారు మిత్రులిద్దరూ…విజయుడు అశ్వం తల భాగం మీద ఆసీనురాలైంది చిలుక.. ఆ శ్వేతాశ్వం తో పాటు విక్రముడి అశ్వం ముందుకు కదిలాయి….
***
రెండు అశ్వాలు అశ్వవేగంతో గాలితో పోటీపడి పరుగులు తీస్తున్నాయి.సంధ్యచీకట్లు ముసురుకుంటున్నాయి…ఒకచెట్టుకింద తమ అశ్వాలను ఆపారు…చల్లటిగాలి వీస్తోంది.వృక్షాలు వింజామరలు అయ్యాయి.
“మిత్రమా ఈ చల్లగాలిలో ప్రయాణం చేసిన బడలికలో అలిసిన మనదేహాలు విశ్రాంతిని కోరుకుంటున్నాయి.మన అశ్వాలు పరుగెత్తి పరుగెత్తి అలిసిపోయాయి”అన్నాడు విక్రముడు
“అవునవును అలిసిపోయాయి అలిసిపోయాయి”చిలుక వంతపాడింది విజయుడు అధిరోహించిన అశ్వం నుంచి రివ్వున ఎగిరివచ్చి విజయుడి భుజాల మీద వాలి.
“అవునవును నిన్ను తన తల మీద మోసిన నా పంచకల్యాణి అలిసిపోయింది “అన్నాడు చిలుకను చేతుల్లోకి తీసుకుంటూ ..
“భలే భలే పంచకల్యాణి ..మరి నేనెవరిని మిత్రమా? చిలుక గారాలుపోతూ అడిగింది”
విజయుడు విక్రముడి వైపు తిరిగే”నిజమే మిత్రమా..మన నేస్తానికి పేరే పెట్టలేదు కదూ…” అన్నాడు
“అవునవును అన్నప్రాసన చేసి పేరు పెడదాం”విక్రముడు నవ్వుతూ అన్నాడు
“మన చిలుకకు తగిన పేరేమి పెడదాము…? విజయుడి భృకుటి ముడిపడింది
ఆ చిలుక వీళ్ళవైపే చూస్తోంది
విజయుడు ఒక్కక్షణం కళ్ళుమూసుకుని కళ్ళు తెరిచి”ఈ రాజహంసకు సరిపడు నామధేయమేమున్నది? అంటూనే వెంటనే..”రాయంచ ,,:అన్నాడు
“బాగు బాగు రాయంచ బాగు “చిలుక తన రెక్కలు టపటపలాడిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
విక్రముడు చిలుక వైపు చూసి”రాయంచా..ఇకనుంచి నువ్వు మాలో ఒకరివి..నీపేరు రాయంచ “అన్నాడు
“అవునవును ధన్యవాదాలు మిత్రులారా?రాయంచ చిలకపలుకులు పలికింది.
“ఏమంటావు మిత్రమా?అన్నాడు విజయుడు
” చిత్తం మిత్రమా నీ చిత్తంలో అనిపించింది నాకు సమ్మతమే “అన్నాడు విక్రముడు.
ఇద్దరూ కలిసి రాయంచా …అని చిలుకను పిలిచారు. అది విన్న చిలుక రెక్కలాడిస్తూ ” నేను రాయంచ నేను రాయంచ “అని పలికింది. అది చూసిన మిత్రులిద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఆ చెట్టు కింద విశ్రమించారు.
“ఈరాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం..తెల్లవారి మన ప్రయాణం కొనసాగిద్దాం ..ముందు ఆకలి తీర్చుకుందాం మిత్రమా”విజయుడు అన్నాడు
“అవునవును క్షుద్బాధ తీరకుండా కంటిమీదికి కునుకు కూడా రాదు కదా? దగ్గరలో ఫలవృక్షాలు ఉన్నాయేమో చూద్దాం “విక్రముడు అన్నాడు.
ఇద్దరు ముందుకు కదలబోతుంటే “మీరు విశ్రమించండి..ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను …ఫలవృక్షాల జాడ చిటికెలో పసికట్టేస్తాను? అంటూ గాల్లోకి ఎగిరింది రాయంచ.
“ఇది మాములు చిలుక కాదు మిత్రమా..శాపవశమున ఈ రూపం ధరించిందని నా మది చెబుతుంది”
“నిజమే మిత్రమా..లేకున్నా ఇన్ని మాటలుపలుకు చిలుక ..అదియునూ గురుదేవుడి ఆశ్రమ ప్రాంతమున “వాళ్ళు అలా సంభాషణ కొనసాగిస్తూ వుండగానే రాయంచ వీళ్ళ దగ్గరికి వచ్చి వాలింది.
“త్వరపడండి..మేలుజాతి రాజఫలాలు మామిడి..సీతాఫలం..నాకు మిక్కిలి మక్కువైన జామఫలాలు….” రాయంచ పలికింది
***
ఫలములతో కూడిన తోట..రకరకాల ఫల వృక్షలు వున్నాయి.విక్రముడు విజయుడు తమకు కావలిసిన ఫలాలను తీసుకున్నారు…రాయంచ వైపు చూసారు..రాయంచ జామచెట్టు మీద వాలి జామకాయల రుచి చూస్తూ బావున్నవాటిని తన ముక్కుతో కొరికి తన మిత్రులకు అందిస్తున్నది.
“చిలుక కొరికిన జామరుచి బహుబాగున్నది కదా విక్రమా”అన్నాడు విజయుడు
రుచికరమైన ఫలాలతో ఆకలి తీర్చుకున్నాక అశ్వాలను కట్టివేసి ప్రదేశానికి వచ్చి చెట్టుకింద విశ్రమించారు.
“మిత్రమా నువ్వు నిద్రపో..నేను మెలుకువగా వుంటాను..క్రూరమృగాలు దాడి చేసే ప్రమాదం పొంచి వున్న అడవికదా “అన్నాడు విజయుడు
“లేడు మిత్రమా నువ్వు విశ్రమించు..నేను కాపలా వుంటాను”విక్రముడు అన్నాడు.
“మీరు ఇరువురూ విశ్రమించండి..నేను మెలుకువగా వుంటాను..ప్రమాదం పొంచిచూసినప్పుడు మీకు తెలియజేస్తాను ” రాయంచ చెప్పింది
“భేష్ మిత్రమా..మాకు నువ్వు రక్ష…కాపలా…”నవ్వి రాయంచను తన భుజాల మీద పెట్టుకున్నాడు.
తర్వాత విక్రముడు విజయుడు చెట్టుకింద విశ్రమించారు.నిద్రలోకి జారుకున్నారు.
రాయంచ చిలుక పరిసరాలను గమనిస్తోంది.
***
ఆ అడవిలో దక్షిణం వైపు ఒక గుడారం వుంది..లోపల బందిపోట్లు వున్నారు..పేరుమోసిన గజదొంగలు..హిగ్గారీలుగా పేరుపడిన నరరూప హంతకులు..దారికాచి దోచుకుంటారు.అడవిమార్గంలో ప్రయాణించేవారిని ముఖ్యంగా పురుషులను స్త్రీరూపంలో ఆకర్షించి వారిదగ్గర వున్న ధనాన్ని దోచుకుంటారు…రాజ్యాలు మారుతూ అడవిప్రాంతంలో తమ బస ఏర్పాటు చేసుకుంటారు.
స్త్రీల రూపంలో మారువేషాలలో ఉండడం మూలాన రాజభటులు నుంచి తప్పించుకోవచ్చన్న ఉపాయం వారిది.
ముగ్గురు గజదొంగలు తమ రూపాలను మార్చుకుంటున్నారు . స్త్రీల వలే అలంకరించుకుని ముఖాన్ని వస్త్రంతో కప్పేశారు.కేవలం వారి కళ్ళు మాత్ర్రమే కనిపిస్తున్నాయి .స్త్రీల వస్త్రధారణలో ఉండడం మూలాన వారిని పోల్చుకోవడం కష్టం.
( సశేషం )

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY